తెలంగాణా రాష్ట్రం ఏర్పడి పదేళ్ళయింది. ఇప్పటికి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఉంది. అభివృద్ధి విధానాల ప్రాధాన్యాలలోనూ, పాలనా శైలి లోనూ, సంక్షేమ పథకాలలోనూ మార్పులు తీసుకువస్తానన్న వాగ్డానంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లక్షిత సామాజిక సమూహాల జీవితాల్లో మార్పు ఉండబోతోందన్న సంకేతాన్నిచ్చింది.
పదేళ్ళ టి ఆర్ ఎస్/బి ఆర్ ఎస్ పాలనకు ముగింపు పలికిన కాంగ్రెస్ విజయం ఈ కొత్త రాష్ట్రంలో రాజకీయాలను మార్చగలదన్న సంకేతాన్నిచ్చిన పరిణామంగా కనిపించింది. అత్యంత కేంద్రీకృతమైన, వ్యక్తి కేంద్రక అధికారతత్వంతో కూడిన, అహంకారపూరితమైన ఏలుబడి నుంచి ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిస్పందించేదిగానూ, జవాబుదారీతనం కలిగిన పరిపాలనను ఇచ్చే రాజకీయాల వైపుకు మారుతున్న సంకేతాన్ని ఇచ్చిన పరిణామంగానూ కాంగ్రెస్ విజయాన్ని జనం చూశారు. ఈ విషయంలో భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఉంటుందన్న ఆశ వ్యక్తమైంది. అందుకే అప్పటికే చాలా విసిగిపోయివున్న తెలంగాణ పౌరసమాజం నుంచి గణనీయమైన స్పందన వచ్చింది. తాను అధికారంలోవున్నరాజస్థాన్, చత్తీస్ఘడ్ లలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. గెలుస్తుందనుకున్న మధ్యప్రదేశ్‌లో కూడా ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ విజయం జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ గెలుపును రాష్ట్రస్థాయిలో ఇంకొక కోణం నుంచి కూడా తరచి చూడాల్సి ఉంటుంది. నిజానికి అప్పటికి పార్టీగా బి ఆర్ ఎస్ పట్ల గానీ, దాని అధినాయకుడైన కె సి ఆర్ పట్ల గానీ ఓటర్లలో భరించలేనంత విసుగు, విముఖత కలిగినట్లు సూచించే సంకేతాలేమీ కనిపించలేదు. కెసిఆర్ పాలనలో ప్రజాకర్షక పథకాలు, సంక్షేమ చర్యల పరిధి విస్తారంగా ఉండడం, లబ్దిదారుల కవరేజి కూడా విస్తృతంగా ఉండడంతో పాటు వాటి అమలు సుస్థిరంగానూ . నిరాటంకంగానూ కొనసాగిందన్నది బాగా తెలిసిన విషయమే. ఇంతటి ప్రజాకర్షక పాలన ఉన్నప్పటికీ ఎన్నికలలో ఎందుకు ఓటమికి గురికావాల్సి వచ్చిందన్న చిక్కుప్రశ్న ఒకటి పుట్టుకొస్తుంది. తక్షణ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే బయటకు అది ఒక నిర్దిష్టమైన చిక్కుప్రశ్నగా మాత్రమే కనిపించవచ్చు. కానీ అంతర్గతంగా ప్రజాకర్షణ విధానాలకు, పార్టీలు, ఓటర్లకు మధ్య రూపుదిద్దుకుంటున్న సంబంధాలకు గురించిన అతి ముఖ్యమైన, అత్యవసరమైన ప్రశ్నలను కూడా అది ముందుకు తీసుకువచ్చింది.
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కూడా ప్రజాకర్షక విధానాలు అవలంబించిన ప్రభుత్వాలు కూడా ఎన్నికలలో ఓటమి పాలయ్యాయి కదా. కాబట్టి ఇది తెలంగాణాకు మాత్రమే ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన అంశం కాదని, ఇంకా విస్తృతమైన ప్రాసంగికత కలిగిందని వేరే చెప్పనక్కర్లేదు. ఇంకా దీనిని చర్య, దాని ప్రభావం లేదా కార్యకారణ సంబంధపు మూసకి పరిమితం చేసి కూడా వివరించలేము. ప్రస్తుతం భారతదేశం ఉన్న నయా ఉదారవాద సందర్భంలో ప్రజాస్వామ్యపు స్వభావం, సారం, నాణ్యతలలో వస్తున్న మార్పులపై , విధాన రూపకల్పన భవిష్యత్ పై ఈ పరిణామాల ప్రభావాన్ని, అవి అందించే హెచ్చరికలను అవగాహన చేసుకోవడానికి మరింత లోతైన రాజకీయ సైద్ధాంతిక(పొలిటికల్ థీయారిటికల్ ) దృష్టికోణం నుంచి పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ వ్యాసంలో బి ఆర్ ఎస్ విధానాలపై దృష్టి పెట్టి వాటిపై తార్కిక విశ్లేషణ చేస్తూ, వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చిన వాదనలను గుర్తిస్తూ వాటి ద్వారా బి ఆర్ ఎస్ ఎన్నికలలో ఓడిపోవడానికి దారితీసిన కారణాలేమిటో పరిశీలించే ప్రయత్నం చేశాను. అందుకోసం మొదట బి ఆర్ ఎస్ 2014లో అధికారంలోకి వచ్చాక అది తన పాలనలో ముందుకు తీసుకువచ్చిన విధానాలను పరిశీలించాం. వాటినే రెండో సారి గెలిచాక కూడా కొనసాగించింది. రెండవ భాగంలో 2023 ఎన్నికల సందర్భంగా బి ఆర్ ఎస్ విధాన దృక్పథాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషణ చేశాం. అందులో పౌరసమాజపు పాత్రను, ప్రతిపక్షపార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ల వాదనలపై దృష్టి పెట్టాం. మూడవ భాగంలో పాలన విధానాలపై జరిగిన సంవాదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్నిచూపి, బి ఆర్ ఎస్ ఓటమికి దారి తీయడాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాం.ఈ ఓటమి ప్రజాకర్షక విధానాల పరిమితులను తెలియజేసింది అని గుర్తించాలి.
