ప్రస్తుత కేంద్ర పాలకులకు సిద్ధాంత దైవం వి.డి.సావర్కర్. ఈయన చెప్పిన హిందూత్వ సిద్ధాంతం ఆధారంగా హిందూ రాజ్యం నిర్మించాలని ఆర్ఎస్ఎస్ ఉవ్విళ్ళూరుతున్నది. కేంద్రంలో వున్న అధికారాన్ని ఉపయోగించుకుని అందుకు వేగంగా సిద్ధపడుతుంది. ఈ సంవత్సరానికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్నందున ఆ సంస్థతో పాటు, దాని అధినేతల గురించి అనేక కల్పిత గాధలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. సరిగ్గా ఈ సమయంలో సావర్కర్ నిజరూపాన్ని ‘ది న్యూ ఐకాన్ : సావర్కర్ అండ్ ఫాక్ట్స్’ అనే 550 పేజీల పుస్తకంలో సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరి స్కాన్ చేశారు.
గాంధీజీ హత్య గావించబడిన రోజునే ఆ కేసులో ముద్దాయిగా వున్న సావర్కర్ గురించిన పుస్తకం ఆవిష్కరించడం మరింత ప్రాధాన్యత కలిగించింది.ఈ అరుణ్ శౌరి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకో,కమ్యూనిస్టు అభిమానో కాదు. కరడుగట్టిన హిందూత్వవాది. 1998-2004 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కోసం కల్పిత చరిత్రను సృష్టించిన సీతారాం గోయల్ ‘హిందూ దేవాలయాలు-వాటికి ఏం జరిగింది?’ అనే పుస్తకం ఆధారంగా అయోధ్య బాబ్రీ మసీదు వివాదాన్ని రగిలించడంలో కీలకంగా పని చేసిన జర్నలిస్టు ఈ అరుణ్‌శౌరి.
‘ది ఇలస్ట్రేటెడ్ విక్లీ’ పత్రికలో కమ్యూనిస్టుల మీద నిందా ప్రచారాన్ని చేసిన ఆర్ఎస్ఎస్ వాది. జీవిత కాలమంతా పాపాలు చేసి చివరి రోజుల్లో గంగానది స్నానానికి వెళ్లినట్లు శౌరి తన చివరి రోజుల్లో ఈ పరిశోధనాత్మక పుస్తకాన్ని రాశారు.
స్వాతంత్య్ర పోరాటంలో చిత్రహింసలను, ధన, మాన,ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరయోధుల స్థానంలో బ్రిటీష్ వారి క్షమాభిక్షను ‘అడుక్కుని’, వారు ఇచ్చే ముష్టి పింఛను కోసం దేబిరించిన వారి చిత్రపటాలను పార్లమెంట్ హాల్లో ప్రతిష్టించుకుంటున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం.
దేశ విభజనకు మూల బీజాన్ని నాటిన వ్యక్తి పేరు అంతర్జాతీయ విమనాశ్రయాలకు పెట్టిన పాలకుల ఏలుబడిలో ప్రస్తుతం మనం వున్నాం. మహాత్ముడు పాపాత్ముడు అవుతున్నాడు. దేశద్రోహమే దేశభక్తి అయిపోతున్నది. ఈ పరిస్థితుల్లో అరుణ్ శౌరి రాసిన ఈ పుస్తకం లోని అంశాలను విద్యార్థులు, మేధావులు,ప్రజాతంత్ర వాదులు విస్తృతంగా చర్చించాలి.
వినాయక దామోదర్ సావర్కర్ గురించి ప్రచారంలో వున్న కొన్ని కీలకమైన అంశాల వాస్తవికతను రచయిత ఈ పుస్తకంలో వివరించారు. తాను చెప్పిన అంశాలకు వందల ఆధారాలను ఈ గ్రంథంలో చూపారు.
ఫ్రాన్స్ సముద్ర జలాల్లో మెరిసిల్స్ వద్ద ఓడ నుండి సావర్కర్ తప్పించుకున్నారా? సావర్కర్, గాంధీలు లండన్‌లో స్నేహితులుగా కలిసి ఉన్నారా? అండమాన్‌లో జైలు అధికారుల వల్లే సావర్కర్ ముస్లిం వ్యతిరేకిగా మారారా? బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న దరఖాస్తులలో ఏముంది? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించారా? నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సావర్కార్ మార్గదర్శా? హిందూత్వం గురించి,మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు,గోవుల గురించి సావర్కర్ ఏం చెప్పారు? సావర్కర్ నిర్మించ దలచుకున్న హిందూ రాజ్యం ఎటువంటిది? వీటికి సమాధానాలు వెదికారు.ప్రస్తుత పాలకుల మతతత్వ విధానాల ప్రమాదాన్ని హెచ్చరించారు.
వి.డి. సావర్కర్ ఎవరు?
