
Reading Time: 5 minutes
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీలు జాతీయ స్థాయిలో అనేక కీలక అంశాలపై తమ వైఖరిని మార్చుకున్నాయి. అలా మార్చుకున్న అంశాలలో రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం, రిజర్వేషన్లు ఉన్నాయి. తాజాగా కుల గణనపై మారిన బీజేపీ వైఖరి మిగిలిన వాటన్నింటికంటే ప్రాధాన్యత సంతరించుకుంది.
కులగణన డిమాండ్‌ను ‘‘భారతదేశాన్ని విభజించే ప్రణాళిక’’ అని, ‘‘అర్బన్ నక్సల్ ఆలోచన’’ అని తీవ్రంగా విమర్శించి, ఆ తరువాత కులగణనను బీజేపీ ఆమోదించిన కాలక్రమం ఇలావుంది:
ఓబీసీల సామాజిక- ఆర్థిక, కుల గణన 2011(SECC-2011) ముడి కుల డేటాను ప్రకటించాలని కోరుతూ 2021 ఆగస్టులో మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా, రాబోయే జనాభా లెక్కల్లో వెనుకబడిన తరగతుల పౌరుల(బీసీసీ) సమాచారాన్ని సేకరించడం సాధ్యం కాదని 2021 సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సామాజిక- ఆర్థిక, కుల గణన 2011 సర్వేలో భాగంగా కులగణనను నిర్వహించడంలో ఎన్యుమరేటర్లు చేసిన తప్పులు, సమాచార సేకరణ ప్రక్రియలో ఏర్పడిన అంతర్లీన లోపాలు డేటాను నిరుపయోగంగా మార్చాయని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు కుల ఆధారిత జనాభా గణన ఆవశ్యకతను డిమాండ్ చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇటువంటి అఫిడవిట్‌ను సమర్పించటం జరిగింది.
2023 అక్టోబర్‌లో బీహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన తర్వాత, ప్రధాని మోడీ దానిని “దేశాన్ని విభజించే” ప్రయత్నంగా అభివర్ణించారు. 2023 నవంబర్‌లో కులగణనను బీజేపీ “ఎప్పుడూ వ్యతిరేకించలేదు” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2023 డిసెంబర్లో సమాజంలో విభజనలను సృష్టించనంత వరకు గణన ప్రయోజనం కోసం కులగణనను నిర్వహించవచ్చని ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ అన్నారు. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ కులగణన కోసం చేస్తున్న వాదన ‘అర్బన్ నక్సల్’ ఆలోచన అని అన్నారు. 2024 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జనాభా గణనను ప్రకటించినప్పుడు కులగణన వంటి అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు(అప్పటికే జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ, తెలుగుదేశం పార్టీ వంటి అనేక బీజేపీ మిత్రపక్ష పార్టీలు కులగణనకు మద్దతుగా బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించాయి). సంఘ్ పరివార్ శక్తులు ఇటువంటి ద్వంద ప్రమాణ కళలో ఆరితేరాయి. ఒకే విషయంపై వారు తరచుగా వేరువేరుగా మాట్లాడుతారు. కొన్నిసార్లు పూర్తిగా వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. వారి మాటలు వినేవారు గందరగోళంలో పడతారు. కానీ వాస్తవంలో ఇది సంఘ్ పరివార్ వ్యూహంలో భాగం.
ఈ నేపధ్యంలో పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండ తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తున్న సందర్భంగా 2025 ఏప్రిల్ 30వ తేదీ నాడు కేంద్ర రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) రాబోయే జనాభా లెక్కల్లో కులగణనను కూడా భాగం చేయాలని నిర్ణయించింది. బహుశా తన సంప్రదాయ అగ్రవర్ణ మధ్యతరగతి మద్దతుదారులు పాకిస్తాన్ పై జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన దేశభక్తి పూర్వక ఉద్విగ్నతలో ఉండగానే, తమకు ‘ద్రోహం’ జరిగిందనే భావన రాకుండా ఉండేందుకే అటువంటి నిర్ణయం జరిగివుండవచ్చనేది ఒక ఊహాగానం. అంతేకాదు భారత రాజకీయాలలో మండల్ నివేదిక అమలు నిర్ణయ అనంతర కాలంలో జరిగిన పెను మార్పులను పోలిన మార్పులు సంభవించే సాధ్యతగల కులగణనను బీజేపీ ఆమోదించటం వెనుకగల కారణాలను విశ్లేషించవలసిన అవసరం ఉంది.
