
భారతదేశ చరిత్రతోపాటు సావర్కర్ గురించి ప్రచారంలోవున్న కట్టుకథలను తన గ్రంథం ఒక క్రమపద్దతిలో నేలమట్టం చేస్తుందని అరుణ్ శౌరీ చెప్పారు.
మాజీ కేంద్ర మంత్రి, ఆర్థికవేత్త, జర్నలిస్ట్, సుప్రసిద్ద రచయిత అయిన అరుణ్ శౌరి తాను రచించిన ‘ద న్యూ ఐకాన్’ అనే గ్రంథాన్నివిడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందూత్వ సిద్దాంతకారుడు, సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా భావించబడుతున్న వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం, భావజాలం, వారసత్వాలను ఈ పుస్తకం “విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది’’.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో (1998–2004) అరుణ్ శౌరి మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఆయన ప్రముఖ హిందూ జాతీయవాద మేధావిగా పేరొందారు. సావర్కర్ వారసత్వాన్ని, ఆయన వాదనలను, ఆదేశాలను చారిత్రక ఆధారాలతో సరిపోల్చడం ద్వారా తన ‘‘ద న్యూ ఐకాన్’’లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన అరుణ్ శౌరి విశ్లేషిస్తాడు.
సావర్కర్ ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు. తన ‘‘హిందూ-మెజారిటీ దేశం’’ దృక్పథాన్ని హిందూత్వను సమర్థించే మితవాదులు చాలా మంది గౌరవిస్తారు. అయితే ‘మినహాయింపు లేక ఎక్స్ క్లూషనరీ’ రాజకీయాలను సమర్థించినందుకు ఆయన తీవ్ర విమర్శకు గురయ్యారు. శౌరి తన గ్రంధంలో పొందుపరిచిన విమర్శలు తీవ్రమైన చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవస్థీకృత మతం, హిందూ మితవాద భావజాలంతోసహా రాజకీయ సిద్ధాంతాలను సవాలు చేయడంలో పేరుగాంచిన వ్యక్తి నుండి వచ్చిన విమర్శలు అవి.
సమకాలీన రికార్డులు, నిఘా నివేదికలు, జీవిత చరిత్రలు, ప్రాచీన పత్ర భాండాగారాలతో(ఆర్కైవ్స్) సహా “550 కి పైగా వనరుల” ఆధారంగా, భారతీయ చరిత్ర, హిందూ అస్థిత్వాల గురించే కాకుండా సావార్కర్ ప్రవచించిన తన స్వీయ కట్టుకధలను కూడా ఒక క్రమపద్ధతిలో ఈ పుస్తకం పటా పంచలు చేస్తుందని శౌరీ చెప్పారు.
“ఈ వక్కాణింపులు, వాదనలు అస్సలు పరిశీలనకు నిలవ జాలవు. సావర్కర్ మన గురించి, మన చరిత్ర గురించి లేదా నిజానికి తన గురించి తాను సృష్టించిన కట్టుకధలు ఖచ్చితంగా పరీక్షకు నిలువవు. సావర్కర్ ఆదేశాలను మనం స్వీకరించినట్టయితే హిందుత్వ రాజ్యం తాను నిందించే ‘ఇస్లామిక్’ రాజ్యంగా మారుతుందని అరుణ్ శౌరి ఈ గ్రంధంలో వివరించాడు. మన సమాజం ద్వేషంతో నిండిపోతుంది. ప్రతీకారం, ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘అతి క్రూరత్వం’’, దానితోపాటు వచ్చేవన్నీ నియమాలు అవుతాయి’’ అని శౌరి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
“అటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి సంభాషణ లేక ప్రవచనం ఒక సాధనంగా ఉంటుంది. ‘మహాకారణం’ పేరుతో ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేసే అసత్యాల తాకిడికి అది ముక్కలయి ఉండేదే. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందూ మతం విపరీత పోకడలకు నెలవయ్యేది. భారతదేశం పాకిస్తాన్‌గా మారే మార్గంలో పయనించి ఉండేది”.
పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం జనవరి 30 నుండి లభ్యమౌతుంది. దీని ధర ₹999.
ఈ వ్యాసం మొదట ‘‘సౌత్ ఫస్ట్’’ లో ప్రచురించబడింది.
(అనువాదం: నెల్లూరు నరసింహారావు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.