
చరిత్రను వక్రీకరించిన రజాకార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ చారిత్రక సినిమాగా గద్దర్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. భూమి కోసం, వెట్టి చాకిరి, ఫ్యూడల్ దుర్మార్గపు వ్యవస్థ నుంచి విముక్తి కోసం హైదరాబాదు రాజ్యంలో 1946 నుంచి 1951 దాకా వీరోచిత సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని ముస్లిం నిజాంపై హిందువులు జరిపిన పోరాటంగా చరిత్రను వక్రీకరించి తీసిన సినిమా ‘రజాకార్’. అలాంటి చిత్రాన్ని ఉత్తమ చారిత్రక సినిమాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం యాధృశ్ఛికంగా జరిగింది కాదు. వీరోచిత తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించడమే ఆ ఎంపిక వెనుక ఉన్న లక్ష్యం. దేశంలోని జనాన్ని మత ప్రాతిపదికపై విడగొట్టి ఉంచడానికి నేడు సినిమాల నిర్మాణం కొనసాగుతోంది. ఆ పరంపరలోనిదే రజాకార్. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేదు. వందల కోట్లు వెచ్చించి నిర్మించిన సినిమా ‘ఆదిపురుష్’ను కూడా భారతీయులు తోసి పుచ్చారు.
ఒక వాస్తవ సంఘటనను తీసుకొని సంకుచిత రాజకీయ దృష్టితో అవాస్తవాలు చెప్పడం ఈ చిత్రాల ప్రత్యేకత. ప్రతి చారిత్రక సినిమాలోనూ కొంత కాల్పనికత తప్పదు. ఆ కాల్పనికత ఉత్తమ విలువలను, సౌభ్రాతృత్వాన్ని పెంచాలి. బాధితుల పట్ల సానుభూతిని కల్గించాలి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు, ఆదరిస్తారు. మనదేశంలో అప్పటికీ ఇప్పటికీ జనం ఆదరించే ‘మొఘల్ ఎ ఆజం’ను చూడండి. అందులో ప్రేమను భూమికగా ఎంచుకున్నారు. అంతేకాకుండా మతసామరస్యాన్ని, మధ్యయుగాల నాటి కరుడు గట్టిన రాజరిక పాలనలో కూడా కాసింత కారుణ్యాన్ని చూపిన సినిమా అది. అందులో రాజుల పక్షం వహించకుండా ఉన్నత విలువల వైపు నిలబడే సంక్రాజ్ పాత్ర చారిత్రక వాస్తవం కాకపోవచ్చు. కానీ చక్రవర్తిని కూడా ప్రజల పక్షాన నిలదీసే వారుండాలని చెప్పిన సినిమా మొఘల్ ఎ ఆజం. అన్ని భాషల్లోని ఉత్తమ సాహిత్యంలో మనకు ఇలాంటి పాత్రలు కన్పిస్తాయి. ఈ పాత్రలను సృష్టించడం వెనుక ఒక ప్రయోజనం ఉంది. రజాకార్ చిత్రం వెనుక కూడా ఒక సామాజిక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం మంచిదో కాదో గమనించే సామర్థ్యం అవార్డుల ఎంపిక కమిటికీ, మాజీ ఏబీవీపీ కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోపించాయని అనుకోలేం. అలా అనుకొంటే అది ఆత్మవంచనో, అజ్ఞానమో అవుతంది. పనిగట్టుకొనే అవార్డు కమిటి, ముఖ్యమంత్రి అందుకు తెగబడ్డారు.
సినిమాలో చూపినట్లు రజాకార్లు యూనియన్ సైన్యంపై తిరగబడలేదు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా నిజాం నవాబులాగే వారూ లొంగిపోయారు. యూనియన్ సైన్యం ప్రవేశించినప్పుడు మరాఠ్వాడ జిల్లాల్లో రక్తపాతం జరిగిన మాట వాస్తవమే. కానీ అది ప్రతిఘటన వల్ల జరగలేదు. అప్పటి ఉస్మానాబాదు జిల్లా కలెక్టర్ మహ్మద్ హైదర్ రాసిన పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా తెలియజేయబడింది. యూనియన్ సైన్యాలు హైదరాబాద్ స్టేట్లోకి వస్తున్నాయని తెలిసి ఆయన స్వయంగా హైదరాబాదుకు వచ్చి నిజాంను, ప్రధాని లియాకత్ అలీని కలిసి తాను ఏంచేయాలో ఆదేశించమని కోరాడు. నిజాం ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. అప్పటికే యూనియన్ ప్రభుత్వంతో ఆయనకు ఒప్పందం కుదిరి ఉంటుంది.
