
దశాబ్దాల కాలపు నడక
సుదీర్ఘ ప్రయాణపు చరిత
ఉద్యమాల పరంపర
పాద ముద్రల శిలాఫలకం
శంకర్, శ్రీకాంతాచారి వంటి
ఎందరో అమరుల త్యాగ వనం
ప్రాంతీయ వివక్షతను తరిమే
లక్షల ఉషోదయాల కావ్యం
నీళ్లు నిధులు నియామకాల
యుద్ధ పోరాటపు గళం
బరువెక్కిన గుండెల
నినాదాల జలదృశ్యం
నాలుగు కోట్ల గొంతుకల
ఏకస్వరపు సాకారం
తెలం”గాన”మయ్యింది
మిలియన్ మార్చ్
ప్రభం”జన”పు వాయుగుండంలో
సకలజనుల ఆకాంక్షల
సమ్మె సారథ్యంలో
వంటావార్పు
సాగరహారం ఈ దేశ రాజకీయ
ముఖచిత్రాన్నే మార్చేసింది
సడక్ బంద్ సంసద్ యాత్ర
రణభేరి పొలికేక
జనగర్జన పల్లె పట్టాల పైకి
ఇలాంటివెన్నో పరిణామాల
ప్రతిధ్వనుల జ్వాలలు
దమ్మిడి బారాణ
గిద్దెడు శేరు
తొక్కులు బగార అన్నం
హలీమ్ హైదరాబాద్ బిర్యానీ
బొంగరాలాట గోలీలాట
ఇలాంటివెన్నో ఆనవాళ్ల
సంస్కృతి ప్రతిబింబాల శిఖరాలు
వెనకబాటు పోకడలతో
ఆధిపత్యపు దాడిలో
తల్లడిల్లుతున్న తెలంగాణ
కన్నీటి బిందెలు
కటిక చీకటి బుగ్గలు
మ్యానిఫెస్టోలు మారినా
మారని తరాల బతుకు రాతలు
ప్రకటనల కమిటీల
తారీఖులు మార్చినప్పుడల్లా
గుండెలన్నీ చెరువులయ్యాయి
తొలిసూరి 2014 జూన్ 2న
జయశంకర్ సార్ వొడవని ముచ్చట
కాంతి పుంజాల ప్రవాహమై
అలాయ్ బలాయ్ ఆటలాడుతూ
తెలంగాణ స్వాతంత్య్రోదయం
నీలి గగనాన స్వేచ్ఛా
పతాకమై ఉద్యమించింది
సూర్యుడు చిరునవ్వుల
కిరణాల నవపథం
జై తెలంగాణ ప్రభాత గీతమైంది
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.