
అమెరికా ఎన్నికల ఫలితాలకు ముందు, రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ ట్రంప్ అనుకూల లేదా కమలా హారిస్ అనుకూలత వంటి పక్షపాత ధోరణి హుందాతనం తో కూడిన వ్యవహారం కాదని, అవమానకరమని బోధించారు. కానీ ప్రపంచంలోని ఒక సాధారణ, రాజకీయ చింతన కలిగిన పౌరుడిగా, నేను, పెద్దగా హుందాతనం లేని అనేక మంది ఇతరుల్లాగానే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంలో ఏమి జరుగుతుందో ఉద్వేగంతో గమనించాను. పాలస్తీనాలో బాధితుల పక్షాన నా హృదయం బాధపడుతోంది. అక్కడ జరుగుతున్న మారణహోమంలో అమెరికా ప్రమేయంపై ఆగ్రహంగా ఉంది.
34 కేసుల్లో దోషిగా తేలిన నేరస్థుడు, 2020 ఎన్నికల ఓటమి తర్వాత తనను పదవి నుంచి తొలగించకుండా అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్ష భవనంపై హింసాత్మక తిరుగుబాటును ప్రేరేపించిన ఈ లైంగిక నేరస్థుడి విజయం నన్ను కలచివేసింది. ఈ వ్యక్తి ఇప్పుడు తన విషపూరితమైన, వికృతమైన ఆటలకు, తన మనుగడకు, చెలగాటానికి ప్రపంచాన్ని ఆట స్థలం గా మార్చుకుంటున్నాడు.
నాలాంటి ఉదారవాదులకు, భౌగోళిక రాజకీయ పర్యవసానాలతో పాటు, అమెరికా ఎన్నికలు కేవలం మితవాద ప్రజాస్వామ్యం లేక ఉదారవాద ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యో లేదా ఫాసిజం గురించిన సమస్య మాత్రమే కాదు. కనీస మానవత్వం, దానికి భిన్నమైన అమానవీయ నేరపూరిత తత్వం గురించిన సమస్య గా కూడా ఉంటుంది. ట్రంప్ రెండు దశాబ్దాల క్రితం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నాగరికత, హుందాతనానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఉల్లంఘించారు.
ఫలితాలు వెలువడడానికి ముందు రోజు రాత్రి, ట్రంప్ విజయం గురించి ఆందోళన చెందుతున్న నా స్నేహితులకు నేను భరోసా చ్చాను. కానీ నేను ప్రమాదకరమైన పరిస్థితుల నడుమ ఉన్నానని నాకు తెలుసు. ఫలితాలు ప్రకటించినప్పుడు, హారిస్ దాదాపు ఆరు మిలియన్ల ఓట్ల తేడాతో పాపులర్ ఓటును కూడా కోల్పోవడంతో నేను షాక్ అయ్యాను కాని ఆశ్చర్యపోలేదు.
అధిక ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాలు హారిస్ ఓటమికి ప్రధాన కారణాలన్న నిపుణుల అభిప్రాయాన్ని నేను అంగీకరించను. ఎన్నికల సమయానికి కొవిడ్ తర్వాత తలెత్తిన అధిక ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని, వేతనాలు పెరిగాయని, స్టాక్ మార్కెట్ పుంజుకుందని, నిరుద్యోగం చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరుకుందన్నది వాస్తవం. ఈ ఎన్నికలు పూర్తిగా విరుద్ధమైన రెండు అభిప్రాయాల మధ్య పోటీ మాత్రమే.
జాతి వివక్ష, లింగవివక్ష, ఎల్జీబీటీక్యూ ప్రజల హక్కుల నిరాకరణ, పర్యావరణ విధ్వంసం, శ్వేతజాతి హక్కులకు సంబంధించిన అంశాలపై ఆధారపడిన డెమొక్రటిక్ పార్టీ ‘వోకిజం’ ఒక వైపూ, ట్రంప్ యొక్క మసకబారిన జాతీయోన్మాద, వలస వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక, స్వేచ్ఛా వాణిజ్య వ్యతిరేక, పర్యావరణ వ్యతిరేక తత్వంతో కూడిన ట్రంప్ ప్రచార సరళి మరో వైపు మొహరించాయి. ఈ అంశాల ప్రాతిపదికన సాగిన హోరాహోరీ పోరులో ట్రంప్ సునాయాసంగా గెలిచాడు.
