
హిందూయిజంలో మనకు తెలీని కొత్త కోణాలు
కుంభమేళాలో కనిపిస్తోంది సన్యాసులు, కరుడుకట్టిన సాంప్రదాయికత, క్షుద్ర సైనిక విన్యాసాలు, రాజఠీవిలే. ఇవన్నీ సాధారణంగా హిందూయిజం గురించి జరుగుతున్న చర్చల్లో మనకు కనిపించని అంశాలు.
ప్రజారంజక హిందూయిజం గురించి సాధారణంగా మనకు తెలీని, లక్షణాలు, వ్యవహారాలు, కథల్లో చదుకునే తాంత్రిక ప్రదర్శనలు కుంభమేళా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఆశ్చ్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ గుడి లేదు. ఓ దేవుడంటూ లేడు. పాటలూ లేవు. పూజారులు లేరు. ఇది ప్రధానంగా ఓ సాంప్రదాయం. వివిధ అఖాడాలకు పీఠాలు, ఆశ్రమాలకు చెందిన, వంటి నిండా విభూతిపూసుకుని, జటాజూటాలే వస్త్రాలుగా దండకమండలాలు, దిగంబరత్వంతో హడావిడి చేసే పురుషాధిక్య ప్రదర్శనలు…గణాధిపతి తన గణాలను పురికొల్పటానికి చేసే భైరనాట్యాలే కుంభమేళాలో కనిపించే క్రతవులు.
ఈ క్రతువులో పాల్గొనేవాళ్లు ఏదో పుణ్యప్రాప్తి కోసమో లేదా, తాత్వికచైతన్యాన్ని సొంతం చేసుకోవడానికి వచ్చిన వాళ్లు కాదు. (ఇదే విషయాన్ని మహాత్మ గాంధీ 1915లో కుంభమేళా పర్యటన గురించి వ్యక్తపరిచిన అభిప్రాయంలో కూడా ప్రస్తావించారు. ఎస్ ఎన్ సాహు రాసిన ఈ విశ్లేషణను ఇక్కడ చూడవచ్చు. ఇదంతా నదిలో ఓ నిర్దిష్టప్రదేశంలో నిర్దిష్ట సమయంలో తలస్నానం చేయటమే. అది కూడా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సాధువులు, సన్యాసులు స్నానం చేసిన తర్వాత స్నానం చేయటమే. అటువంటి సాధువులు, సన్యాసులు సదరు నిర్దిష్ట సమయంలో స్నానమాచరించటం ద్వారా నదిని పావనం చేస్తారన్న నమ్మకాన్ని వ్యాపింప చేసి ఆయా ఆశ్రమాలు, పీఠాలకు చెందిన అనుయాయులు ఆయా ఆశ్రమాలు, పీఠాలతో తమ జీవితాలు పెనవేసుకున్న స్వాములు, సన్యాసులు, సాధువులు స్నానమాచరించిన తర్వాత స్నానానికి ఎగబడేలా చేయటమే. సంస్కృతంలో శరీరాన్ని తంత్రం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం తాంత్రికమైనది, దేహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి సంబంధించినదని కూడా మనం చెప్పుకోవచ్చు.
భారతదేశంలో విభూధిధారులైన సన్యాసులు పర్యటిచే అనేక ప్రాంతాల్లో ఇటువంటి క్రతువులు జరుగుతాయి. ఈ పర్యటనలు ఓ క్రమానుగతంగా జరుగుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయం బహుశా క్రీస్తు పూర్వం వెయ్యో సంవత్సరాల్లో దేశపు తూర్పు తీరంలో మొదలై ఉండవచ్చు. పశ్చిమాన ఉన్న పంజాబ్ ప్రాంతం నుండి దండులు దండులుగా వలస వస్తున్న ఆర్యులు అమల్లోకి తెస్తున్న వైదీక సాంప్రదాయాలను సవాలు చేస్తూ ఈ తాంత్రిక సాంప్రదాయం మొదలై ఉండవచ్చు. ఈ ఘర్షణలు ఇపుడు హరిద్వార్‌గా పిలవబడుతున్న గంగాద్వారం వద్ద జరిగాయి. ఈ కథ గురించిన మూలాలు తొలుత మహాభారతంలో భాగంగా ఉన్న ఓ కథలో కనిపిస్తాయి. అది దక్షయజ్ఞం కథ. ఇక్కడ దక్షుడు వైదీక సాంప్రదాయానికి ప్రతినిధి అయితే శివుడు వైదికేతర సాంప్రదాయానికి ప్రతినిధి. వైదీక సాంప్రదాయాన్ని పాటించే కుటుంబానికి చెందిన పార్వతి వైదికేతర సాంప్రదాయానికి చెందిన శివుడిని ప్రేమించి పెళ్లాడటంతో దక్షుడు ఆమెను వెలి వేస్తాడు.
