
‘వార్తలు సమాప్తం, లోపలి కథ మొదలు’ వ్యాసాల సంపుటిని రచయిత తన తల్లిదండ్రులకు అంకితం చేశారు. తెలంగాణ ఉద్యమ సారధుల్లో ఒకరైన ప్రొఫెసర్ కోదండరామ్(ఎమ్మెల్సీ), సీనియర్ పాత్రికేయులు ప్రసేన్ ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాశారు. 54 వ్యాసాలున్న ఈ సంపుటిలో దాదాపు అన్ని వ్యాసాలు పేదోడి గొంతుకను వినిపించాయి. బాధ్యతాయుతమైన జర్నలిస్ట్‌గా పీవీ రావు ఎంతో శ్రమకూర్చి ఈ వ్యాసాలను రాశారు.
*”రచయిత జీవితం సాహిత్యం వేరువేరుగా ఉండటానికి వీలు లేదు. అతని వ్యక్తిత్వంలో సాహిత్యం సంస్కారం స్ఫురించాలి. అతని సాహిత్యంలో జీవితం ప్రతి ఫలించాలి”* పీవీ రావు కేవలం పాత్రికేయుడిగానేగాక ప్రజాపక్ష పాత్రికేయునిగా అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సామాజిక కార్యకర్త. అంతర్జాతీయ దృక్పథం, మానవీయత, నిబద్ధత, నిమగ్నత, వివేచన, విస్తృత జీవన వాస్తవికత, రాజ్యాన్ని ప్రశ్నించే తత్త్వం, నిత్యం కష్టజీవుల పక్షం వహించడం ఈ అక్షరయోధుని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
వ్యాసప్రక్రియ ఆవిర్భావం..
‘సహితస్య భావః సాహిత్యం- హితేన సహితం సాహిత్యం”* అన్నారు పెద్దలు. ప్రపంచ సాహిత్యంలో వ్యాసరచనకు ఆద్యుడు ”బేకన్” అంటారు. తెలుగులో సామినేని ముద్దు నరసింహనాయుడుగా చెప్పుకుంటారు. సాహిత్యంలో ఆంగ్ల ప్రభావంతో తెలుగు వ్యాసప్రక్రియ ఆవిర్భవించింది.
1901లో బేకన్స్ వ్యాసాలను కిళాంబి రామానుజాచార్యులు ఆంధ్రీకరించారు. బేకన్, ఎడిసన్, స్టీల్, ఎజి గార్డ్నర్, ఈవీ లూకాస్ మొదలైన వారి వ్యాసాలు ఎంతో ప్రఖ్యాతమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే తెలుగులో తొలి వ్యాసరచయిత్రిగా ‘పోతం జానకమ్మ’ను చెపుతారు. ప్రధానంగా ఎత్తుగడ, పరిచయం, విశ్లేషణ, విమర్శ, చక్కటి ముగింపు అంశాలు వ్యాసంలో ఉండాల్సినవిగా పరిగణిస్తారు. పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు, వేలూరి శివరామశాస్త్రి వేదాలు, భూగోళంపై వ్యాసాలు ఆరోజుల్లో ఎంతో ప్రభావాన్ని చూపాయి.
సామినేని వ్యాసాన్ని ”సంగ్రహాలు” అంటే కందుకూరి ”ఉపన్యాసం” అన్నారు. పీవీ రావు వ్యాసాల్లో చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక కళ, భాషా అంశాల సమాహారంగా ఈ పుస్తకం పాఠకుల ముందు వ్యాసకర్త పెట్టారు. పత్రికల్లో ప్రచురణై, ప్రజాదరణ పొందిన ఈ వ్యాసాల సంకలనాన్ని ఓ క్లుప్త పరిచయంగా అవలోకిద్దాం..
ఉత్తమాభిరుచిని తెలిపే వ్యాసాలు..
తెలంగాణ నాటకరంగంలోనే గాక తెలుగు పౌరాణిక పద్య నాటకానికి ప్రార్థనా గీతం, సురభిసంస్థలకు నాటకాలు రాయడం, వీర తెలంగాణ పోరాటంలో పాల్గొనడం చేసిన గొప్ప కళామతల్లి మద్దుబిడ్డ చందాల కేశవదాసుపై రాసిన వ్యాసంతో ఈ సంపుటి ప్రారంభమైంది. భగవాన్ సత్యసాయి, అక్కినేనిలాంటి మహామహులు చందాల ”కనకతార” నాటకంలో నటించినవారే. తొలి సినీగీత రచయితగా కేశవదాసు ప్రసిద్ధులు. వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని రచయిత అంటారు. నాటకంలో లక్షలాది మందిని కదలించిన హష్మీని 1989 జనవరి 1న దేశరాజధానిలో హత్య చేయబడిన కళాకారుని గూర్చి రచయిత రాశారు. ‘మాసిపోని రంగుల కళ’ అంటూ ‘వ్యాంగో’ గురించి రాసిన వ్యాసం విలువైనది. అతని పెయింటింగ్ 1990లోనే 83 మిలియన్ డాలర్లు పలికింది. సినీ రచయిత, దర్శకుడు ‘వంశీ’పై నాలుగు వ్యాసాలున్నాయి. ఇందులోని వ్యాసాలు రచయిత అభిరుచిని తెల్పుతాయి.
