
భన్వర్ మేఘ్వంశీ రాజస్థాన్ రాష్ట్రంలో బిల్వారా జిల్లా సర్దియా గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించినాడు. 13 ఏండ్ల వయసు నుంచే ఆర్ ఎస్ ఎస్ శాఖలో పాల్గొంటూ, వారి అన్య మత విద్వేషపూరిత బోధనలు, కట్టు కథనాలను ఒంటబట్టించుకొని కట్టర్ హిందుత్వవాదిగా మారినవాడు భన్వర్ మేఘ్వంశీ. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మొదటి దశ అయోధ్య కరసేవలో పాల్గొనడానికి బయలుదేరి, లక్నౌలో అరెస్ట్ అయి పోలీసుల దెబ్బలు తిని 15 రోజుల తర్వాత ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. తమను ఆజ్మీర్ లో అయోద్య రైలు ఎక్కించిన సంఘ్ పరివార్ నాయకులు, ప్రచారక్ లు జాడ పతా లేకుండా జారుకున్నారని ఆనాడే గుర్తించాడు. అయినా కూడా సంఘ్ పరివార్ భావజాలం పట్ల ఆయనకు విశ్వాసం సడలిపోలేదు. సంఘ్ పరివార్ ఘోషిస్తున్న హిందూ అఖండ భారత్ నిర్మాణం కోసం, అయోధ్యలో రాములోరీ మందిర నిర్మాణం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్దంగా ఉండేవాడు. ఈ రకంగా సంఘ్ పరివార్ భావజాలాన్ని త్రికరణ శుద్దిగా నమ్మి క్రియాశీల కార్యకర్తగా చాలా ఏండ్లు ఆర్ ఎస్ ఎస్, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగినాడు. ఆర్ ఎస్ ఎస్ శాఖల పని తీరు, శాఖలను విస్తరించే తీరు, కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, వాటిని దాచే పద్దతి, ఆ శాఖలలో పసి పిల్లలకు నూరిపోసే అన్యమత.. ముఖ్యంగా ముస్లిం మత విద్వేషపు పాఠాలు, వక్రీకరించిన చరిత్ర కట్టు కథనాలు, వారికి అందించే పుస్తకాలు, పత్రికలు, సాహిత్యం, హిందుత్వ భావజాలాన్ని వివిధ వర్గాలలో ప్రచారం చేయడానికి స్థాపించిన సంస్థలు, సరస్వతి శిశు మందిరాలు, ఆఖరికి అంబేద్కర్ భావాలను కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా వాడుకోవడం .. వీటన్నిటిని నిశితంగా గమనించిన వాడు భన్వర్ మేఘ్వంశీ.
ఆర్ ఎస్ ఎస్ ప్రచారం చేసే “మనం హిందువులం – మనమందరం బంధువులం” అన్న భావజాలాన్ని నమ్మినవాడు. తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడినాడు. జై శ్రీరాం, వందే మాతరం, హరహర మహాదేవ, జై బజ్ రంగ్ బలి.. అంటూ కంఠనాళాలు తెగిపోయేటట్టు నినదించినవాడు. తన తండ్రి “సంఘ్ పరివారం సంగతి నీకు తెలియదు. వారు దళితులకు, ఆదివాసీలకు, వెనుకబడిన వర్గాలకు ఏమీ మేలు చేసే వారు కాదు. వారి చెంతకు పోవద్దు” అని ఎంత హెచ్చరించినా కాదని సంఘ్ పరివార్ కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొన్నాడు. ఇటువంటి ఒక నమ్మకస్తుడైన ఒక కార్యకర్త “నేనేందుకు హిందువును కాలేకపోయాను” అన్న గ్రంథాన్ని ఎందుకు రాసినాడో తెలుసుకోవడం ఆసక్తికరంగా, జ్ఞానదాయకంగా ఉంటుంది. దళితులు, ఆదివాసీలు, బి సి ల పట్ల సంఘ్ పరివారం చూపిస్తున్న వివక్షను స్వయంగా అనుభవించిన తర్వాత కళ్ళు తెరుచుకొని సంఘ్ పరివారం విషపు కౌగిలి నుంచి బయటపడి హిందూ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, వారి వేధింపులు, బౌతిక దాడులకు వెనుకంజ వేయకుండా జీవితాన్ని గడుపుతున్నాడు భన్వర్ మేఘ్వంశీ.