యూనియన్ ప్రభుత్వం హైదరాబాదు రాజ్యాన్ని విలీనం చేసుకున్న వెంటనే నిజాంను రాజప్రముఖ్‌గా నియమించింది. 1971లో ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు చేసే వరకు నిజాంకు భారీ రాజభరణం అందింది. నిజాం అకృత్యాలపై ఎలాంటి విచారణ జరపలేదు. రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీని అరెస్టు చేసి మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్ (భవంతి)లో ఉంచారు. కాశీం రజ్వీకి అండదండలు అందించిన ప్రధాని, తనకు అనారోగ్యమని నాటకమాడి పాకిస్తాన్ ఉడాయించాడు. కాశీం రజ్వీని కూడా కొంతకాలం తర్వాత పాకిస్తాన్‌కు పంపారు. తెలంగాణ ప్రజలపై భయంకరమైన హింసాకాండ సాగించి వేలాది మంది హత్యలకు, అత్యాచారాలకు కారకుడైన రజ్వీ వంటి దుర్మార్గుడికి లభించాల్సిన శిక్ష లభించలేదు. రజ్వీ పోకడలను వ్యతిరేకించిన ఉస్మానాబాదు కలెక్టర్ హైదర్‌కు మాత్రం జైలుశిక్ష పడింది. కోర్టులో కాశిం రజ్వీ తరఫున వాదించిన న్యాయవాదికి ప్రభుత్వమే ఫీజు చెల్లించింది. ఆ చరిత్ర జోలికి సినిమాలో వెళ్లలేదు.
దొరల నుండి స్వాధీనం చేసుకొన్న భూమిని రక్షించుకోవడానికి పోరాడుతున్న 2,500 మంది రైతులను యూనియన్ సైన్యాలు చంపేశాయి. ఆ భూములను మళ్లీ భూస్వాముల పరం చేశాయి. వాస్తవ చరిత్రను చెప్పాలనే ఉద్దేశమే ఉంటే రజాకార్ చిత్రంలో ఇవన్నీ చూపెట్టేవారు. కాని అలా చేయలేదు. ముస్లింల పట్ల ద్వేషం రెచ్చగొట్టడమే తమ సంకుచిత రాజకీయ లక్ష్యం గనుక వాస్తవ ఘటనలకు మసిబూసి అబద్దాలను జనం ముందుంచారు. నిజాంకు దొరలతో మంచి దోస్తానా ఉండింది. దొరల నుండి విలువైన కానుకలు అందేవి. అందమైన మహిళలను కూడా దొరలు నిజాంకు నజరానాగా బహుకరించేవారు. దొరలు ప్రజలను పశువుల కంటే హీనంగా చూసేవారు. ప్రశ్నించే వారిని చంపేసేవారు. కాంగ్రెస్‌ను వదలి బీజేపీలో చేరిన గూడూరు నారాయణ రెడ్డి రజాకార్ చిత్ర నిర్మాత కాగా బీజేపీ సీనియర్లు తెరవెనుక నుండి కథ నడిపించారు.
