
ఢిల్లీ ముఖ్యమంత్రికి ఓ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కన్నా కొంచెం ఎక్కువగా అధికారాలు ఉంటాయి. కానీ, స్వతంత్రించి పరిపాలన చేయలేరు. ఎందుకంటె కీలకమైన శాంతిభద్రతలు, భూములు, పాలనా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. మిగిలిన అంశాలలో సహితం లెఫ్టనెంట్ గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. పూర్తి అధికారాలు లేని ఢిల్లీలో అధికారంలోకి రావడానికి జిజెపి, ఆప్ పోటాపోటీగా తలపడగా విజయం కమల దళానికి దక్కింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ పొందలేక పోయిన బిజెపి తర్వాత హర్యానా, మహారాష్ట్రలలో అనూహ్యమైన విజయాలు సాధించినా వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతనే 12 ఏళ్లలో తన పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు సాధించుకోవడమే కాకుండా, పంజాబ్ లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. పలు రాష్ట్రాల్లో తన పార్టీ ఉనికిని విస్తరింప చేసుకోవడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. కేజ్రీవాల్ రంగప్రవేశంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పుష్కరకాలం పాటు విలవిలలాడాయి. తొలుత షీలా దీక్షత్ నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో 15 ఏళ్లు, అనంతరం 12 ఏళ్లకుపైగా కేజ్రీవాల్ చేతిలో భంగపాటుకు గురయిన బిజెపి 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఘన విజయం సాధించింది.
గత ఎన్నికలతో పోల్చితే ఆప్ 10 శాతం ఓట్లను పోగొట్టుకోవడం గమనిస్తే ఈ ఎన్నికలు కేజ్రీవాల్ రాజకీయాలకు ఓ రెఫరెండంగా పనిచేసిన్నట్లు స్పష్టం అవుతుంది. ఆప్, బిజెపిల మధ్య 2 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉన్నప్పటికీ, బిజెపి ఓట్లు సుమారు 7 శాతం పెరిగాయి. దానితో తన సీట్ల సంఖ్యను 8 నుండి 48కి పెంచుకోగలిగింది. ఆప్ సీట్లు 22కు పరిమితం అయ్యాయి. పైగా ముఖ్యమంత్రి అతిశి మినహా ఆప్ అగ్రనాయకులు అందరూ కేజ్రీవాల్ తో సహా ఓటమి చెందారు. ఓ విధంగా ‘ఆప్ వ్యతిరేక సునామీ’ అని చెప్పవచ్చు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.57 శాతం ఓట్లు సాధించగా, ఈ సారి 10 శాతం కోల్పోయి 43.57 శాతం ఓట్లతో 22 సీట్లకు పరిమితమైంది. బిజెపి 2020లో 38.51 శాతం సాధించగా, ఈ ఎన్నికల్లో 45.56 శాతం ఓట్లతో 48 స్థానాలు సాధించింది. 2020లో 4.3 శాతం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు 6.34 శాతం పొందిన ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. కనీసం 13 సీట్లలో ఆప్ కు బిజెపి కి మధ్య ఉన్న తేడా కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు రావడం గమనిస్తే ‘ఇండియా’ కూటమి భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే వాటికి మెరుగైన ఫలితాలు ఉండేవని స్పష్టం అవుతుంది.
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జనంలోకి వచ్చిన కేజ్రీవాల్ సరికొత్త రాజకీయాల కోసం అంటూ ఆప్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, విద్యావంతులను ఆకట్టుకొని ఢిల్లీలో అధికారంలోకి రాగలిగారు. విద్య, వైద్య రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ఆ తర్వాత వరుసగా రెండు ఎన్నికలలో గెలుపొందగలిగారు. అయితే ఆయన ప్రయాణం అక్కడితో ఆగిపోయింది.
కాలుష్యం, ట్రాఫిక్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి హామీలను నిలబెట్టుకోలేక పోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడపడాన్ని ప్రజలు ఎక్కువకాలం సహించలేక పోయారనే భావించాలి. నిత్యం లెఫ్టనెంట్ గవర్నర్ తో వీధి పంచాయతీలతో పరిపాలన స్థంభించిపోయే పరిస్థితులు నెలకొనడం, ఫైల్స్ కదలకపోవడం, పాలన కుంటుపడటం వాటితో మొదట్లో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నట్లు ప్రజల సానుభూతి పొందగలిగినా, క్రమంగా వారు విసుగు చెందటం ప్రారంభించి, బిజెపి చూపిన ‘డబల్ ఇంజిన్’ ప్రభుత్వం వైపు ఆకర్షితులైన్నట్లు కనిపిస్తున్నది.
అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ మద్యం కేసులో కీలక నిందితులుగా జైలుకు వెళ్లడం, వారితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా అవినీతి కేసులతో జైలుకు వెళ్లడం ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపింది. అలాగే ఢిల్లీ సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కామ్ అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మసకబార్చాయి. అవన్నీ వేధింపు చర్యలలో భాగంగా నమోదైన నకిలీ కేసులని ప్రచారం చేసినా ప్రజల ముందు తన నిర్దిషిత్వాని నిరూపించుకోవడంలో కేజ్రీవాల్ పూర్తిగా విఫలమైనట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం మొదట్లో మద్దతు కూడదీసినా, క్రమంగా పారిశుధ్యం, ట్రాఫిక్ జామ్‌లు ప్రజలకు విసుగు కలిగించాయి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోవడం, రోడ్లన్నీ గుంతలమయం కావడంతో అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలిగించాయి. ఢిల్లీలో ఉచితాలు తప్ప అభివృద్ధి శూన్యమని విపక్షాలు ఆరోపించాయి. పైగా, బిజెపి ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలంన్నిటినీ కొసనాగిస్తూనే అవినీతిపై కొరడా ఝుళిపిస్తామని, ప్రత్యేకంగా ‘సిట్’ వేసి ఆప్ అవినీతిపై దర్యాప్తు చేస్తామని ప్రకటించడం ప్రజలను ఆకట్టుకుంది.
తాను, తన సహచర మంత్రులు అవినీతి ఆరోపణలలో చిక్కుకుపోవడం, జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉండడంతో కేజ్రీవాల్ ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని అభిప్రాయం బలపడింది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు ఇస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది. 2020 మేనిఫెస్టోలో ఢిల్లీలో కాలుష్యాన్ని 60 శాతం తగ్గిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకొస్తానని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ అధికారంలో ఉండగా ఇటువంటి హామీలకు కట్టుబడి ఉన్నట్లు దాఖలాలు లేవు.
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పురి మాట్లాడే ప్రాంతాలలో సాంస్కృతికంగా పాతుకుపోయిన పూర్వాంచలీల సమాజం ఢిల్లీలో సుమారు 30 శాతం వరకు ఉండటంతో వారు కీలకమైన ఓటు బ్యాంకుగా మారారు. వారి గురించి కేజ్రీవాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు విమర్శలు ఎదురయ్యాయి. జనవరి చివరిలో ఢిల్లీ ప్రజా సేవలను దోపిడీ చేస్తున్నారని పేర్కొనడం ద్వారా బిజెపికి ఓ బలమైన అయిధం సమకూర్చినట్లయింది. ‘‘మేము రూ. 500 టికెట్‌పై వచ్చి రూ. 5 లక్షల విలువైన చికిత్స పొందిన తర్వాత వెళ్లిపోతున్నామని చెప్పడం ద్వారా కేజ్రీవాల్ మమ్మల్ని అవమానపరుస్తున్నాడు’’ అని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ విమర్శించడం గమనార్హం.
గత ప్రచారాలకు భిన్నంగా, బిజెపి హిందూత్వం కంటే కేజ్రీవాల్ పాలన, వాయు కాలుష్యం, ట్రాఫిక్ వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టింది. పూర్వాంచలీలు, మురికివాడల వంటి కీలక జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఈ విస్తృత ప్రచారం బిజెపికి పలు వర్గాలలో మొదటిసారి చొచ్చుకుపోయే అవకాశం కల్పించింది. బిజెపి ప్రచార వ్యూహం మతపరమైన అంశాలపై కాకుండా అవినీతి, పాలనపై దృష్టి పెట్టడం ద్వారా ఆప్ విశ్వసనీయతను సమర్థవంతంగా దెబ్బతీసింది. మరోవైపు, ఢిల్లీ ఎన్నికలకు ఐదు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను పరిమితి ప్రకటించడం మధ్యతరగతి జీవులను ఆకర్షించింది. 8వ వేతన సంఘం కూడా వేయడం ఉద్యోగ వర్గాలలో సానుకూలతకు దారితీసింది. ఓ విధంగా బిజెపి వ్యూహాత్మకంగా అన్ని ఆయుధాలను ప్రయోగించి దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అటువంటి ప్రయత్నం ఆప్, కాంగ్రెస్‌లలో కనిపించలేదు.
