
జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో వివరాల ప్రకారం 2015 నుండి 2022 మధ్యకాలంలో దేశంలో లక్షకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. అయినా గత 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్లు అన్నీ ఆశ్రిత పెట్టుబడిదారుల జేబులు నింపేవిగానూ, బొజ్జలు పెంచేవిగానూ ఉన్నాయే తప్ప రైతాంగం ఆత్మ హత్యలకు పూనుకోకుండా భరోసా కల్పించేవిగా లేవు.
ఈ ధోరణిని గమనిస్తే నేడు (2025 ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టే బడ్జెట్ లో కూడా రైతాంగానికి, వ్యవసాయ కూలీలూ పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి ఏమీ ఉండే పరిస్థితులు కనిపించటం లేదు. పైగా పత్రికల్లో వస్తున్న వార్తలు గమనిస్తే సాధారణ ప్రజల జీవన స్థితిగతులపై మరికొన్ని కొత్తదాడులు ఎక్కు పెట్టేందుకు కేంద్రం చేతిలో బడ్జెట్ సాధనం కాబోతోందన్న ఆందోళన కలుగుతోంది.
ఘోరమైన పనితీరు
మరీ పచ్చిగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లల్లో ఆమోదించిన బడ్జెట్లన్నీ దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్ప మోడీ గత మూడు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు ఉపాధి పెరుగుదలకో, జీవన భద్రతకో, ఆర్థికాభివృద్ధికో తోడ్పడేవిగా లేవు. ఈ పదేళ్ల కాలంలో రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలు మరింత దారిద్య్రంలోకి జారిపోయాయి.
అమెరికాలో ట్రంప్ అధికారానికి వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహాన్ని తట్టుకుని నిలబడే వెన్నుపూస లేని ప్రభుత్వం అరకొరగా ఇస్తున్న రాయితీలకు కూడా మంగళం పాడే ప్రమాదం ముందుకొస్తోంది.
గత సంవత్సరం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార సబ్సిడీ 7082 కోట్లు మేర తగ్గించగా ఎరువుల సబ్సిడీ 24984 కోట్లమేర కోసేసింది. ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన 86000 కోట్లు 2023లో ఖర్చుపెట్టినదానికంటే తక్కువ. 2019 నాటికి బడ్జెట్ కేటాయింపుల్లో 5.44 శాతం వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయిస్తే 2024 నాటికి ఇది 3.15 శాతానికి పడిపోయింది.
కేంద్ర నేర రికార్డుల బ్యూరో 2015`2022 మధ్యకాలంలో లక్షకు పైగా రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కఠోర వాస్తవం కళ్లముందున్నా కేంద్ర ప్రభుత్వం తన కీలకవిధాన పత్రమైన బడ్జెట్లలో రైతాంగానికి, గ్రామీణ పేదలకు బతుకుపై ఆశ కల్పించేందుకు పెద్దగా తీసుకున్న చర్యలేమీ లేవు. అంతేకాదు. ప్రపంచ ఆకలి సూచిలో 127 దేశాల్లో భారతదేశం స్థానం 105వ స్థానానికి దిగజారింది.
దాదాపు నాలుగేళ్లుగా 80 కోట్లమందికి ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ఢంకా బజాయించి చెప్పుకున్నప్పటికీ దేశంలో పేదల కడుపులు ఆర్థాకలితో నకనకలాడుతున్నాయని ప్రపంచ ఆకలిసూచి నివేదిక వెల్లడిస్తోంది. ఈ రెండు గణాంకాలు దేశంలో ఉధృతమవుతున్న వ్యవసాయ రంగ సంక్షోభానికి అద్దం పడుతోంది.
కమ్ముకొస్తున్న కార్పొరేట్ ప్రమాదాలు
ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ రంగానికి ఎటువంటి ప్రాధాన్యత దక్కబోతోందో అర్థం చేసుకోవడానికి నవంబరు 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ ఫ్రేంవర్క్‌ను చూస్తే సరిపోతుంది. 2020`21లో భారత రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో సాగించిన మహత్తరపోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకున్న మూడు నల్లచట్టాల్లోని కార్పొరేట్ అనుకూల అంశాలన్నీ ఈ ఫ్రేంవర్క్‌లో ఉన్నాయి. ఈ ఫ్రేం వర్క్‌ను వ్యతిరేకిస్తూ నవంబరు, డిశెంబరు మాసాల్లో దేశ వ్యాపిత ఆందోళనలు జరిగాయి.
జాతీయ వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ ఫ్రేంవర్క్‌ను ఉపసంహరించుకోవాలన్నదే ఈ ఉద్యమాల ప్రాధమిక డిమాండ్.
