
నలబై కుటుంబాలు వున్న ఆ ఆదివాసీ ఆవా స గ్రామానికి పెద్దలు పెట్టిన పేరు “ పెద్దపేట”. ఆ నలబైలో 17 కుటుంబాలకు కంటి మీద కునుకు లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు వచ్చి తమ సాగు భూమి “ మాది అంటారేమో’ నని వారి భయము, బెంగా.
అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని వుంది పెద్దపేట. వారివి అనవసరమైన భయాలు కాదు. ఈ మధ్యకాలంలో వచ్చిన, వస్తున్న మార్పులును వారు గమనిస్తున్నారు.
అవేమిటో చూద్దాం.
పెద్దపేట గ్రామంలో ప్రభుత్వ బంజరు భూమి వుంది. స్థానిక గిరిజన రైతు కొదమ అచ్చియ్య మాటల్లో చెప్పాలంటే ఆ బంజరు భూములు రాళ్ళు, రప్పలు, తుప్పలు, డొంకలతో వుండి తొండలు కూడా గుడ్లు పెట్టడానికి ఇష్టపడని మెరక భూములు. అలాంటి భూములను తమ రెక్కల కష్టంతో సాగు భూములుగా మార్చారు గిరిజన రైతులు. తండ్రుల కాలంలో పని మొదలైతే నేటికీ వాటికి రూపురేఖలు వచ్చాయి. జీడి మామిడి తోటలతోపాటు, టేకు, మద్ది, వేగిస, తాడి, మామిడి చెట్లను పెంచారు. మా తోటలలోని చెట్లను బట్టి మా సాగు ఎంత కాలం నుండి వుందో ఇట్టే చెప్పవచ్చు అంటుంది మార పెద్దింటమ్మ.
భూమిని సాగు చేస్తే సరిపోదని దానికి పంట తెచ్చుకోవాలనే తెలివిడి వచ్చేసరికి చాలకాలం గడిచిపోయింది. తీరా అందుకు కాగితం రాసుకొని తహశీల్దార్ వద్దకు వెళ్ళే సరికి చావు కబురు చల్లగా తెలిసింది. వారి సాగులో వున్న భూములకుగాను పట్టాలు మరెవరికో ఇచ్చేసారట. వారెవరో తెలీదు. ఎక్కడ వుంటారో తెలీదు. ఆ పేర్లు ఎన్నడూ వినలేదు.
పెద్దపేట ఆదివాసీలు తేదీ: 10-04-2010న మొదటసారి రోలుగుంట తాహశీల్దార్ కు ఒక వినతిపత్రం ఇచ్చారు. తాహశీల్దార్ ఆదేశాలపై వచ్చిన అప్పటి మండల సర్వేయర్, మండల రెవిన్యూ ఇన్సిఫేక్టర్ (RI) ఇరువురూ సర్వే నెంబర్ల వారీగా తనిఖి చేశారు. ఆదివాసీలే సాగులో వున్నారని నిర్దేసిస్తూ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికే పెద్దపేట ఆదివాసీలు సాగులో వున్నట్లు చూపించే కాగితం ముక్క. ఏకైక ఆధారం.
విశాఖజిల్లా (ఉమ్మడి) మన్యప్రాoతానికి ముఖద్వారo నర్సిపట్టణం. నర్సిపట్టణం తాలుకాను బ్రిటిష్ వారు నేరుగా తమ ఆధీనంలో వుంచుకున్నారు. అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం, బంగ్లా , తాహశీల్దార్ కార్యాలయం నిర్మించారు. ఇప్పటికీ అవి పని చేస్తున్నాయి. నర్సిపట్టణం సబ్ కలెక్టర్ పోస్ట్ ముందు ICSలకు తదుపరి IAS కు కేటాయించబడిన పోస్ట్. జయ భారత రెడ్డి, జయప్రకాష్ నారాయణ, చటర్జీ, నందమూరి రమేష్ కుమార్ ఇలా ఎందరో IAS లు ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పని చేశారు. ఇప్పుడు తెలంగణాకు చీఫ్ సెక్రటరీగా వున్న శాంతి కుమారి గారు ట్రైనీ కలెక్టర్ గా తదుపరి సబ్ కలెక్టర్ గా పాలనలో ఇక్కడే అక్షరాభ్యాసం చేశారు.
