కనీవిని యెరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఎల్అండ్టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం తమ ఉద్యోగులతో జరిపిన చర్చాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను మూటకట్టుకోవడమే కాక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ తాలుకు లాభాపేక్షను మరీ ముఖ్యంగా భారతదేశ కార్పోరేట్ ప్రపంచపు మరో కోణాన్ని మన ముందు నిలిపాయి. వీటన్నటితో పాటుగా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులు లేదా ఆధునిక కార్మికుల తాలుకు దీనావస్థకు సంబంధించిన చర్చను కూడా మన ముందుకు తెచ్చాయి.
ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం తమ ఉద్యోగులతో మాట్లాడుతు ‘‘మీరు తమ భార్యలను ఎంతసేపని చూడగలరు, వాళ్లైన మమ్మల్ని ఎంతసేపని అదే పనిగా చూడగలరు? మీరు ఆదివారాలు పని చేయనందుకు చాలా చింతిస్తున్నాను. మీరు ఆదివారాలు కూడా తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించినట్టైతే నేను చాలా ఆనందిస్తాను. నేను ఆదివారాలు కూడా పని చేస్తాను కాబట్టి మీరు తమ కార్యాలయాలకు రావాల్సిందిగా కోరుతున్నాను. వారంలో తొంభై గంటలు పనిచేయాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.
వ్యక్తిగత అభిప్రాయం కాదు..
ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే భావిస్తే భారత కార్పోరేట్ వ్యవస్థ తీరు తెన్నులను, కార్పోరేట్ – ఉద్యోగుల బంధాలను అంతర్లీనంగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. గతంలో ఇన్ఫోసెస్ వ్యవస్థాపకులలో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి కూడ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారంలో డైబ్భై గంటల వరకు పని చేయాలని హితబోధ చేశారు. కాబట్టి వీటిని వ్యక్తిగత అభిప్రాయాలుగా కొట్టిపారెయ్యడం దుస్సాహసమే అవుతుంది. అట్టి చర్య నయ ఉదారవాద ప్రపంచంలోని వంచన, దోపిడి ఫలితంగా పతనమవుతున్న మానవ సంబంధాలని క్షుణ్ణంగా పరిశీలించడం మరుగున పడేలా చేయగలదు.
శ్రమదోపిడి, ప్రకృతి వనరుల దోపిడి, లాభాపేక్ష అనేవి మూడు మూలస్థంబాలుగా ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థలో దిగజారుతున్న మానవ విలువలు, బంధాలను అట్టి వ్యవస్థ ఆర్థిక ముఖచిత్రంలోని భాగాలుగా చూడటం వల్ల ప్రశ్న – జవాబు రెండు పక్కపక్కనే ఉన్నాయని అర్థమవుతుంది.
కార్పోరేట్ చేతిలో వ్యవస్థ..
నయా ఉదారావాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం, దాని ఆర్థిక విధానాల రూపకల్పనలో కార్పోరేట్ల ప్రమేయం అడ్డుకోవడం కష్టమే కాదు. అసాధ్యం కూడాను. ఇటువంటి స్థితి కార్పోరేట్లకు ప్రభుత్వం అనేది తమ లాభాపేక్షను పెంచుకోవడానికి ఉపయోగపడే అయుధంగా మారుస్తుంది.
విధానాల రూపకల్పనలో తమ లాభాలకు, దోపిడికి, వంచనకు అడ్డుపడే ఏ విధమైన కార్పోరేట్లు అడ్డుపడి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అనేది కార్పోరేట్ల గొంతెమ్మ కోరికలను తీర్చె ఒక యంత్రంగా పని చేస్తూ ఆర్థిక ప్రగతి, అభివృద్ధి అని సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యే చిలుక పలుకలతో తియ్యని మాటలతో మాయ చేయగలదు. తేనె పూసిన కత్తిలా వ్యవహరించే ఇటువంటి పదజాలం మాయాజాలానికి లోనేన సాధారణ ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా సర్వ సాధారణమే. వారు మాత్రం ఏం చేయగలరు! వారికి చేరే సమాచార సాధనాలు కూడా అన్ని బడాబడా కార్పోరేట్లు నడిపించే మాయాజలంలో భాగం అయితేను. తమ ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకోవడంలో భాగమేగా ఈ విన్యాసలన్నీ.
సాధారణ జనాలు తమ ముంగిట ఉన్న వాస్తావాన్ని కూడా గ్రహించలేక ఊహాలోకంలో తేలడమే కదా కార్పోరేట్లకు కావాల్సింది! ఈ ఆటలో వారు చాలా మట్టుకు సఫలీకృతులు అయ్యారు కూడాను. మొత్తంగా సంక్షేమ రాజ్యం అంతరించిపోయిన తర్వాత ప్రభుత్వ విధానాలలో ముఖ్యంగా ఆర్థిక రంగంలో పెరిగిన కార్పోరెట్ల ప్రమేయం మూలంగా ఆర్థిక అసమానతలు మరింత పెరగడమే కాకుండా ప్రజల స్థితిగతులు జీవన ప్రమాణాలు మన ఊహాస్థాయికి మించి దిగజారిపోతున్నాయి. అలాగే మానవ సంబంధాలు కూడాను.