2025 ఏప్రిల్ నుండీ దేశవ్యాపిత కార్మికవర్గం తీవ్రంగా వ్యతిరేకించిన మూడు నాలుగుకార్మిక కోడ్లు అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కష్టకాలంలో కార్మికులు కడుపులో కాళ్లు పెట్టుకుని కూర్చున్నవేళ పార్లమెంట్లో ఉన్న మందబలంతో చీకటి చట్టాల కుంపటి దేశం నెత్తిన పెట్టింది బిజెపి ప్రభుత్వం. మేలుకొన్న కార్మికవర్గం ప్రతిఘటించటంతో ఈ చట్టాల అమలును ఐదేళ్ల పాటు వాయిదా వేసింది. ఈ చట్టాలు రద్దు చేయాలంటూ కార్మికవర్గం దేశవ్యాపిత ఉద్యమానికి సిద్ధమవుతోంది.
కనీస మద్దతు ధర, రుణ మాఫీలకై డిమాండ్
నేడు రైతాంగం దేశం ముందుంచిన ప్రధానమైన డిమాండ్ తాము పడిరచే పంటలకు సమగ్ర వ్యయంపై అదనంగా యాభై శాతం ఆదాయం కావాలన్న డిమాండ్. దీనికి గాను సి2G50 శాతం ఆదాయం దక్కేలా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. 2006లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదిక సిఫార్సు ఇది. ఈ సిఫార్సును అమలు చేయకపోవడమే రైతు ఆత్మ హత్యలకు, రుణభారానికి, సేద్యం దివాళా తీయటానికి ప్రధాన కారణం. దేశంలో మెజారిటీ రైతులకు కనీస మద్దతు ధర దక్కటం లేదు. మార్కెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధాపడుతున్నారు.
సాగుకు అవుతున్న ఖర్చు కూడా రైతుకు దక్కటం లేదు. కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తామని 2014 ఎన్నికల్లో మోడీ వాగ్దానం చేశారు. కానీ ఇపుడు నోరుమెదపటం లేదు.
కనీస మద్దతు ధర అమలు ప్రత్యేకించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకపోతే వ్యవసాయంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించటం సాధ్యం కాదు. కనీస మద్దతు ధర,రుణ మాఫీ అమలు జరగాలంటే బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండాలి.
వ్యవసాయం చేసే రైతు ఎదుర్కొంటున్న మరో కీలక సమస్య పెరుగుతున్న సేద్యపు ఖర్చు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి వ్యవసాయోపకరణాల ఖర్చు పెరిగిపోతోంది. ఈ ధరలు తగ్గించేందుకు తగిన ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉండాలని రైతాంగం ఆశిస్తోంది. రైతుకు సి2 + 50 శాతం చొప్పున కనీస మద్దతు ధర అమలు కావాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలి. సేద్యానికి అయ్యే సగటు ఖర్చు తగ్గాలి.
వ్యవసాయోపకరణాలన్నీ ప్రధానంగా ఉత్పత్తి చేస్తోంది ప్రైవేటు కంపెనీలు. గుత్త సంస్థలే. కాబట్టి వాటిపై అవసరమైన నియంత్రణలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధం కాకుండా సాగు ఖర్చు తగ్గదు. గతంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి మౌలిక వ్యవసాయోపకరణాలను ప్రభుత్వరంగ సంస్థలే ఉత్పత్తి చేసేవి.
వ్యవసాయోపకరణాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వరంగ కంపెనీలను పునరుద్ధరించాలి. వాటిని పని చేయించటానికి కావల్సిన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలి. స్వావలంబన గురించి గుండెలు బాదుకుంటున్న ప్రభుత్వం వ్యవసాయ రంగంలో స్వావలంబనను గాలికొదిలేసింది. ప్రత్యేకించి ఎరువుల ఉత్పత్తి విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో వ్యవసాయోపకరణాల ఉత్పత్తికీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలి.
ఈ బడ్జెట్లో పెద్ద చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయకార్మికులకు రుణమాఫీ అమలు చేయాలని గ్రామీణ భారతం ఆశిస్తోంది. ఈ పథకం అమలు చేయకపోతే రైతుల ఆత్మ హత్యలు, బేదఖళ్లు నిలువరించటం సాధ్యం కాదు. 1990లోనూ, 2008లోనూ కేంద్ర ప్రభుత్వాలు పాక్షిక రుణమాఫీ అమలు చేశాయి. గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం బలిసిన కార్పొరేట్లకు 14.46 లక్షల కోట్ల మేర రుణమాఫీ అమలు చేసింది. కానీ రైతాంగం లక్షల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డా ప్రభుత్వం రైతు రుణ మాఫీ కోసం పైసా విదిలించలేదు.
ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రూపొందించి అమలు చేస్తున్న పరపతి విధానాలు ప్రధానంగా గ్రామీణ పేదలు,రైతాంగం, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరపతి విధానంలో సమగ్ర మార్పులు చేయాలి. రైతాంగం జలగల్లాంటి వడ్డీవ్యాపారుల కంబంధ హస్తాల నుండి విముక్తి పొందాలంటే వ్యవసాయరంగానికి ప్రాధాన్యత రంగం హోదా ఇచ్చి పరిమిత వడ్డీతో సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలి. కనీస మద్దతు ధర, సి2+50 శాతం చొప్పున మద్దతు ధర నిర్ణయం, వ్యవసాయోపకరణాలు చౌకగా సాగుదారులకు అందుబాటులోకి తీసుకురావటం, రుణమాఫీ ఏకకాలంలో జరిగితేనే వ్యవసాయరంగం ప్రధానంగా సాగుదారులు జీవితాలు కొత్తకాంతులతో నిండుతాయి.
పంటల బీమా, విద్యుత్, సాగునీటి వసతులు
బడ్జెట్లో గ్రామీణ భారతం ఆశిస్తున్న నాల్గో అంశం కేవలం గ్రామీణ భారతానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. యావత్ పర్యావరణనానికి సంబంధించిన అంశం.
పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో ప్రకృతి వైపరీత్యాల సంఖ్య, తీవ్రత కూడా పెరుగుతోంది. పదేపదే పంటలు విధ్వంసం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమగ్ర పంటలబీమా పథకాన్ని రూపొందించాలి. ఇది రైతులను దివాళాతీయించే ప్రధానమంత్రి పంటల బీమా యోజనకు పూర్తి భిన్నంగా ఉండాలి. ఈ పథకం రైతాంగానికి పెద్దగా ప్రయోజనకారి కాకపోవటంతో పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయటానికి నిరాకరించాయి. కొన్ని రాష్ట్రాలు తమ సొంత పంటలబీమా పథకాలు ప్రారంభించాయి.
ప్రధానమంత్రి పంటల బీమా పథకం బీమా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తోంది కాబట్టే రాష్ట్రాలు దాన్ని అమలుచేయటానికి సిద్ధం కావటం లేదు. ఈ నేపథ్యంలో రైతు ప్రయోజనం లక్ష్యంగా సమగ్ర పంటల బీమా పథకం, దానికి తగిన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలి.
ఐదో అంశం విద్యుత్, సాగు నీరు. గత దశాబ్ది కాలంలో సాగునీటివసతుల నిర్మాణం, విద్యుత్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ రంగాల నిర్వహణ ప్రైవేటు కంపెనీలకు అప్పగించటంతో సేవల భారం పెరిగిపోయింది. సామాజిక ఉపయోగ వనరుల నిర్మాణానికి ప్రభుత్వాలు పెట్టగలిగినంత ఖర్చు ప్రైవేటు కంపెనీలు పెట్టలేవు. దేశవ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సాగునీటి వసతలు నిర్మాణం, నిర్వహణలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రాధాన్యత ప్రాతిపదికన నిధులు కేటాయించాలి. తద్వారా విశాలభూభాగాన్ని సాగుబడిలోకి తీసుకురావచ్చు.
విద్యుత్‌రంగంలో సైతం ప్రభుత్వ పెట్టుబడులు, ప్రమేయం, నియంత్రణ లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యం కాదు. అదానీ, అంబానీ, టాటా కంపెనీలే విద్యుత్ ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్మార్ట్ మీటర్లు ప్రజల జీవితాలను నరకప్రాయం చేయనున్నాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణను కార్మివర్గం వ్యతిరేకిస్తూ పోరాడుతోంది.
ఉపాధి హమీ చట్టం
కేంద్రంలో మోడీ అధికారానికి వచ్చిన నాటి నుండీ పథకాన్ని పీకనులిమేందుకు చేయని ప్రయత్నం లేదు. చట్టం ప్రతి వ్యవసాయ కార్మికుడికీ వంద రోజుల ఉపాధికి హామీ ఇస్తుంటే ప్రస్తుతం 45 రోజులకు మించి పని దొరకటం లేదు. ఉపాధి హామీ చట్టం కింద 200 పని రోజులు, రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలి. గ్రామీణ పేదల కొనుగోలు శక్తి పెంచటానికి ఇది ప్రాణవాయువులా పని చేస్తుంది.