స్వాతంత్య్రోద్యమంలో మతం ఆధారంగా ప్రజల మధ్య ఐక్యతను విభజించిన ముస్లీంలీగు, హిందూ మహాసభలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సామ్రాజ్య వాదానికి తోడ్పడ్డాయి. సావర్కర్ 1937లో హిందూ మహాసభకు అధ్యక్షుడై ఏడు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నాడు.
ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది ఈయనే.అదే ఆ తర్వాత దేశ విభజనకు కారణ మైంది.1909లో కర్జన్ విల్లి అనే బ్రిటీష్ భారత ఆర్మీ అధికారి హత్యను ప్రోత్సహించడంతో పాటు,మరో రెండు హత్య కేసుల్లో అనుమానాస్పదుడు. అండమాన్ జైల్లో ఉన్న రోజుల్లో 1911, 1913, 1917 సంవత్సరాల్లో క్షమాభిక్ష పెట్టాలని బ్రిటీష్ అధికారులను రాతపూర్వకంగా వేడుకున్నాడు.
1948 జనవరి 30న గాడ్సే కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాంధీజీ హత్య కేసులో ఆయన ముద్దాయి. ఈయన రాసిన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’ గ్రంథం నేటి ఆర్ఎస్ఎస్కు, బిజెపి కి ప్రాణవాయువు.
అరుణ్ శౌరి పుస్తకంలో ఏముంది?
మొదటి భాగంలో ‘సావర్కర్ గురించి మరింత తెలుసుకుందాం’ అనే శీర్షిక కింద సావర్కర్ ”గోవు” ఆరాధకుడు కాదని,అంతే కాక గొడ్డు మాంసం తినడానికి ఆయన వ్యతిరేకం కాదని, వ్యవసాయానికి అవసరమైన పశుసంపదకు కారణం ఆవు కనుక దాన్ని గౌరవించడం తప్పు కాదు కానీ ఆవుకు ఒక పవిత్రతను అంటగట్టడం సరికాదని సావర్కర్ చెప్పినట్లు శౌరి ఈ భాగంలో చెప్పారు.
గో మూత్రం,గో పేడ,గో సంరక్షణ పేరుతో నేటి పాలకులు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రచారం, ఇతర మతస్తులపై దాడి ఆవుపై గౌరవంతోనో, భక్తితోనో కాదని దాని వెనుక మతతత్వ ఎజెండా వుందని శౌరి చెప్పారు. సావర్కర్ గొప్పదనం గురించి ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రచారం ‘చరిత్ర కల్పితం’ అనే రెండో భాగంలో చరిత్ర ఆధారాలతో శౌరి చర్చించారు. చిత్రగుప్త పేరుతో రాయబడిన ‘లైఫ్ ఆఫ్ బారిస్టర్ సావర్కర్’ పుస్తక రచయిత సావర్కరేనని శౌరి తేల్చారు. తన చరిత్రను మారు పేరుతో రాసుకుని అందులో అనేక కల్పితాలను సృష్టించారని ఆయన ఆరోపించారు.
‘ది రివల్యూషనరీ రైట్స్’ అనే మరో భాగంలో సావర్కర్ తనను తాను శివాజీతో పోల్చుకోవడాన్ని శౌరి హేళన చేస్తారు. ‘శివాజీ ఆటంకాలను అధిగమించి తన పోరాటాన్ని కొనసాగించాడు. సావర్కర్ మాత్రం బ్రిటీష్ వారికి పెట్టుకున్న క్షమాభిక్ష విజ్ఞాపన ప్రకారం వారికి ఉపయోగపడ్డాడు. రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బ్రిటీష్ వారికి ఎల్లవేళలా ఉపయోగపడ్డాడు. సావర్కర్ గాంధీజీపై అనేక అవమానకర మైన విమర్శలు, దూషణలు చేశాడు’ అని శౌరి చెప్పారు.
1911లో సావర్కర్ అండమాన్ సెల్యులార్ జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించి బ్రిటీష్ అధికారులకు క్షమాభిక్ష కోరుతూ లేఖ రాసుకున్నాడు. 1913లో మరోసారి లేఖ రాస్తూ ‘భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం రాజీ విధానంతో మరోసారి ముందుకొచ్చింది.మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా… ముళ్ళ దారిని కోరుకోడు.’ అంటూ ‘నేను మీకు అవసరమైన ఏ పదవినిచ్చినా ప్రభుత్వానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకున్న వ్యక్తి సావర్కర్.
సుభాష్ చంద్రబోస్,మహాత్మా గాంధీల గురించి సావర్కర్ అబద్ధం చెప్పాడని, 1908లో గాంధీ లండన్‌లో వున్నప్పుడు సావర్కర్ అక్కడకు వెళ్లనేలేదని అలాంటప్పుడు గాంధీతో లండన్‌లో స్నేహం ఎలా ఏర్పడిందని ప్రశ్నించారు.భారతదేశం నుండి పారిపోవాలని, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేయాలని, హిందూస్థాన్‌కు పూర్తి స్వాతంత్య్రం ప్రకటించాలని సావర్కర్ సుభాష్ చంద్రబోస్‌కు చెప్పాడనేది పూర్తిగా కల్పితమని అరుణ్ శౌరి చెప్పారు.
