
ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ ఆధారంగా జరిగే మోసాల సంఖ్య గుజరాత్లో బాగా పెరిగింది. గత రెండు నెలల్లోనే గుజరాత్లో ఇటువంటి మోసాలకు సంబధించిన 67 కేసులు నమోదు అయ్యాయి.
కర్ణాటకకు చెందిన బెల్గావిలో డిజిటల్ అరెస్ట్ పేరిట 60 లక్షలు మోసపోయిన ఇద్దరు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో మొదలైన దర్యాప్తు సూరత్ చేరుకుంది. సూరత్‌కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు.
ఇదే రకమైన మోసాలకు పాల్పడ్డవారిలో ఇది మూడో అరెస్ట్. గత కొంత కాలంగా జరిగిన మూడు అరెస్టుల్లో నిందితులు గుజరాత్‌కు చెందిన వారే కావడం గమనార్హం. తాజాగా ఏప్రిల్‌లోనే సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెంగాల్‌కు చెందిన ఒక వ్యాపారిని బెదిరించి 80 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడిని పోలీసులు సూరత్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు దర్యాప్తులో ఇటువంటి మోసాలకు సంబంధించిన మాస్టర్ మైండ్ సూరత్ నివాసి సావ్లే శైలేష్ అని తేలింది
ఇదే కేసులో గతంలో మహమ్మద్ అమీన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన వ్యాపారికి మధ్యవర్తులు తాము ముంబై పోలీసు శాఖలో మాదక ద్రవ్యాల విభాగానికి చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
తన పేరుతో వచ్చిన ఒక పార్సెల్‌లో మాదక ద్రవ్యాలు గుర్తించినట్లు చెప్తూ బెంగాల్ వ్యాపారిని వరుసగా మూడు రోజుల పాటు వీడియో కాల్‌లోనే నిర్బంధించారు.
బెల్గావి వృద్ధుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు చిరాగ్ జీవరాజ్ భాయి లక్కడగా గుర్తించారు. ఈ వృద్ధులు తమ మొబైల్ సిమ్ కార్డ్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని చిరాగ్ అతని బృందం బెదిరించింది.
వృద్ధులు బ్యాంక్ ద్వారా పంపిన 60 లక్షల్లో చిరాగ్‌కు ఆరు లక్షల పది వేలు ముట్టినట్టు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఏడాది జనవరిలో ఒక రష్యన్ పౌరుడు ఇలానే మరో వ్యక్తిని 17 లక్షల డిజిటల్ మోసం చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మోసపోయిన వ్యాపారస్తుడు కొంతమంది అగంతకులు తాము కస్టమ్స్ అధికారులం అంటూ మోసగించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈ కాలంలో కేవలం గుజరాత్‌లోనే ఇటువంటి మోసాలు 67 నమోదు అయ్యాయి. వృద్ధులు, ఉద్యోగ విరమణ చేసినవాళ్లు, వివిధ వృత్తుల్లో రాణిస్తున్నవాళ్లు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్ళు ఈ మోసాలకు పాల్పడుతున్నారని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక కథనం తెలియజేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.