
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నాటి నుండి తనదైన శైలిలో ప్రపంచ దేశాలను ట్రంప్ వివాదాలలోకి లాగుతున్నాడు. అలెగ్జాండర్‌లా నిరంకుశత్వంతో ప్రపంచాన్ని ఏలాలని, మాట వినని దేశాలను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికై, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం వేళ అధిక ప్రసంగంతో తన అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపాడు. ప్రస్తుతం తనదైన శైలిలో ఊగిపోతు తన కన్నుపడిన ప్రతి దేశాన్ని బెదిరిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్ని తన కనుసన్నలలో మెలగాలని ఆరాటపడుతున్నాడు.
పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, రష్యా ఉక్రెయిన్ ఇలా అన్ని ఖండాలను తన వైఖరితో ఉచ్చులోకి లాగుతున్నాడు. కొలంబియా, మెక్సికో, గ్వాటిమాల దేశ పౌరులను అక్రమ వలసదారులని ముద్రవేసి అవమానిస్తున్నాడు. అంతేకాకుండా, ఆ దేశ పౌరులకు బేడీలు వేసి మరి యుద్ధ విమానాల ద్వారా వెనక్కి పంపుతున్నాడు. ఈ నేపథ్యంలో కొలంబియా మాత్రం కాసింత గట్టిగానే స్పందించింది. తమ పౌరులని తాము రప్పించుకుంటామని బదులిచ్చే సాహసం చేసింది. ట్రంప్ పదేపదే టారీఫ్ నామజపం చేస్తూ ప్రపంచదేశాలను అభద్రతకులోను చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదంలో అడుగు వేసి, ప్రపంచ దేశాలన్ని తన వెనకే నడవాలన్నట్టుగా ట్రంప్ వైఖరి ఉంది. అయితే ఏ దేశ పౌరులకైనా తమ దేశమే తమకు ఫస్ట్, కేవలం ఒక్క అమెరికాకే ఆ మాట సొంతం కాదు.
అటుతిరిగి ఇటుతిరిగి అమెరికా అధ్యక్షుడి కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. అటానమస్ రీజియన్ గ్రీన్‌లాండ్‌ను కొంటానని చెప్పి ట్రంప్ తన నోరు పారేసుకున్నాడు. దీనిపై యూరోపియన్ పార్లమెంట్లో గట్టిగా ఆ దేశ నాయకులు బదులిచ్చారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన గ్రీన్లాండ్ పూర్తి సార్వభౌమత్వం కలిగి ఉందని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ అమ్మకపు సరుకు కాదని, ఆ దేశ ప్రధాని ట్రంప్‌కు తెలిపారు. అయినా కానీ డెన్మార్క్‌ను బెదిరించి గ్రీన్‌లాండ్‌ను వశం చేసుకోవాలనుకుంటున్నాడు. దీని వెనుక ట్రంప్ మతలబేంటంటే విలువైన అపార ఖనిజ సంపదను కొల్లగొట్టాలనుకోవడం.
1721లో డెన్మార్క్ గ్రీన్లాండ్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. 1953 నాటికి గ్రీన్లాండ్ డెన్మార్క్‌లో భాగంగా తీర్మానం జరిగింది. స్వపరిపాలన తీర్మానం ద్వారా గ్రీన్లాండ్ ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది. అతి తక్కువ జనసాంద్రత ఉండి, మంచుతో కప్పబడిన గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కంటే ముందే ఆండ్రూజాన్సన్, హారిట్రూమన్లు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అమెరికా తన రక్షణ బేస్‌ను కూడా గ్రీన్లాండ్లో పెట్టింది. డానిష్ ప్రభుత్వం ట్రంప్ చప్పుళ్ళకు బెదరలేదు, గట్టిగా తిరిగి బదులిచ్చింది. అయితే, నాటోలో భాగస్వామి డెన్మార్క్‌ను లొంగదీసుకోవడం అమెరికాకు అంత తేలిక కాదు.