టి ఆర్ ఎస్ విధానాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తెలంగాణా ఉద్యమం ముందుకు తీసుకువచ్చిన ముఖ్యమైన అంశాల చుట్టూనే తన విధానాల రూపకల్పనకు ప్రయత్నించింది. వాటి ఆధారంగానే తన విధానాలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం టి ఆర్ ఎస్ ఆవిర్భావానికి రెండు దశాబ్దాల ముందే మొదలైనా, తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ఉద్యమానికి తాము మాత్రమే కర్తలమనే భావన కలిగించడంపై దృష్టి పెట్టింది. నిజానికి అనేకానేక పౌర సమాజపు సంస్థలు, ఇంకా దాదాపు అన్ని పార్టీలు ఉద్యమానికి మద్దతును సమీకరించడంలో, దానిని బలోపేతం చేయడంలో చురుకైన పాత్రను పోషించాయి. స్వభావం రీత్యా చూసినా, కూర్పు, భాగస్వామ్యాల రీత్యా చూసినా తెలంగాణ ఉద్యమం బహుళత్వానికి మారుపేరుగా ఉండిరది. అయినా టి ఆర్ ఎస్ రాష్ట్ర సాధనలో తమదే అత్యంత ప్రధాన పాత్ర అని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. అంటే దాదాపుగా ఆ ఖ్యాతి తమకు మాత్రమే దక్కేలా చేసుకునేందుకు ప్రయత్నించింది. తన ప్రయత్నానికి విశ్వసనీయత పొందడం కోసం చాలా జాగ్రత్తగా రూపొందించిన వాదనను అధికారిక యంత్రాంగం ద్వారా చర్చలోకి తెచ్చింది. ఇది మనకు నాయకుల ప్రసంగాలలో కనిపిస్తుంది. వాటితో పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కూడా జరిగింది. అది ఎవరి ఆర్థిక సహకారంతోనైనా కావచ్చు లేదా వాటికున్ననిధులతోనే కావచ్చు. ఉదాహరణకు తెలుగు అకాడమీ ప్రచురణల ద్వారా ఇది జరిగింది.
టి ఆర్ ఎస్ పాలనా విధానాలను మనం తెలంగాణ ఉద్యమం ఏ ప్రధాన అంశాల చుట్టూ నిర్మితమైందో, వేటిని బలంగా ముందుకు తెచ్చిందో వాటి నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి, మూల్యాంకనం చేయాలి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి దానిని పాలించిన రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకత్వంలో ఆధిపత్యం వహించిన ఆంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రాంతంపై ఈ అంశాలలోనే వివక్ష చూపిందని కదా తెలంగాణ భావించింది. అందుకే వాటి ఆధారంగానే విశ్లేషించాలి. చారిత్రకంగా భిన్నప్రాంతాలు, అభివృద్ధిలో అసమానతలున్న రాయలసీమ, కోస్తాంధ్ర (అవి బ్రిటిష్ పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగాలు), హైదరాబాద్ సంస్థానంలో భాగమైన తెలంగాణాలను భాషా ప్రాతిపదికన కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేశారు.
నీళ్ళు, నిధులు, నియామకాల పంపకంలో జరిగిన వివక్షను వివరించడం ద్వారానే ప్రాంతీయ అసమానతల లక్షణాలను వ్యక్తీకరించారు. న్యాయబద్ధంగానూ, సమాన దృక్పథంతోనూ వ్యవహరిస్తామని విలీనం సమయంలో అన్ని ప్రాంతాల రాజకీయ ప్రముఖులు చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందంలో వాగ్డానం చేసినప్పటికీ సమైక్య రాష్రంలో పాలన అందుకు భిన్నంగా సాగింది. ఏ మాత్రం పట్టింపు లేకుండా ఆ హామీలన్నిటి ఉల్లంఘించారు. ఇది 1960ల చివరలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజాలు పడ్డాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచివేసింది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామని కొన్ని హామీలు కూడా ఇచ్చారనుకోండి. అందుకే 1990లలో ఉద్బవించి రెండు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమం గతంలో చేసిన వాగ్డానాలు, ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో విఫలమైన వైనాన్ని ఎత్తిచూపింది. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ విషయంలో రాజీపడబోమని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రకారమే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఈ అంశాలపై పనిచేస్తామని తాము చేసిన వాగ్దానాలను ఎత్తి చూపి, తద్వారా (ఉద్యమ సందర్భంగా ప్రస్తావించబడిన) ‘బంగారు తెలంగాణ’ సాకారానికి కృషి చేస్తామని చెప్పడానికి ప్రయత్నించింది.