ఈ దేశంలో పేదరిక నిర్మూలనకు భూమి కీలకం. దున్నేవాడికే భూమి అన్న నినాదాన్ని ఈ ప్రభుత్వాలు కార్పొరేట్లకే భూములు అన్న నినాదంగా మార్చాయి. 2013 భూ సేకరణ చట్టాన్ని ధిక్కరించి భారీ ఎత్తున భూముల సేకరణ జరుగుతోంది. రైతాంగం బేదఖళ్లు అవుతుంది. నష్టపరిహారం నామమాత్రంగా మారింది. ఆదివాసీ నివాస ప్రాంతాల్లో భూములు గిరిజనుల చేతుల్లో నుండి లాక్కుని ఖనిజవనరుల వాణిజ్యం కోసం కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వటం లేదు. ఏ ప్రాజెక్టు కోసం భూ సేకరణ జరిగినా నిక్కచ్చిగా 2013 చట్టం, తత్సంభంధిత విధివిధానాల ఆధారంగానే జరగాలి. సమగ్ర భూసంస్కరణలు అమలు జరిపేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టాలి. తరాల నుండీ సేద్యం చేసుకుంటున్న అటవీ భూములపై ఆయా గిరిజన కుటుంబాలకే పట్టాలు ఇవ్వాలి. దీనికోసం అటవీ హక్కుల రక్షణ చట్టాన్ని తుచ తప్పకుండా అమలు చేయాలి. పట్టాలు ఇచ్చేటప్పుడు మహిళలకు సమానహక్కులు ఉండేలా పాస్ పుస్తకాల్లో మహిళల పేర్లు చేర్చాలి. సహకార రంగం వంటి ప్రత్యామ్నాయ సామూహిక ఉత్పత్తి నమూనాలు అమలు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి.
వీటన్నిటికి నిధులు ఎక్కడినుండి వస్తాయి?
ఇవన్నీ చేయాలంటే ఒకటే ప్రశ్న పదేపదే మనముందుకొస్తుంది. ఇవన్నీ చేయటానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి అన్నదే ఆ ప్రశ్న. దేశ ప్రజానీకం సంక్షేమానికి అవసరమైన నిధులు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వారసత్వపు పన్ను మొదలు సంపద పన్ను వరకూ విధించేందుకు సిద్ధం కావాలి. పోర్బ్స్ శతకోటీశ్వరుల జాబితా ప్రకారం 2014 నాటికి భారతదేశంలో 104 మంది శతకోటీశ్వరులు ఉంటే 2024 నాటికి 200 మంది అయ్యారు. వీళ్లందరి ఉమ్మడి సంపద విలువ 110 లక్షల కోట్లు. ఆక్స్‌ఫాం సంస్థ భారతదేశంలోని ఆర్థిక అసమానతల గురించి విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో 50 శాతం ప్రజానీకం కేవలం మూడు శాతం జాతీయ సంపదతో బతుకు వెళ్లదీస్తుంటే దేశంలోని ఒక శాతం జనాభా 40 శాతం జాతీయ సంపదను స్వంతం చేసుకుంది. ఈ వివరాలు పరిశీలిస్తే ప్రపంచంలో ఆర్థిక అంతరాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి అని నిర్ధారణ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో గణనీయంగా కార్పొరేట్ పన్ను తగ్గించింది. ఈ పరిస్థితిని తిప్పి కొట్టాలి. కార్పొరేట్ పన్నల్లో కోత కారణంగా ఏటా దేశం 1.45 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతోంది. విచిత్రమైన విషయం ఏమిటంటే 2024`2025 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వచ్చే ఆదాయల్లో స్థూల జాతీయోత్పత్తిలో 30 శాతం పైగా ఆదాయపు పన్ను రూపంలో వస్తే కార్పొరేట్ పన్ను ద్వారా వస్తున్న ఆదాయం కేవలం 26.5 శాతం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్న శ్లాబులు నిర్ధారించటంలో తెలివైన విధానాన్ని అనుసరిస్తోంది. మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించి సంపన్నులపై పన్ను భారం మోపటానికి వీలుగా నిర్ణయించటానికి బదులు రాజు పేదా అన్న తేడా లేకుండా అందరిపైనా సమానంగా ఆదాయపు పన్ను భారం మోపుతోంది. సూటిగా చెప్పాలంటే ప్రత్యక్ష పన్నులు పెంచి పరోక్ష పన్నులు తగ్గించాలి. పన్ను ఎగవేతను కఠిన చర్యల ద్వారా నియంత్రించాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్ల కంటే భిన్నమైన విప్లవాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టాలని అదేమంత చిన్న విషయమేమీ కాదు. ఈ పని చేయకుండా సాగుదారుల సంక్షోభ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించదు. కనిపించటం లేదు. ఏదో ఒక రోజు రైతాంగం అగ్నిపర్వతంలా పెల్లుకుబుతుంది.
డాక్టర్ అశోక్ ధావలె
రచయిత అఖిల భారత రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.