అమెరికా ట్రేడ్ వార్ కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కావట్లేదు. తాము ఇష్టారీతిన పన్నులు విధించడము తమ అంతర్గత అంశం. తమ ఆదేశాల ప్రకారమే ఇతర దేశాలూ పన్నులు విధించాలన్నది ఆధిపత్యానికి సంకేతం. అంతటితో ఆగక తమ అదుపాజ్ఞలలో ఇతర దేశాల ఆర్థిక విధానాలుండాలనడం దుర్మార్గం, క్షమించరానిది కూడా. ఈ కోవలో భారతదేశ అంతరంగిక వ్యాపారాల్లోనూ పెద్ద కుదుపు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది.
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్స్(యూఎస్టీఆర్) అనబడే అమెరికా ఏజెన్సీ విదేశీ వ్యాపారాల విధానాలను మానిటర్ చేస్తుంది. ఈ ఏజెన్సీ ఈరోజు భారత దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురించి అర్హతకు మించిన వాదనే చేసింది. “ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ గ్యారెంటీ ఉండడం వలన ప్రజలు ప్రైవేట్ సంస్థలతో పోల్చి చూసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాను ఎంచుకుంటున్నారు, ఇది స్వేచ్ఛా మార్కెట్లో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విధానం” అంటూ సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ ప్రైవేట్ కార్యాలయం ఓవల్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ చర్య ఇతర దేశాల అంతరంగిక అంశాలలో తల దూర్చడం అవుతుంది.
విదేశీ పెట్టుబడిదారుల దాడి..
ఒకరకంగా చెప్పాలంటే భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సింది. కానీ, అలా జరగలేదు. కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రం వెంటనే స్పందించి ఎల్ఐసి ఆఫ్ ఇండియాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రభుత్వ గ్యారంటీకి ఎలాంటి సంబంధం లేదని నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనార్థం పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
అమెరికా ఏజెన్సీ నుండి బయటపడిన ఇలాంటి అభిప్రాయం ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టింది. భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో పనిచేస్తున్న 25 ప్రైవేట్ కంపెనీలలో మూడు మాత్రమే 26% పెట్టుబడితో అమెరికాకు చెందిన కంపెనీలు పని చేస్తున్నాయి. అయితే వెలువడిన ఈ అభిప్రాయం కేవలం అమెరికా కంపెనీల ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, మూకుమ్మడిగా ప్రైవేటు కంపెనీల, విదేశీ పెట్టుబడిదారుల దాడిగా భావించాల్సిందే.
ప్రతిపాదనలు- కోరికలు..
1991లో నూతన ఆర్థిక విధానాల తలంటు పోసినప్పుడు, భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ ఏకస్వామ్యంగా ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలని మొదటిగా కోరారు. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల్లో విదేశీ భాగస్వాములకు కూడా అవకాశం ఉండాలని రెండో ప్రతిపాదన చేశారు. విదేశీ భాగస్వాములకు కనీసం 26% ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత 26% సరిపోదు 49 శాతం కావాలన్నారు. ఆ తర్వాత 74%. ఈ కోరికలన్నీ తీర్చబడ్డాయి. ఆ తర్వాత 100% డిమాండ్ చేశారు. ఇలా ప్రైవేటు విదేశీ భాగస్వాముల పెట్టుబడిని 100 శాతానికి పెంచుకోవడానికి అన్ని రకాల మార్గాలను సుగమం చేసుకున్నారు.
అయినప్పటికీ దాహం తీరక ఇప్పుడు “విదేశీ పెట్టుబడి శాతాన్ని పెంచడం కాదు, మీ దేశంలో ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నటువంటి మీ సంస్థ పూర్తిగా నాశనం కావాలి, అలా నాశనమైనప్పుడే మా ప్రైవేట్ సంస్థలు పెరగడానికి అవకాశం ఉంటుంది” అనే దుర్మార్గమైన ఆలోచనని ఎక్కు పెట్టారు. టెలికాం రంగంలోకి ప్రైవేట్ పార్ట్నర్లను అనుమతిస్తూ సాగిన క్రమం చూస్తే, బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయడం కోసం దానికి త్రీజీ, ఫోర్జీ ఇంకా ఫైజీ నెట్వర్క్ ఇవ్వకుండా బిఎస్ఎన్ఎల్ టవర్లను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పూర్తిగా నష్టపరిచారు. ప్రభుత్వ ఆధీనంలో ఏకస్వామ్యంగా ఉన్న సంస్థను పక్కనపెట్టి పోటీతత్వం ద్వారా అనేక కంపెనీలు ఉండాలని కోరుతున్నామని చెప్పి, ఈరోజు కేవలం రెండు కంపెనీల చేతిలో మాత్రమే భారత టెలికం వ్యవస్థ నడుస్తున్నది. ఇదే బాటలో భారత విమాన రంగంలో ఎయిర్ ఇండియాకున్న ఏకస్వామ్యాన్ని ఓడించడం కోసం పొటీతత్వాన్ని సృష్టించి, క్రమేపి ఆ పోటీ తత్వాన్ని తగ్గించి నేడు ఇండిగో, టాటాఎయిర్ సర్వీసెస్ మాత్రమే శాసిస్తున్నాయి. ఆ కోవలోకి ఇన్సురెన్సు, బ్యాంకింగ్ రంగాలను తేవాలనే ప్రయత్నాలను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తుండటం బాధాకరం.
ఎల్ఐసి ఆఫ్ ఇండియా అప్రతిహత ప్రయాణం..