1920లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ కార్మికుల, రైతుల,సామాజిక సమస్యలను జాతీయోద్యమ ఎజెండాగా మలచింది. 1920-25 మధ్య మూడు పెద్ద కుట్ర కేసులను ఆ పార్టీ నాయకులు ఎదుర్కొన్నారు. అప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మార్చుకుని పూర్తి స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేసింది. ఇలాంటి సమయంలో హిందూ మహాసభను బ్రిటీష్ యుద్ధ మండలిలో చేర్చమని వైస్రారు లార్డ్ లిన్‌లిత్‌గోను సావర్కర్ ”అడుక్కున్నాడు” అని ఈ పుస్తకంలో రాశారు.
సంపూర్ణ స్వాతంత్య్రానికి విరుద్ధమైన అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ హోదా)ని ఇస్తామన్న బ్రిటీష్ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా సావర్కర్ సంతోషంతో అంగీకరించాడని రచయిత తెలుపుతారు.
జీవిత కాలమంతా అహింసను బోధించిన మహాత్మా గాంధీ సైతం 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బ్రిటీష్ వారితో పోరాటం చివరి దశకు వచ్చిందని ‘విజయమో వీర స్వర్గమో’ తేల్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇలాంటి సమయంలో సావర్కర్ బ్రిటీష్ సైన్యంలో చేరమని తన సంస్థ సభ్యులకు చెప్పాడని రుజువు చేశారు.
సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని మహమ్మద్ ఆలీ జిన్నా మరింత ముందుకు తీసుకవెళ్లి ముస్లింలు, హిందువులు రెండు జాతులని ఇవి రెండూ కలిసి వుండలేవు కనుక పాకిస్తాన్ కావాలని దేశ విభజనకు కారకుడయ్యాడు.
పాకిస్తాన్ ప్రతిపాదనకు పోటీగా సిక్కిస్తాన్ కావాలని సావర్కర్ మరో వాదనను చేశాడు. ఈ రకంగా దేశ విభజనకు,జాతుల మధ్య ఘర్షణలకు సావర్కర్ భావజాలం తోడ్పడిందని ఈ పుస్తకంలో రచయిత వివరించారు. అంబేద్కర్‌ను సావర్కర్ అనేక సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు.
‘హిందూత్వ నుండి హిందూ మతాన్ని రక్షించండి’ అనే చివరి భాగంతో శౌరి ఈ పుస్తకాన్ని ముగించారు. హిందూ మతంలో వున్న క్రతువులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, ధ్యానం,ప్రార్థనలు మనిషి మరింత ఉన్నతంగా ఎదిగేందుకు,ఆత్మ పరిశుద్ధికి మార్గాలుగా భావిస్తారు.ప్రస్తుతం వీటన్నింటికీ వక్రభాష్యాలు చెప్పి రాజ్యాధికారాన్ని సాధించటం,రాజ్యంపై పెత్తనం చేయటం కోసమే ఈ క్రతువులు, ఆచారాలు, భక్తి ప్రపత్తులు అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారని అరుణ్ శౌరి ఘాటుగా విమర్శించారు.
రాజ్యాధికారం కోసం మానవ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చెయ్యటానికి కూడా వెనకాడరని, తీర్థయాత్రలను, కుంభమేళాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారని, సాంప్రదాయక అవగాహనకు భిన్నంగా దేవాలయాల దర్శనం పేరుతో ‘ధార్మిక పర్యాటక రంగం’ వంటి వాటిని చేపడుతున్నారని పేర్కొన్నారు.
విభిన్న మార్గాల్లో భగవంతుడిని చేరు కోవడం అన్నది హిందూ మత వాస్తవికత అని అందుకు భిన్నంగా నాయకుడి అడుగు జాడల్లో నడవడం ద్వారానే పుణ్యం వస్తుందనే అశుద్ధ భావజాల ప్రచారాన్ని శౌరి తీవ్రంగా ఆక్షేపించారు.
”హిందూ మతం ప్రధానంగా ఆత్మశుద్ధితో కూడుకున్నది. అంటే సత్యానికి కట్టుబడడం, అణకువ, నమ్రత, సేవా భావన, నైతిక ప్రవర్తన కలిగివుండడం. అలాంటి ‘హిందూ మతాన్ని హిందూత్వ నుండి కాపాడుకుందాం.” అని శౌరి ఈ పుస్తకాన్ని ముగించారు.
వి. రాంభూపాల్
రచయిత సీపీఎం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు
ఈ పుస్తక సమీక్ష మొదట ప్రజాశక్తి దినపత్రిక లో అచ్చయింది