ఆప్ గెలుపొందిన 22 నియోజకవర్గాలలో 14 ఎస్సిలు, ముస్లింల ప్రాబల్యం ఉన్నవే కావడం గమనిస్తే పేద ప్రజలలో ఇంకా ఆ పార్టీకి పట్టు ఉన్నట్లు వెల్లడవుతుంది. ఎస్సిలకు రిజర్వు చేసిన 12 నియోజకవర్గాలలో ఆప్ 8 గెలుపొందింది. బిజెపి 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 14 మంది దళితులను నిలబెట్టిన బిజెపి వారిలో నలుగురిని మాత్రమే గెలిపించుకోగలిగింది. ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న 7 నియోజకవర్గాలలో ఆప్ 6 గెల్చుకుంది. ఒక చోట మాత్రమే ఎంఐఎం ఢిల్లీ అల్లర్ల నిందితుడిని నిలబెట్టడంతో బిజెపి గెలుపొందింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఓ విధంగా అన్ని రాజకీయ పార్టీలకు బలమైన సందేశాన్ని అందించాయి. పట్టణ ప్రజలు కేవలం ఉచితాల వెంట పడటం లేదని, వారు మౌలిక సదుపాయాలను, నాణ్యమైన నీటిని, స్వచ్ఛమైన గాలిని, గుంతలు లేని రోడ్లను కోరుకుంటున్నారని వెల్లడిచేశాయి. సుపరిపాలన, మౌలిక సదుపాయాలు లోపించడంతో ఆప్‌కు మద్దతుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు ఈ సారి పెద్ద సంఖ్యలో బిజెపి వైపు వెళ్లిన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ పదునైన వ్యూహం అనుసరించి ఆప్ ను దెబ్బకొట్ట కలిగింది.
లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ తెచ్చుకోవడంలో విఫలమైన బిజెపి తన లోపాలను గ్రహించి వెంటనే హర్యానా, మహారాష్ట్రలలో తన ఎత్తుగడలను, ప్రచార వ్యూహాలను మార్చుకొని ప్రజా విశ్వాసం పొందగలిగింది. అయితే అటువంటి సామర్థ్యం మిగిలిన పార్టీలలో, ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి పక్షాలలో లోపిస్తుందా? అనే అనుమానాలు ఢిల్లీ ఎన్నికలు వెల్లడిస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర అనుభవాల తర్వాతనైనా ఢల్లీిలో ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. కూటమిలో ప్రాంతీయ పార్టీలు దాదాపుగా ఆప్‌కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది.
కాంగ్రెస్ పార్టీ బిజెపిపై పోరాడే ప్రయత్నం చేయకుండా కేజ్రీవాల్ అవినీతి, పరిపాలనపై విమర్శలు గుప్పించడంతో పరోక్షంగా బిజెపికి బలం చేకూర్చిన్నట్లయింది. ఈ ఫలితాల పట్ల జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో విడివిడిగా పోటీచేసినందువల్లే ఈ చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని విరుచుకుపడ్డారు. ‘‘ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు నాశనమయ్యే వరకూ ఇలానే చేసుకోండి.. ఇలా వేర్వేరుగా ఉండటం కంటే ‘ఇండియా’ కూటమి నుంచి విడిపోవడం మంచిది’’ అంటూ చివాట్లు పెట్టారు. అయితే, అటువంటి కనువిప్పు ఆ రెండు పార్టీలలో కనిపించడం లేదు. దానితో ఇండియా కూటమి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వస్తుండగానే ఢిల్లీ సచివాలయం కార్యాలయాలకు తాళాలు వేయడం, ఫైల్స్ కదలికలపై లెఫ్టనెంట్ గవర్నర్ ఆంక్షలు పెట్టడం గమనిస్తే, ఇప్పటికే ఆప్ అవినీతిపై సిట్ వేస్తామని ప్రకటించిన బిజెపి మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఒత్తిడులను ఆప్ ఏమేరకు తట్టుకుంటుందో చూడాల్సి ఉంది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, ఆయన సహచరులపై ఉన్న కేసులపైనా ఎటువంటి ప్రభావం ఉంటుంది? మరోసారి వీరంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుందా? ఈడీ సూచించినట్లుగా ఆప్‌ను రాజకీయ పార్టీల జాబితా నుండి తొలగించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఆప్ అస్థిత్వాన్ని వెంటనే అవకాశం ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ తిరుగులేని ప్రజాదరణ గల నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే అని మరోసారి రుజువయింది. బీజేపీలో గాని, ప్రతిపక్షాలలో గాని ఆయనకు దీటైన నాయకుడు మరొకరు లేరని స్పష్టమైంది.
-జి.మురళీ కృష్ణ,
సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.