
భారతదేశం ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపే సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అంబేడ్కర్ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలే ప్రధాన వాహికగా నిలుస్తాయి. భారతదేశం ఈనాడు నిరుద్యోగంలో, నిరక్షరాస్యతలో కొట్టుమిట్టాడుతుంది. కానీ బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ కర్తగా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన మన ముందుకు అనేక రాజ్యాంగ సూత్రాలను తెచ్చారు. వాటిని మనం ఇప్పటికైనా పాటించగలిగితే భారతదేశం ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల సామాజిక ఆర్థిక ఉత్పత్తులు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయగలిగిన స్థాయికి ఇంకా ఎక్కువ చేరుకుంటుందనేది చారిత్రక సత్యం.
నిజానికి భారతదేశం సంపన్నమైనదమని అంబేడ్కర్ అనేక ఉపన్యాసాలలో, రచనల్లో నిర్ధారించారు. భారతదేశంలోని నదులను ప్రక్షాళన చేసి వాటికి సరైన ప్రాజెక్టులను రూపొందించాలని ఆయన అన్నారు. త్రాగునీరు, సాగునీరు పుష్కలం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని పిలుపునిచ్చారు. వాటిని ఇతర దేశాలకు ఉత్పత్తుల ఎగుమతి పెంచాలంటే తప్పకుండా మనం నదులను పరిశుభ్రపరిచి ఉత్పత్తికి అనుకూలంగా మలచవలసి ఉంది. నదులను పవిత్రంగా భావించి హారతులిస్తూ, నదీస్నానాలను పుణ్యప్రదంగా భావించే దేశం మనది.
అంతేకాదు దేశంలో సుమారు 603 నదులలో 279 నదులు కాలుష్యమయంగా ఉన్నాయని 2019, 2021 సంవత్సరాలలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించింది. ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాలు, డ్రెయినేజ్ల ప్రవాహాలు, జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వాటితో అనేక నదులు నిండిపోతున్నాయి. విషతుల్యమౌతున్న ఈ నదీజలాలనే సాగు, త్రాగునీరుగా వినియోగిస్తూ ప్రజలు రోగాల పాలౌతున్నారు. గంగ, గోదావరి, యమున, మూసీ నదులు ఇందుకు ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తాయి.
థాయ్‌లాండ్, మలేషియా, వియత్నాం వంటి చిన్నదేశాల నదుల ప్రక్షాళనను ఆదర్శంగా తీసుకొని మన ప్రభుత్వం మన దేశ నదులను యుద్ధప్రాతిపదికన శుద్ధిచేయించాలి. నదులను కాలుష్యమయం చేస్తున్న సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన త్రాగు, సాగు నీటిని అందించాలి. ఆర్టికల్ 39(బీ) ప్రకారం సహజ వనరులపై ప్రజల హక్కును ప్రభుత్వం కాపాడుతుందని ఆశిద్దాం. నిజానికి మనదేశం నదుల సముద్రాల దేశం అందుకే భారతదేశం అనేక దేశాల చేత ఆకర్షించబడింది, ఆక్రమించబడింది. ప్రపంచ నాగరికతల్లో అత్యున్నతమైన నదీ నాగరికత, మానవ పరిణామానికి మూల శక్తిగా నిలిచింది. భారతదేశ నదీ నాగరికత కూడా ఈజిప్ట్ నాగరికత అంత ప్రసిద్ధమైనది. నాగరికతలన్నీ నదీతీరాల నుండే పుట్టాయి.
ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత కలిగిన భారతదేశం నదులకు పుట్టిల్లు. అందుకే మనం ఏ నిమిషంలోనైనా సుసంపన్నం చేసుకోవచ్చు. నిజానికి “భారతదేశంలో హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో మహానదులూ, ఉపనదులూ ప్రవహిస్తున్నాయి. ఇవి రెండు రకాలు మొదటిరకం హిమాలయాలగుంపు. రెండవరకం దక్కను గుంపు. ఎప్పుడూ తుషారంతో కప్పి వున్న హిమాలయ పర్వతాలలో జన్మించిన గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర మొదలైన జీవనదులు మొదటిరకం. భారతదేశ మధ్య ప్రాంతంలో వింధ్య, సాత్పురా పర్వతాలు దక్షిణ ప్రాంతంలో సహ్యాద్రి పర్వతాలలో పుట్టి వర్షం మీద ఆధారపడి వర్షాకాలంలో మాత్రమే నిండుగా ప్రవహించే నర్మద, తపతి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, మంజీరాది నదులు రెండవరకం.
