
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలతో కోనాకార్పస్ మొక్క మరొక సారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మొక్కపై పలు ఆరోపణలు ఉన్నాయి. స్పీకర్ వ్యాఖ్యలతో మరింత బలాన్ని పొందే అవకాశం ఉంది. అవన్నీ నిజమైనవేనా కాదానే మీమాంసలో కొద్దోగొప్పో జీవశాస్త్ర జ్ఞానం తెలిసిన వారు గందరగోళ పడుతున్నారు.
“ఎక్కడ బడితే అక్కడ హరితహారం పేరు మీద కోనాకార్పస్ మొక్కలు నాటారు. వాటిమీద పిట్ట కూడా వాలదు. ఈ మొక్కలను ఏ జంతువు తినదు. ఇవి భూగర్భ జలాలను నాశనం చేస్తాయి, ఇవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్‌ను వదులుతాయి. ఈ మొక్కలన్నింటిని తీయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను” స్పీకర్ అన్నారు.
ప్రభుత్వాలు ఖాళీప్రదేశాలలో, రోడ్ల వెంట, డివైడర్ల మధ్య చెట్లు ఎందుకు నాటుతారు? పచ్చదనం పెంచి అధిక వర్షపాతాన్ని పొందడం కోసం. రెండు గాలిలో ఆక్సిజన్ శాతం పెంచడానికి, గాలిలోని దుమ్ము ధూళిని అడ్డుకొని ఆకర్షించి వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి, శబ్దకాలుష్యాన్ని నియంత్రించడానికి . అంతే గాని పళ్ళూ ఫలాలు పొందడానికి, నాణ్యమైన కలప పొందడానికి, పక్షులకు గూళ్ళు కట్టుకోవడానికి, జంతువులకు మంచి ఆహారం అందించడానికి మాత్రం కాదు.
అలాగే ప్రభుత్వాలు, తక్కువ ఖర్చుతో పెంచగలిగేవి, తక్కువ నీటితో త్వరగా పెరిగేవి, జంతువుల నుండి లేదా శత్రువుల నుండి తమను తాము కాపాడుకోగలిగేవి, విపరీతంగా కొమ్మలు విస్తరించి స్థలాన్ని ఆక్రమించని (రోడ్లకు అడ్డం రాకుండా) మనం వేసిన సంఖ్యను మించి ఎక్కువగా సంతానోత్పత్తి లేని మొక్కలను పెంచాలనుకుంటాయి. ఇదిగో ఈ లక్షణాలాన్నీ ఈ కోనాకార్పస్కు లక్షణంగా ఉన్నాయి. బహుశా అందుకే గత ప్రభుత్వం ఈ మొక్కలను నాటి ఉండవచ్చు.
కోనాకార్పస్ ఎప్పుడూ పచ్చగా వుండే మొక్క. దీని పచ్చదనం కండ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. కోనాకార్పస్ మెక్క పచ్చగా వుండటం వల్ల కాంతి ఉన్న సమయంలో కిరణజన్య సంయోగ క్రియ జరుపుతూనే ఉంటుంది. అంటే కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని నిరంతరం ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కానీ స్పీకర్ ఈ మొక్క ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుందని చెప్పడం సరైంది కాదు. అంతేకాకుండా ఒక మొక్క వేగంగా పెరుగుతోంది అంటే వేగంగా గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను పిండి పదార్థంగా మార్చి కలప రూపంలో నిలువ చేసుకుంటున్నదని అర్ధం. ఇది ఏ రకంగా చూసినా కాలుష్యాన్ని తగ్గించడమే కదా.
దాని ఆకులు జంతువులు తినవు అన్నారు. ప్రతీ మొక్కకు దాని ప్రయోజనాలు దానికుంటాయి. తనను తాను రక్షించుకునే పద్ధతులు దానికి ఉంటాయి. అందుకే ఇతర జంతువులకు రుచించని పదార్ధాలను తన ఆకులలో ఉత్పత్తి చేసుకుని తనను తాను రక్షించుకుంటుంది. ఆ మొక్కను పెంచాలనుకునే వారికి అది లాభదాయకాంశమే కదా! పిట్టకూడా వాలదన్నారు. కోనాకార్పస్ చాలా గుబురుగా ఆకులను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చిన్న పక్షులు లోపలికి వెళ్ళలేవు. రెక్కలు ఆడించడమూ కష్టమవుతుంది. ఈ చెట్టు లేత కొమ్మలు చాలా పెళుసుగా ఉంటాయి. పెద్ద పక్షులు ఈ కొమ్మలపై వాలడం సులభం కాదు. దీనివలన మనకు వచ్చే నష్టమేంటి? మనం ఇష్టంగా పెంచే అశోక మొక్కలు, వ్యాపార ప్రయోజనం కోసం పెంచే యూకలిప్టస్ మొక్కలు కూడా ఇవే లక్షణాలతో ఉంటాయి కదా? ఇవి భూగర్భజలాలను హరిస్తాయనేది మరో ఆరోపణ. ఇది కూడా పూర్తిగా సరైనది కాదు. యూకలిప్టస్ మొక్కలు, అశోక మొక్కలు కూడా ఎత్తుగా ఎదుగుతాయి. నీరు అధికంగా తీసుకుంటాయి.