నర్సిపట్టణం నుండి మన్యంలోకి వెళ్ళే ఒక రహదారి చింతపల్లి రోడ్డు. చింతపల్లి కొండలను దొలిచి వేస్తున్న ఘాట్ రోడ్డు నిర్మాణoలో ఆదివాసీ కూలీల వేతన దోపిడిని అల్లూరి సీతారామరాజు గుర్తించారు. సమస్యగా తీసుకున్నారు. చింతపల్లి రోడ్డులో, నర్సిపట్టణం నుండి 10 కిలో మీటర్ల తరువాత కుడి వైపు 2 కిలో మీటర్ల దూరంలో పెద్దపేట గ్రామం వుంది. అంటే నర్సిపట్టణంకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామo వుంది. ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్ర విడిపోవడం, మాకవారుపాలెం వద్ద అల్యూమియం రిఫైనరీ, బాక్సైట్ తరలింపు ప్రణాళికలో భాగంగా నర్సిపట్టణం – చింతపల్లి రోడ్డు విస్తరణ, నర్సిపట్టణం పంచాయితీ నుండి మున్సిపాలిటీకి మార్పు, విశాఖ జిల్లా నుండి అనకాపల్లి జిల్లా ఏర్పాటు ఇలా పలు పరిణామాలు భూముల రేట్లను ఎన్నో రేట్లు పెంచేశాయి. భూముల వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గుర్రపు డెక్కలా వ్యాపించారు.
ఎలక్ట్రానిక్ భూమి రికార్డుల ప్రవేశంతో రికార్డులలో మార్పులు క్షణాలలో జరిగిపోయే వెసులుబాటు వచ్చింది. ఏ క్షణంలో ఎవరు వచ్చి తమ సాగు భూములకు పట్టా వుందని బెదరిస్తారోనని పెద్దపేట ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ బంజరుకు నియమాలు ఏమి చెపుతున్నాయి:
ఒక ప్రశ్న ఏమిటంటే, పెద్దపేట గ్రామంలో వున్న ప్రభుత్వ బంజరు భూములకు స్థానికులు కాని వారికి, ఎన్నడూ ఆ భూమిని కూడా చూడని వారికి D-పట్టాలు ఎలా వచ్చాయి?. అసలు పట్టాలు ఇవ్వడానికి వున్న ప్రభుత్వ నిబంధనలు ఏమిటి ? ఈ ప్రశ్నలకు జవాబు మనకు చాలా విషయాలు నేర్పగలవు.
రెవిన్యూ శాఖ విధి విధానాలను ఎప్పటికప్పుడు రూపొందిస్తూ, సమీక్షిస్తూ, మార్పులు చేస్తూ, మార్గనిర్దేశం చేయడానికి మద్రాస్ ప్రెసిడెన్స్ లో “రెవెన్యూ బోర్డు” ఏర్పాటు చేశారు. అది ఇచ్చే ఆదేశాలను “ స్టాండింగ్ ఆర్డర్స్ (Standing Orders) అంటారు. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ( Board Standing Orders)ను సంక్షిప్తంగా BSO అని పిలుస్తారు రెవిన్యూ వారు. 1878 వరకు వచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ ను ఒకదగ్గిరకు తెచ్చి ప్రచురించింది Dr. C.D. మేకలెన్ (Macleane).
అంశాల వారీగా స్టాండింగ్ ఆర్డర్స్ అధ్యాయాలుగా వుంటాయి. అందులో మొదటి వాల్యూమ్ చాప్టర్ 15, ప్రభుత్వ బంజరు భూముల మంజూరిని గూర్చి తెలియజేస్తుంది. దీనినే సంక్షిప్తంగా BSO-15 అంటారు. 1878 నుండి ఇప్పుడు తాజాగా మార్కెట్ లో వున్న BSOల వరకు, కొన్ని మార్పులు చేర్పులతో నేటికీ అదే BSO-15 కొనసాగుతుంది. 1900 ప్రచురితమైన BSO-15లో, ప్రభుత్వ భూమిని మంజూరు చేసే సమయంలో “సమన్యాయ” సూత్రాన్ని (Principal of equity) పాటించాలని అన్నారు.