దక్కను ప్రాంత నదులను పీఠభూమి నదులని తీరప్రాంతపు నదులని పునర్విభజన చేయవచ్చు. తీరవర్గానికి చెందిన నదులన్నీ చిన్నవి. భారత ప్రసిద్ధ నదులలో అధిక భాగం నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. సింధూ, నర్మద, తపతి మొదలైన కొన్ని నదులు మాత్రమే పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
భూగర్భశాస్త్ర దృష్ట్యా హిమాలయపు నదులు దక్కను నదులకంటె తక్కువ వయస్సు కల్గినవి. అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. భారతదేశంలోని నదులలో గంగానది అతి ముఖ్యమైంది. ఇది హిందువులకు ఎంతో పవిత్రమైంది కూడ. ఇది హిమాలయాలలోని ‘గోముఖి’ అనే మంచుగుహలో పుడుతున్నది. పుట్టిన ప్రాంతంలో ఈ నది పేరు భాగీరధి. అందుకు మన భారత పాలక వర్గం ఆయా రాష్ట్రాలు నదీ నాగరికతను ఉత్తేజం చేసి, నీటి పారుదలను పెంచి దళితులకు, బహుజనులకు, స్త్రీలకు భూమిని పంపకం చేసినట్లయితే డా బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు వ్యవసాయక భూమి భారతదేశంలో విస్తృతమై దళిత బహుజనులు వ్యవసాయ ఉత్పత్తులను స్వయంగా చేయగలిగి వారిలో ఆత్మ గౌరవం పెరిగి స్వీయ జీవన సంపన్నులవుతారు.
మనుషుల వలసలు తగ్గిపోయి వస్తువుల ఉత్పత్తులు పెరిగి వ్యవసాయాధారిత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి భారతీయ ఆర్థిక వ్యవస్థ సామాజిక సమతుల్యత పరిపుష్టమవుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వలన దేశంలో ఆకలి అవిద్య నశిస్తాయి. అంతేగాక మనదేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించి పేదరికాన్ని తగ్గించి జీవన వ్యవస్థల్లో పరిపుష్టి తేవాలంటే అంబేడ్కర్ రాజ్యాంగ సూత్రాలను అనుసరించవలసిన చారిత్రక అవసరం ఉంది. ఈ క్రమంలో మనం అంబేడ్కర్ పేర్కొన్న ఆర్థిక ఉత్పత్తి క్రమాన్ని అనుసరించాలి. 38వ ఆర్టికల్ ప్రకారం ధనికుల్లో, పేరుకుపోతున్న అవినీతిని నిర్మూలించి పేదలకు ఉద్యోగ అవకాశాలు పరిపుష్టం చేసి రాజ్యాంగంలో దాగివున్న సామ్యవాద భావజాలానికి మనం పట్టం కట్టాలి.
నిజానికి డా బీఆర్ అంబేడ్కర్ పరిశోధన కృషి ఆర్థిక సామ్యవాదం మీదే వుంది. అందుకే ఆయన వ్యవసాయం తరువాత దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తన సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రణాళికల్లో నొక్కి వక్కాణించారు. అవి ఇప్పుడు మన దేశ పునరుజ్జీవన ఉద్యమానికి మూలశక్తిగా నిలబడతాయి. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సి ఉందని అంబేడ్కర్ అన్నారు.
పరిశ్రమల్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతాన్ని అమలు చెయ్యాలి. పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సామాజిక బీమా, ఉపాధిపై అదుపు, అలాగే ఉద్యోగాల తొలగింపుపై నియంత్రణ కలిగి ఉండటం వంటి సదుపాయాలు కల్పించడం అవసరం. ఈ చర్యలు తీసుకునే సమయంలో మధ్యతరగతిలో దిగువ శ్రేణి వారి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత బీమా, బస్ రవాణా రంగాలను జాతీయం చేయాలని ఆయన సూచించారు. మనిషిని మనిషి, ఒక వర్గాన్ని మరో వర్గం, ఒక దేశాన్ని మరో దేశం అణిచివేయడం, దోపిడీ చేయడాన్ని అంతమొందించేందుకు కృషి చేయగలనని షెడ్యూల్డ్ కులాల సమాఖ్య (1952) తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది.