నీటికి సంబంధించి, కాళేశ్వరం పేరుతో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంభించింది. గ్రామీణ చెరువుల వ్యవస్థను పునర్జీవింపజేయడమే లక్ష్యంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథను మొదలుపెట్టింది. తెలంగాణ ప్రాంతం విస్తృతమైన గ్రామీణ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు పేరొందింది. కాకతీయుల కాలంలో తవ్వించిన ఈ చెరువుల నిర్వహణ బాధ్యతను అత్యధికంగా స్థానిక యంత్రాంగం సహకారంతో గ్రామీణులే చూసుకునేవారు. క్రమంగా 1980ల నుంచి ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చి సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగి, మెట్టపంటల స్థానంలో నీరు ఎక్కువగా అవసరమయ్యే వాణిజ్యపంటలకు ప్రోత్సాహం పెరగడంతో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మిషన్ కాకతీయ ప్రాధాన్యాన్ని ఈ నేపథ్యం నుంచి చూడాలి.
టి ఆర్ ఎస్ ప్రభుత్వం చెరువుల వ్యవస్థకు విధానపరమైన ప్రాధాన్యం ఇచ్చింది. చెరువుల సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించడంతో వ్యవసాయ ఉత్నత్తిలో భారీ పెరుగుదల వచ్చింది. అది తెలంగాణాను వరిపంటలో మిగులు రాష్ట్రంగా చేసింది. రైతుబంధుపథకం ద్వారా వంతుల వారీగా సంవత్సరానికి రెండేసి సార్లు 5000రూపాయల చొప్పున రైతులకు వ్యవసాయ ఖర్చులకు ఆర్థిక సాయం అందించడంతో టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రైతు అనుకూలమైనదన్న ఇమేజ్ వచ్చింది.
టి ఆర్ ఎస్ తన పాలనలో సమాజంలో అణగారిన వర్గాలకు ఆదుకునే ఉద్దేశంతో వరుసగా ప్రజాకర్షక, సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అంటే రాజ్యం నయా ఉదారవాద మలుపు తీసుకున్నదశలో మనం రెండు విరుద్దమైన దిశలలో లాగుతున్న ఆర్థిక వైఖరుల మధ్య ఉన్నలంకెను గమనించాల్సిన అవసరం ఉంది. ‘అభివృద్ది’ వైపుకు దూసుకుపోయే దిశగా ఒకటి. సామాన్య ప్రజలకే కాకుండా కార్పొరేటేతర పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించేవారికి హానికరమైన దిశ ఇది. వీరందరి ప్రయోజనాలను కాలరాస్తూ కేవలం గ్లోబల్ పెట్టుబడి తో అనుసంధానించబడిన కార్పొరేట్ పెట్టుబడికి మాత్రమే అన్నీ అనుకూలంగా అమర్చే దిశ. మరొకటేమో ఎన్నికల ప్రజాస్వామ్యంలో అవసరమైన ప్రజల సమ్మతి, ఆమోదం, చట్టబద్ధత పొందడం కోసం అనివార్యమైంది(పథకాల ఏర్పాటు). ఒకపక్కన జరుగుతున్న తీవ్రమైన, విస్తారమైన ఆదిమ (పెట్టుబడి) సంచయం (ప్రిమిటివ్ ఎక్యుమిలేషన్ .. సహజవనరులను,బలవంతపు భూసేకరణ ద్వారా వందల ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెట్టడం లాంటి వాటి ద్వారా – అనువాదకురాలు ) జరుగుతోంది. దాని వల్ల పెద్ద సంఖ్యలో ప్రజానీకం రాజ్యాంగబద్దమైన తమ ఆర్థిక హక్కుల నిరాకరణకు గురై సంక్షోభంలోకి నెట్టబడడం కనిపిస్తుంది. భూమి, ఉమ్మడి ఆర్థిక వనరులు, జీవనోపాధి, నివాసాలు కోల్పోయి విస్థాపనకు గురికావడం కనిపిస్తుంది. కాబట్టి ఈ సంక్షోభపు తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కలిగించడం కోసం ప్రజాకర్షక పథకాలను అమలు చేయాల్సి వస్తుంది. బ్రెట్టన్ వుడ్ సంస్థల (వరల్డ్ బ్యాంక్, ఐ ఎమ్ ఎఫ్) పరోక్ష ఆమోదంతోనే ఇది జరుగుతుంది. ఈ చట్రం నుంచే మనం ప్రజాకర్షక పథకాలను విస్తృతంగా అమలు పరిచే తెలంగాణ, ఇతర రాష్ట్రాల పాలనలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
టి ఆర్ ఎస్ ప్రభుత్వం తన పాలనలో రకరకాల సంక్షేమ, ప్రజాకర్షక విధానాలు, పథకాలుండేలా చూసుకుంది. వాటిలో బాగా జనాదరణ పొందిన పథకం ఆసరా ఫించను పథకం. ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు వర్తించే పథకం ఇది. ఒకరూపాయికి కిలో బియ్యం పథకం, ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం కూడా విస్తృతంగా అమలులో ఉన్న పథకాలే. వివిధ వృత్తులు, చేతి వృత్తులలో ఉన్న సమూహాలకు అండగా ఉండేందుకు రకరకాల పథకాలు తీసుకొచ్చారు. ఉదాహరణకు సహకార సంఘాలుగా ఏర్పడిన సంప్రదాయక గొర్రెల పెంపకం దారులకు (కురుమ) గొర్రె పిల్లలను, మత్స్యకార సహకార సంఘాలలోని మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. బాగా పేరున్న మరో పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. పేద ముస్లిం, హిందూ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్ళి సందర్భంగా ఆర్ధిక సాయం అందించే పథకం ఇది.