13 ఏళ్ల వయసు నుంచి ఆర్ ఎస్ ఎస్ లో పని చేస్తున్న భన్వర్ మేఘ్వంశీ కి మొదటి చేదు సంఘటన ఒక జిల్లా ప్రచారక్ ద్వారా అనుభవంలోకి వచ్చింది. అప్పటికి భన్వర్ మేఘ్వంశీ జిల్లా స్థాయి ప్రముఖ్ గా ఉన్నాడు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని వదిలి ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా పని చేద్దామని కలగన్నాడు. అదే విషయాన్ని జిల్లా స్థాయి ప్రచారక్ కు తెలిపినాడు. ఆయన “మీ కులాల నుంచి విస్తారక్ లు మాత్రమే కావాలి ప్రచారక్ లు కాదు” అని భన్వర్ కోరికను నిస్సిగ్గుగా తిరస్కరించాడు. ఆర్ ఎస్ ఎస్ లో కీలకమైన కార్యవాహక్, ప్రచారక్, సంఘ్ చాలక్ పదవులకి బ్రాహ్మణులు, బనియాలు మాత్రమే ఎంపిక అవుతారు. అరుదుగా అగ్రకులాలకు చెందిన క్షత్రియులు, జాట్, మరాఠాలు ఎంపిక అవుతారు. ఆర్ ఎస్ ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంపిక అయిన 6 గురు సర్ సంఘ్ చాలక్ లలో 5 గురు బ్రాహ్మణులు, ఒకరు క్షత్రియులు. అసలు ప్రచారక్ పదవికే ఎంపిక కాలేని దళిత, ఆదివాసీ, బి సి లు వారు ఎంత సీనియర్ నాయకుడైనా సంఘ్ చాలక్ లేదా అత్యున్నత సర్ సంఘ్ చాలక్ పదవికి ఎంపిక కానేకారని భన్వర్ మేఘ్వంశీ అభిప్రాయపడినాడు. ఇక రెండో చేదు అనుభవం.. తన ఊరు సర్దియాలో సంఘ్ పరివార్ సమావేశం జరిగినప్పుడు తన తండ్రి వారించినా కాదని నాయకులను భోజనాలకు తన ఇంటికీ ఆహ్వానించాడు. మంచి వంటకాలను తయారు చేయించాడు. సమావేశం తర్వాత “ఇంటికి రావడానికి సమయం లేదు. మరో ఊరికి వెళ్ళాలి. పార్సల్ చేసి ఇవ్వు. దారిలో తింటాము” అని అన్నప్పుడు కొంత నిరాశ చెందినా తింటారని ఆశించి వంటకాలను టిఫిన్ బాక్సులలో నింపి పంపించాడు. మరుసటి రోజు తాను కట్టించిన ఆహారమంతా ఊరి అవుతల రోడ్డు పక్కన డొంకలో పారబోసిన విషయాన్ని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకొని నమ్మలేక స్వయంగా చూసి నిర్ఘాంతపోయినాడు. జిల్లా నాయకుడిని ఈ విషయంలో నిలదీసినప్పుడు టిఫిన్ డబ్బా జారిపోయి ఆహారమంతా ఒలికిపోయిందని మళ్ళీ అబద్దం అడినప్పుడు మరింత నిర్ఘాంతపోయినాడు. టిఫిన్ డబ్బా కిందపడితే ఆహారం రోడ్డు మీద పడాలి కానీ రోడ్డు పక్కన డొంకలో ఎట్లా పడుతుంది ? టిఫిన్ డబ్బాకు సొట్ట కూడా పడలేదు. అన్నీ విశ్లేషించుకున్న భన్వర్ మేఘ్వంశీ వివక్షతాపూరిత ఈ చేదు అనుభవాల తర్వాత ఇక తాను సంఘ్ పరివారంలో కొనసాగడం అంటే తనను తాను వంఛనకు పాల్పడినట్టే అనుకున్నాడు. “మనం హిందువులం – మనమందరం బంధువులం” అన్న ఆర్ ఎస్ ఎస్ నినాదం వట్టి బూటకమని అతనికి అర్థం అయ్యింది. దళితులు, ఆదివాసీలు, బిసి