అత్యవసరమైతే పరిశ్రమలు జాతీయీకరణకు అది మద్దతు తెలిపింది. నిధుల సేకరణకు అంబేడ్కర్ ఈ సూచనలు చేశారు. (1) సైన్యంపై వ్యయం తగ్గింపు (2) అమ్మకం పన్నుపై తిరిగి లెవీ విధించడం (3) మద్యపాన నిషేధం రద్దు చెయ్యడం, ఎక్సైజ్ ఆదాయాన్ని పొదుపు చెయ్యడం(4) బీమా రంగాన్ని జాతీయ చెయ్యడం (5) ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నిర్బంధ బీమా, ఆర్ధిక శక్తి కేంద్రీకరణ కాకుండా ఉండేందుకు అంబేడ్కర్ రెండు మార్గదర్శక సూత్రాలు ప్రతిపాదించారు.
అవి (1)ఉమ్మడి ప్రయోజనం సిద్ధించేలా భౌతిక వనరుల యాజమాన్యం, నిర్వహణను పంపిణీ చెయ్యడం (2) సంపద ఒక చోట కేంద్రీకృతం కాకుండా, ఉత్పత్తికి విఘాతం కల్పించకుండా ఉండే విధంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం, నిర్బంధ శ్రమ, బాల కార్మిక వ్యవస్థను రాజ్యాంగం నిషేధించింది. ఆస్తి హక్కులు హామీ ఇవ్వబడ్డాయి. పని చేసేందుకు అందరికీ సమాన హక్కు సమాన పనికి సమాన వేతనం, పురుషులు, మహిళల జీవన భృతికి సమాన హక్కులు, ఇకపోతే అంబేడ్కర్ నిజమైన జాతీయవాది, దేశభక్తి గలవాడు, ఒక గొప్ప మేధావి అనేక దేశాల్లో ఖండాలలో ఆయన ఆర్జించిన జ్ఞానాన్ని అంతా భారతదేశ పునరుజ్జీవనానికి ఉపయుక్తం చేశారు. ఆయన నిక్కచ్చితనం, నిజాయితీ, మానవతా దృక్పథం సామ్యవాద భావజాలం అసమానమైనవి.
అంబేడ్కర్ కేవలం సామాజిక దార్శనికుడు కాదు.అంబేడ్కర్ ఆర్థికశాస్త్రం మీద పరిశోధన చేసిన డిఆర్ జాదవ్ తన సోషల్ ఫిలాసఫి అనే గ్రంథంలో అంబేడ్కర్ ఆర్థిక విప్లవం గురించి ఇలా విశ్లేషించారు. సమాజంలో ఆర్థిక విప్లవం తప్పనిసరిగా రాజకీయ విప్లవంతో ముడిపడి వుంది. అందుకే అంబేడ్కర్ ఆర్ధిక సామాజిక రాజకీయ విప్లవాలను ఒకే కాలంలో ప్రారంభించారు.
రాజకీయ విప్లవానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన తాత్విక విప్లవానికి కూడా యిచ్చి రెండింటిని ఏకకాలంలో నడిపించారు. బౌద్ధవిప్లవం రక్తపాతరహిత విప్లవమని, బౌద్ధతాత్విక విప్లవం పునాదిగా చేసుకుని సమాజంలో మార్పు తీసుకురావాలనేది ఆయన దృఢనిశ్చయం. అంబేడ్కర్ భారతదేశంలో అత్యున్నతమైన సామ్యవాది, ఆయన ఈ సందర్భంగా భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు కావాలని కమ్యూనిస్టు నాయకుడు దాంగేతో చర్చించారు. సోషలిస్టులతోను, కమ్యూనిస్టులతోను, హేతువాదులతోను, హిందూ సంస్కరణ వాదులతోను అంబేడ్కర్ చర్చలు జరిపారు.