అందుకుంటున్న వారి సంఖ్య రీత్యా చూసినా, అందించదలుచుకున్న వాటి రీత్యా చూసినా టి ఆర్ ఎస్ ప్రభుత్వపు సంక్షేమ, పజాకర్షక విధానాల పరిధి చాలా విస్తారమైనది. వాటి కొచ్చిన ప్రజాదరణ ఫలితమే 2018 అసెంబ్లీ ఎన్నికలలో టి ఆర్ ఎస్ ఘన విజయం. ఆ తర్వాత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలోనూ భారీ విజయాన్నే పొందింది. తెలంగాణలో రెండు పర్యాయాలు వరుసగా గెలుపొందడంతో ఉత్తేజితమైన టి ఆర్ ఎస్ తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. అందుకు తగ్గట్టు పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితి అయింది. వారికున్న జాతీయస్థాయి అధికార కాంక్షను ఇది తెలియపరుస్తుంది. ఇది బాగా ఆలోచించి వేసిన అడుగులానే ఉంది. ఇతర రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నిపుణులు,ఎన్నికలను అధ్యయనం చేసేవాళ్ళు (సెఫాలజిస్టులు), పాత్రికేయులు, రాజకీయనాయకులతో వరసగా సంభాషణలు జరిపారు. వారి అభిప్రాయాల్ని తెలుసుకున్న తర్వాతనే ఈ పని చేశారు. దానితో పాటు ఇతర రాష్ట్రాలలో విస్తృత పర్యటనలు కూడా చేశారు. కొన్ని ప్రాంతాలలో పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగమైన మరట్వాడా ప్రాంతంలో కార్యాలయాలు పెట్టుకున్నారు. ఈ ప్రయత్నం వెనక ఉన్న ఆలోచన ఏమిటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడుతోంది. బిజెపికి ఆయా ప్రాంతాల్లో సమీప భవిష్యత్ లో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఆ ఖాళీని బి ఆర్ ఎస్ పూరించగలదు అని భావించారు. దక్కనీ, ఇంగ్లీషులో చక్కగా ప్రసంగించే నేర్పుతో బయటి ప్రాంతాలలో శ్రోతలను ఆకట్టుకుని, వారి అభిమానాన్ని పొందగలడని అనుకున్నారు. కాని అనూహ్యంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పరాజయం పాలు కావడంతో అధినాయకుడు మౌనంలోకి జారుకున్నాడు. బయట కనిపించడం లేదు కూడా. కార్యకర్తలేమో పార్టీని పూర్వస్థితిలోనే ఉంచాలని కోరుతున్నారు. వాస్తవపరిస్థితలకు తగ్గ లక్ష్యాలను పెట్టుకోవాలని, తమ దృష్టిని వాటిపైనే పెట్టాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. బి ఆర్ ఎస్(జాతీయ స్థాయిలో) నమోదు చేసుకున్న పార్టీగా కొనసాగుతున్నప్పటికీ దాని కార్యకలాపాలు తెలంగాణ వరకే పరిమితమై ఉన్నాయి.
ఇంతటి ప్రజానుకూల విధానాలు, ప్రజాదరణ పొందిన పథకాలు అమలుచేసినప్పటికీ టి ఆర్ ఎస్ 2023 ఎన్నికలలో ఎందుకిలా పరాజయం పాలైంది అన్న ప్రశ్న తలెత్తక మానదు.
రాజకీయంగా చూసినా, సంస్థాగతంగా చూసినా, సంకీర్ణ రాజకీయాల్లో భాగస్వామిగా చూసినా కాంగ్రెస్ ఘోరమైన స్థితిలో ఉంది. అలాంటి పార్టీ పునరుద్దరణ కావడం చాలామంది రాజకీయ విశ్లేషకులకు ఒక అంతుబట్టని విషయంగా కనిపించింది. తరచి చూడాల్సిన విషయంగా కూడా కనిపించింది. చాలా మంది విమర్శకులు చెబుతున్నట్లు తెలంగాణ రాష్ట్రాన్ని (ఎన్నికల ఫలితాల రీత్యా) ముఖ్యమైనదిగా పరిగణించాలి. ఎందుకంటే ఈ సారి ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించగలమనుకున్న బిజెపిని ఇక్కడి ఓటర్లు ఎనిమిది సీట్లకు కుదించారు. నిజానికి బిజెపి అగ్రనాయకత్వం ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చింది. కర్ణాటక ఎన్నికలలో ఓడిపోవడంతో దక్షిణ భారత దేశంలో తమ ప్రాబల్యానికి ఈ ఎన్నికలలో తమ మెరుగైన ఫలితాలు సాధించడం చాలా ముఖ్యమని భావించింది. అయినప్పటికీ ఈ ఎన్నికలలో అది సాధించినది 2019 ఎన్నికలలో అది సాధించిన ఫలితాలతో పోలిస్తే చాలా పేలవమైనది.
