
ఒక పాస్టర్ మరణం రెండు తెలుగు రాష్టాలలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి శివార్లలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది. పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం ప్రవీణ్ తన బైక్‌పై బయల్దేరారు. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన తన బుల్లెట్ కింద విగతజీవిగా కనిపించారు. బుల్లెట్ పై వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముందు రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మరణించారని పోలీసులు భావించినా, పలువురు క్రిస్టియన్ నేతలు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పాస్టర్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఇందులో కుట్ర కోణం దాగివుందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మత ప్రబోధకుడి మరణం కావడం, అదీ అనుమానాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. దర్యాప్తులో నాలుగు పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. పోస్టుమార్టం నివేదిక వస్తే పాస్టర్ మృతిపై కొంత స్పష్టత రానుంది.
ప్రమాదానికి కొన్ని నిమషాల ముందు ఏం జరిగిందనే దానికోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయిన విజువల్స్‌ను పోలీసులు సంపాదించారు. బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చింది. ఈ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరికీ ఏ అనుమానాలు అక్కరలేదని కేసు దర్యాప్తు సమగ్రంగా జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు.
సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. అయితే, బైక్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడం, పాస్టర్ ప్రవీణ్ ముందు పడిపోయిన తర్వాత, తన పైన బైక్ పడడంతో మృతిచెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. అనుమానాస్పద మృతి అంటూ రాజమండ్రిలో క్రిస్టియన్ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది ప్రమాదం మాత్రం కాదని, ఈ బైక్ వెనుక వచ్చిన కార్లు, ఆయన గుండెలపై పాదరక్షల ముద్రలు ఉన్నాయని ఇవి పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయని క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి.
ఈ సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో తీస్తూ పోస్టుమార్టం చేస్తామని పోలీసులు చెప్పారు. మృతదేహానికి పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని సికింద్రాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌లో భారీగా తరలివచ్చిన క్రైస్తవ సంఘాల నేతలు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
క్రైస్తవ సంఘాల ఆరోపణ ఏంటి?
పాస్టర్ ప్రవీణ్ మరణవార్త తెలిసిన వెంటనే క్రైస్తవ సంఘాల నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో రాజమండ్రి తరలి వెళ్లారు. అక్కడే ఆందోళన చేపట్టారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య చేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని పట్టుపట్టారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ స్పందించారు. ప్రవీణ్ మరణం ప్రమాదవశాత్తు జరగలేదని, ఎక్కడో చంపి ఇక్కడ పడేసి వెళ్లారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేశారు. దీనికంటే ముందు మాజీ ఎంపీ హర్షకుమార్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదం కాదన్నారు. పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రవీణ్ పగడాల మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక, పారదర్శక విచారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కొవ్వూరు డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించామని హోంమంత్రి అనిత తెలిపారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రభుత్వం నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు చెబుతున్నదేంటి..?
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కీలక విషయాలను వెల్లడించారు. తమ దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా ప్రవీణ్ బైక్ 24న రాత్రి 11:31కి కొవ్వూరు టోల్ ప్లాజాను దాటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యిందని, తర్వాత ఘటనా స్థలం ఎదురుగా పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో రాత్రి 11:42కి ఓ కారుతో పాటు మొత్తం ఐదు వాహనాలు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్ దాటుకుని వెళ్లినట్లు రికార్డయ్యిందని తెలిపారు. ఇదే సమయంలో ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకూ రాలేఖపోతున్నామని పేర్కొన్నారు.
”పాస్టర్ ప్రవీణ్ బైక్ టోల్ గేట్‌ను దాటడం స్పష్టంగా తెలిసింది. ఆ తరువాత 12 నిమిషాలలో ఏమి జరిగిందో తెలియాల్సి ఉంది. బైక్ స్క్రిడ్ అయిందా, వెనుక వాహనం ఢీ కొట్టిందాని తేలాల్సి ఉంది. అందుకే వదంతులు నమ్మకుండా ఎవరివద్దైనా ఎలాంటి ఆధారాలు ఉన్నా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌కు ఇవ్వాలి” అని ఎస్పీ సూచించారు.
అసలు ఎవరీ పాస్టర్ ప్రవీణ్..