అంబేడ్కర్ సామ్యవాద ప్రజాస్వామ్యవాది ఆయన కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలోని కార్మికవర్గ నియంతృత్వ స్థాపనకు మంసామార్గం, బలప్రయోగమే మూలమనే దాన్ని వ్యతిరేకించారు. సామ్యవాదాన్ని బౌద్ధ సిద్ధాంత మార్గంలో సాధించాలని నొక్కి వక్కాణించారు. అంబేడ్కర్ ఈ సందర్భంగా ఏ సిద్ధాంతాన్నైనా ఒక దేశపు సామాజిక ఆర్ధిక రాజకీయ పరిస్థితులకు సమన్వయించేటపుడు ఆ దేశ చారిత్రక, భౌతిక పరిస్థితులను శాస్త్రీయ పద్దతుల్లో అర్ధం చేసుకోవలసిన అవసరం వుంది. ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి పనిచేస్తున్న మార్క్సిస్టులు, లెనినిస్టులు, అంబేడ్కరిస్టులు ఈనాటి చారిత్రక పరిస్థితులను వారి దృష్టిలో వుంచుకొని ఈ సిద్ధాంతాలను సమన్వయం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాలి. అంబేడ్కర్ బౌద్ధధర్మాన్ని పునర్నిర్మించి ఆచరించాడు.
మార్క్సిజాన్ని శాస్త్రీయ పద్ధతిలో అవగాహన చేసుకొని ఆ రెండు సిద్ధాంతాలకు వుండే సమన్వయాన్ని, వైరుధ్యాలను మన ముందుంచాడు. ఆయన వంతుగా ఆచరణకు సంబంధించి బౌద్ధాన్ని సమర్థించాడు. తనకు తానుగా ప్రజాస్వామిక సిద్ధాంతవాదిగా ముందుకు వచ్చాడు. ఈనాడు సమసమాజం కోసం కృషి చేస్తున్న శక్తులు బుద్ధుడు, మార్క్స్ లక్ష్యసాధనలో వున్న సమన్వయాలను, వైరుధ్యాలను అవగాహనలోకి తీసుకొని అంబేడ్కర్ చారిత్రక అవగాహనతో ఆ రెండు సిద్ధాంతాల మీద యిచ్చిన వివరణలు, వ్యాఖ్యలు సమన్వయాలు, వైరుధ్యాలు, ఆచరణలను అధ్యయనం చేయాలి. ఈనాటి పీడిత వర్గ విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ అధ్యయనాన్ని ఆచరణలో ఆయుధంగా చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించకపోతే పోరాటంలో విజయాన్ని సాధించడం దుర్లభం.
సమసమాజ స్థాపనలో, దాని కొనసాగింపులో, నియంతృత్వంలో మృగ్యమవుతున్న ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్న నియంతృత్వాన్ని నిరోధించినపుడే సత్ఫలితాలు చేకూరుతాయని అంబేడ్కర్ తన బుద్ధుడు- మార్క్స్ తులనాత్మక పరిశీలనలో నిగ్గు తేల్చిన చారిత్రక సత్యం. నిజానికి అంబేడ్కర్ ఆర్థిక సామ్యవాద సామాజిక సిద్ధాంతాలు ఈనాడు భారతదేశానికి శిరోధార్యం, మనందరం జాతీయవాదులం, ఎన్నో పోరాటాలతో స్వాతంత్ర ఉద్యమంలో మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. దీన్ని ఆర్థిక, సామ్యవాద, సామాజిక, సమతుల్యతలను రాజ్యాంగ బద్ధంగా అంబేడ్కర్ ఆలోచనల్లో సిద్ధాంతాలతో పరిపుష్టం చేసుకోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యున్నత ఆర్థికాభివృద్ధి కలిగిన దేశంగా రూపొందించుకోగలుగుతాం. రాజ్యాంగ కర్త ఆలోచనలలో నడుద్దాం. దేశ ప్రగతికి సోపానం నిర్మిద్దాం. అంబేడ్కర్ ఆలోచన విధానమే దేశ ఆర్థికాభివృద్ధి మార్గం.
డా కత్తి పద్మారావు
9849741695
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.