ఇటీవలి సంవత్సరాలలో, రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన సాధనం గుర్తింపు, ఇది జాతి, మతంతో ముడిపడి ఉన్న గుర్తింపు ఓట్ల సంపాదనకు శక్తివంతమైన సాధనం అయ్యింది. శ్వేతజాతి ఆధిపత్యం, జాత్యహంకారం, దానిలో నిక్షిప్తమైన ద్వేషాలు అమెరికా మనస్తత్వాన్ని ఆవరించి ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు తరచుగా జాత్యహంకారం, బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారి పట్ల వ్యతిరేకతకూ మధ్య ఉన్న సున్నితమైన గీత ను చెరిపేసి మాట్లాడుతున్నారు. వలసదారుల పట్ల శత్రుత్వం జాత్యహంకార ప్రవృత్తుల యొక్క స్పష్టమైన కొనసాగింపు మాత్రమే. వారి శ్వేతజాతి ఆధిపత్యం పునాదిగా ఈ దూషణ భూషణలకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. వలసలు, జనాభా పెరుగుదల, శ్వేతజాతీయుల జనన రేటు తగ్గుదల వంటి కారణాలతో అమెరికాలో తెల్లజాతి వారి సంఖ్య తగ్గిపోతోందని, అమెరికా అన్య జాతుల పరం అవుతోందన్న వాదనను అమెరికా పౌరులు నమ్ముతున్నారు. దీనిని ఒక వ్యాఖ్యాత “ప్రత్యామ్నాయ భర్తీ ద్వారా మారణహోమం” గా అభివర్ణించారు.
ఈ భయాందోళనలను ట్రంప్ చాకచక్యంగా ఉపయోగించుకుని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను ‘బహిష్కరించడం ద్వారా’ ఈ మారణహోమాన్ని అడ్డుకుంటామని అమెరికన్ల కు భరోసా ఇస్తున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎలాన్ మస్క్, ఆయన అనుచరులు తమ చేతుల్లో ఉన్న బలమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)ను జాతిపరమైన మైనారిటీల ఆత్మ న్యూనత, తెలివితేటల్లో అధమతం, శరీర నిర్మాణ శాస్త్రం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించడం ద్వారా జాత్యహంకారంతో కూడిన కుహనా విజ్ఞాన శాస్త్రాన్ని బలోపేతం చేశారు. ఇప్పుడు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు అయిన దక్షిణాఫ్రికా వాసి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్కీతో ట్రంప్ సాగించిన సంభాషణల్లో భాగస్వామిగా ఉండడం రానున్న కాలంలో వర్ణవివక్షపై ట్రంప్ మైండ్ గేం ఎలా ఉండబోతుందో స్పష్టంగా వెళ్లడిస్తుంది. వీటన్నిటికీ తోడు బరితెగించిన జాత్యహంకార భావాలని ప్రచారం చేసే వెబ్సైట్లు, అల్లరిమూకల దాడులు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
సాధారణ ప్రజలకు దేవుడి పై ఉన్న భక్తి విశ్వాసాలే ఫాసిస్టులు, జాత్యహంకారులకు అసలైన పెట్టుబడి అని భారత దేశ పరిణామాలు గమనిస్తున్న మనకు స్పష్టంగా అర్ధం అవుతున్న సంగతే కదా. అలానే సుప్రీం కోర్టును తన వంది మాగధులతో కట్టడి చేయడం 1973 లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం స్త్రీల హక్కు అన్న 1973 నాటి అమెరికా సుప్రీం కోర్టు తీర్పును తిరగరాయటంలో ట్రంప్ విజయం సాధించారు. 2022 లో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకునే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు గా ఉండబోదు. కేథలిక్ లు మత తత్వ వాదులు ఇటువంటి తీర్పు కోసం ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నారు.