వీసీ పదవి నుంచి ఇందిరాగాంధీనే తప్పించిన నాటి విద్యార్థి ఉద్యమ నేత ఇటీవలే అమరుడైన సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిపై ”అరుణాంజలి” వ్యాసం బాగుంది. పెరుమాళ్ మురుగన్ రాసిన ”మధురోభగిన్” పుస్తకంపై మతోన్మాదులు దాడులు చేసిన ఉదంతంపై ”అవమానం ఆయనకా? సాహిత్య రంగానికా? అనే వ్యాసంలో విపులంగా అనేక విషయాలను చర్చించారు. అయితే ఆయన 2010లో పుస్తకం రాస్తే అనిరుధ్ వాసుదేవన్ ఐదేళ్ల తర్వాత ”వన్ పార్ట్ ఉమెన్” పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. దీనిమీద మతోన్మాదుల రాద్ధాంతం, దాడులు చేయడాన్ని ఎలా చూడాలి? పుస్తకంపై నిషేధించలేమని హైకోర్టు చెప్పినా బుద్ధిరాని మతోన్మాదాన్ని ఏమనాలి?
కీలకాంశాల ప్రస్థావన..
”ఆరున్నర దశాబ్ధాల అభివృద్ధి మేడిపండు చందమే” వ్యాసంలో ఈ దేశంలోని ఆర్థికస్తితి, ఆకలి పరిస్థితులు పాఠకులకు అర్థమయ్యేలా వ్యాసకర్త రాశారు. భారత్ ఆకలితో అలమటిస్తుంటే దేశంలో వందకోట్ల మంది చేతిలోకి సెల్ఫోన్లను చేర్చామనే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను ఎలా చూడాలో చర్చించారు.
”పల్లె జనంలో చైతన్యం రగిలించిన యువకిశోరాలు” వ్యాసంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా 14 గ్రామాల్లో జరిగిన ప్రజావ్యతిరేక పోరాటాన్ని పుస్తక రచయిత గుర్తుచేశారు. భారత ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2013 కాదని తెలంగాణ ప్రభుత్వం జీఓ 123 తేవడాన్ని మల్లన్నసాగర్ ముంపుగ్రామాలు ముక్తకంఠంతో ఎందుకు వ్యతిరేకించాయో అర్థవంతంగా చర్చించారు. మెదక్ జిల్లాలోని ”ఎల్కల్” గ్రామంలో రైతాంగ ఆత్మహత్యలు, రైతుల కష్టాల గురించి రాశారు. సాంప్రదాయ సాగే రైతాంగాన్ని గట్టెక్కించే మార్గమని వ్యాసంలో విపులీకరిస్తారు. ఎకరం పొలంలో 20 రకాల పంటలని వేసి ఏడాది పొడువునా పంటలని తీస్తూ ఆదాయాన్ని ఎలా గడిస్తున్నారో రచయిత చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభత్వ విధానాన్ని 2015లోనే ఈ రచయిత అంచనా వేశారు. ”నోట నవ్వు, నొసట వెక్కిరింత” వ్యాసం మార్కటల్లీ(బీబీసీ జర్నలిస్టు)”ఇండియా ఇన్ స్లోమోషన్” పుస్తకం చదివి లోతైన విశ్లేషణను వ్యాసకర్త చేశారు. 2015- 16లో వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో కేంద్ర రూ.41,000 కోట్ల వాటాలను విక్రయించాలని నిర్ణయించడం(బడ్జెట్ సాక్షిగా)తో కార్మిక వర్గం అగమ్యగోచరంగా మారిందని రచయిత అంటారు. పర్యావరణ పరిరక్షణ దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరమని రచయిత గుర్తుచేస్తారు. అంతేకాకుండా చేజేతులా పాడు చేసుకున్న వాతావరణ సమతుల్యాన్ని మెరుగు పర్చుకోవాలని సూచిస్తారు. వాతవరణంలో కాలుష్యం వల్ల జీవవైవిధ్యంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అవి చేటుకలిగిస్తాయని రచయిత అంటారు. రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణం 33% ఉండాలి. కానీ నేటి అటవీ విస్త్రీర్ణం 25.11% మాత్రమే ఉంది.