ఈ కథలో శివునికి మామ అయిన దక్షుడు కులకట్టుబాట్లు విడిచి శివుడిని పెళ్లాడిన పార్వతిని కుటుంబకార్యానికి ఆహ్వానించకుండా వెలివేస్తాడు. ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతున్నప్పుడు అల్లుడిని ఆహ్వానించి మర్యాద చేయటం సాంప్రదాయమని సాధారణ హిందువులందరికీ తెలిసిందే. కానీ అపర బ్రాహ్మణుడు అయిన దక్షుడు ఈ సాధారణ సాంప్రదాయాన్ని కూడా పాటించటానికి నిరాకరించటం, అదేమని నిలదీసిన పార్వతిని దూషించటం, ఆమె అగ్నికాహుతి కావటం, దానిపై ఆగ్రహించిన శివుడు జటాజూటధారి అయి ఒంటినిండా విభూతి పూసుకుని తన అనుయాయులను ప్రేరేపిస్తూ (గణములను) భైరవనాట్యం చేస్తూ భూమ్మీదకు పయనం కావటం, దక్షుడిని సంహరించటం ఈ కథ సారాంశం. అప్పటి నుండీ కొందరు సన్యాసులు చేతుల్లో త్రిశూలాలు, పుర్రెలు పట్టుకుని ఊరేగుతూ ఓ పుణ్యతిధి అని భావించిన రోజున హరిద్వార్‌లో పవిత్రస్నానాలకు వస్తారు. వీళ్లను పాశుపతులనీ, కాపాలికులనీ, కాలముక్తులనీ అనేకపేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉగ్రరూపులు కాలక్రమంలో తమ స్వరూపాన్ని, స్వభావాన్నీ, పేర్లనూ, వ్యవహారశైలిని మార్చుకున్నారు. ఈ మార్పులకు నాథిజం, వైష్ణవిజం, చివరకు సిక్కిజం కూడా కొంతమేర కారణం అయి ఉండొచ్చు. ప్రస్తుతం వీరినే సాగసాధువులు అంటున్నారు. (నాగ లేదా దిగంబర సాధువులు).
ఈ సాధుల గమనం, గమ్యం ప్రతి నెలా పౌర్ణమి, ప్రతి ఏటా సూర్యుని గతిరీతులు, ప్రతి పన్నెండేళ్లకొకసారి గురు గ్రహం గతిరీతులను బట్టి ఉంటుంది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువునే కుంభ్ అంటారు. ఇది హరిద్వార్‌లో జరుగుతుంది. గురుడు సింహరాశితోనూ కుంభరాశితో కలిసేసమయంలో స్నానాలు ఆచరించే క్రతువే కాలక్రమంలో కుంభమేళా పరిణామం చెందింది. వందల ఏళ్లపాటు ఆచరణలో ఉన్న ఈ క్రతువునూ, జరిగే అన్ని కుంభమేళాలనూ నక్షత్రమండలం కదలికలతో ముడిపెట్టి పవిత్రస్నాన సమయంగా భావించే క్రమం ఉద్దేశ్యపూర్వకంగా మొదలైంది. 1857కు ముందు ఈ పద్ధతి ఉనికిలో లేదు. ఆ తర్వాతనే మొదలైంది. అప్పటికి షుమారు వందేళ్లకు పైగా దేశంపై పెత్తనం చలాయిస్తున్న బ్రిటిష్ పాలనలో హిందువులు అస్తిత్వానికి ముప్పు ఎదురవుతుందని భావించి దాన్ని అధిగమించటానికి తామంతా హిందువులమని చెప్పుకుంటూ తమ అస్తిత్వాన్ని ధృవీకరించుకునే క్రమంలో మొదలైన కసరత్తే ఇది.