కుల గణనపై బీజేపీ యూటర్న్ తీసుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం: కుల గణన అంశాన్ని ప్రతిపక్షాలు స్థిరంగా లేవనెత్తాయి. నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిని విడిచిపెట్టినప్పటికీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా కుల గణనను నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వంలో నితీష్ కుమార్‌తో కాంగ్రెస్, ఆర్జేడీలు ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఆ తరువాత కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తమతమ కుల సర్వేలను చేపట్టాయి.
ఉపకుల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆధిపత్య వ్యవసాయ కులాలకు, సాపేక్షంగా ప్రాధాన్యత కలిగిన దళిత ఉపకులాలకు వ్యతిరేకంగా బీజేపీ దిగువ ఓబీసీలను, దిగువ దళితులను సమీకరించి విజయం సాధించగలిగింది. దానితో ఆ పార్టీలో కుల జనాభా లెక్కల కార్డును తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోగలమనే ధీమా ఏర్పడింది. అంతేకాకుండా మెరుగైన వెనుకబడిన కులాల ఆధిపత్యం ఉన్న బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలను బలహీనపరచగలమనే ధైర్యం బీజేపీకి వచ్చింది. అంటే, బలమైన ఉపకుల-వర్గీకరణ రాజకీయాల ప్రభావంతో సమరశీలంగావున్న బాగా వెనుకబడిన కులాల స్థితిగతులపై కులగణన మరింత స్పష్టతను ఇస్తుంది. పర్యవసానంగా యాదవుల, మీనాల వంటి ఆధిపత్య రిజర్వ్డ్ కులాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలలో ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా కింది కులాలను సమీకరించి సంకీర్ణాలను ఏర్పాటు చేయడంలో బీజేపీకి ఎంతో అనుభవం ఉంది.
కులాల గందరగోళం హిందూత్వాన్ని ఒక గొడుగుగా బలపరుస్తుంది. కులాలు ఎంత చీలితే, వాటిని విస్తృతమైన కాషాయ పైకప్పు క్రిందకు తీసుకురావడం అంత సులభం. ముఖ్యంగా పై కులాల ఆధిపత్యం ఎక్కువైనప్పుడు సంఘ్ పరివార్‌లో హిందూ ఐక్యత, సామాజిక న్యాయం కలిసి ఉండగలవనే నమ్మకాన్ని పెంచటం బీజేపీకి తేలిక అవుతుంది.
అలాగే ముస్లింలలో, క్రైస్తవులలోని నిగూఢంగావున్న కులపరమైన సామాజిక అసమానతలను కులగణనతో అధికారికంగా నమోదుచేయడం ద్వారా వారి ఐక్యతను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు బీహార్‌లో మైనారిటీ అష్రఫీ ముస్లింలచేత దోపిడీకి గురౌతున్న పస్మాండ ముస్లింలకు అనుకూలంగా సానుకూల నిర్ణయాలు చేసి వారిని తమవైపు తిప్పుకోవచ్చు.
అంతిమంగా బీజేపీకి బలమైన పునాదిగావున్న ఉన్నత వర్గాలు కులగణనతో తమపై ప్రతికూల ప్రభావం ఉండదని భావించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించిన 50 శాతానికి మించి కుల రిజర్వేషన్లను పెంచటానికి రాజ్యాంగంలో చేయవలసిన సవరణలను చేయటానికి సుముఖంగా ఉండదనే నమ్మకం ఈ వర్గాలలో ఉంది. అలాగే ప్రైవేట్ విద్య లేదా ఉద్యోగాలలో కోటాను బీజేపీ ప్రభుత్వం అనుమతించదు. కాబట్టి, బీజేపీ సాంప్రదాయ సామాజిక పునాదిగావున్న అగ్ర కులాల వైఖరిలో యథాతథ స్థితి కొనసాగుతుంది.