‘మీరు మతోన్మాదిగా నటిస్తే మీరు ఎకాఎకిన పెద్ద కష్టపడకుండానే మూడింట ఒక వంతు ఓట్లను పొందవచ్చు’ అనే రాజకీయ సిద్ధాంతకర్త నోమ్ చోమ్స్కీ వ్యాఖ్యలను ట్రంప్ తన ఎన్నికల ఎత్తుగడగా మాచుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ “నా అందమైన క్రైస్తవులకు” అంటూ విజ్ఞప్తి చేశారు. లౌకిక, బహుళత్వ దేశంలో అధికారం కోల్పోతామనే వారి భయాలను పెంచారు. వారికి బైబిళ్లను విక్రయించారు. క్రైస్తవ వ్యతిరేక శక్తుల నుండి మతాన్ని రక్షిస్తానని వారికి హామీ ఇచ్చారు. అతను సాంప్రదాయ క్రైస్తవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు రెండు లింగాలను మాత్రమే సృష్టించాడని ధృవీకరించడం ద్వారా ఎల్జిటిబిక్యూ లపై పరోక్షంగా దాడి చేశారు. క్రైస్తవ వ్యతిరేక పక్షపాతంతో పోరాడటానికి ఫెడరల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ట్రంప్ కు ఓటేసిన వారిలో 84 శాతం మంది శ్వేతజాతీయులే కావడం గమనార్హం. 2020లో జో బ్రెడెన్ సాధించిన 81 మిలియన్ల ఓట్లు కాగా ట్రంప్74 మిలియన్ల ఓట్లు సాధించారు. కమలా హారిస్ 68 మిలియన్ల ఓట్లు మాత్రమే పొందారు.
నా అభిప్రాయంలో 2020 లో బైడెన్ కు ప్రజలు విస్తృతంగా మద్దతు పలకడానికి కారణం ఏమిటంటే, అతను శ్వేతజాతీయుడు, దైవభక్తిగల కాథలిక్, కోవిడ్ గాయం నుండి ప్రజలకు కొంత అండగా నిలిచాడ్రు. ఇది ప్రజలను వారి గుర్తింపుకు అవల ఉన్న సమస్యల గురించి ఆలోచింప చేయటానికి అవకాశం కలిగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కమలా హారిస్ శ్వేతజాతీయురాలు కాదు, నల్లజాతీయురాలు కాదు, క్యాథలిక్ కూడా కాదు. అంతేకాకుండా ఆమె స్త్రీ వ్యతిరేకత ఉన్న దేశంలో ఒక మహిళ. ఆమె పూర్వీకులు భారతీయ మూలాలున్న వాళ్ళు. ఆ వారసత్వాన్ని ఇప్పటి వరకు కమల హారిస్ సొంతం చేసుకోక పోవడాన్ని కూడా ఆమెపై దుష్ప్రచారానికి సాధనంగా వాడుకుని ఏరుదాటక తెప్పను తగిలేసేవారనీ, అవసరం తీరాక నిచ్చనని తన్నేసేవారనీ ప్రచారం చేసారు. సొంత గుర్తింపు కోరుకునే భారతీయ ప్రవాసులు ట్రంప్ వెంట బలంగా ఉన్నారు. ఇలా నిస్సయురాలైన ఆమెకు ఎలా అవకాశం వస్తుంది?
సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చేతిలో ఉండటం, తన ఇష్టానుసారం నడుచుకోవాలనే నిస్సహాయ న్యాయవ్యవస్థతో ట్రంప్ నాలుగేళ్లుగా అపరిమితమైన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన ఎజెండాకు సంబంధించిన బ్లూప్రింట్ ను రిపబ్లికన్ థింక్ ట్యాంక్ హెరిటేజ్ ఫౌండేషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. “ప్రాజెక్ట్ 2025” అనే శీర్షికతో రూపొందించిన ఈ డాక్యుమెంట్ తన రెండవ పదవీకాలంలో పరిపాలన కోసం ట్రంప్ యొక్క వ్యూహాన్ని వివరిస్తుంది. తన ఎన్నికల ప్రచారంలో అతను వాగ్దానం చేసిన ప్రతి దుర్మార్గమైన పనిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ భయంకరమైన చాకిరేవు పెట్టాల్సిన జాబితాను ప్రకటించారు.