1956లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా జాతీయీకరించబడినప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల పెట్టుబడి మాత్రమే పెట్టింది. 245 కంపెనీలను కలిపి జాతీయకరణ చేస్తూ 100% వాటాను కేంద్ర ప్రభుత్వం తన పేరున చేసుకుంది. ఏదైనా ఒక కంపెనీ 100% యాజమాన్యం పొందిన తర్వాత సహజంగానే ఆ కంపెనీ చేసే లావాదేవీలన్నింటికీ యజమాని గ్యారెంటీ ఉంటాడన్న నిబంధన అత్యంత సహజమైనది. ఉదాహరణకు టాటా ఏఐజి కంపెనీ జరిపే లావాదేవీలకు యాజమాన్యమైన టాటా ఏఐజి గ్యారెంటీ కాక ఇంకెవరుంటారు? అందులో భాగంగా సెక్షన్ 37 ప్రకారం ప్రభుత్వ సావరిన్ గ్యారంటీ ఎల్ఐసికి ఉన్నది.
1956లో 185 కోట్ల నికర ఆస్తులతో ఏర్పడిన ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో భారత ప్రభుత్వం ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. సరి కదా ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను డివిడెంట్ రూపంలో తీసుకుంటూనే ఉన్నది. ఇప్పుడు 55 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన భారతదేశ ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం 30 కోట్ల పాలసీదారులు ఎల్ఐసి సర్వీస్ పొందుతుండగా ఇంతవరకు కోట్ల కోద్ది పాలసీదారులకు డెత్ క్లెయిములు, మెచ్యూరిటీ క్లెయిములు చెల్లించింది. ఈ చెల్లింపుల కోసం ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సందర్భంగా లేదు. సంస్థ జాతీయీకరణ చేయబడినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి ఏటా పాలసీదారులకు బోనస్ చెల్లిస్తూనే మిగులును నమోదు చేస్తుంది. ఇప్పుడు కూడా పాలసీదారులకు చెల్లించవలసిన లైఫ్ ఫండ్ కంటే ఎల్ఐసి దగ్గర ఉన్న ఆస్తులు చాలా ఎక్కువ.
స్వదేశీ అనేది ఒక నినాదం కాకూడదు..
ఐఆర్డిఏఆఇ బిల్లు పాస్ అయినప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ సాల్వన్సి మార్జిన్ (బాధ్యతలను నెరవేర్చగల ఆర్థిక శక్తి) పాలసీదారులకు చెల్లించవలసిన మొత్తాల కన్నా ఒకటిన్నర రెట్లు ఉండాలని కోరినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా ఆ సాల్వెన్సీ మార్జిన్ విధానాన్ని పాటిస్తూ ఒకటిన్నర రెట్లు పాటించింది. ఈరోజు ఎల్ఐసి సాల్వెన్సీ మార్జిన్ ఎల్ఐసి 2.11 గా ఉన్నది. విదేశీ భాగస్వాములతో ప్రైవేట్ రంగంలో ప్రవేశించిన ప్రైవేట్ కంపెనీలు ఒకటిన్నర రెట్ల సాల్వెన్సీ మార్జిన్ కూడా పాటించడానికి ఇబ్బంది పడుతున్నాయి.
ఇక పాలసీదారులు ఎల్ఐసి వెంట ఎందుకు నడుస్తున్నారు? ప్రైవేట్ కంపెనీలటొ పోలిస్తే, ఎల్ఐసిని ఎందుకు ఎంచుకుంటున్నారంటే సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు డెత్ క్లేములు చెల్లించడంలో 99 శాతానికి పైబడి రికార్డు నమోదు చేస్తుండగా ప్రైవేటు కంపెనీలేవి ఈ 25 ఏళ్ల కాలంలో దరిదాపున కూడా నిలవలేక పోతున్నాయి. బోనస్ చెల్లించడంలో, పాలసీల రేట్లు నిర్ణయించడంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా అత్యంత చౌకగా ఉందని గణంకాలు చెబుతున్నాయి. అన్నింటికి మించి క్లైయిముల చెల్లింపులో పూర్తిగా పారదర్శకత పాటిస్తూ, ఎలాంటి పైరవీలకి అవకాశం లేకుండా చూస్తూ, అత్యంత నీతి నియమాలతో వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తుంది. కాబట్టి సహజంగానే ప్రజలు ఎల్ఐసిని తమ ప్రాధాన్యతగా పెంచుకోవడంలో అర్థముంది.
ఈ దేశంలో పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలు, వివిధ దేశాల ప్రైవేట్ సంస్థలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుని వినియోగించుకోవాలనే దురుద్దేశంతో అమెరికా నుంచి ఎల్ఐసిపై అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. విదేశీ వాణిజ్య విధానాలను సైతం తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనుకునే అమెరికాకు ఇదే అదునుగా భావించి ఈ ప్రయత్నానికి దిగింది. దీనిని ధీటుగా ఎదుర్కొని రాజకీయ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నేటి పాలన అమెరికా అడుగులకు మడుగులొత్తేలా ఉన్నది. స్వదేశీ అనేది ఒక నినాదం కాకూడదు అది దేశీయ కంపెనీలను ధారాదత్తం కాకుండా చూసుకునే బాధ్యతై ఉండాలి. అయితే ఈ రకమైన దాడులను ఎదుర్కోవడానికి రాజకీయాల కంటే కార్మిక సంఘాలే ప్రధాన పాత్ర ఇప్పటివరకు పోషిస్తూ వచ్చాయి. ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలు జరగాల్సిందే.
జి తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.