ప్రపంచంలో ఏ మొక్క అయినా నీటిని పీల్చుకుంటుంది. అంతేకాదు తీసుకున్న నీటిలో ఎక్కువ శాతం దాదాపు 98% నీటిని బయటకు భాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. భాష్పోత్సేకం ద్వారా విడుదల అయిన నీరు మేఘాలను ఏర్పరచడంతో పాటు వర్షాలు కురిసేటట్లు కూడా చేస్తాయి. కోనాకార్పస్ మొక్క దీనికి భిన్నంగా ఏమీ ఉండదు.
కోనాకార్పస్ వేరు వ్యవస్థ గురించి కూడా కాస్త ఆలోచిద్దాం. కోనాకార్పస్ వేర్లు ఉపరితలం తేమగా, తడి ప్రాంతాలలో భూమి పైపొరలో సమాంతరంగా సుమారు 30 నుంచి 50 అడుగుల వరకు విస్తరించవచ్చు. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో 10 నుంచి 16 అడుగుల లోతు వరకు వేర్లు విస్తరిస్తాయి. నీటివనరులు పుష్కలంగా ఉన్నచోట మాత్రం 33 అడుగుల లోతు వరకు వెళ్ళవచ్చు. ఈ మొక్క అందించే లాభాలతో పోలిస్తే భూగర్భజలాలు అంతరించిపోతాయనే మాట అంత సరైంది కాదు. అసలు తెలంగాణాలో భూగర్భజలాలు సగటున ఎంత లోతులో ఉన్నాయనేది కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. తెలంగాణలో భూగర్భజలం అందుబాటులో ఉండే సగటు లోతు 7.46 మీటర్లు. అంటే 24.5 అడుగులు. హైద్రాబాద్ లో ఈ సగటు 31 అడుగులు. ఈ పరిస్థితిలో కోనాకార్పస్ మొక్క వేర్లు భూగర్భజలాలను అందుకునేంతగా విస్తరించలేవు. తాను గ్రహించిన నీటినే ఎక్కువ కాలం నిలువ ఉంచుకునే ఎడారిమొక్కల లక్షణాలు దీని మందపాటి ఆకులలో గమనించవచ్చు.
అయితే ఇవి కొంతవరకు భూగర్భ నీటిగొట్టాలను అడ్డుకునే అవకాశముంది. ఈ విషయంలో ఈ మొక్కలను ఎక్కడ నాటాలి అనే జాగ్రత్త, విచక్షణ అవసరం. హైవే రోడ్ల డివైడర్లలో వీటిని నాటడం వలన నష్టం ఏముంటుంది?
ఇక ఊపితిత్తులకు ఇబ్బంది కలగడం గురించి మాట్లాడినట్లయితే మొక్కలు పుష్పించే సీజన్లో పుప్పొడి రేణువులను గాలిలోకి వదులుతాయి. అవి ఏ మొక్కకైనా సహజం. దీనివల్ల కొంతమందికి అలర్జీ రావచ్చు. దీనికి ప్రత్యేకంగా కోనాకార్పస్ను నిందించాల్సిన పని లేదు. ఉదాహరణకు మనం పవిత్రంగా భావించే తులసి, అందం కోసం పెంచుకునే బంతి, వ్యాపార పంటగా సాగుచేసే సన్‌ఫ్లవర్ కూడా తన పుప్పొడి ద్వారా శ్వాసకోశ సంబంధ వ్యాధులను ఉత్తేజితం చేస్తాయి.