మరోవైపు పనామా కాలువను వెనకకు తీసుకుంటానని ట్రంప్ పనామా దేశాన్ని హెచ్చరిస్తున్నాడు. తమ దేశ వాణిజ్య రవాణాపై అధిక సుంకాలను విధిస్తుందని, పనామా కాలువను అమెరికాకు తిరిగి ఇవ్వాలని ట్రంప్ తన కోరికను బయట పెట్టాడు. దీనిపై స్పందిస్తూ పనామా కాలువ పనామా భూమిపై ఉందని, అది ఇతరుల ఆస్తి కాదని పనామా అధ్యక్షుడు మలినో బదులిచ్చాడు. 1904లో పనామా కాలువ నిర్మాణం మొదలై, 1914లో పూర్తి అయ్యింది. టోరిజోస్- కార్టల్ ఒప్పందం మేరకు పనామా కాలువ పనామా దేశానికి చెందుతుందని ఆ ఒప్పందం సారాంశం. 1999 నుండి పూర్తిగా పనామా ప్రభుత్వమే కాలువను నిర్వహిస్తుంది. ఇప్పుడు చైనా ప్రాబల్యం పెరుగుతుందనే బూచితో పనామాను లాక్కొంటామని ట్రంప్ అనడం దురహంకార ప్రదర్శనే అవుతుంది.
ఉక్రెయిన్ చర్యలే ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధానికి దారి తీశాయని ట్రంప్ అన్నాడు. ఈ మాటలను ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలన్స్కీ తీవ్రంగా ఖండించాడు. యుద్ధాన్ని ఆపి, తమ దేశానికి ఉక్రెయిన్ ఖనిజ నిక్షేపాలపై 50% రాయితీ ఇవ్వాలని ట్రంప్ తాజా ప్రతిపాదన. ట్రంప్ కోరినట్టు సాధ్యం కాదని, దేశాన్ని విక్రయించలేనని జెలనస్కీ బదులిచ్చాడు. ట్రంప్ గొంతమ్మ కోరికలు కోరుతున్నారని అన్నాడు.
తాజాగా పశ్చిమాసియాలోని గాజాను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతం చేస్తానని, పాలస్తీనియన్లు ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని మరోసారి ట్రంప్ వాచాలత్వం ప్రదర్శించాడు. ఇజ్రాయిల్- హమస్ ఒప్పందం చేసుకోవాలని, ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహును ఆ దేశ జాతీయ పండగనాడే తన దగ్గరికి రప్పించుకున్నాడు. ట్రంప్ తెంపరితనానికి ఇది మరో నిదర్శనం. ఇరాన్‌ను బెదిరించి అణుస్థావరాలను నిర్వీర్యం చేయాలని హెచ్చరిక కూడా ఇచ్చాడు.
ట్రంప్ ఇలా అన్ని దేశాలను తన మాట వినాలని, తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. టారిఫ్‌ల పేరుతో ప్రేలాపనలు చేస్తూ, ప్రపంచాన్ని అస్థిర పరచాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ రక్షణ బడ్జెట్లను అమాంతం పెంచుకుంటున్నాయి. డెన్మార్క్ గ్రీన్లాండ్ రక్షణ బడ్జెట్‌ను పెంచుతామని ప్రకటించింది. ఉక్రెయిన్ కూడా అదే దారిలో వెళ్తుంది.
యూఎస్ ఎయిడ్ నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్త ఎయిడ్స్ రోగులకు మరణ శాసనం రాస్తున్నాడు. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలోకి నెట్టివేస్తున్నాయి. రక్షణ బడ్జెట్లు పెంచుకోవటం అంటే ప్రజల సంక్షేమం ఆవిరి కావటమే అవుతుంది. ఆయా దేశాలకు మిలటరీపై మరింత ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణ మంటలను ఎగిసే విధంగా ట్రంప్ పురికొల్పుతున్నాడు. ఇది ప్రపంచశాంతికి విఘాతం కాకపోదు.
డా. సుంకర రమేశ్
ఆర్ధికశాస్త్ర ఉపన్యాసకులు
9492180764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.