![Nirmala Sitharaman leaves from the Ministry of Finance for Rashtrapati Bhavan](https://thewiretelugu.in/wp-content/uploads/2025/02/Nirmala-Sitharaman-leaves-from-the-Ministry-of-Finance-for-Rashtrapati-Bhava.jpeg)
భారీ పెట్టుబడులు, మౌలికరంగ విస్తరణ లక్ష్యాలుగా ఉన్న నిర్మలా సీతారామన్ ఎనిమిదో బడ్జెట్, మోడీ ప్రభుత్వపు 12వ బడ్జెట్‌తో సామాజిక సేవలు, పేదలు, నిరుద్యోగ యువత, రైతాంగం, వ్యవసాయకూలీలకు ఒరిగేదేమీ లేదు.
మూడో దఫా అధికారానికి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దేశాన్ని ప్రపంచ ఆర్థిక అగ్రరాజ్యంగా చూడాలనుకుంటున్న పరిస్థితుల్లో దేశానికి బడ్జెట్ ఇచ్చే దిశా నిర్దేశం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. దేశ ఆర్థికాభివృద్ధికి కావల్సిన రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్‌తో వస్తుందని ఎదురు చూశారు. ప్రజలకు వినియోగ సామర్ధ్యం, కంపెకనీలకు పెట్టుబడి సామర్ధ్యం పెరిగే ప్రణాళికలు రచించబడతాయని ఆశించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత ఈ రెండు అంశాలూ నానాటికీ బలహీనపడుతున్నాయి. ఆర్ధికాభివృద్ధికి సంకెళ్లుగా మారాయి.
కానీ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ద్రవ్య విధానం ఈ లక్ష్యాలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేదిగా లేదు.
స్థూల జాతీయోత్పత్తిలో 80 శాతం అప్పులపై ఆధారపడి ఉంది. వార్షిక జాతీయాదాయంలో పాతికశాతం వడ్డీలకే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ద్రవ్య ప్రమాణాలు దేశాభివృద్ధికి దోహదం చేసేవిగా లేవు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి ద్రవ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారైంది. 2026-27 నాటికి 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా పెట్టుకుంది. ద్రవ్య నియంత్రణ లక్ష్యాలు తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆర్థిక మంత్రి చెప్పటంలో వింతేమీ లేదు. కాకపోతే తేడా ఒక్కటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం జాతీయాభివృద్ధిని ఫణంగా పెట్టి ఈ లక్ష్యాలు సాధించాలనుకొంటోంది.
ఆర్థిక క్రమశిక్షణ పేరుతో పట్టాలు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు వీలుగా తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసింది మోడీ ప్రభుత్వం.
వ్యవసాయోత్పత్తిలో వెనకబడిన వంద జిల్లాలకు ప్రోత్సాహం ఇవ్వటానికి వీలుగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన వంటి పేర్ల ద్వారా ప్రజాకర్షక పథకాలు ప్రారంభించటం లాంటి మొక్కుబడి చర్యలు తప్ప చెప్పుకోదగ్గ విధానాలేవీ ప్రతిపాదించలేకపోయింది.
ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం కంటే రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకోవడానికి ఎక్కుపెట్టబడ్డాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలను ఓటుబ్యాంకుగా పరిగణించి, ఓట్లు రాల్చుకోవడానికి బడ్జెట్‌ను మాధ్యమంగా మల్చుకున్న తీరే కనిపిస్తోంది. బీహార్ గురించిన బడ్జెట్ ప్రతిపాదనలే దీనికి ఉదాహరణ.
పైకి చూస్తే సమగ్ర బడ్జెట్‌గానే కనిపిస్తోంది. పది ప్రాధాన్యతా రంగాలనుకూడా నిర్దేశించుకుంది. వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, సృజనాత్మకరంగాలకు ప్రోత్సాహం, ఉపాధి వంటి వాటి ఆధారంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తామని ప్రకటించింది. మహిళలు, యువత, పేదలపట్ల ప్రత్యేక దృష్టితోనూ, అభివృద్ధిలో ప్రాంతీయ సమతౌల్యత లక్ష్యంతోనూ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని ఆర్థిక మంత్రి చెప్తున్నారు. కానీ, తదనుగుణంగా బడ్జెట్లో వ్యూహరచన కనిపించటం లేదు.
