
విద్యార్థి జీవితంలో అత్యంత ప్రధానమైనది టెన్త్ క్లాస్ మార్కుల సర్టిఫికెట్. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఆ తర్వాత ఉద్యోగాలు చేయాలన్నా ప్రతి ఒక్కరూ ముందుగా ఈ సర్టిఫికెట్‌నే అడుగుతారు. ప్రభుత్వం ఇచ్చే ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టులు ఇతరాత్ర గుర్తింపు కార్డులన్నింటికి ఈ సర్టిఫికెట్టే ఆధారం. అంత అత్యంత కీలకమైన టెన్త్ సర్టిఫికెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి. నేటి పాలకులకు రికార్డుల కోసం తాపత్రయమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. రికార్డుల కోసం ఆరాటంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. రెండు వారాల్లో దిద్దాల్సిన పేపర్లను కేవలం వారం రోజుల్లోనే దిద్దించి రికార్డు స్థాయిలో రిజల్టు ఇచ్చేశామని గౌరవనీయులైన విద్యాశాఖమంత్రి నారా లోకేష్ డప్పాలు కొట్టుకున్నారు. ఆ తర్వాత వెల్లడైన వాస్తవాలు చూస్తే నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటం ఆడినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఎస్ఎస్సీ పరీక్షలు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు రాశారు. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 81.14 శాతం పాసయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే రెండు వారాల్లో చేయాల్సిన వాల్యుయేషన్‌ను వారంలోనే హడావుడిగా ముగించిన ఫలితం వేలాది మంది విద్యార్థుల జీవితాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 66,363 మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారంటేనే సమస్య తీవ్రత అర్థమవుతోంది. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 11,175 మంది విద్యార్థుల పేపర్లలో మార్కులు మార్పులు జరిగి అసాధారణంగా పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెచ్చి వారం రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేయించిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆ ఆరోపణ సంగతి ఎలా ఉన్నా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక క్షోభకు ప్రభుత్వమే కారణం.
ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జెడ్పీ హైస్కూలు విద్యార్థిని గంగిరెడ్డి మోక్షితకు తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్‌లో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు వచ్చాయి. కానీ సోషల్‌లో 21 మార్కులే వచ్చి తప్పినట్టు రిజల్ట్ ఇచ్చారు. విద్యార్థిని తండ్రి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు ఫీజు కట్టి రీవాల్యుయేషన్‌కు పెడితే అధికారులు పేపర్ మళ్లీ దిద్ది సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్టు ప్రకటించారు. అయితే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటి, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేందుకు గడువు ముగిసిపోయింది. ఇలానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్థినికి అన్యాయం జరిగింది. సాయికుందనకు ఒక పేపరులో కేవలం 34 మార్కులు వేసి తప్పించారు. రీవాల్యుయేషన్లో ఆమెకు 93 మార్కులు వచ్చాయి. ఏం లాభం ఉత్తమ విద్యార్థినికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటి, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడింది.
సంపద సృష్టి ఇలాగా…
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాకే సంక్షేమ పథకాలు ఇస్తామని, సంపద సృష్టికి చిట్కాలు చెప్పామని ఆ మధ్య జనాలను అడిగాడు. సంపద ఎలా సృష్టించాలో అర్ధం కాక ఇలా విద్యార్థుల పరీక్ష పేపర్లు రీవాల్యుయేషన్ ఫీజు ద్వారా సంపద సృష్టించవచ్చనుకున్నారో ఏమో..!
ఈ ప్రభుత్వానికి రికార్డుల పిచ్చి కదా, ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. 66,363 మంది విద్యార్థుల ద్వారా ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం ఆరు కోట్ల అరవై మూడు లక్షల 63 వేల రూపాయలు ప్రభుత్వానికి సంపద సృష్టి జరిగినట్టేగా.
జరగాల్సిందేదో జరిగిపోయింది. ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆ 66,363 మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్ ఫీజు వెనక్కు ఇవ్వాలి. అలాగే రీవాల్యుయేషన్లో మార్కులు పెరిగిన ఆ 11,175 మందికి ట్రిపుల్ ఐటి, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరడానికి అవకాశం కల్పించాలి. జరిగిన తప్పిదానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు మళ్లీ జరగకుండా చూస్తామని మాట ఇవ్వాలి. ఇది ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎన్నుకున్న ప్రభుత్వ కనీస ధర్మం.
మానవేంద్ర బసు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.