
మనకు ఏ నాణ్యమైన విద్యా వద్దు, విమర్శ అసలే వద్దు. కవితం వద్దు, వ్యంగ్యం వద్దు. మనకు కావలసింది భజన, సన్మానాలు- సత్కారాలు, ఎందుకూ పనికి రాని శాలువలు. వేలరూపాయల పూలహారాలు. ఇవన్నీ తిరోగమనానికి నిదర్శనంగా భావించాలి. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ముగ్గురు పాత్రికేయులను కారాగారానికి పంపింది. ఒకవేళ కోర్టు దిక్కులేకపోతే, ఆ పాత్రికేయులకు ఏ దిక్కూ ఉండేది కాదు. హైదరాబాద్ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత వారు విడుదలయ్యారు. అయితే వారిని అరెస్ట్ చేయడానికి కారణం తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడమట. అది కాస్త సీఎం రేవంత్ రెడ్డికి నచ్చలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నచ్చలేదు. దీంతో కోపానికి గురై జైల్లో వేశారు. ఆ పాత్రికేయుల ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. వారి తిట్టు ఘాటుగా అధికార పార్టీ నసాళానికి తగిలింది. ఒక్క సంఘటనే కాని బోలెడు కేసులు.
తెలంగాణలో ఇలా ఉండగా మహారాష్ట్రలో మరో ఘటన చోటుచేసుకుంది. ముంబైలో ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారనే కారణంగా కమెడియన్ కునాల్ కామ్రాపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కామ్రా తన స్టాండ్ అప్ కామెడీ ప్రదర్శనలో షిండేపై వ్యంగ్యంగా‘దేశద్రోహి’అని వ్యాఖ్యానించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ప్రభుత్వ మద్దతుదారులు ఆరోపించారు. మరింత ముందుకు వెళ్లి మహారాష్ట్ర శాసన మండలిలో 2025 మార్చి 27న కామ్రాపై ప్రివిలేజ్ నోటీసు జారీ చేయించారు.
ఇక గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గడిపై 2025 ఫిబ్రవరి 10న ఎఫ్ఐఆర్ నమోదైంది. జామ్నగర్లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రతాప్ గరీ ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో(రక్త దాహార్తుల్లారా మాట వినండి) శీర్షికతో ఓ కవిత రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఇది విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ జనవరి మూడో తేదీన జామ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు మద్దతుగా గుజరాత్ హైకోర్టు కూడా ఈ కవితను “అపకీర్తికరమైనదిగా” ప్రకటించింది. దీనిపై ఇమ్రాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తిరస్కరించింది.
ప్రతిదానికీ సుప్రీంకోర్టు తన సమయాన్ని విచ్చెంచి, ఒకవేళ సమయం లేకపోయినా సరే కష్టపడి స్పష్టతతో కూడిన సమాధానం ఇవ్వాలి. అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. “ఈ కవిత ఏ సమాజానికి, ఏ మతానికి, ఏ రకమైన సముదాయానికి టార్గెట్ చేసి రాశారని అనుకోవడం ఎందుకు?” అని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఆ కవితతో ఆయన శాంతి సందేశాన్ని అందించారని తెలిపింది. గుజరాత్ పోలీసులు మాత్రం దీనిని “ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది, దేశ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంది” అని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కోర్టులో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భజన చేస్తే గవర్నర్, సీజేఐ, ఎంపీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ కవిత విషయం మీద సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే “వ్యక్తిగతంగా లేదా ఒక వర్గానికి బృందానికి, జట్టువారికి తమ అభిప్రాయాలను వ్యక్తపరచే స్వేచ్ఛ ఆరోగ్యకరమైన నాగరిక సమాజానికి అనివార్యం. భావవ్యక్తీకరణ లేకుండా మన సంస్కృతి అభివృద్ధి చెందలేదు” అని తీర్పులో స్పష్టం చేసింది.
ఇంకా చెపుతూ “పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం తమ అధికారం మీద అసురక్షితంగా ఉండి, విమర్శను హానికరంగా భావిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేయడం తగదు.” అని సూచించింది. ఇంత స్పష్టంగా న్యాయస్థానం చెప్పినా మళ్లీ ఎన్నోకేసులు పెడతారు..!
ప్రభుత్వం ‘సడక్ ఛాప్’(రోడ్డుపై లభించే చీప్ కవిత) అంటూ ఈ కవితను వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు మాత్రం అభిప్రాయ స్వేచ్ఛకు అనుకూలంగా తీర్పునిచ్చింది. “75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో కేవలం ఒక కవితా వచనం లేదా వ్యంగ్యంగా చెప్పిన కామెడీ సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడుతోందని అనుకోవడం సరికాదు. అలా అనుకోవడం సమాజాన్ని మూగబోయేలా చేస్తుంది, అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది.”
“ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా భావన అత్యంత ప్రాధాన్యమైనది. కవి, రచయిత, కళాకారుడు లేదా నాటక రచయిత ఎవరైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు కలిగి ఉండాలి. కేవలం మెజారిటీకి నచ్చనందుకు ఎవరినీ మాట్లాడకుండా చేయలేరు. ఒక సమాజం కేవలం మెజారిటీ అభిప్రాయాన్ని మాత్రమే అనుసరించి, ఇతర భావజాలాలను అణిచివేస్తే, అది ప్రజాస్వామ్యం కాదు” అని వ్యాఖ్యానించింది.
స్వేచ్ఛాయుత భావవ్యక్తీకరణను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. భావవ్యక్తీకరణ హక్కు మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉంది. కవిత్వం, నాటకం, స్టాండ్-అప్ కామెడీ, వ్యంగ్యం వీటిని అణిచివేయాలనే ప్రభుత్వ యత్నాలు సదాచారం కాదు. ఇప్పటికన్నా నిరంకుశ ప్రభుత్వాల ఆలోచనలో మార్పు వస్తుందంటారా?
మాడభూషి శ్రీధర్
(ఎల్ఎల్డి, ఎమ్సీజె., ప్రొఫెసర్- మహీంద్రా విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.