అక్రమ వలసదారులపై సంపూర్ణ యుద్ధం. తన మొదటి పదవీకాలంలో వలస పిల్లల అపహరణ, వారి తల్లిదండ్రుల నుండి వేరు చేయడాన్ని సమర్ధించిన ట్రంప్, ఇప్పుడు “అమెరికా చరిత్రలో అతి పెద్ద బహిష్కరణ చర్యను చేపడతాను” అనే తన బెదిరింపును అమలు చేయాల్సి ఉంటుంది. లోపల ఉన్న శత్రువును ఎదుర్కోవడానికి సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతానని సంకేతాలిచ్చారు. ముస్లింలపై నిషేధంగా పిలిచే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను మరిన్ని దేశాలకు విస్తరిస్తామని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేస్తామని, భారత్ సహా తృతీయ ప్రపంచ దేశ పౌరులకు వీసాల జారీని మరింత కఠినతరం చేస్తామని చెప్పారు.
ట్రంప్ గూండాలు దూకుడుతో కాఫ్కా ఊహాత్మక ప్రపంచంలో ఎంతో గందరగోళం చెలరేగే పరిస్థితి తలెత్తుతుందని ఆశించవచ్చు.
జాతీయ స్థాయిలో అబార్షన్ నిషేధాన్ని విధించవచ్చు. నెతన్యాహు, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి వారికి తన వంతు హామీ ఇచ్చిన ట్రంప్ తీరుపై పై ఎలా స్పందించాలో అమెరికా మిత్రదేశాలు ఆలోచిస్తున్నాయి.
పర్యావరణానికి హాని ఉంది. భూగోళాన్ని వేడెక్కించే శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, ట్రంప్ “స్కామ్ వ్యాపారం” అని పిలిచే పునరుత్పాదక ఇంధన విధానాన్ని వెనక్కి తీసుకోవడం, 2032 నాటికి 67% కొత్త తేలికపాటి వాహనాలు, 46% మీడియం తరహా వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలనే బైడెన్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేశారు ట్రంప్..ఇవన్నీ రానున్న కాలంలో అమలులోకి రానున్నాయి.
వేలాది మంది ప్రభుత్వోద్యోగులను తొలగించి, వారి పదవులను ట్రంప్ తన విధేయులకు కట్టబెట్టనున్నారు.
విద్య, ఆరోగ్యం కూడా ట్రంప్ దారిలోనే నడవనున్నాయి. ఫెడరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను రద్దు చేయనున్నారు. ‘క్రిటికల్ రేస్ థియరీ’ ముసుగులో అమెరికాలోని అత్యంత క్లిష్టమైన జాతి, లింగ, వ్యవస్థాగత అణచివేతపై అకడమిక్ చర్చలు ఇక నిషేధమవుతాయి. తన మితవాద జాత్యహంకార ప్రయోజనాలను పెంపొందించడానికి చరిత్రను తిరగరాయాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తానని” ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
అమెరికాలో ప్రజాస్వామ్య స్థితిగతులపై గొప్ప చరిత్రకారుడు, మానవతావాది, నాటక రచయిత హెూవార్డ్ జిన్ ను ఇక్కడ ఉదహరిస్తాను: “అమెరికాలో జాత్యహంకారం ఇంత దీర్ఘకాలం సజీవంగా ఉండటమే కాక మరింతగా పెట్రేగుతున్న దేశం మరోటి లేదని చెప్పవచ్చు.”
– మాథ్యూ జాన్
మాజీ ప్రభుత్వోద్యోగి.
( అభిప్రాయాలు వ్యక్తిగతం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.