కులగణనకు అనుకూలంగా ఆకస్మికంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. నిన్నటి వరకు అపహాస్యం చేయడానికి, వాయిదా వేయడానికి ఏమాత్ర వెనుకాడని మోడీ ప్రభుత్వం నేడు ప్రజల తీవ్ర ఒత్తిడికి, ప్రతిపక్షాల పోరాటానికి తలొగ్గి కులగణనను నిర్వహించడానికి అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రతి మంచి పథకాన్ని లేదా విధానాన్ని మొదట వ్యతిరేకించటం, ఆ తరువాత దానిని అప్రతిష్టపాలు చేయటం బీజేపీకి అలవాటేనని, ప్రజల ఒత్తిడిని, వాస్తవికతను ఎదుర్కొన్నప్పుడు, అదే విధానాన్ని అవలంబించమని చెప్పటం “బీజేపీ ప్రభుత్వ నమూనా’’ అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపై అనేక ఉదాహరణలు ఇచ్చారు: గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)గురించి ప్రధానమంత్రి పార్లమెంటులో మాట్లాడుతూ అది ‘వైఫల్యానికి స్మారక చిహ్నం’ అని ఎగతాళి చేశాడని, వాస్తవంలో అది గ్రామీణ ఉపాధి, పేదరిక నిర్మూలనకు ఒక ప్రతీకగా నిలిచిందని, కరోనావైరస్ సంక్షోభం వచ్చినప్పుడు, ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ దేశంలోని పేదలకు వెన్నెముకగా మారిన సందర్భంలో బీజేపీ ప్రభుత్వం తన బడ్జెట్‌ను కూడా పెంచి, గొప్పలు చెప్పుకుంది.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ విషయంలో కూడా అదే జరిగింది. అది “గోప్యతకు ముప్పు, కేవలం రాజకీయ స్టంట్” అని బీజేపీ చెప్పేది, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ఆధార్‌ను మొత్తం సంక్షేమ వ్యవస్థకు పునాదిగా మార్చింది.
అలాగే జీఎస్టీ కథ కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదని, కాంగ్రెస్ జీఎస్టీని తీసుకురావడానికి చొరవ తీసుకున్నప్పుడు, బీజేపీ దానిని తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇది రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నదని, కానీ అది అధికారంలోకి వచ్చిన వెంటనే, చెప్పుకోదగిన మార్పులు చేయకుండానే దానిని అమలు చేయటమే కాకుండా దానిని ‘గేమ్ ఛేంజర్’ అని పిలుస్తూ తనను తాను ప్రశంసించుకోవడం ప్రారంభించింది.
కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సబ్సిడీలను నేరుగా ప్రజల ఖాతాకు చేరేలా చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) వ్యవస్థను పనిచేయదనే పేరుతో బీజేపీ తిరస్కరించిందని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే, అది దేశవ్యాప్తంగా ఈ డీబీటీ విధానాన్ని అమలు చేసి ‘డిజిటల్ ఇండియా’ అని తనకుతాను డబ్బా కొట్టుకుందని, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మహిళలకు నగదు సహాయం అందించే విధానాన్ని కూడా బీజేపీ తనదే అన్నట్టుగా అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
మరోవైపు కులాల డేటా అందుబాటులో లేకపోవటంవల్ల ఆచరణకు సంబంధించిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఇంద్ర సాహ్నీ కేసు(1992)లో సుప్రీంకోర్టు రిజర్వేషన్లను అమలు చేసేందుకు వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి, ఓబీసీ ‘క్రీమీ లేయర్’ను మినహాయించడానికి డేటా అవసరాన్ని నొక్కి చెప్పింది. కులాల డేటా లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాల్లోని కోర్టులు స్థానిక ఎన్నికలలో ఓబీసీ కోటాలను నిలిపివేయాల్సి వస్తోంది. ప్రాబల్య ఓబీసీ సమూహాలలోని వెనుకబడిన ఉపకులాలకు ప్రయోజనాలు చేరాలంటే సదరు కులాలకు చెందిన డేటా కూడా చాలా అవసరం. జస్టిస్ రోహిణి కమిషన్ దీనిని అధ్యయనం చేసి, అనేక పొడిగింపుల తర్వాత 2023 ఆగస్టులో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది(ఈ నివేదికను ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేదు).
