
ప్రొఫైల్స్ లాక్ చేసుకోనో, ఫేక్ అకౌంట్స్తోనో ఈ మధ్య కొందరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అసహనాన్ని బూతుల కామెంట్స్ రూపంలో చూపిస్తూ తమ సంస్కారహీనతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఆయా సెలబ్రెటీ అభిమానుల మధ్య వ్యక్తుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక రకమైన గ్రేజోన్ వార్ జరుగుతుంది. నియంత్రణ, అడ్డూఅదుపు లేకపోవడంతో తమ ఫాలోయింగ్‌ను పెంచుకోవడానికి, తమ పోస్ట్ హైలెట్ చేసుకోడానికి కొందరు సోషల్ మీడియా అడ్మిన్లు డార్క్ కామెడీని కూడా ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు అసత్య ప్రచారాలు, తమకు నచ్చని వ్యక్తి వ్యక్తిత్వహననం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ సమాజం ఎటు పోతుంది? దీని పర్యావసనం ఎలా ఉంటుందనే ఆలోచన రాకుండా ఉండదు.
తాజాగా తెలుగునాట ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ ఘటన సోషల్ మీడియాను ఒక కుదుపు కుదుపేస్తోంది. పికిల్స్ అమ్మే అమ్మాయి కస్టమర్‌తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తను అలా మాట్లాడడం ముమ్మాటికీ తప్పే, వాటిని ఎవరూ సమర్థించరు. సమర్ధించకూడదు కూడా. అయితే ఆ అమ్మాయి అలా తిట్టిందని ఆ అమ్మాయిని మించి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించేవారు చాలా దిగజారిపోయి సంస్కారహీనంగా ఆమెతో పాటు ఘటనకు సంబంధంలేని వారిని కూడా కలిపి తిడుతున్నారు. తను ఆ విధంగా మాట్లాడడం సంస్కారహీనత అని వ్యతిరేకించడంలో తప్పులేదు. కానీ బూతులతో దాడి చేయడం ఏ రకమైన సంస్కారం?
సోషల్ మీడియా అనేది అందరిని ఒక చోటుకు చేర్చి, ప్రపంచాన్ని ఓ కుటుంబంలా మార్చింది. కోవిడ్ లాక్డౌన్ సందర్భంగా వాట్సప్ సందేశాలే కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకునే సాధనాలయ్యాయి.
చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారా ప్రాణస్నేహితులు, ప్రేమికుల అయిన సందర్భాలు ఉన్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నవారు ఉన్నారు. మరికొందరు యూజర్స్‌కి తమలోని నైపుణ్యతను, కళలను ప్రదర్శించుకోవడానికి సోషల్ మీడియా వేదికలా మారింది. ఈ వేదిక ద్వారా చాలా మంది సెలబ్రెటీలు అయినవారు కూడా ఉన్నారు.
ప్రతిదాంట్లో మంచీ చెడూ ఉన్నట్టుగా ఇందులో కూడా చెడు ఉంది. వరదలా పారుతున్న ఆ మురికినే ప్రస్తుత సందర్భంలో మనం చూస్తున్నాం. మంచికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియా వేదికను కొందరు యువత తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. స్వార్థపూరిత నాయకులు తమకు అనుకూలంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని, ఆయా పార్టీల ఎజెండాను- ప్రొపగాండాను అమలు చేస్తున్నారు. దీంతో స్నేహానికి ఉపయోగపడే సోషల్ మీడియా శత్రుత్వానికి కేంద్రం అవుతోంది. ప్రేమను వ్యక్తం చేయాల్సిన వేదిక విషనాగులా ద్వేషపు విషం చిమ్ముతోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి తెలిసీ తెలియని వయసులో బాలబాలికలను- యువతను మురికి కూపంలోకి లాగుతోంది. ఈ అందమైన మాయాప్రపంచంలో పడి దంపుతులు అక్రమ సంబంధాలతో సంసారాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చోటుచేసుకుంటున్న నెగిటివ్, అసత్యవార్తల వల్ల సమాజంలో అశాంతి చోటుచేసుకుంటోంది.
ఇటువంటి ఘటనలకు ఉదాహరణగా చాలా చెప్పుకోవచ్చు. అందులో మచ్చుకు తాజాగా సమాజాన్ని మతప్రాతిపాదికన మానసికంగా విభజించడానికి తీసిన చిత్రంగా విమర్శించబడుతున్న ఛావా వల్ల నాగపూర్‌లో జరిగిన తాజా అల్లర్లుకానీ, ప్రపంచంముందు భారతదేశం తలదించుకునేలా చేసిన మణిపూర్‌లో ఇద్దరు అమ్మాయిల నగ్న ఊరేగింపు కానీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయిన ఫేక్‌న్యూస్ కూడా ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఓ మారణాయుధంలా, సమాజాన్ని విభజించడానికి పనిచేస్తుందని, సమాజంలో అశాంతికి కారణమవుతోందని చెప్పక తప్పదు.
2024 ఏపీ లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికల ముందు తెనాలికి చెందిన వైసీపీ అభిమాని గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దుమారం రేపింది. టీడీపీ-జనసేన శ్రేణులు, పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన ట్రోలింగ్ వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. నిజానిజాలేమో కానీ ఆ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురైంది మాత్రం వాస్తవం.
అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపింది. కాదుకాదు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న కేవలం వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పైనే తన ఉక్కుపాదాన్ని మోపింది. తమ మీద వ్యక్తిత్వహననం చేస్తున్నారని ప్రతిపక్ష మహిళానేతలు ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అధికార పార్టీలు పక్షపాతంగా వ్యవహరిస్తే, ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియా ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అవుతుంది. ఇక బీజేపీ పార్టీ మాట సరేసరి అసత్యం, సోషల్ మీడియా హేట్ వేవ్ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిందనేది జగమెరిగిన సత్యం.
రోజురోజుకు సోషల్ మీడియాలో పెరుగుతున్న ఈ రకమైన సంస్కృతి కొందరికి లాభం చేకూర్చవచ్చు. సంతృప్తికరంగా ఉండొచ్చు. కానీ పూర్తి సమాజానికి మంచిది కాదు. దీని పర్యవసనాలు వర్తమానమే కాకుండా భవిష్యత్తు కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ఎవరికి లాభం చేకూరిందో వారికి భవిష్యత్తులో నష్టం జరగొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం హద్దులు దాటుతున్నవారిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గ్రేజోన్గా, డార్క్ కామెడీకి సోషల్ మీడియాను వేదికగా మార్చుతున్న వారిపై ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా వ్యవహరించి అదుపులో పెట్టాలి.
– సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.