తెలంగాణలోని జాగీర్దార్లకు, వారికి అండగా నిల్చిన నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాదు స్టేట్‌లో వివిధ రూపాల్లో ప్రతిఘటనా పోరాటాలు సాయుధ పోరాటానికి ముందే మొదలయ్యాయి. గ్రంధాలయోద్యమం, ఆంధ్ర జనసభ, ఆంధ్ర మహాసభ ఆ ప్రతిఘటనల్లో భాగంగా ముందుకొచ్చాయి. తెలుగులో చదువుకొనే, కనీసం సభల్లో మాట్లాడే అవకాశం లేని స్థితిలో ఆంధ్రజనసభ ఆ తర్వాత ఆంధ్రమహాసభ ఆవిర్భవించాయి. ఆంధ్రమహాసభలోని కమ్యూనిస్టులు ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాన్ని వేదిక పైకి తెచ్చినప్పుడు మహాసభలోని భూస్వామ్య అనుకూల వర్గాలు బెంబేలెత్తి మహాసభ నుంచి చీలిపోయాయి. ఆ తర్వాత వారి పోరాటాలు అంతగా కన్పించవు. ఆంధ్రమహాసభ మహోద్వేగంతో ముందుకు సాగింది. జమిందారీ వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. జాగీర్దార్ల అరాచకాలకు వ్యతిరేకంగా స్వీయ రక్షణ కోసం రైతులు, బడుగు జనం ఆయుధాలు చేపట్టారు. క్రమంగా పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోకి వెళ్లింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని విస్తారమైన ప్రాంతంలో మూడు వేల గ్రామాలు జాగార్దారీ భూస్వామ్య పాలన నుండి విముక్తి పొందాయి. పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. 1946 నుంచి 1951 వరకు జరిగిన ఆ పోరాటంలో నాలుగు వేల మంది వీరులు తమ ప్రాణాలొడ్డారు.
రజాకార్లు, నిజాం సైన్యం, అలాగే దొరల గుండాల చేతుల్లో 1500 మంది చనిపోయారు. రైతులు, వివిధ వృత్తులవారు చేసిన ఆ పోరాటాన్ని అణచడానికి జాగీర్దార్ల గుండాలతో పాటు రజాకార్లు సామాన్య ప్రజలపై చెప్పలేని అఘాయిత్యాలకు, క్రూర చర్యలకు పాల్పడ్డారు. సినిమాలో చూసిన అకృత్యాలన్నీ రజాకార్లు హిందూ ప్యూడల్ దొరల సైన్యాలతో కలిసి చేసినవే. కాని దొరలు రజాకార్లను ఉపయోగించుకున్న సత్యాన్ని రజాకార్ సినిమా కావాలనే దాచిపెట్టింది. వీరనారి చాకలి ఐలమ్మ పట్ల తెలంగాణ ప్రజల్లో విశేష అభిమానం ఇప్పటికీ ఉంది. కనుక ఆ అభిమానాన్ని కూడా ఎన్నికల్లో తమకు అనుకూలంగా మల్చుకోవడానికి ఐలమ్మ సంఘటనతోనే సినిమా మొదలెట్టారు. ఆమె చివరి దాకా కమ్యూనిస్టుగా బతికినా ఆ విషయాన్ని సినిమాలో చూపెట్టలేదు.
ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభలు తెలంగాణలో చేసిందేమి లేదు. కనుక వారిని చూపెట్టడానికి అవకాశమే లేదు. వీడీ సావర్కర్ అనుమతితో హిందూ మహాసభ నిజాంకు వ్యతిరేకంగా జరిపిన సత్యాగ్రహంలో గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సే నాయకుడిగా పాల్గొన్నాడు. అందుకు అతను పదకొండు నెలల పాటు హైదరాబాదు జైల్లో శిక్షను అనుభవించాడు. జాతిపితను చంపిన గాడ్సే ఒక హిందూ మతోన్మాది గనుక ఆ ఘటనను కూడా సినిమాలో చూపకుండా జాగ్రత్త పడ్డారు. ఆర్యసమాజ్ వ్యక్తిగత దాడులకు మాత్రమే పరిమితం అయింది. నిజాం నవాబుపై వారు చేసిన హత్యాయత్నం ఆ కోవలోనిదే. కాని ఆర్యసమాజ్ పాత్రను గొప్పగా చూపే ప్రయత్నం చేశారు.