చరిత్రలో నుంచి వర్తమానంలోకి..
”ప్రేమలేదని… ప్రేమించరాదని ఎవరంటారు?” అనే వ్యాసంలో ప్రేమ గురించి, నేటి ఆధునిక యువకులు ఎలా ఉండాలనే అంశంపై రచయిత చక్కటి వ్యాసంతో మంచి సందేశమిచ్చారు. క్రీశ 269లో రెండో క్లాడియస్ రోమ్ సామ్రాజ్యం గురించి ఆయన ప్రస్థావిస్తారు. సామ్రాజ్యానికి రెండో క్లాడియస్ చక్రవర్తి అయ్యేనాటికి ”ల్యూపర్ కాలియా” అనే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వచ్చాయి. ఈ ఉత్సవాల్లో అమ్మాయి- అబ్బాయిలను ఏడాది పాటు కలిపి తిప్పడం, సంవత్సరం తర్వాత ల్యూపర్ కాలియా ఉత్సవాల్లో వారిద్దరిని పెద్దలు ఒకటి చేస్తుంటారు. ఈ తంతు చక్రవర్తి క్లాడియస్‌కు నచ్చక నిషేధం ప్రకటించాడు. ”వాలెంటైన్” అనే మతగురువు రాజశాసనాన్ని ధిక్కరించి జంటలకు పెళ్లి చేస్తాడు. మరణశిక్ష వాలెంటైన్‌కు వేస్తాడు. జైలర్ కూతురుకూ ”ఫ్రం యువర్ వాలెంటైన్” అని మరణశిక్షకు ముందు రాస్తాడు. రెండు శతాబ్దాల తర్వాత క్రీశ 496లో మరో మతగురువు గెలాసియస్ ”వాలెంటైన్ డే” ప్రేమికులరోజుగా ప్రకటిస్తాడు. అయితే నేటి ఆధునిక యువత ”చేగువేరా” త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వ్యాసకర్త చెప్పారు.
2016 సంవత్సరం నాటి పరిస్థితిని బట్టి చూస్తే భారత్‌లో 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఆర్థికమంత్రే ఈ విషయాన్ని పార్లమెంట్లో చెప్పారు. దేశజనాభాలో 15.25 శాతం మందికి ఆహారం అందక అర్థాకలితో అలమటిస్తున్నారు. 114 లక్షల కోట్లు బ్యాంకు బాకీలు ఎగవేసే పనిలో కార్పొరేట్లు ఉన్నారు. ఇలా ఎన్నో విషయాలు ”దేశపురోగమనం ఓ భ్రమ” వ్యాసంలో చెప్పుకొచ్చారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన ఎంతో విలువైన రెండు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. 16 ఓపెన్‌కాస్ట్ గనులు 36 భూగర్భ గనుల గురించి రచయిత ప్రస్తావిస్తారు. ఇక నాడు లక్షల మంది ఉపాధి పొందిన సింగరేణిలో 56వేల మందే ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులు 20 వేల మంది పనిచేస్తున్నారు. సమ వేతనం, వాటా అలవెన్స్‌ల గురించి పుస్తకంలో చర్చించారు. నా ఊరి జ్ఞాపకాలు (నోస్టాలజీ) వ్యాసం ఎంతో ఆసక్తిగా రాశారు. 35 ఏళ్ల కిందటి ‘అక్షరదీపం’ అక్షరాస్యత ఉద్యమవ్యాసంలో గతకాలపు యువతకృషిని గుర్తుచేశారు.
యూట్యూబ్ వేదికగా సాహిత్య సేవ చేస్తున్న కిరణ్ ప్రభ టాక్ షో గురించి ఓ వ్యాసంలో ప్రస్తావించారు. దాదాపు దశాబ్దకాల రాష్ట్రపరిస్థితిని ఈ పుస్తకంలో రచయిత పీవీ రావు పొందుపరిచారు. రాజకీయ, సామాజికంశాలు, పర్యావరణ పరిరక్షణ, యువత కళలు, కళాకారుల గురించి రాసిన 54 వ్యాసాలు పాఠకులకు జ్ఞానాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చైతన్యాన్ని కలగజేసి, ఓ స్పష్టతను అందిస్తాయి. ఆరుద్ర అన్నట్టు అన్ని వ్యాసాల గురించి రాస్తే విషయసూచిక అవుతుంది. వర్థమాన జర్నలిస్టులు, కవులు-కళాకారులు, రచయితలు, సామాజిక వేత్తలకు ఈ పుస్తకం చక్కటి కరదీపికగా పనిచేస్తుంది.
తంగిరాల చక్రవర్తి
9393804472
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.