కోనాకార్పస్ ప్రత్యామ్నాయంగా పెంచాలని చెబుతున్న స్థానిక మొక్కలు రావి, తుమ్మ, చింత, నిమ్మ చెట్లు కూడా పుప్పొడిని అధికంగా వెదజల్లడంతో పాటు శ్వాసకోశ రుగ్మతలను, ఎలర్జీలను కలిగిస్తాయి. రావిచెట్లు పండ్లను తిన్న పక్షులు ఇండ్ల మీద విత్తనాలను విసర్జించడం ద్వారా ఎంత విధ్వంసం కలుగుతుందో విజ్ఞులకు చెప్పవలసిన అవసరం లేదు. తుమ్మ ముండ్లు కలిగిన మొక్క రైతులకు ఆ ముండ్లు గుచ్చుకుని సెప్టిక్ అయిన కేసులు గతంలో ఎన్నో ఉండేవి. మునగమొక్క తేలికగా విరిగిపోతుంది. రోడ్డు ప్రక్కన దాన్ని నాటితే దాని కాయలకోసం విరగ్గొడతారు. మర్రి కొమ్మల విస్తరణ చాలా ఎక్కువ. బూరుగుదూది కళ్ళకు ప్రమాదం. ఇలా చెబుతూ పోతే ప్రతీ మొక్కకు కొన్ని ప్రయోజనాలు, కొన్ని లోపాలు ఉంటాయి. ఉదాహరణకు జిల్లేడు విషపు మొక్క దాని పాలు, విత్తనాలు కళ్ళలో పడితే చాలా ప్రమాదం. కానీ ప్లెయిన్ టైగర్, (స్ట్రెస్డ్ టైగర్ వంటి సీతాకోకచిలుకలు పెరగడానికి దోహదపడి జీవవైవిద్యానికి సహకరిస్తుంది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రాజకీయాలు పర్యావరణాంశాలను ప్రభావితం చేయకుండా చూసుకోవడం మంచిది. మనం గమనించే ఉంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు పసుపు రంగు ఆకులు, పూలు కలిగిన మొక్కలతో నింపారు. అలాగే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీరంగు పూలు పూసే మొక్కలను అధికంగా నాటారు. ఇలా ఉంటాయి మన రాజకీయ ప్రయోజనాలు. కొన్ని లక్షల కోనాకార్పస్ చెట్లను తొలగించి వేరే చెట్లను పెంచమని ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ సలహా ఇచ్చారు. ఇలా పచ్చగా ఎదుగుతున్న చెట్లను తొలగించి మరొకరకం చెట్లను నాటడం పట్టణాలకు, నగరాలకు, జిల్లాలకు, పథకాలకు ఒక పేరు మార్చి మరొక పేరును తగిలించడమంత సులభం కాదు. పర్యావరణం బాగుపడకపోగా అస్తవ్యస్తమయ్యే ప్రమాదమున్నది. అంతేగాక ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తాజ్‌మహల్‌ను కాలుష్యం నుండి రక్షించేందుకు నాటిన చెట్ల నుండి 454 చెట్ల కొట్టివేతకు సంబంధించిన కేసులో “పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టివేయడం. మనుష్యులను చంపడం కంటే దారుణం” అని వ్యాఖ్యానించింది. అంతేగాక పర్యావరణ సంబంధిత కేసులలో దయ చూపకూడదని అన్నది.
ప్రభుత్వాలు ఏదైనా బృహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు రాజకీయాలకు అతీతంగా శాస్త్రీయ దృష్టితో సంబంధిత నిపుణులను సంప్రదించి నిర్ణయాలను తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం మొక్కలను పెంచడం, కొట్టివేయడం వంటి విషయాలలో నిర్ణయం తీసుకోకూడదు. ఏది ఏమైనా ఒకే రకమైన చెట్లు పెద్దఎత్తున పెంచడం కూడా జీవప్రపంచంలో వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పటికే కోనోకార్పస్ చెట్లు అవసరానికి మించి ఉన్నాయని భావిస్తే కొత్తవి పెంచడం ఆపాలి. రాబోయే సీజన్లో వైవిధ్యం ఉన్న స్థానిక మొక్కలను పెంచడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇప్పటికే ఉన్న మొక్కలను పూర్తి అవగాహన, తగిన సంసిద్ధత లేకుండా తొలగిస్తే ఏర్పడే పర్యావరణ నష్టాన్ని పూడ్చడానికి మరొక 20 ఏండ్ల కాలం పట్టవచ్చు.
జి గోపాలకృష్ణ
జీవశాస్త్ర- విశ్రాంత ఉపాధ్యాయుడు
8555030366