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.5 శాతానికి తగ్గిందని ప్రభుత్వం చంకలు కొట్టుకొంటోంది. కానీ ఈ తగ్గుదల ఎంత? గత త్రైమాసం నాటికి పట్టణ ప్రాంత నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. అంటే తగ్గింది 0.1శాతం. దీనికే కేంద్రం చంకలు కొట్టుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ కీలకమైన సమస్య పట్టణ ప్రాంతాల్లో దొరుకుతున్న ఉపాధి నాణ్యత, నిలకడతనం ఏమిటన్నది. ఈ మధ్యనే ది వైర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారు అరవింద సుబ్రమణ్యం ఈ విషయాన్ని లేవనెత్తారు.
ఈ కాలంలో అసంఘటితరంగంలో బొటాబొటి వేతనాలతో మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఒకసారి అటువంటి ఉద్యోగాల్లో చేరిన తర్వాత జీవితంలో ఒక్కసారన్నా పదోన్నతి ఉంటుందన్న నమ్మకం కానీ ఆశ కానీ లేవు. అటువంటి భద్రత లేని కొలువులతో జనం కొనుగోలు శక్తి నిలకడగా పెరగటం అన్నది కల్ల. దేశంలో ఉన్న యువతకు సంపూర్ణంగా పని కల్పించాలన్నా, 2047 నాటికి ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా ఎదగాలన్నా ఏటా కనీసం 75 లక్షలమందికి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాలి. ఆర్థిక వ్యవస్థ ఆ మేరకు ఉపాధి అవకాశాలు సృష్టించగలగాలి. అటువంటి లక్ష్యం కానీ, దాన్ని సాధించే ప్రణాళిక, రోడ్ మ్యాప్ కానీ బడ్జెట్లో లేవు.
దేశంలో ఉపాధికల్పనకు వెన్నెముక లాంటిది చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం. ఈ రంగం దాదాపు 23 కోట్లమందికి బతుకుదెరువు కల్పిస్తోంది. కానీ ఈ పరిశ్రమలు అనేక వ్యవస్థాగత, సంస్థాగత లోపాలు, పరిమితులు, బంధనాలతో మగ్గుతున్నాయి. దేశంలో కనీసం మూడోవంతు శ్రామికజనావళికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమలు అనేక వైఫల్యాల బరువుకి కునారిల్లుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి చేసిన ఉపన్యాసంలో గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు ఇస్తామని వాగ్ధానం చేయటం ద్వారా యావత్ అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను చాపకిందకు నెట్టేసేందుకు ప్రయత్నం చేసింది. అంతేకాదు. ఉపాధి కల్పన గురించిన ప్రభుత్వ వ్యూహ రాహిత్యాన్ని కూడా కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.
పేదల సాధికారీకరణ, పరపతి వ్యవస్థ, జీవనోపాధి
పలు శ్రేణులకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే గ్యారంటీల రూపంలో పరపతి అవకాశాలు కల్పించేందుకు ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు దేశం ముందుంచింది. పరపతి గ్యారంటీ సదుపాయాలను ఐదు కోట్ల నుండి పది కోట్లకు పెంచింది. రానున్న ఐదేళ్లల్లో లక్షన్నర కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు రుణాలుగా మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనలు చిరువ్యాపారులకు అవసరమైన రుణాలను అందుబాటులోకి తేవడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు దోహదం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ పరిశ్రమలకు (ఐదు లక్షల లోపు పెట్టుబడితో నడిచేవి) కూడా పరపతి చట్రం పరిధిలోకి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించారు. ఈ లక్ష్యాలు రెండూ సక్రమంగా అమలు జరిగితే ఇప్పటి వరకూ బ్యాంకింగ్ రుణాలు పొందలేని లక్షల పరిశ్రమలకు రుణాలు అందుబాటులోకి రావచ్చు. తద్వారా ఆయా కంపెనీలు కొంతమేర ఉపశమనం పొందవచ్చు.
అదనంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం ద్వారా 80 కోట్లమందికి ఉచిత ఆహారధాన్యాల సరఫరాను రానున్న ఐదేళ్లపాటూ కొనసాగించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. పేదకుటుంబాలకు చెందిన విద్యార్ధులకు 10 లక్షల రూపాయల వరకూ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పథకం ద్వారా రుణాలు మంజూరు చేయటానికి కూడా నిర్ణయించింనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాలన్నీ వినటానికి బాగానే ఉన్నాయి కానీ లబ్దిదారుల ఎంపిక, పరపతి ఇచ్చే బ్యాంకుల సంసిద్ధత, రుణాలు మంజూరే ఇందులో కీలకమైన సమస్యలు. ఇప్పటి వరకూ ప్రకటించిన విన్నూత్న పథకాల అమలు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, సాధించిన అనుభవాలు, గుణపాఠాల గురించి మాట మాత్రమైనా ప్రస్తావన లేదు.
వ్యవసాయరంగ ప్రతిపాదనల ద్వారా రైతుకు మేలు కలుగుతుందా?
బడ్జెట్ కనీస మద్దతు ధర విషయంలో బడ్జెట్ నోరు మెదపలేదు. వ్యవసాయోత్పత్తుల అదనపు సేకరణ విషయం కూడా ప్రస్తావనకు నోచుకోలేదు. రైతాంగం జీవితాలు మెరుగుపడటానికి ఇవే ముఖ్యం.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంచుకున్న వ్యవసాయ రంగ ప్రాధాన్యతల్లో ముఖ్యమైనది ఉత్పాదకత పెంచటం. ఆధునిక సాంకేతిక పద్ధతులు, మన్నికైన, సేంద్రియ సేద్యం, సాగునీటి వనరుల అభివృద్ధి, విస్తరణ ద్వారా పంటలు వృధాకానీయకుండా చూడటం ప్రభుత్వ విధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ధనధాన్య కృషి యోజన పేరుతో మండలం, పంచాయితీల స్థాయిలో పంటల వైవిధ్యం, ఉత్పాకదతను పెంచటం, గిడ్డంగుల సామర్ధ్యాన్ని పెంపొందించటం వంటి చర్యలకు తెరతీసింది. వ్యవసాయ రంగంలో వెనకడిన వంద జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఫలితాన్నిచ్చే ప్రతిపాదనలే తప్ప తక్షణం రైతు, సేద్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేవి కాదు.
సేద్యం దివాళా తీయకుండా ఉండాలంటే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ సౌకర్యం అందుబాటులో ఉండాలి.వడ్డీల భారం తగ్గాలి.
మహిళలు : పరపతి లభ్యత, అవరోధాలు
పారిశ్రామిక రంగంలోకి అడుగుపెడుతున్న ఐదు లక్షలమంది తొలితరం మహిళలు లేదా ఎస్సీ ఎస్టీలకు రెండు కోట్ల రూపాయల టర్మ్‌లోన్ ఇస్తామన్న వాగ్ధానం ఆసక్తికరంగానే ఉంది. ఆర్థికాభివృద్ధిలో వెనకబడుతున్న మహిళలు, సామాజిక తరగతులను ఉత్పత్తి కార్యకలాపాల్లోకి తీసుకురావటానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యయనంలో దాదాపు 90 శాతం మంది మహిళలు బ్యాంకు రుణాలకు దూరంగానే ఉన్నారని తేలింది ఈ పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ప్రయోజకరమే కానీ ఐదు లక్షలమంది మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలనుకోవటం రకరకాల అవకతవకలకు అవకాశం ఇచ్చే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.
సక్షమ్ అంగన్వాడీ పోషణ పథకం ద్వారా ఎనిమిదికోట్ల మంది శిశువులు, కోటి మంది గర్భవతులైన మహిళలు, 20 లక్షల మంది ఆడపిల్లలకు పోషకాహారం అందించేందుకు జరుగుతున్న ప్రయత్నం గతంలో అమలు జరిగిన లక్షిత సంక్షేమ పథకాల కోవకు చెందుతుంది. అంటే ఎవరికి అవసరమో వారికి మాత్రమే చెందేలా పథకాన్ని రూపొందించటం. ప్రపంచ ఆకలి సూచికల్లో భారతదేశం అట్టడుగు స్థానానికి చేరుతున్న సమయంలో ఇటువంటి పథకం అవసరం మాత్రమే కాదు. పార్లమెంట్‌లోనూ, బయటా అంగీకరించటానికి సిద్ధం కాని కొన్ని చేదు నిజాలను ప్రభుత్వం గుర్తించినట్లుగా కూడా ఈ ప్రతిపాదనల ద్వారా భావవించవచ్చు.