కులాలు వారి మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని అమలు చేయడానికి వాహకులుగా మాత్రమే పనికి వస్తారని అర్థం చేసుకున్నాడు. సంఘ్ పరివారం ప్రేరేపించే మత కలహాల్లో హింసకు పాల్పడే కార్యకర్తలందరు దళితులు, ఆదివాసీలు, బిసి కులాల కార్యకర్తలే తప్ప అగ్ర కులాల వారు కాదని భన్వర్ గ్రహించాడు. గుజరాత్ మారణకాండలో అది రుజువయ్యింది. ఆ తర్వాత సంఘ్ పరివార్ మతతత్వ వ్యతిరేక కార్యకలాపాలను ఉదృతంగా నిర్వహించినాడు. దళిత ఆదివాసీ బిసి కులాల సమాజాలను, ముఖ్యంగా విద్యార్థులను, యువతను చైతన్య పరచేందుకు తీవ్రంగా కృషి చేసినాడు. “వజ్ర భారత్” పత్రికను స్థాపించి మత ఘర్షణల నిజనిర్ధారణ రిపోర్టులను తయారు చేసి ప్రచురించినాడు. అన్ని రకాల మతతత్వ శక్తుల భావజాలాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా వ్యాసాలను రాసినాడు. 2002 లో గుజరాత్ లో ముస్లింలపై దారుణ మారణ కాండ జరిగినప్పుడు గుజరాత్ వెళ్ళి సంఘటనలు జరిగిన ప్రాంతాలను చూసి, బాదితులను కలుసుకొని వారి అనుభవాలను నమోదు చేసుకొని వజ్ర భారత్ ప్రత్యేక సంచికను వెలువరించినాడు. అందుకు కక్షగట్టిన సంఘ్ పరివారం తనను వేధించి వెంటాడిన తీరును ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించినాడు. వారి బెదిరింపులకు, బౌతిక దాడులకు వెరవకుండా ధైర్యంగా తన మతతత్వ వ్యతిరేక పోరాట మార్గంలో ఇంకా పయనిస్తూ ఉన్నాడు. ఈ సంగతులన్నిటిని ఒక లోపలి మనిషిగా తన ఆత్మకథగా రాసి ఆర్ ఎస్ ఎస్, దాని పరివారం నిజ రూపాన్ని ప్రపంచానికి అందించాడు భన్వర్ మేఘ్వంశీ.
భన్వర్ మేఘ్వంశీ హిందీలో రాసిన ఈ పుస్తకాన్ని “నవయానా” పుస్తక సంస్థ వారు 2020 లో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు. 2024 లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు తెలుగులో ప్రచురించారు. కే సత్యరంజన్ అనువాదం సరళంగా పఠనీయంగా ఉన్నది. సంఘ్ పరివార్ మతతత్వ భావజాలంలో యువతరం కొట్టుకుపోతున్న తరుణంలో ఈ పుస్తకం రావడం సముచితమైనది. “ప్రతీ భారతీయుడు చదవాల్సిన పుస్తకం ఇది. మన కనులు తెరిపించి మన ఆలోచనలకు స్వేచ్ఛను కల్పించే రచన” అని పుస్తకం పై బెన్యమిన్ వ్యక్తం చెసిన అబిప్రాయం వంద శాతం నిజం. ఆర్ ఎస్ ఎస్ పన్నాగాలను వమ్ము చేసే శక్తి ఈ పుస్తకానికి ఉందని, అందరూ తప్పక చదవాల్సిన పుస్తకమని ప్రొ కంచె ఐలయ్య గారు కూడా కితాబునిచ్చారు. 200 పేజీల పుస్తకం వెల రు.300 అయినా అందరూ కొని చదవదగ్గ పుస్తకమే.
– శ్రీధర్ రావు దేశ్పాండే
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.