నిజాం ప్రభుత్వ యంత్రాగం ఫ్యూడల్ దొరల దోపిడీకి అనుకూలంగా నిల్చింది. దొరల్లో అత్యధికులు హిందువులే. గ్రామాల్లోని వృత్తికులాలు, సేవాకులాలు దొరలకు అధికారులకు ఉచితంగా తమ ఉత్పత్తులు, సేవలను వెట్టి కింద అందించే వారు. దొరల ఇళ్లల్లో పెళ్లైతే పెళ్లి కూతురితో పాటు కొందరు యువతులను కూడా బానిసలుగా పంపేవారు. దొరలు వారితో తమ కామ వాంఛలు తీర్చుకొనేవారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు వారిని తార్చేవారు అలాంటి విషయాలేవీ సినిమాలోలేవు. ఉంటే రేవంత్ రెడ్డి కూడా రజాకార్కు ఉత్తమ చారిత్రక సినిమా అవార్డును ఆమోదించేవాడే కాదు. ఈ ఘటనలను చెప్పడమంటే దౌర్జన్యాలకు, దోపిడీకి మతం ప్రాతిపదిక కాదని చెప్పడమన్న మాట. అది పరివార్‌కు మింగుడు పడని విషయం కదా?
సినిమాలో పదే పదే హైదరాబాద్‌కు తుర్కిస్తాన్‌గా మార్చడానికి నిజాం ప్రయత్నిస్తునట్లు చూపారు. మొదటి నిజాం ఇరాన్ నుంచి వచ్చిన వాడు. టర్కీతో నిజాం కుటుంబాలకు పెళ్లి సంబంధాలున్నా, టర్కీతో పాలనా సంబంధాలు లేవు. సినిమాలో వాడిన తుర్కిస్తాన్ అనే మాట మనకు చరిత్రలో కన్పించదు. నిజాం ఒక దశలో మత మార్పిడులు చేయించారు. అతనే వాటిని నిలిపేశాడు. కారణం మళ్లీ దొరలే. మతమార్పిడి వల్ల ఇస్లాంను స్వీకరించిన మాల మాదిగలు, ఇతర శూద్రులు వెట్టిచాకిరీని నిరాకరిస్తే మా గతేమిటి? మీ అధికారుల గతేమిటి? అని దొరల ప్రతినిధి వర్గం నిజాంను కలిసి ప్రశ్నించింది. వెంటనే నిజాం మతమార్పిడులను నిలిపి వేయించాడు. సినిమాలో ఈ విషయం ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.
1917లో రష్యాలో సోషలిస్టు రాజ్యం ఏర్పడ్డాక ఆ స్ఫూర్తితో ఉత్తరాది నుంచి వచ్చిన ముస్లిం పాత్రికేయులు హైదరాబాదులో ఉర్దూ పత్రికలు పెట్టి నిజాంను ఏకిపారేశారు. “అనల్ మాలిక్” అన్న భావనను ఎండగడ్తూ మగ్దూంమొయిద్దీన్ కవితలు రాశాడు. రోజుకు పావలా సంపాదించే ముస్లిం రిక్షాకార్మికుడు హైదరాబాదుకు ప్రభువు అవుతాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో దొరల ఆగడాలను మా భూమి, దాసి, వీరతెలంగాణ, చిల్లరదేవుళ్లు వంటి సినిమాలు చూపెట్టాయి.శ్యాంబెనగల్ నిజాం కాలం నాటి తెలంగాణ ఇతివృత్తంతో అంకుర్, నిషాంత్, మండి వంటి సినిమాలు నిర్మించారు. ఇవన్నీ 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలు. కాల్పనిక కథలే అయినా వాస్తవ ఘటనల ఆధారంగా తీసినవి. ఈ తరం వారు వీటిని చూడలేదు. అవి చూస్తే నిజాం పాలనకు అండగా దొరలు పాల్పడిన అకృత్యాలు తెలుస్తాయి. తెలుగులో చిత్రాల కంటే తెలంగాణ పోరాటంపై ఎక్కువ సంఖ్యలో నవలలు వచ్చాయి. గంగు, ప్రజల మనిషి, చిల్లరదేవుళ్లు, మోదుగు పూలు, జనపదం, తెలుగు గడ్డ, జైత్రయాత్ర వంటి అనేక నవలలు తెలంగాణ సాయుధ పోరాట ఘటనలను, దానికి ముందు నాటి స్థితిని తెలియజేస్తాయి. వాటికి జనం బ్రహ్మరథం పట్టారు. కాని ‘రజాకార్’ను నెత్తిన పెట్టుకోలేదు. ఆ పని రేవంత్ చేస్తున్నాడు.
ఎస్ వినయ కుమార్
9989718311
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.