మహిళా పారిశ్రామికులకు రుణసౌకర్యం అందుబాటులోకి తేవటం అవసరమే కానీ అంతకన్నా ముఖ్యమైనవి ఇప్పుడు అమలు జరుగుతున్న పథకాలు, కొత్త పథకాల్లో తలెత్తే వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించటం ప్రాధాన్యతగా ఉండాలి. జెండర్ గ్యాప్ నివేదికలో భారతదేశం స్థానాన్ని పరిశీలిస్తే దేశంలోని మహిళల బహుముఖాభివృద్ధికి సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం కనిపిస్తోంది.
సామాజిక రంగాల వ్యయం
విద్య, వైద్య గ్రామీణాభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం భారీ ఆలోచనలు, ప్రతిపాదనలు చేస్తోంది కానీ నిజానికి బడ్జెట్ కేటాయింపులు తగిన విధంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించాలి. పైకి చూస్తే సామాజిక రంగాలకు కేటాయింపులు పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పెరుగుతున్న ధరల నేపథ్యంలో చూస్తే నిజ కేటాయింపులు తగ్గాయనే చెప్పాలి.
పార్లమెంట్లో పెట్టిన లెక్కల ప్రకారం కేంద్రానికి వచ్చే ఆదాయం 28.37 లక్షల కోట్లు. ప్రతిపాదిత ఖర్చు మాత్రం 50.65 లక్షల కోట్లు. మరి సుమారు సగానికి సగం పైసలు చేతుల్లో లేకుండానే కేటాయింపులు చేస్తోంది. దీన్ని బట్టి కేటాయింపులన్నీ యథాతథంగా ఆచరణలోకి వచ్చే అవకాశమే లేదని తేలిపోతోంది. ద్రవ్య నియంత్రణ పాటిస్తున్నామని చెప్తున్నారు కానీ దాని కోసం దేశం ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తోందో అంచనా వేసే సాహసం కూడా లేదు ప్రభుత్వానికి. రూపాయి సంపాదనలో పావలా వడ్డీలకు, మరో పావలా రక్షణ రంగానికే ఖర్చు అవుతున్నపుడు ఇన్ని పథకాలు అర్థవంతంగా అమలు చేయటం ఆచరణసాధ్యమేనా? అన్నది ఈ బడ్జెట్ పరిశీలనలో ముందుకొచ్చే కీలకమైన ప్రశ్న.
ఉదాహరణకు విద్యారంగాన్నే తీసుకుంటే ఈ రంగంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలెన్నో ఉన్నాయి. చూపించాల్సిన చొరవ ఎంతో ఉంది. కానీ కేటాయించిన నిధులు మాత్రం నామమాత్రం. కనీసం దేశంలో బడికెళ్లే ఈడుకొస్తున్న పిల్లల సంఖ్యతో పోలిస్తే వాళ్లందరికీ చదువు చెప్పటానికి ఏర్పాటు చేయాల్సిన మౌలికవసతులు ఎంతో కొరతగా ఉన్నాయి.
వైద్య రంగంలోకూడా వైద్య విద్య విస్తరణ, క్యాన్సర్ కేర్ వంటివి ఆహ్వానించదగిన పరిణామాలే. పెరుగుతున్న గ్రామీణ నిరుద్యోగాన్ని అర్థవంతంగా పరిష్కరించేందుకు కావల్సినన్ని నిధులు, ప్రతిపాదనలూ లేవు. ఇవన్నీ వదిలేసి కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాల కల్పన పేరుతో లక్షలకోట్లు కుమ్మరిస్తోంది. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు, తక్షణ సంక్షేమ అవసరాలు మధ్య ఆరోగ్యవంతమైన అర్థవంతమైన సమన్వయం, సమతౌల్యత ఉండాలి. ఈ ప్రభుత్వం తక్షణ ప్రజా అవసరాలను పక్కన పెట్టి దీర్ఘకాలంలో ప్రయోజనాలిచ్చే రంగంపై దృష్టి పెడుతోందా?
అలానే కనిపిస్తోంది. దీనికి నిదర్శనం రాజకీయ ప్రేరేపిత అభివృద్ధి వ్యూహాలు, విధానపరమైన స్పష్టత లోపం. ఈ విధానాల మార్గదర్శకత్వంలో సబ్ కా వికాస్ సాధ్యమే కాదు.
– దీపాంశు మోహన్, సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్
అనువాదం : కొండూరి వీరయ్య