2023 ఎన్నికల విశ్లేషణ
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చ అంతా పైన చెప్పిన విధానాలు, సమాజంలోని అనేక తరగతుల ప్రజలకు విస్తృతంగా ఎలాంటి ప్రయోజనాలను కలిగించాయన్న దాని చుట్టూనే తిరిగింది. తమ ప్రజానుకూల విధానాలను చూసి తమకు అనుకూలమైన తీర్పు ఇవ్వమని టి ఆర్ ఎస్ ఓటర్లను కోరింది. రెండు ప్రధాన ప్రతిపక్షాలైన బిజెపి, కాంగ్రెస్‌లు ఆ విధానాలలో ఉన్న లోటుపాట్లు, వాటి అమలులో ఉన్న లొసుగుల గురించి చర్చ పెట్టాయి. ఈ పార్టీలు, ముఖ్యంగా వాటి జాతీయ స్థాయి నాయకులు టి ఆర్ ఎస్ వారసత్వ రాజకీయాలు, పార్టీపై కుటుంబ పెత్తనాలను ఎత్తిచూపారు. దీనికి సంబంధించి లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించారు. టి ఆర్ ఎస్ పార్టీ, దాని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, ఆ అవినీతి ముఖ్యంగా అధినాయకుడు, అతని కుటుంబ కేంద్రకంగా సాగిందన్న భావన ప్రజాభిప్రాయంలోకి చొచ్చుకుపోయింది. ఇది మనకు సి ఎస్ డి ఎస్ చేసిన ఎన్నికల సర్వేలో స్పష్టమైంది. రెండు పడకగదుల ఇళ్ళు, భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి లాంటి భారీ వాగ్దానాలను నెరవేర్చడంలో టి ఆర్ ఎస్ వైఫల్యం చెందడంపై ప్రతిపక్షం తీవ్రంగా ప్రచారం చేసింది. ఇది టి ఆర్ ఎస్ ను ఇబ్బందికర పరిస్థితికి నెట్టింది.
పౌరసమాజం పాత్ర
ఈ ఎన్నికలలో పౌర సమాజపు సంఘాలు పునరుత్తేజితమై క్రియాశీలంగా వ్యవహరించడం కనిపించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో పౌరసంఘాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించాయి. ముఖ్యంగా ఉద్యమాన్ని నిలబెట్టి కొనసాగించడంలో ఇవి కీలకం అయ్యాయి. పౌరహక్కుల సంఘాలు, మహిళా, దళిత సంఘాలు, కులవృత్తికారుల సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఇంకా ఇతర వృత్తి సంఘాలు, సమాఖ్యలు … ఇలా తెలంగాణ ఉత్తేజపూరితమైన, సంక్లిష్టమైన చరిత్రకు ప్రాతినిధ్యం వహిస్తూ అనేకానేక పౌరసమాజపు సంఘాలు రాష్ట్ర సాధన డిమాండ్‌కు తమ సమ్మతిని, సహకారాన్ని అందించాయి. ఉద్యమ ఐక్యతను నిలబెట్టాయి. ఉద్యమంలో ఇంతటి అత్యంత ప్రధానమైన పాత్రను పోషించిన సంఘాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా మూగబోవడం గమనించగలం. దీనికి ప్రధాన కారణం అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ పార్టీ అనుసరించిన వ్యూహం.
పౌరసమాజపు సంఘాలలోని చురుకైన వారిని కో ఆప్ట్(పదవులో, ఉద్యోగాలో ఇచ్చి తమలో కలిపేసుకోవడం) చేసుకోవడం, కొంతమేరకు ఏ మాత్రం సంకోచించకుండా ప్రశ్నలు లేవనెత్తిన వారిపై బలప్రయోగం చేయడం ద్వారా ఇది సాధించారు. అందుకే రాష్ఠ్రావతరణ అనంతరం తెలంగాణ పౌరసమాజపు కార్యాచరణలో స్తబ్దత కనిపించింది. ఉద్యమకాలంలో దాని ప్రధానపాత్రతో పోల్చి చూసినప్పుడు ఇది మరింత స్పష్టంగా కనపడిరది. అయితే 2023 ఎన్నికల సందర్భంలో మళ్ళీ పౌరసమాజపు సంస్థలు చురుకైన కార్యాచరణలోకి దిగడం చూస్తాం. ఒద్దేలు కర్ణాటక ఉద్యమం అక్కడి బిజెపి ప్రభుత్వ దుశ్చర్యలు, దుష్ప్రవర్తనలను ఎండగట్టడంపై దృష్టి పెట్టింది. అదిచ్చిన తక్షణ స్ఫూర్తి ఇక్కడి పౌరసమాజపు సంఘాలు ఉత్తేజితం కావడానికి తోడ్పడిరది. టి ఆర్ ఎస్ పాలకులు కనబరిచిన అహంకారం, పట్టనితనం పట్ల పెరిగిన అసహనం, విద్యా, ఉద్యోగ రంగాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్న భావన – ఇవన్నీ కలిపి ప్రత్యామ్నాయ చర్చకు దారి పరిచాయి. దానిని సంఘటితపరిచాయి.
