
వక్ఫ్ సవరణ బిల్-2025ను పార్లమెంట్ ఆమోదించింది. 1995లో వచ్చిన వక్ఫ్ చట్టానికి ఇది తాజా సవరణ అని చెప్పవచ్చు. అయితే, ఈ కొత్త చట్టం ముఖ్యంగా పారదర్శకతను, సమర్థతను కలిగించేదిగా కనిపించినా లోతుగా విశ్లేషించినప్పుడు ఇది ముస్లిం ఆస్తులపై, వారి సంస్థలపై, వారి పట్టున్న అధికారాలపై దాడిచేసే విధంగా రూపొందించబడిందని తెలుస్తోంది. ఈ చట్టపరమైన మార్పులు మైనారిటీల హక్కులను క్రమంగా క్షీణింప చేస్తున్నాయి.
ఇప్పటివరకు వక్ఫ్ భూముల సర్వే అధికారాలు వక్ఫ్ కమిషనర్ వద్ద ఉండేవి. ఇప్పుడు ఆ అధికారాన్ని కలెక్టర్లకు బదలాయించారు. కలెక్టరే చివరి నిర్ణయం తీసుకునే స్థితిలోకి వస్తే, ముస్లింల వాదనలు, ముస్లిం సంప్రదాయాలు, చట్టసూత్రాలు అన్నీ అప్రాసంగికం అవుతాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కలెక్టర్లు ఈ భూములను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని ముస్లింలు అనుమానిస్తున్నారు.
ఇక రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల విషయంలో మరింత ఆందోళన కలిగించే మార్పులు జరిగాయి. ఇప్పటివరకు 8 నుంచి 12 మంది ముస్లింలే సభ్యులుగా ఉండే విధంగా ఉండేది. ఇప్పుడు సభ్యుల సంఖ్యను 11కి తగ్గించి, అందులో ఏడుగురు ముస్లింలు కానివారిని నియమించగల నిబంధనను చేర్చారు. సభ్యులంతా నామినేషన్ పద్ధతిలో ఎంపికవుతారు. బోర్డు అధ్యక్షుడు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇద్దరు నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగి, బార్ కౌన్సిల్ సభ్యుడు వీరందరూ ముస్లిం కానివారు కావచ్చని చట్టంలో పేర్కొన్నారు. ఇది ముస్లింలకు చెందిన వ్యవస్థపై కేంద్రం మౌనంగా ఏర్పాటు చేసిన కుట్రగా ముస్లింలు భావిస్తున్నారు. ఈ 11 మంది సభ్యుల్లో ఏడుగురు ముస్లింలు కానివారు ఉన్నప్పుడు, ఏదైనా నిర్ణయాన్ని ఆ ఏడుగురే మెజార్టీగా తీసుకునే స్థితి వస్తుంది. మిగతా నాలుగు ముస్లిం సభ్యుల అభిప్రాయాలు బలం లేని నీరసపు వాదనలుగా మారుతాయి. ఇదే సమయంలో హిందూ దేవాలయాల బోర్డుల్లో ఇతర మతస్థుల సభ్యత్వానికి ఎలాంటి నిబంధన లేదు. ఇది సమానత్వ సూత్రనికి విరుద్ధంగా ఉంది. దీన్ని సరిచేయాలంటే భారత దేశంలోని అన్ని హిందూ దేవాలయాల ఆర్థిక లావాదేవీలను చూసే పాలనా బోర్డులలో మెజార్టీ సభ్యులు ముస్లింలతో నింపి అప్పుడు మెజార్టీ నిర్ణయం ప్రకారం హిందువుల దేవాలయాలు నడవాలి. అందుకు బీజేపీ అంగీకరిస్తే వారి చట్ట సవరణ నిష్పాక్షికంగా జరిగినట్లు భావించవచ్చు.
ఇప్పటికే ఇద్దరు మహిళల సభ్యత్వ నిబంధన వక్ఫ్ బోర్డులలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు “ఇద్దరు ముస్లిం మహిళలే ఉండాలి”అని పేర్కొన్నారు. మిగతా సభ్యులలో మెజారిటీ ముస్లిం కాని పురుషులే ఉంటే, ఈ మహిళల అభిప్రాయాలు ప్రయోజనం లేకుండా పోవచ్చు అనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.
రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ నియమించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇది తప్పనిసరిగా ముస్లిం అధికారిగా ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించి, ఏ మతస్తుడైనా ఈ పదవిని చేపట్టవచ్చని చట్టం చెబుతోంది. హిందూ దేవాలయాల ఆస్తుల నిర్వహణలో కూడా హిందూయేతర మతస్తులకు కూడా ఈ బీజేపీ కల్పిస్తుందా? ముస్లింల సంస్కృతి, చరిత్ర, నిబంధనల పట్ల అవగాహన లేని వ్యక్తి ఈ పదవిలో ఉంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో హిందూ దేవాలయాల బోర్డు సీఈఓ పదవుల్లో హిందువులే ఉన్నారు. ఇది సమానత్వ సూత్రాలకు వ్యతిరేకం కాదా?
వక్ఫ్ ఆస్తులపై వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించేందుకు ట్రిబ్యూనల్ వ్యవస్థ ఉంది. ఇందులో న్యాయమూర్తి, మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ముస్లిం చట్టాలపై నిపుణుడిగా ఉండే విధంగా నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ ముస్లిం చట్టాల నిపుణుడి నిబంధనను తొలగించారు. ఇది మతపరమైన విషయాలను తెలిసినవారు లేకుండా నిర్ణయాలు తీసుకునే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆస్తిపరంగా చూస్తే చాలు అనే తీరుగా ఈ సవరణ మలచబడింది. ఇవే సూత్రాలు హిందూ దేవాలయాలకూ ఉండాలి కదా?
ఒకవైపు ముస్లింలో లేని వ్యక్తిని బోర్డు నుంచి తొలగించవచ్చని నిబంధన కొనసాగిస్తూనే, మరోవైపు ఏడుగురు ముస్లింలు కాని సభ్యులను నియమించవచ్చని చెబుతుండటంలో స్పష్టమైన విరోధాభాసం కనపడుతుంది. ఇది చట్టసమ్మతంగా ముస్లిం బోర్డులలో ముస్లిం ప్రభావాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు.
ఇంకా ఒక గమనార్హమైన మార్పు ఏమిటంటే ఎవరైనా వ్యక్తి వక్ఫ్ పేరిట ఆస్తిని దానం చేయాలంటే, కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించి ఉండాలి. ఇంకా ఆ ఆస్తిపై పూర్తి హక్కులు కలిగి ఉండాలనే నిబంధనను చేర్చారు. ఇది కొత్తగా ఇస్లాం మతంలోకి మారినవారిని వెంటనే వక్ఫ్కి ఆస్తులు దానం చేయకుండా నిరోధించే విధంగా చేసేందుకు ఈ నిభందన చేర్చారు. ఐదు సంవత్సరాల లెక్కను ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? ఎవరు నిర్ణయించాలి? అన్న ప్రశ్నలకు స్పష్టత ఈ చట్టంలో లేకపోవడం గమనార్హం.
భారత ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 6 లక్షలకుపైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవి సుమారు 8 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. వాటిలో అనేకం పట్టణాల్లో విలువైన స్థలాలు. ఈ ఆస్తుల నిర్వహణలో అవినీతి, ఆక్రమణలు తరచూ ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ముస్లింలే నాయకత్వం వహించే బోర్డులను బలోపేతం చేయడం ద్వారా సాధ్యమవుతుంది. దానికి బదులుగా మతేతరుల చేతుల్లో అధికారాన్ని ఉంచటం అసంబద్ధం. దీనివల్ల భవిష్యత్లో ముస్లిం సమాజం తమ ఆస్తులపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.
వాస్తవంగా చూస్తే ఈ సవరణల ద్వారా ముస్లిం సమాజం తన మతపరమైన సంస్థలపై, ఆస్తులపై కలిగిన హక్కులను సంపూర్ణంగా కోల్పోతుంది. మత సామరస్యానికి ఇలాంటి మార్గం ఎంత మాత్రం సరైంది కాదు. పైగా ఇవి మత విద్వేషాలు రెచ్చగొట్టే వి. అయితే ఒకవేళ ఉంటే అన్ని మతాల బోర్డులకూ ఒకే విధమైన నియమ నిబంధనలు ఉండాలి. అలా కాకపోతే అది సమానత్వాన్ని, న్యాయాన్ని ధ్వంసం చేసే చర్యగా మిగులుతుంది. భారత్ ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మిగలాలంటే మైనారిటీల మత స్వాతంత్య్రానికి గౌరవం ఇవ్వడం అవసరం.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
9849328496
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.