దానిని వివరిస్తూ, భూమి ఎక్కడ వున్నదో ఆ స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులోను, అప్పటికే ఆ భూమిని సాగులోకి తెచ్చిన వ్యక్తిని శివాయిజమదార్ ( Sivoijmadar)గా ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రభుత్వ బంజరు భూమి ఇచ్చే పట్టా షరతులతో కూడినదే (Conditional grant)గాని శాశ్వత హక్కు కాదు.
స్వాతoత్రం వచ్చిన తరువాత 1878 నుండి BSO-15కు వచ్చిన సవరణలన్నిoటిని సమీక్షించి 1958లో ఒక GOను ప్రకటించారు అదే GO Ms No: 1407, Dt: 25-07-1958. దీనిని BSO-15కు సమానార్దకంగా పరిగణిస్తారు. ప్రభుత్వ బంజరు భూముల మంజూరుకు, “సమన్యాయ” సూత్రాన్ని కొనసాగిస్తూ, మరింత మెరుగు పర్చారు. భూమి వున్న గ్రామoలోని స్థానిక పేదలు మొదటి అర్హులు అని BSO-15, సెక్షన్ 10(1) మార్గ నిర్దేశం చేస్తోంది.
ఒకవేల ఒకరికంటే ఎక్కువ మంది పేదలు ధరఖాస్తు చేస్తే, అప్పటికే సాగులో వున్న పేదవాడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి(సెక్షన్ 10(2)). సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ధరఖాస్తుదారులు ప్రాధాన్యత క్రమంలో ముందు వుంటారు(సెక్షన్ 10 (3)). భూమిని కోరుకుంటున్న వ్యక్తి నిరక్షరాస్యుడు అయితే గ్రామ కరణం ( ఇప్పుడు VRO) ధరఖాస్తు రాయడంలో సహకరించాలని కూడ BSO-15 ( సెక్షన్ 5 (2)) చెపుతుంది. అంతే కాదు ధరఖాస్తు వివరాలను గ్రామoలో దండోర ( దీనిని Tam Tam అన్నారు తెల్లవారు) వేసి ప్రజలకు తెలియజేయాలని కూడ BSO-15 చెపుతుంది.
ప్రభుత్వ బంజరు భూమి మంజురుకు సంబంధించి నియమాలు ఇంత స్పష్టంగా వున్నా, పెద్దపేట ఆదివాసీలు, పేదలుగా , స్థానికులుగా, శివాయిజమదార్స్ గా, షెడ్యూల్ తెగలుగా ఇన్ని అర్హతలు వున్నా, వారి సాగు అనుభవంలో వున్న బంజరు భూమికి D- పట్టాలు ఎందుకు రాలేదు ?!. పారదర్శకoగా జరగవలసిన ప్రక్రియను రెవిన్యూ అధికారులు ఒక గూడు పుఠానిగా మార్చారని, భారీగా లంచాలు దిగమింగి ప్రభుత్వ బంజరు భూమిని అమ్ముకున్నారని అర్దం.
రీ సర్వేలో సరి చేస్తాం
2010 నుండి పెద్దపేట ఆదివాసీలు VRO నుండి కలెక్టర్ వరకు కాగితాలు ఇస్తూనే వున్నారు. గత ప్రభుత్వంలో, రీ సర్వేలో పెద్దపేట గ్రామం వుందని అప్పుడు మొత్తం సర్వే చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆదివాసీలు నమ్మారు.
రీ – సర్వే సిబ్బందిని ఆదివాసీలు సాదరంగ ఆహ్వానించి, వున్నoతలో వంటవార్పు ( నాటు కోళ్లతో) చేసి పెట్టారు. తమ ఆధార్ కార్డులు, ఫోటోలు, రేషన్ కార్డులు, ఓటరు ఐడి కార్డులు, అడిగిన అన్ని కార్డులు ఇచ్చారు. రీ సర్వే పైనల్ రికార్డులో ఆ స్థానికేతరులనే పట్టాదారులుగా, సాగుదారులుగా చూపించారని తెలుసుకొని పెద్దపేట వారు హతాసులయ్యారు.
