
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవం వేళ స్వామివారి సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాల పాలయ్యారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందినవారు అందరూ స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చినవారు. వీరంతా స్వామి వారి నిజరూపదర్శనం కోసం రూ 300 దర్శనం టికెట్ లైన్లో ఉండగా రాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలి మృతిచెందారు.
అసలు ఏం జరిగింది..
ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా సింహాచలం శ్రీరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం ఆలయం ముస్తాబైయింది. వేడుకలను సంబంధించిన అన్నీ ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పూర్తి చేయించారు. అయితే, చందనోత్సవం రోజున స్వామివారు నిజరూపంలో తమకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు. దీంతో చందనోత్సవం రోజున స్వామి దర్శనం కోసం భారీగా ఆలయానికి భక్తులు వస్తారు. ఈ క్రమంలో సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కోసం మంగళవారం(ఏప్రిల్ 29) మధ్యాహ్నం నుంచి భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది.
ఈ నేపథ్యంలో సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడే పక్కకు రూ 300 టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షానికి కొత్తగా కట్టిన గోడ భక్తులపై కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటన తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో జరగటంతో భక్తులు నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారని అధికారులు చెపుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పిల్లా మహేశ్(30) ఆయన భార్య శైలజ(29), శైలజ తల్లి పైలా వెంకటరత్నం(45), శైలజ మేనత్త జి మహాలక్ష్మి(65) ఉన్నారు. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా శైలజ పనిచేస్తున్నారు. హెచ్‌సిఎల్‌లో పిల్లా మహేశ్ విధులు నిర్వహిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితమే వీరికి వివాహం జరిగింది. మృతి చెందినవారిలో పత్తి దుర్గాస్వామి నాయుడు ఎడ్ల వెంకటరావు కుమ్మపట్ల మణికంఠగా అధికారులు గుర్తించారు.
సీఎం చంద్రబాబు నాయుడు సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే, గాయపడిన వారికి రూ 3 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
జగన్ ఓదార్పు
సింహాచలం దుర్ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటనకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. బాధితుడి ఇంటిని సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే భక్తుల ప్రాణాలను బలిగొన్నారని, ప్రభుత్వం 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించటం మీద జగన్ స్పందిస్తూ రేపు తమ ప్రభుత్వమే వస్తుందని వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలకు మిగతా 75 లక్షలు అందజేస్తానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు
ఏ ఏం ఆర్ వరప్రసాద్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.