ఈ పీఠాలన్నీ తమ ఉనికిని ఆదిశంకరాచార్యుడితో ముడివేసుకుంటాయి. 8వ శతాబ్దంలో వేదాంతాన్ని ప్రచారంలోకి తెచ్చి పామరులకు వేదాంత సారాన్ని అందుబాటులోకి తెచ్చిన బ్రాహ్మణ పండితుడిగా ఆది శంకరాచార్యకు హైందవ సాంప్రదాయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిశంకరుడు బౌధ్ధాన్ని వ్యతిరేకించాడు తప్ప ఇస్లాం మతాన్ని కాదు. ఆదిశంకరాచార్యుడి పర్యటనలూ, ఈ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా వివిధ పండితులు, వేద ప్రచవనకారులతో జరిపిన వాదోపవాదాలు, వాటి ఫలితాలను ఆదిశంకరుడి మరణానంతరం ఐదువందల ఏళ్లకు గానీ గ్రంథస్తం చేయలేదు. అదికూడా విజయనగర సామ్రాజ్యంలోని ఆస్థాన విద్యాంసులైన బ్రాహ్మణులు క్రోడీకరించినవే. అప్పటికి మధ్య ఆసియా ప్రాంతం నుండి తురుష్కులు దేశంపై దండయాత్రలు సాగిస్తూ భారత ఉప ఖండంలోని కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యం సాధించిన సందర్భంలో విజయనగర సామ్రాజ్యంలోని బ్రాహ్మణులు హిందూమతానికి ప్రమాదం వచ్చిపడే అవకాశాలున్నాయని ఆందోళన చెందారు. మధ్య ఆసియా నుండి తురుష్కులకంటే ముందే హూణులు, శకవంశస్తులు, కుషాణులు కూడా భారతదేశంపై దండెత్తారు. కానీ వీళ్లు దేశంలోని సంపద కొల్లగొట్టడానికి వచ్చినవారే తప్ప ఈ దేశపు సంస్కృతిని ప్రభావితం చేయలేదు. కానీ తురుష్కులు తురుకు ధర్మ పేరుతో రూపం లేని దేవుడిని కొలుస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ప్రార్థనా విధి విధానాలు కూడా నిర్దిష్టంగా ఉండేవి. ఓ గదిలో పశ్చిమం వైపు తిరిగి ప్రార్ధనలు చేసేవారు. తురుకు ధర్మంలో కులాచారాలకు స్థానం లేదు. దీన్నే ఇప్పుడు ఇస్లాం అని పిలుస్తున్నాము.
హిందూమతంలో సాయుధ సన్యాసులు ఓ సాంప్రదాయంగా ఎప్పుడు మొదలైందన్నది చెప్పటానికి నిర్దిష్ట ఆధారాలు అందుబాటులో లేవు. కానీ క్రీస్తు శకం 15వ శతాబ్దిలో ఇస్లాం ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. మార్మికతను వ్యక్తం చేసే సూఫీ సాధువులను పోలి ఉంటారు మార్మికత కలిగిన హిందూ సాధువులు. మిలిటరీ శైలిలో ఉండే ఘాజీలను సైనిక పటాలంలా వ్యవహరించే నాగసాధువులు సవాలు చేసేవాళ్లు. అప్పట్లో నాగసాధువులే రహదారి ప్రయాణాలకు రక్షక దళాలుగా వ్యవహరించేవి. గంగానదీ పరివాహక ప్రాంతంలో (హరిద్వార్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఉజ్జైని) మరియు ఎగువ గోదావరి (నాసిక్) ప్రాంతంలో ఇలా జరిగిందని చెప్పటానికి కావల్సిన చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ ఓ చారిత్రక సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. 18వ శతాబ్దంలో మొఘల్స్‌కు వ్యతిరేకంగా హోరా హోరీ పోరాడిన మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సంస్థానాలున్న ప్రాంతాలు ఇవి. ఈ కాలపు చరిత్ర పరిశోధనల్లో కనిపించే షా, పీష్వాహి వంటి పదాలు మరాఠీ భాషపై ఉన్న పర్షియన్ భాష ప్రభావానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. అయితే ఈ సంస్కృతి, సాంస్కృతిక సమ్మేళనం దక్షిణ భారతంలో పెద్దగా ప్రాచుర్యంలో లేదు.