మరోవైపు 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు సీట్ల పునర్విభజన 2026 తర్వాత అంతకు ముందు నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా చేయవలసి ఉంటుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి తరువాత ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల 2021లో జరగవలసిన జనాభా లెక్కలు ఇప్పటివరకూ జరగలేదు. కాబట్టి ప్రభుత్వం 2026 లేదా 2027 నాటికి జనాభా లెక్కలను నిర్వహించి, దాని ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. కుల గణనపై బీజేపీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తరువాత 2026-27లో జరగనున్న జనాభా లెక్కలలో కులగణన కూడా ఉంటుందనేది సుస్పష్టం. ఇలా బ్రిటీష్ వలస పాలన 1881 నుంచి 1931వరకు(1941లో జరిగిన జనాభా లెక్కల్లోని కుల గణన డేటా బయటకు రాలేదు) జనాభా లెక్కల్లో భాగంగా జరిగిన కుల గణనను స్వత్రత్ర భారత ప్రభుత్వం తిరిగి చేపట్టబోతోంది.
రానున్న కాలంలో నిర్వహించనున్న కులగణనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనంలో ఉంచుకోవాలి. జనాభా లెక్కల్లో కులగణనను భాగం చెయ్యాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే కానీ ఈ చర్యను కుల గణన సమర్థవంతంగా నిర్వహించబడుతుందనే హామీగా పరిగణించలేము. దీని కార్యాచరణకు జనాభాశాస్త్రం, సామాజిక శాస్త్రం, సామాజిక, సాంస్కృతిక భౌగోళిక శాస్త్రం ఇంకా గణాంకశాస్త్రంవంటి బహుళ విభాగాలలో నిష్ణాతులచే రూపొందించబడిన గణాంక పద్ధతి అవసరం. గత శతాబ్ద ప్రారంభ దశాబ్దాలలో కులగణనలో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం అమలు చేసిన ప్రక్రియల నుంచి, వాటిపై జరిగిన అధ్యయనాల నుంచి నేర్చుకోవలసిన పాఠం ఇది.
చర్చల, పర్యవేక్షణల రూపంలో పౌరులు, మేధావులు జోక్యం చేసుకోవటానికి వెనుకాడకుండా అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. 2011 జనాభా లెక్కలలో భాగంగా చేసిన ‘2011 సామాజిక ఆర్థిక, కుల సర్వే’లో ఇటువంటి జోక్యం లేకపోవడంవల్లనే “ఉపయోగించలేని” నిరుపయోగ డేటాగా సమాచారం పోగుపడింది. ఈ వాస్తవాన్ని విస్మరించటం అంటే మనకు ప్రమాదం పొంచివున్నట్టే.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో ప్రభుత్వ పాలన అభివృద్ధి కోసం మహాలనోబిస్, డేనియల్ థోర్నర్ వంటి నిష్ణాతులు చేసిన కృషి ఫలితంగా బాగా స్థిరపడిన సంస్థాగత, వ్యవస్థాగత యంత్రాంగాలు, డేటా సేకరణ, కార్యాచరణ ప్రోటోకాల్‌లు చాలావరకు నిర్వీర్యం చేయబడినట్లు, నమ్మదగనివిగా మారినట్టు ఆయా రంగాలలో పనిచేస్తున్న మేధావులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలో విధాన రూపకల్పనకు, ప్రగతిశీల, న్యాయమైన సామాజిక, ఆర్థిక పరివర్తనకు ఆధారం కాగల ప్రామాణికమైన, నమ్మదగిన కుల గణనకు చెందిన సమాచార సేకరణ కోసం విమర్శనాత్మక పౌర నిఘా, పరిశీలన అవసరాన్ని మనకు తెలియజేస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.