
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని భారతీయ జనతా పార్టీ తలకిందులు చేసి నిరాశపరచగలదా? ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు పరిశీలకుల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ ను “ఆపద”, ఒక విపత్తుగా, దాని పదేళ్ల పాలనా కాలాన్ని “ఆపదల కాలం”గా ముద్ర వేయడం ద్వారా ఒక అధికారిక ప్రకటన చేశాడు. అధికార ఆప్ ప్రభుత్వం అవినీతి మయమైందని చిత్రించేందుకు ముఖ్యమంత్రి నివాస పునరుద్ధరణ పనుల్లో అధికంగా చేసిన ఖర్చును, బీజేపీ తన పార్టీ ప్రచారంలో ప్రధాన సాధనంగా ఉపయోగించుకుంటుంది.
గత ఆరు నెలల కాలంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ పట్టణ పేదలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు మొహల్లా సమావేశాలను నిర్వహిస్తూ, తన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేస్తూ, దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించడానికి బీజేపీదే బాధ్యత అని, దానిపై ఒంటికాలిపై లేస్తున్నాడు. అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హెంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో 2013లో షీలా దీక్షిత్ ఓటమి పాలైన తర్వాత దెబ్బతిన్న కాంగ్రెస్ తిరిగి కోలుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి తాను మాత్రమే ఏకైక లౌకిక ప్రతిపక్షమనే విషయాన్ని చెపుతూ, ఆప్ సంక్షేమ పథకాలకు ధీటైన పథకాలను తాము కూడా తీసుకొస్తామని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది.
అయినప్పటికీ, ఆ రెండు పార్టీల నుండి ఆప్ ను వేరు చేసేది, ప్రజాదరణ పొంది, తన పార్టీని ముందు నుంచి నడిపించిన కేజ్రివాల్ మాత్రమే. మదన్ లాల్ ఖురానా లేక కనీసం సుష్మా స్వరాజ్ లాంటి ప్రజాకర్షణ కలిగిన బలమైన ఒక నాయకుడిని వెతకడంలో బీజేపీ తీవ్ర పోరాటం చేసింది.
2015లో కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా దించాలనే బీజేపీ కపటోపాయం విఫలమైంది. 2020లో కేజ్రివాల్, ఆయన టీంకు హర్షవర్ధన్ సరితూగలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా షీలా దీక్షిత్ లోటును పూడ్చగలిగే వారు కూడా ఎవరూ లేరు. అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్ లు కాంగ్రెస్ కు ఉత్తములైన విశ్వాసపాత్రులే, కానీ పార్టీలో కూడా ముఠా దృష్టితోనే చూస్తారు.
1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పాటైన నాటి నుండి దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా పోరాడుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మదన్ లాల్ ఖురానా పదవీ కాలాన్ని మినహాయిస్తే, కాషాయ పార్టీ ఇతర పార్టీల కంటే మించిన బలాన్ని ఎప్పుడూ పొందలేక పోయింది. షీలా దీక్షిత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1998 నుండి వరుసగా మూడు ఎన్నికల్లో, మొదటిసారి ఆప్ అధికారం చెపట్టే వరకు, విజయం సాధించింది. 2013 లో స్వల్పకాలిక మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో 70 స్థానాలున్న శాసనసభలో 60 స్థానాలు గెలిచి ప్రత్యర్థుల్ని తుడిచి పెట్టింది. తన పార్టీ బలహీనతలను కప్పిపుచ్చడానికి బహుముఖ వ్యూహాలు రచించినప్పటికీ కూడా ఢిల్లీలో నాయకత్వలేమి, మోడీని, బీజేపీని నడిపించే పరిస్థితుల్లోకి నెట్టి వేసింది. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు మోడీ వైపు మొగ్గినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో వారు ఆప్ వైపు మొగ్గారని అర్థమవుతోంది.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవినీతి, రాజ్య వారసత్వం ఆధారంగా బీజేపీ సమర్ధవంతమైన రాజకీయ కథనం కలిగి ఉండగా, అది ఆప్ కు వ్యతిరేకంగా అనుసరించాల్సిన తన వైఖరి ఎలా ఉండాలో ఇంత వరకు కనుగొనలేదు. వాస్తవానికి, ఆప్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన ప్రతీసారి కేజ్రివాల్ బీజేపీని అధిగమించాడు. తన ప్రభుత్వాన్ని విద్యావంతులు నిర్వహిస్తున్నారన్న ఆప్ ప్రచారానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా కేజ్రివాల్ ఇటీవలి ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామా విషయంలో బీజేపీ వద్ద ఎలాంటి సమాధానం లేదు.
ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో, తన సంక్షేమ పథకాలు, ఆప్ నాయకులపై కేంద్ర ఏజెన్సీలు విచారణ చేపట్టిన అవినీతి ఆరోపణల గురించి మోడీ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా, కులమతాల ప్రాతిపదికన బీజేపీ ఓటర్లను విభజించే విధంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది. న్యూఢిల్లీ స్థానానికి కేజ్రివాల్ పై మాజీ పార్లమెంట్ సభ్యుడు పర్వేశ్ వర్మను కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా బరిలోకి దించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన నాటి నుండి సంఘ్ పరివార్‌లో వర్మ ముఖ్యమైన ముస్లిం వ్యతిరేకులలో ఒకడిగా, తీవ్ర మతపరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. అదే రీతిలో కల్కాజీ స్థానంలో ముఖ్యమంత్రి అతిషీపై మాజీ ఎంపీ రమేష్ బిధూరీని పోటీకి దించింది. వర్మ మాదిరిగానే బిధూరీ కూడా మతపరమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 2023లో లోక్ సభలో డానిష్ ఆలీతో జరిగిన ఘర్షణ అత్యంత క్రూరమైనది. ఆయన అక్కడ ఆలీని తాడ్పుడు గాడు అని, కత్వా (సుంతీ కోసం ఉపయోగించే అవమాన కరమైన పదం) అని, “ముల్లా ఆతంక్వాది” అని, “ముల్లా ఉగ్రవాది” అని అన్నాడు.
2020 ఎన్నికల సమయంలో ముస్లింలను “కుట్రదారులు”, “జాతి వ్యతిరేకులు” అని ముద్ర వేయడానికి, ముస్లింలకు వ్యతిరేకంగా నిందలతో కూడిన ప్రచారం కోసం బీజేపీ సీఏఏ వ్యతిరేక నిరసనలను ఉపయోగించుకొని, మత ప్రాతిపదికన ఓటర్లను విభజించడానికి అనేక ప్రదర్శనలను నిర్వహించింది.
విభజన వ్యూహాల కొనసాగింపు:
రేపు 2025లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తన విభజన వ్యూహాలకు ఒక నూతన అంశాన్ని అదనంగా చేర్చింది. పట్టణ పేదలలో ఎక్కువగా బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్వాంచలులు అని పిలువబడే ప్రజలు ఇప్పటికీ ఆప్ కు మద్దతుగా ఉన్నారని అర్థమైన తరువాత బీజేపీ, ఢిల్లీలో పంజాబీలు, జాట్లు, గుజ్జర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.
ఢిల్లీలో పూర్వాంచలులు 40 శాతం ఓటర్లు కాగా, పంజాబీలు 20 శాతం, జాట్లు మరియు గుజ్జర్లు కలిసి 12 శాతం ఓటర్లు ఉన్నారు. వీరికి చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా హోంశాఖమంత్రి అమిత్ షా ఇటీవలే, ఢిల్లీలోని సిక్కు రాజకీయ కేంద్రమైన రాకబ్ గంజ్ గురుద్వారాను సందర్శించాడు. అలాంటి ఆలోచనలో భాగంగానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ సుపరిచితులైన వర్మ(జాట్)ను, బిధూరి (గుజ్జర్)ను పోటీకి దించింది. ఆ విధంగా పార్టీని నడిపించగల నాయకుడు లేని సమయంలో ఆప్ నుండి దృష్టిని మరల్చేందుకు కాషాయ పార్టీ మోడీ గుర్తింపు, కులం, మత విభజన, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడుతుంది. కానీ మరీ ముఖ్యంగా, సాధారణంగా జరిగే ద్విముఖ పోటీగల ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ త్రిముఖ పోటీగల ఎన్నికలుగా మార్చాలని బీజేపీ తీవ్రంగా ఆశిస్తోంది. రేపు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు ముఖ్య కారకంగా ఉంటుంది.
నాయకత్వలేమి ఉన్నప్పటికీ 2013 నుండి బీజేపీ తన 33 శాతం ఓట్ల వాటాను నిలబెట్టుకుంటూ వస్తుంది. విశ్వాసపాత్రులైన ఓటర్లు బీజేపీ పార్టీకి చాలా ప్రయోజనకరంగా ఉంటున్నారు. అయితే గడిచిన పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పతనం ఆప్ ను పతాక స్థాయికి చేర్చింది.
2013లో 24.55 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ల వాటా 2015లో 9.65 శాతానికి, 2020లో 4.26 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టమంతా ఆప్‌కు లాభంగా మారింది. బలమైన ప్రచారంతో యథాతథస్థితి రాజకీయాల్ని ప్రశ్నిస్తూ ఆప్ 2013 లో 29.49 శాతం ఓట్లు సాధించి, తన మొదటి ఎన్నికల్లోనే బీజేపీకి రెండో స్థానంలో నిలిచి, ఆ తరువాత బాగా బలపడి పోయింది.
2015లో 54.34 శాతం ఓట్లతో 67 స్థానాలు, 2020లో 53.57 శాతం ఓట్లతో 62 స్థానాలతో ఢిల్లీలో సగానికి పైగా ఓట్లను సాధించింది. మరోవైపు బీజేపీ 2015లో 32.19 శాతం నుండి 2020లో 38,51 శాతానికి తన ఓట్ల వాటాను పెంచుకుంది. అయితే బీజేపీ ఇప్పటికీ ఆప్ కు రెండవ స్థానంలోనే ఉంది.
ఇలాంటి అంశాల కారణంగా బీజేపీ, ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనం వహించింది. తన పెద్ద రాజకీయ ప్రత్యర్ధి పునరుద్ధరణ కోసం ఆశలు పెట్టుకునే క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీ కొంత మేరకైనా తన ఓట్ల వాటాను మెరుగుపరచుకుంటే, బీజేపీకి, అప్ ను ఓడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి ఉంటే, ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కదు.
అజయ్ ఆశీర్వాద్ మహాప్రశస్థ
అనువాదం: బోడపట్ల రవీందర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.