లాభాల కోసం శ్రమదోపిడి..
కోవిడ్ తర్వాత ఏర్పడిన ఆర్థిక మందగమనం, సరుకులకు గిరాకి తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. దానివల్ల బడా కార్పోరేట్ సంస్థలకు లాభాలు తగ్గడం, లాభాలు పెంచుకోవడంలో చిక్కులు ఏర్పడడం కూడా చూస్తూనే ఉన్నాం. మరి లాభాలను పెంచుకోవడం ఎలాగా?
ఉత్పత్తిలో భాగమైన శ్రమదోపిడి ద్వారానే అది సాధ్యం అనేది జగమెరిగిన సత్యం. పని గంటల పెరుగుదలతో ఇది సాధ్యపడవచ్చు. కోవిడ్ అనంతరం ప్రపంచంలో కొనుగోలు శక్తి తగ్గడం వల్ల అంగడిలో గుట్టలు గుట్టలుగా ఉన్న సరుకుతో పాటుగా, కారుచౌక తమ శ్రమశక్తిని అమ్ముకోడానికి సిద్ధమైన నిరుద్యోగ యువత కూడా ఉంది. మరి అధిక వేతనాలతో తమ ఉద్యోగులని పోషించడం దేనికి? అంగడిలో దొరుకుతున్న మానవ వనరులనే కారుచౌకగా నియమించి లాభాలు పొందవచ్చు కదా అన్నది కార్పొరేట్ వాదన. కోరిక.
పెట్టుబడిదారులకు ఇక్కడ ఏర్పడిన చిక్కు నైపుణ్యం విషయంలోనే. తమ వద్ద ఉన్న ఉద్యోగులని తమకు నచ్చినట్టుగా మలచి అందుంచిన నైపుణ్యం అంగడిలో దొరికే వారి వద్ద ఉండదు. నైపుణ్య శిక్షణ ఖర్చుతో కూడుకున్న పని. అదే తమ వద్ద పనిచేస్తున్న వారిని మరిన్ని గంటలు పనిచేసేలా చేస్తే ఈ సమస్యకు ఉపాయం దొరికినట్టే కదా. ఈ ఆలోచనతో బడా కార్పోరేట్లు అధిక పని గంటల శ్లోకాన్ని నెత్తిన మోసుకొని తిరుగుతున్నాయి. ఈ ఆటలో ప్రభుత్వాలు నిర్మొహమాటంగా కార్పోరేట్లకు తోడ్పడుతున్నాయి.
ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి..
తమ శక్తికి మించి తమ శ్రమను వెచ్చించడం వల్ల కార్మిక ప్రపంచం అలిసిపోయిందన్న మాట వాస్తవం. నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ, దాని విధ్వంసకర జీవన శైలి ఫలితంగా కార్మికులు, ఉద్యోగులు శారీరకంగానేకాక మానసికంగా కూడా కుంగుబాటుకు లోనవుతున్నారు. పైపై మెరుగులు చూసి ఒక అవగాహనకు రావడం అమాయకత్వం కదా..!
పెట్టుబడిదారులు విదిల్చిన మెతుకులను చూసి అంతా బాగానే ఉందనుకోవడం భ్రమయే కాకుండా వివేక వంచన కూడా అవుతుంది.
తమ వద్ద ఉన్న కార్లు, బంగ్లాలు చూసి ఉద్యోగులు ఆనంద సాగరాలలో విహరిస్తున్నారనుకోవడం కూడా పెట్టుబడిదారుల మూర్ఖత్వానికి నిదర్శనమే అవుతుంది. పైపై మెరుగులు దిద్దడంలో పెటుబడిదారులు మహామహా నిష్ణాతులు కదా మరి. పని ఒత్తిడి మూలంగా కార్మికులు, ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడంలాంటి వార్తలు మనం అడపాదడపా వింటున్నాం. వార్తా పత్రికల్లో చదువుతున్నాం. రుణాల ద్వారా పొందిన సౌకర్యాలను, అడంబరాలను చూసి అంతా సవ్యంగానే ఉందనుకుందామా?
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కార్మికుల, ఉద్యోగుల జీవితాలని మెరుగుపరిచే బాధ్యత కార్పోరేట్లు ఎలాగు చూసుకోవు, మరి ప్రభుత్వాల మాట ఏమిటి. పుట్టారు కాబట్టి అనుభవించి తీరాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయా..?
కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం..
పని ప్రదేశాల్లో ఒత్తిడి కారణంగా భార్యభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ అనురాగం, అలాగే కుటుంబాలతో గడపాల్సిన సమయాలలో అనేక చిక్కులు వస్తుండడం చూస్తున్నాము. ఒత్తిడి కారణంగా లేనిపోని అపోహలు, స్పర్థలు కుటుంబ వ్యవస్థలని చిన్నాభిన్నం చేస్తున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలను కోపం, చికాకు, ఆవేశం ఆక్రమిస్తు మానవ సంబంధాలని మంటగొల్పుతున్నాయి.