క్రిస్టియన్ మిషనరీస్‌కు, పాస్టర్స్‌కు, క్రిస్టియానిటీని విపరీతంగా ఫాలో అయ్యేవాళ్లకు తప్ప పాస్టర్ ప్రవీణ్ అంతగా తెలియదు. అయితే మరణం తరువాత ప్రవీణ్ పేరు సంచలనంగా మారింది. క్రిస్టియన్‌గా ఒక పాస్టర్‌గా బోధనలు చేసే ప్రవీణ్ పగడాల ఇటీవల కాలంలో తన కాంట్రవర్సీ ప్రసంగాలతో ప్రజల్లోకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇతర మతాల పండుగలను విమర్శిస్తూ కూడా వీడియోలలో ప్రసంగించారు. అసలు ప్రవీణ్ ఎవరు? ఆయన చేసిన గొప్ప పనులు ఏంటి? ఆయన వ్యక్తిగత జీవితం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రవీణ్ కడపకు చెందిన వ్యక్తి. ఆయన తల్లిది మాత్రం ప్రొద్దుటూరు. అయితే తల్లి క్రిస్టియన్ కాగా, తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారని తెలుస్తోంది. ప్రవీణ్‌కు సోదరుడు కూడా ఉన్నాడు. చదువుతో పాటు సామాజిక అంశాల మీద, ముఖ్యంగా క్రిస్టియానిటీ మీద ఆసక్తి చూపేవారని చెబుతున్నారు. చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేయడంతో తల్లిదండ్రులు ప్రవీణ్‌ను హాస్టల్లో చదివించారు. ఆ తర్వాత ఇండోర్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబిఏ పూర్తి చేశారు. ప్రవీణ్‌కు వ్యాపార రంగం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది. కొంతకాలం క్రిస్టియానిటీలో ఉన్న పద్దతులను విమర్శిస్తూ వచ్చిన ప్రవీణ్ ఇండోర్‌లో ఒక క్రిస్టియన్ కుటుంబానికి దగ్గరై మత పరంగా బోధనలు, ప్రసంగం అలవర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్‌కు ప్రవీణ్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఆ మీటింగ్‌కి హాజరైనప్పుడు అక్కడ ఆ వక్తలు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన్ని విపరీతంగా ఆలోచింప జేశాయి. దాంతోపాటు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పించడం అక్కడితో ఆగకుండా, మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించినట్లు చెబుతున్నారు. అటు బిజినెస్‌తో పాటు పాస్టర్‌గా మారి ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగాలు చేస్తూ క్రిస్టియన్ వర్గాలలో పేరు సంపాదించారు. ఇండోర్‌లో తాను దగ్గరైన కుటుంబంలోని అమ్మాయినే పెళ్లిచేసుకున్నారు. అలాగే ఆయన బోధనలు, స్పీచ్లులలో లాజిక్ వుండేలా ప్రవీణ్ చూసుకునేవారు. అవే ఈ మధ్య కాలంలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. దాంతోపాటు కొందరు అసూయ పడేలా మారారు.
గతంలో ప్రవీణ్ వివాదాలు..
పాస్టర్ ప్రవీణ్ పగడాల గతంలో హిందూ పండుగలు, దేవుళ్లపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ముస్లింలకు ఆరాధ్యుడైన మహ్మద్ ప్రవక్త పైన ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాన్ని కొనితెచ్చాయి .ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు క్షమించేది లేదని ముస్లిం నాయకుడు సమి ఆ మధ్య పాస్టర్‌ను హెచ్చరించారు. నాలుక చీల్చేస్తానని, అంతు చూస్తానని బెదిరించాడు. ఇప్పుడా అంశం చర్చలోకి వచ్చింది. అయితే సమీ చేసిన హెచ్చరికల తర్వాత ప్రవీణ్ క్షమాపణలు చెప్పారు. ఆవిషయం క్షమాపణలతో ముగిసి పోయిందని సమీ చెబుతున్నారు. అంతేకాకుండా హోలీ పండుగ గురించి కూడా పాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వివాదాస్పద ప్రసంగాలతో గతంలో కూడా ప్రవీణ్ వివాదాలను కొని తెచ్చుకున్నారు.
క్రిస్టియన్ పాస్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడో మిస్టరీగా మిగిలింది. రోడ్డుప్రమాదం కాదని, కావాలనే ఆయనను హత్య చేశారని క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరో అడుగు ముందు కేసి సీబీఐ దర్యాప్తుకు కూడా డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల తమ దర్యాప్తులో ఏమి తేలుస్తారో చూడాలి. ఒక మత పెద్ద మరణానికి సంబంధించిన ఈ విషయంలో ఎవరికి వారు, ఎవరి పైనో బురదజల్లకుండా అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వుంది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.