![images](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/images-5.jpeg)
ఆర్టీఐ ద్వారా వెల్లడి
భారత దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు గత పదేళ్ళలో 84 శాతం కార్పొరేట్ రుణాలు మాఫీ చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వెల్లడి అయ్యింది. ఈ కాలంలో మొత్తం రూ. 16.6 లక్షల కోట్ల రుణాలకు గాను 16% మాత్రమే వసూలు చేశాయి.
న్యూ ఢిల్లీ: పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పీ సర్దా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) క్రింద లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం ఏప్రిల్ 1, 2014 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు భారతీయ బ్యాంకులు రూ 16,61,310 కోట్ల విలువైన రుణాలను రద్దు చేశాయి. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఐబీసి కోడ్ వంటి చర్యలు, 2017 తర్వాత తీసుకొచ్చిన విధాన నిర్ణయాల్లో భాగంగా వసూలైన కార్పొరేట్ రుణాలు కేవలం రూ 2,69,795 కోట్లు మాత్రమే అని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
RTI సమాధానం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 12,08,621 కోట్లు , ప్రైవేటు రంగ బ్యాంకులు రూ 4,46,669 కోట్లు, పట్టణ సహకార బ్యాంకులు రూ. 6,020 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని వెల్లడైంది.
రికవరీ రే 16% రికవరీ రేటు..
ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,16,547 కోట్లు వసులు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ .53,248 కోట్లు స్వాధీనం చేసుకున్నాయి. అంటే ప్రభుత్వ రంగమా కాదా అనేదానితో నిమిత్తం లేకుండా అన్ని బాంకుల్లోనూ రికవరీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఇకపోతే పట్టణ సహకార బ్యాంకుల రికవరీ డేటా అందుబాటులో లేదని ఆర్బిఐ వెల్లడించింది. రూ .13,91,515 కోట్ల రూపాయలు ఇంకా వసూలు కాలేదు. మొత్తం రికవరీ రేటు సుమారు 16% గా ఉంది.
అత్యధికంగా రుణాల రద్దు..
నవంబర్ 2024లో లోక్‌సభలో వచ్చిన ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన లెక్కల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రైట్-ఆఫ్ లు రూ 1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి (ఆర్ధిక సంవత్సరం 2024). 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ. 2.34 లక్షల కోట్ల రూపాయలు. అయితే, గత ఐదు సంవత్సరాల కాలంలో ఇదే అత్యంత తక్కువ మొత్తం. ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రుణాలు రద్దు చేశాయి. ఇందులో ప్రైవేట్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మొదలైన బ్యాంకులు మొదటివరసలో ఉన్నాయి.
2024 సంవత్సరంలో మొత్తం రైట్ -ఆఫ్‌లు తగ్గాయి. అయినప్పటికీ, 20% కంటే ఎక్కువ బ్యాంకులు మునుపటి సంవత్సరం కంటే ఎక్కువగా రుణాలను రద్దు చేశాయి.
రిజర్వు బ్యాంకు వివరణ…
సాంకేతిక లేదా వసూలు సంబంధిత కారణాల వల్ల ఎక్కువ శాతం రైట్ ఆఫ్ లు చోటుచేసుకుంటాయని, రుణాలు రద్దు చేసిన తర్వాత కూడా బ్యాంకులు వాటిని తిరిగి పొందే హక్కు ఉంటుందని, ఎందుకంటే ఈ ప్రక్రియ ప్రధానంగా బ్యాలెన్స్ షీట్ ల నిర్వహణ కోసం, పన్ను చెల్లింపుల్లో సామర్ధ్యాన్ని చూపించటం కోసం అకౌంటింగ్ ప్రాక్టీస్‌గా పనిచేస్తుంది తప్ప రుణాలు రద్దు చేయబడ్డ (రైట్ ఆఫ్ ) రుణగ్రహీతలను వారి ఋణం తిరిగి చెల్లించే బాధ్యతల నుండి తప్పించదని రిజర్వు బ్యాంకు వివరణ ఇచ్చింది.
సర్దా విశ్లేషణ…
అయితే, “అధిక మొత్తాలలోని రుణాలను తిరిగి రాబట్టుకోవటానికి నిర్దేశిత కాలపరిమితి లేకపోవటం వల్ల, లక్షల కోట్ల ప్రజా ధనం ప్రజా ప్రయోజనాలకోసం ఉపయోగపడకుండా నిరుపయోగం అవుతోందని, బ్యాంకులు మాత్రం ప్రతి సంవత్సరం ఆకర్షనీయమైన బ్యాలెన్స్-షీట్లను జారీ చేస్తున్నాయని” ఆర్టిఐ ప్రశ్నను ఆర్బిఐకి దాఖలు చేసిన సర్దా తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.
30 ఏళ్ల ఆర్బిఐ విధానాలకు అనుగుణంగా, బ్యాంకులు, రుణ సంబంధిత విషయాలను పర్యవేక్షించే వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కలిసి రుణాలను తిరిగి రాబట్టుకోవటానికి సరైన రికవరీ పాలసీ (వసూలు విధానాలను) నిర్ణయించాలని కూడా సర్ధ అన్నారు.
“ఈ నేపథ్యంలో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రుణదాతలపై జవాబుదారీతనం కోసం కఠినమైన నిబంధనలను ప్రకటిస్తారా? అలాగే NPA (నిరర్ధక ఆస్తులు) ల రూపంలో బ్యాంకులు కోల్పోయిన మొత్తాలకు బ్యాంకు మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ నుండి బోర్డు డైరెక్టర్ల వరకు బాధ్యులను చేసి, వాటిని తిరిగి రాబట్టుకునేందుకు ఆ మొత్తాలను వారి నుండి వసూలు చేస్తారా” అని కూడా సర్దా ప్రశ్నించారు.
ఆగష్టు 2024లో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన వేరొక ప్రశ్నకు భారతీయ రిజర్వు బ్యాంకు స్పందిస్తూ “గత ఐదేళ్ళలో బ్యాంకులు రద్దు చేసిన రుణాలలో కేవలం 18.7% రుణాలను మాత్రమే రికవరీ చేసుకున్నాయని” చెప్పింది.
సెప్టెంబర్ 2024 నాటికి RBI వద్ద ప్రొవిజనల్ డేటా మాత్రమే ఉంది. RBI రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుండి సమాచారాన్ని సేకరించనందున, ఆ గణాంకాలను ఇందులో మినహాయించింది. ఇప్పటివరకు అందించిన సమాచారం అంతా బ్యాంకుల ఆఫ్-సైట్ రిపోర్టుల నుండి వచ్చింది.
పవన్ కోరాడ
అనువాదం : పద్మశ్రీ