ఒంటరితనంతో పాటుగా నయా ఉదారవాదం ఏర్పరిచిన జీవనశైలిలో ఇమడలేక కార్మిక, ఉద్యోగ ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంది. ప్రతిబంధం ఆర్థిక విలువ రూపంలో చూసే ప్రస్తుత పెట్టుబడిదారి వ్యవస్థలో భాగమేగా ఇవన్నీ. పొటీ శైలిని పెంచి పోషించే స్నేహం, సహకారాన్ని త్యజించిన నయా ఉదారవాద ఆర్థిక నమూన దుష్టఫలితమే కదా ఇవన్నీ. పెట్టుబడిదారి వ్యవస్థ నెలకొల్పిన ఆర్థిక ప్రపంచంలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావు ఉంటుందా! జీవితానికి పరమార్థాలైన స్వేచ్ఛ, ఆనందం, దయ భావాలకు అసలు ఇక్కడ చోటు ఉంటుందా. ఆర్థిక స్వతంత్రంలో ఇవన్నీ భాగమని పెట్టుబడిదారులు సర్దిచెప్పుకోగలరా?
చెప్పుకోవచ్చునేమో! తమ కళ్ల ముందు ఇంతటి దోపిడి జరుగుతున్న ప్రభుత్వాలు మిన్నకుండా ఉండిపోవటం వాటిని నడిపించేది ఎవరో తెలియపరుస్తుంది కదా!
ప్రభుత్వాలే సంక్షేమ చర్యలకు తిలోదకాలు వదిలిన నేపథ్యంలో కార్పోరేట్ సంస్థలు వీటిని నెత్తినెత్తుకుంటారనే భ్రమలు ఒట్టి పిచ్చితనమే అవుతుంది.
కార్పోరేట్లకు రాయితీలు.. ప్రజలపై పన్నుభారం…
ఆదర్శ ప్రభుత్వమనేది సంపద కలిగిన వారిపైన అధిక పన్నులు వేసి ఆయా సంపదకు కారణమైన శ్రామికులు, ఉద్యోగులకు పంపిణి చేయాలి. కాని మన ప్రభుత్వాలు ఒక పక్క కార్పోరేట్లకు పన్ను రాయితీలు కల్పించి కార్మికులపై అడ్డు అదుపు లేకుండా పరోక్ష ప్రత్యక్ష పన్నుల భారాన్ని మోపుతున్నాయి. పై నుంచి కింది తరగతులకు ఆర్థిక ఫలితాలు చేరాలి కానీ దీనికి విరుద్ధంగా జరుగుతోంది. పై తరగతుల విలాసాల బంధిలో చిక్కుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడిదారులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా ఆరోగ్యమైన కార్మికలోకమే కదా పెట్టుబడిదారి వ్యవస్థలో సంపద మూటకట్టుకోవడానికి తోడ్పడేది. మరి ఆ కార్మికరంగమే నిరాశ నిస్పృహలో కూరుకుపోయినప్పుడు లాభాల మాట దేవుడెరుగు. మొత్తం వ్యవస్థనే పతనంకాక తప్పదు. పెట్టుబడిదారి వ్యవస్థకు తమతమ రక్తమాంసాలని అందించే కార్మికులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు పెట్టుబడిదారుడు లాభాలను ఆశించడం వ్యర్థ ప్రయాసే కాగదు. ఉత్పాదకత కుంటుపడి తమ ఉద్యోగ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించగలరు కదా. ఇంత సున్నితమైన అంశాన్ని కార్పోరేట్ నేతలు ఎలా మర్చిపోతున్నారు!
నూతన సంకేతిక విధానాలైన కృతిమమేధ, ఆటోమేషన్ ద్వారా కార్మికులు లేకుండానే సంస్థలను నడిపించడానికి సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు వీటినే సాకుగా చూపి కార్మికులను భయభ్రాంతులకు గురిచేయవచ్చు. కార్మిక సంఘాలు లేని ప్రస్తుత కాలంలో వాటికి జీవన కల్పించాల్సిన అవసరం ఉంది. తమ సమస్యలని వెలిబుచ్చడానికి అంగీకారమైన సాధనాలతోనే ఉద్యోగ పేద కార్మిక ప్రపంచం పెట్టుబడిదారుడు ముందు తమ సమస్యలను చెప్పగలడు. ఇటువంటి తరుణంలో బలమైన కార్మిక ఉద్యోగ సంఘాలే వారికి అనువైన మార్గం. ఇటువంటి వ్యవస్థ కేవలం కార్మికులు లేదా ఉద్యోగులకే కాదు పెట్టుబడిదారుడికి మొత్తంగా పెట్టుబడిదారి వ్యవస్థకే ప్రయోజనకారి కాగలదు.
– వీకే సముద్రాల
డైరెక్టర్, సముద్రాల వీకే ఐఏఎస్ అకాడమీ