
హైదరాబాద్: సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన భూములను విక్రయించే చర్యలను ఉపసంహరించకుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. హెచ్సీయుకు చెందిన 400 ఎకరాల భూమిని అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
కేంద్ర విశ్వవిద్యాలయ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నెంబర్ 25 కింద 2,300 ఎకరాల స్థలాన్ని పరిశోధన, విద్యారంగ అభివృద్ధికి కేటాయించిందని వెస్లీ గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ భూమిని వేలం వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని లేఖలో ప్రస్తావించారు.
గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి 400 ఎకరాలను గతంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువకు ఓ సంస్థకు కేటాయించినట్టుగా ఆయన తెలిపారు. అయితే తగిన అభివృద్ధి చేయడంలో సంస్థ విఫలమవ్వడంతో ఆ భూములను ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ద్వారా తిరిగి పొందిందని అన్నారు. ప్రస్తుతం ఆ భూమిని రూ.18వేల కోట్ల అంచనా విలువకు 2025 మార్చి 8-15 తేదీల మధ్యన వేలం వేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని పర్యావరణ, విద్యా- సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన ఇటువంటి స్థలాన్ని ప్రైవేట్, కార్పొరేట్ శక్తులు స్వార్థ ప్రయోజనాలకు ధారాదత్తం చేయడమే అవుతుందని వెస్లీ అభిప్రాయపడ్డారు. విద్య, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఇది ప్రస్ఫుటం చేస్తుందని విమర్శించారు.
ఓ వైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణను, సంపద మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వెస్లీ గుర్తుచేశారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను ఎవరి ప్రయోజనాల కోసం వేలం వేస్తుందని ప్రశ్నించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, వర్సిటీ భూములను వర్సిటీకే కేటాయించి విద్యా, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.