ప్రభుత్వవిద్యా, ఉపాధి రంగాలు నిర్లక్ష్యానికి గురికావడం, క్రమంగా క్షీణించిపోవడం … తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికగా ఉన్న కీలకమైన అంశాలలో ఈ రెండూ ఉన్నాయి. సంస్కరణల తర్వాతి కాలంలో ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చింది. అది పడిపోతూవుంటే, ప్రయివేటు విద్యారంగం విస్తరిస్తూ పోతోంది. అయితే ప్రయివేటు స్కూళ్ళలో రోజురోజుకీ పెరిగిపోయే ఫీజులు కలవరపెడుతున్నాయి. వాటితో పాటు మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో బోధనా ప్రమాణాలు నానాటికి పడిపోవడం కూడా సామాన్య ప్రజానీకానికి ఆందోళన కలిగిస్తోంది. తమ తర్వాతి తరాలకు సామాజికంగా పై మెట్టుకు చేరడానికి నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమన్న ఎరుక అణగారిన శ్రేణులలో(సబాల్టర్న్) పెరుగుతుండడంతో విద్య ప్రజాప్రయోజనం గల అంశంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యలో వెనకబడి ఉండడం తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనానికి ఒక ప్రధానకారణమన్న కథనం ప్రబలంగా వ్యాపించి ఉంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అత్యంత ప్రధానమైనది. ఇంకా అణగారిన శ్రేణులలో తమ సంతతి సామాజికంగా పైకెదగడానికి (లేదా సామాజిక ఊర్ద్వ చలనానికి) విద్య ప్రధానమైనదన్న స్పృహ పెరిగింది. దీనితో విద్య భౌతికంగానే కాక సంకేతాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ విద్యారంగానికి అవసరమైన వనరులు సమకూర్చకుండానూ, ఆ వ్యవస్థను సమర్థంగా నడిపించే ఏర్పాటు చేయకుండానూ దానిని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. విశ్వవిద్యాలయ విద్య విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు వందేళ్ళ చరిత్ర ఉన్న, రాష్ట్రంలోకెల్లా అతి పెద్దదైన ఉస్మానియా యూనివర్శిటీలో అధ్యాపకుల సంఖ్యను 1267 (దానికి కేటాయించిన సంఖ్య) నుంచి మూడవ వంతుకు కుదించేశారు. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్ర రాజధానిలో ఉన్నందున, దీనిలో జరిగే పరిణామాలు విద్యకు సంబంధించి పాలకుల వైఖరి పట్ల ప్రజల దృక్పథం రూపుదిద్దుకోవడంపై గట్టి ప్రభావం చూపుతాయి. నిజానికి పట్టణ ప్రాంతాలలోని యూనివర్శిటీల పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. యూనివర్శిటీలు అన్నీ వైస్ చాన్సలర్ల నియామకాలలో జరిగిన జాప్యాల వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యాయి. ఈ నిర్లక్ష్యధోరణి ఉద్దేశపూర్వకమైనదేనన్న భావన కలుగుతుంది. ప్రయివేటీకరణ అనుకూల విధానంలో భాగంగానే విద్యారంగంలో ఇది జరిగిందనిపించింది. కొత్త రాష్ట్రంలో పాలకుల ప్రోత్సాహంతో ప్రయివేటు యూనివర్శిటీల సంఖ్య పెరగడాన్ని మనం గమనించవచ్చు
గ్రామీణ యూనివర్శిటీ విద్యార్థుల, టీచర్ల ఆందోళనలను ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోలేదు. దీనితో విధానపరంగానూ, ఆచరణలోనూ బి ఆర్ ఎస్ పాలన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా పక్కదారి పట్టిందన్న భావన కలిగింది. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ ఏమాత్రం ఖాతరు చేయలేదనిపించింది. ఇవన్నీ కలిసి అణగారిన శ్రేణుల సామూహిక ఆందోళనగా రూపుదిద్దుకుని అది 2023 ఎన్నికలలో వ్యక్తమయింది. ఈ ఆందోళనలను ఎన్నికలకలో ఒక సామూహిక వ్యక్తీకరణ దిశగా నడిపించడంలోనూ, వాటికి ఒక విధాన దృక్పథం ఏర్పరచడంలోనూ విద్యాపరిరక్షణ వేదిక, తెలంగాణ సోషల్ ఫోరమ్‌లు సాధనాలుగా ఉపయోగపడ్డాయి.
నిరుద్యోగసమస్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ఉద్యమకాలంలో వాగ్దానం చేసిన బి ఆర్ ఎస్ ఉద్యోగావకాశాలను కల్పించడంలో విఫలమైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తను ప్రకటించిన ఉద్యోగాల నియామక ప్రక్రియలో విఫలమయింది. ఇది నిరుద్యోగ యువతలో, విద్యార్థులలో ఆగ్రహాన్ని రగిలించింది. ఇక ప్రశ్నపత్రాల లీకేజి కుంభకోణం ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. దాని పట్ల ప్రజలలో విశ్వాసం పోయేలా చేసింది. పర్యవసానంగా రగిలిన అశాంతిని, ఆ క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరించింది. ఇది కేవలం అసమర్థతకు సంకేతం మాత్రమే కాదు, పాలకుల బాధ్యతారాహిత్యాన్ని, జవాబుదారీతనం లేకపోవడంలో దాని వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపిస్తోందని ప్రజలు భావించారు. అందుకే కోపోద్రిక్తులైన యువత బి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా సాగిన ఎన్నికల ప్రచారంలో కీలకపాత్రను పోషించారు. దాని ఎన్నికల పరాజయానికి వారు గణనీయమైన కృషి చేశారు. ఈ ఎన్నికలలో యువత భాగస్వామ్యం మనకు దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను గుర్తుకుతెస్తుంది.