సన్యాసులకు సర్వసంగ పరిత్యాగం కీలకమైన లక్షణం. కులం కూడా. కానీ ప్రస్తుతం ఈ కీలకమైన లక్షణాన్ని ఇప్పుడు అంత ప్రాధాన్యత కలిగినదిగా భావించటం లేదు. ఈ సర్వసంగ పరిత్యాగం అంటే బౌద్ధులు, జైనులు ప్రతిపాదించినట్లు కేవలం ఐహిక సుఖాలను త్యజించటమే కాదు. శరీరంలోని అవయవాలను, ఇతర జీవసంబంధిత అంశాలు, సాధనాలను సరైన దిశలో ఉపయోగంచటం ద్వారా శక్తిని సంపాదించటం (సిద్ధి పొందటం). ఈ క్రమంలో సంబంధిత మంత్రోఛ్చారణతో మెదడును క్రియాశీలకం చేయటం. స్థూలంగా చెప్పాలంటే నవనాడులూ స్థంభింపచేసి, తిరిగి వాటికి జీవం పోయటమే సిద్ధి. ఇది పురుషులు మాత్రమే చేయగలరు. ఇటువంటి శక్తులే వారికి నీళ్లమీద నడిచే శక్తినీ, గాల్లో ఎగిరే శక్తినీ, అటవీ జంతువులను వాహనాలుగా మచ్చిక చేసుకునే శక్తినీ, కలిగి ఉంటారని నమ్మకం. వీరినే అతీత శక్తులు కలిగిన వారిగా చెప్తుంటారు. ఇటువంటి క్రతువులన్నీ మనం హిమాలయ ప్రాంతంలో కనిపించే తాంత్రిక బౌద్ధంలో చూస్తాము. అందుకే ఇటువంటి సాయుధులైన సాధువులకు బోల్డెన్ని శక్తులు, మహిమలూ ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఇటువంటివారిని తమ వెంట సైన్యంలో పెట్టుకోవడానికి రాజులు, చక్రవర్తులు తాపత్రయపడేవారు. ఇవన్నీ మధ్యయుగాలనాటి ఆలోచనలు. నమ్మకాలు.
ఇటువంటి మధ్యయుగాలకు చెందిన ఆలోచనలు, నమ్మకాలు ఆదిశంకరుడి కాలం నుండీ ప్రజల్లో ఉన్నాయి. నేటికి వీటిలో అనేక లక్షణాలను సాధువులే మర్చిపోయారు. జనం కూడా మర్చిపోయారు. ఇప్పుడు జనానికి గుర్తున్నదల్లా ఇటువంటి సాధువులకు ఉన్నాయనుకుంటున్న అతీంద్రియ శక్తులు, సామర్ధ్యాలే. ఇటువంటి శక్తి సామర్ధ్యాలు కాపాడుకోవడానికి ఆవు పేడతో తయారైన భస్మాన్ని ఒంటినిండా పూసుకుని దాన్ని పవిత్ర స్నాన దినం రోజున శుభ్రం చేస్తారు. దాన్నే షాహి స్నాన్ అంటారు. అటువంటి సాధువులు స్నానానికి వాడిన జలాన్ని పవిత్ర జలంగా భావిస్తారు. మరికొందరైతే ఈ జలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు కూడా. ఇటువంటి జలాన్ని సేవించిన వారికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయన్న నమ్మకం బలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ఇటువంటి నీళ్లకు పవిత్రను మరింత పెంపొందించేందుకు గ్రహాలు, నక్షత్రాలు, రాశులు నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట మోతాదుల్లో కలిసే సందర్భాన్ని కూడా ఆపాదిస్తారు. అటువంటి ఖగోళ కదలిలకు ఓ నిదర్శనంగా హిమాలయాల్లో పుట్టిన గంగ నదీ, భూమ్మీద ప్రవహించే యమునా నది, భూగర్భంలో ప్రవహించే సరస్వతి నదుల నమ్మేళనం ఓ సందర్భంగా పరిగణిస్తారు.
ఈ వివరాలు చారిత్రక నేపథ్యం వంటివి గమనించినప్పుడు కుంభమేళా ప్రధానంగా పురుషాధిక్య ప్రదర్శన, కనిపిస్తోంది సన్యాసులు, కరుడుకట్టిన సాంప్రదాయికత, క్షుద్ర సైనిక విన్యాసాలు, రాజఠీవిలే. ఇవన్నీ సాధారణంగా హిందూయిజం గురించి జరుగుతున్న చర్చల్లో మనకు కనిపించని అంశాలు. ఇదంతా కేవలం హైందవ శక్తి ప్రదర్శనే. ఇదంతా కొండలను పిండిచేసే భైరవుడు, అడవులను దాటుకునిపోయే హనుమంతుడు, భూమండలంపై సంచరించే దత్తాత్రేయుడు వంటి వంటివారికి ఉన్నాయని నమ్మే అనూహ్య, అతీంద్రియ శక్తుల ప్రదర్శన సదరు పుణ్యతిథినాడు జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యాపింపచేయటంలో ఓ కీలకమైన సందర్భంగా ఇటువంటి కుంభ మేళాలు జరుగుతాయి. జనాన్ని ఆకర్షించటానికి, ఇటువంటి క్రతువుల్లో పాల్గొనేలా ప్రోత్సహించటానికి ఆత్మ, పరమాత్మ, శక్తి, పవిత్రత, విముక్తి, ధర్మం వంటి వైదీక పదజాలాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇది శక్తి ప్రదర్శనే తప్ప మరోటి కాదు.
దేవ్‌దత్ పట్నాయక్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.