ఫ్రీహోల్డ్ రైట్స్ వారికే
ఎన్నికలకు ముందు YS జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, 20 సంవత్సరాల కిందట ఇచ్చిన D-ఫారం పట్టా భూములను అమ్ముకోవడానికి వీలుగా ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే అందులో ఒక షరతు పెట్టింది. అమ్ముకునే హక్కులు పొందాలoటే 1. పట్టాదారు సాగులో వుండాలి లేదా 2. వారసులు సాగులో వుండాలి. పెద్దపేటలో పట్టాదారులు సాగులో లేరు. అయినా వారికే ఫ్రీహోల్డ్ రైట్స్ ఇచ్చేస్తూ రికార్డులో నమోదు చేసేశారు. సాగులో ఉన్న వారికి మాత్రం పట్టాలు లేవు.
రీ సర్వే – గ్రామ సదస్సులు
జగన్ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సీనియర్ IAS అధికారి సిసోడియాను రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, జయలక్ష్మి గారిని భూమి శిస్తు కమీషనర్ గా ప్రభుత్వం నియమించింది. రీ సర్వే జరిపిన గ్రామాలలో గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నామని బాధితులు తమ ఫిర్యాదులు చెప్పుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. పెద్దపేట రీ సర్వే జరిగిన గ్రామం గనుక తేదీ: 30-10-2024న అక్కడ సదస్సు పెట్టారు.
ఆదివాసీలు తన సాగులను చూపిస్తున్న ఫోటోలతో సహ వినతిపత్రాలు ఇచ్చారు.
గ్రామ రెవిన్యూ సదస్సులు
“భూ సమస్యల పరిష్కారానికి “ గ్రామ రెవిన్యూ సదస్సులు” లని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31న పెద్దపేట గ్రామoలో మరో రెవిన్యూ సదస్సు జరిగింది. తమ సాగులను, తోటలను చూడమని ఆదివాసీలు అధికారులను వేడుకున్నారు. D-పట్టాదారులుగా రికార్డులో చూపిస్తున్న వారు తమ పంచాయితీకి చెందిన వారు కాదని, వారు సాగులో లేరని పంచాయితీ సర్పంచి కూడా తెలియజేశారు. రీ సర్వే గ్రామ సభ నుండి రెవిన్యూ గ్రామ సభకు మధ్య రెండు నెలలు గడించింది. తహశీల్దార్ కార్యాలయంలోని పెద్దపేట గ్రామ భూమి రికార్డులో ఈ దొంగ పట్టాదారుల పేర్లు కొనసాగుతూనే వున్నాయి.
వాళ్ళు ఏమి అడుగుతున్నారు :
తాము సాగులో వున్నదీ, లేనిది తనిఖీ చేయమని ఆదివాసీలు అడుగుతున్నారు. తమ సాగు అనుభవాన్ని నమోదు చేయమని, నియమాలకు విరుద్దoగా ఇచ్చిన D- పట్టాలు రద్దు చేయమని, శివాయిజమదార్స్ గా గుర్తుంచి పట్టాలు ఇవ్వమని అడుగుతున్నారు పెద్దపేట ఆదివాసీలు.
కేదారి బుచ్చమ్మ వయస్సు ఇప్పుడు 65 సంవత్సరాలు. తాను గదబ ఆదివాసీ మహిళ. ‘గదబ’ తెగను ప్రభుత్వం ఆదిమ తెగగా (PVTG-Particularly Vulnerable Tribal ) గుర్తించింది. తన మాటలలో “ నేను నా మొగుడు భూమిని ఈ తీరులోకి తేడానికి కండలు కరగదీసినాo. ఈ భూమికి పట్టా ఎవడో నర్సిపట్టనపోడికి ఇచ్చినారంట. నోట్ల కట్టలు ఇచ్చినోళ్ళకే పట్టాలు ఇత్తరా ?! అదేనా నాయం ? ఆ పట్టాలు రద్దు జేసి వరకు పోరాడుతాం!”
ఏం జరగబోతుందో, ఆదివాసి సంఘాలు , ప్రజా సంఘాలు ఎలా స్పందిస్తాయో, ఆంధ్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం..
P.S. అజయ్ కుమార్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.