ఎన్నికల ఫలితాలు
నిద్రావస్థ స్థితిలోవున్న కాంగ్రెస్ ఒక్కసారిగా తెలంగాణ ఎన్నికలలో ఒక ప్రధానశక్తిగా ఎదగడం అసాధారణ పరిణామం. తెలంగాణ ఎన్నికలకు కొన్ని నెలల ముందే కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ పట్ల ప్రజాభిప్రాయంలో మార్పు రావడం పై ఈ విజయపు ప్రభావం ఉంది. అంతేకాదు ఇది కాంగ్రెస్ నాయకత్వాన్ని, కార్యకర్తలను ఉత్తేజపరిచింది.
తమను గెలిపించకపోతే అప్పటివరకు అమలవుతున్న పథకాలన్నిటిని తర్వాత వచ్చే ప్రభుత్వం ఆపివేస్తుందని ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ ఓటర్లను నిలువరించే ప్రయత్నం చేయడాన్ని ప్రజలకు రుచించలేదు. నిజానికి అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమూ వాటిని ఆపే సాహసం చేయలేదని ప్రజలకు తెలుసు. అది క్రమంగా ప్రజానీకంలో దృఢ విశ్వాసంగా కూడా మారింది. ఈ నేపథ్యం నుంచే బి ఆర్ ఎస్ అప్పటికి అమలు చేస్తున్న పథకాలతో పాటు అదనంగా ‘‘ఆరు గ్యారంటీల’’ ను కాంగ్రెస్ వాగ్దానం చేయడం, ఉన్న పథకాలను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడాన్ని మనం గమనించాలి. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నెలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటిస్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, యువ వికాసం పథకం కింద కాలేజి విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్ళను ఏర్పాటుచేయడం, చేయూత పథకం కింద వృద్ధులకు ఇస్తున్న ఫించనును 4000 రూపాయలు చేయడం(అంతకు ముందు ప్రభుత్వం నెలకు 2016 రూపాయలు ఇచ్చేది), రాజీవ్ ఆరోగ్య పథకం కింద పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించడం.
మనం ప్రత్యేకించి రైతు భరోసా పథకం గురించి ప్రస్తావించాలి. ఎందుకంటే అంతకు ముందు బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం భూమి యాజమాన్యాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. కాని కాంగ్రెస్ ప్రతిపాదించిన రైతు భరోసా పథకం కింద రైతులకు పదిహేనువేల రూపాయలు, వ్యవసాయకూలీలకు పన్నెండువేల రూపాయలు వస్తాయి. అంటే నిజంగా సేద్యం చేస్తున్నవాళ్ళను, వ్యవసాయ కూలీలను లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఇది. గ్రామీణ ప్రాంతంలో భూములుండి వాటిని స్వయంగా సేద్యం చేయని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రైతు బంధు పథకం వల్ల వారికి లబ్ది కలిగేది. గత ప్రభుత్వం కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను పట్టించుకోలేదు. దీనికి భిన్నంగా రైతు భరోసా పథకం ఉండడమనేది తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రైతులను తమవైపుకు తిప్పుకోవడానికి, వారి విశ్వాసాన్ని పొందడానికి కాంగ్రెస్‌కు దోహదపడిరది. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న గ్రామీణ నిరుద్యోగ యువత, రైతుల సామూహిక ఆగ్రహం మనకు ఎన్నికలలో బి ఆర్ ఎస్ వ్యతిరేకంగా ఓట్లు వేసిన తీరులో కనబడిరది. లోక్ నీతి సి ఎస్ డి ఎస్ ఎన్నికల సర్వే ముందుగానే ఈ ధోరణిని పట్టి చూపింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి కేవలం ప్రజాకర్షక పథకాలతో ఓటర్లను శాశ్వతంగా ప్రభావితం చేసేయగలమన్న రాజకీయ పార్టీల నమ్మకం తప్పని రుజువైంది. పాలనా శైలిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారని, తమ జీవితాల మెరుగుదలపై , విద్యా, ఉద్యోగం వంటి రంగాలలో భవిష్యత్ అవకాశాలను కల్పించడంపై అది చూపించే ప్రభావం పట్ల ఎరుకతో ఉంటారని మనకు స్పష్టమైంది. అధికారంలో ఉన్న పార్టీని ఓడిస్తే అది ఇస్తున్న ప్రయోజనాలు అందకుండా పోతాయేమోనన్న ఆందోళనకు ప్రజలు గురికారని తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తమకు ప్రజల మద్దతు ఏ మాత్రం అక్కర్లదనేంతటి నిర్లక్ష్యధోరణితో వ్యవహరించగలిగే దుస్సాహసానికి దిగితే తప్ప, కొత్తగా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమూ గత ప్రభుత్వపు పథకాలను పక్కనపెట్టలేదు. అలానే అధికారాలన్నీ అధినాయకుడి చేతిలో కేంద్రీకృతమై ఉండడం, అందుకు అనుగుణంగా అవినీతి పెచ్చరిల్లి పోవడంపట్ల పౌరసమాజంలో, సామాన్య ప్రజానీకంలో ఉన్న ఆందోళన వెళ్ళడయ్యేలా చేశాయి కూడా. వ్యక్తి కేంద్రకంగా పరిపాలన సాగడం, ప్రజాస్వామికంగా వ్యవహరించలేకపోవడం, పాలనలో ప్రజలకు లేదా ప్రజాభిప్రాయానికి ఎలాంటి చోటు లేకపోవడం – ఈ మూడిరటి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజలలో ఉందనడానికి తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సంకేతమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని నుంచి ఎవరైనా గుణఫాఠం నేర్చుకోకపోతే అది వాళ్ళ గోతిని వాళ్ళు తవ్వుకోవడమే.
కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోవచ్చు
కాంగ్రెస్ పాలనపై ఇప్పుడే తీర్పులిచ్చేయడం తొందరపాటే అవుతుంది. కానీ లక్షణాలను బట్టి అంచనా వేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండనక్కర్లేదు. టి ఆర్ ఎస్ పాలనలో వారి ప్రాధాన్యాలను, అభివృద్ధి పేరుతో పాల్పడిన విధ్వంసాన్ని, వారి తప్పుడు లక్ష్యాలను, నిధుల దుర్వినియోగాన్ని విమర్శించడం మీద, వాటిని శోధించడం మీదనే దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు చాలా సమయాన్ని వెచ్చించింది. గత పాలన తాలూకు ఆ ధోరణులు రాష్ట్రంలో రుణాలు పేరుకుపోయేట్టు చేయడమే కాకుండా తీవ్రమైన ఆర్థిక కొరత దిశగా నెట్టాయి. ఒక పక్క విమర్శిస్తూనే అదే అభివృద్ధి పరిభాషను వల్లె వేయడం కొనసాగించింది, రుణాల ఆధారంగా భారీ పెట్టుబడులను పెట్టడమూ చేస్తోంది. అయితే ప్రాధాన్యాలు, దృష్టి కేంద్రీకరించిన అంశాలు, స్థానాలలో తేడా ఉంది అంతే.
ఈ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అనివార్యంగా భూసేకరణపైనే దృష్టి పెడుతున్నప్పుడు అది అనేకుమంది జీవితాలను, ఉపాధులను, సామాజిక జీవన సంబంధాలను ప్రభావితం చేస్తోంది. అలా తక్షణం ప్రభావితమైన , భవిష్యత్ లోనూ ప్రభావితం కాబోతున్నవారికి కనీసం జరుగుతున్నదానిని వివరించే, వారిని ఆ చర్చలలోనో, నిర్ణయాలలోనో భాగస్వాములను చేసే ప్రయత్నాలేమీ చేయలేదు. అందుకే ఆయాప్రాంతాలలో ప్రజలు ఈ ప్రాజెక్టుల పట్ల నానాటికీ వ్యకతిరేకత తీవ్రంగా వ్యక్తంచేస్తూ రావడం మనం గమనించవచ్చు.
లక్షన్నర కోట్ల భారీ వ్యయంతో ప్రతిపాదించిన మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు, దాని పర్యవసానంగా హైడ్రా కింద నివాసప్రాంతాలలోని కట్టడాలను కూల్చడం మీద జనంలో వ్యతిరేకత వచ్చింది. అలాగే ‘న్యూ సిటీ’ ప్రతిపాదన మీద కూడా. వీటితో పాటు అనేక చోట్ల ఇథనాల్ ప్రాజెక్టుల కోసం, ఫార్మా పరిశ్రమల కోసం భూసేకరణ చేయడం, వాటి వల్ల వస్తున్న, వచ్చే కాలుష్యం కారణంగా వాటి మీద తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. పరిస్థితులను అంచనా వేసుకుని దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా ఇలా క్రమంగా ఒక్కొక్కొ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చే విధానం రాష్ట్రాన్ని మరింతగా సంక్షోభంలోకి నెడుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కుంటున్న (అన్ని ప్రజాదరణ పొందాలనుకుంటున్న ప్రభుత్వాలలానే) సమస్య ఆర్థిక సంక్షోభం. అలా అని ప్రజాకర్షక ధోరణిని కట్టడి చేసుకోగలిగే అవకాశాలు, పరిస్థితులు ఇప్పుడు కొత్తగా పాలనలోకొచ్చిన వారికి అతితక్కువగా ఉన్నాయి. నిజానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి కొత్త పథకాలను అదనపు భారంగానే చూస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ఎగతాళికి గురైన పథకం కూడా ఇది. కాని ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే అంతకు ముందు రైతు బంధు పథకంలోలా పొలం ఉన్న అందరికీ డబ్బులిచ్చేయకుండా రైతు భరోసా పథకం కింద నిజంగా సేద్యం చేస్తున్న వాళ్ళకి మాత్రమే సహాయం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం. అయితే ఈ ప్రభుత్వం గత పాలనలోలా కాకుండా అభివృద్ధి ప్రాజెక్టుల దూకుడు పై పునరాలోచించుకుని దానిని నుంచి తప్పుకోకుండా అదే కొనసాగిస్తోంది. పాలనా శైలిలో కూడా అదే ధోరణి కనబరిచేలా ఉంది. అన్నినయా ఉదారవాద పాలనలలోనూ వారి వైఫల్యాలకు దారితీసే ప్రత్యామ్నాయాల వైపు చూడలేని బలహీనత ఉంటుంది.
రచయిత: ప్రొఫెసర్ కర్లి శ్రీనివాస్, Senior Fellow, ICSSR, New Delhi, Professor (Retd), Osmania University, Hyderabad
(అనువాదం: విప్లవ జ్యోతి వడ్లముడి)