
‘‘ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)కి నివాళులు అర్పించడానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆజాద్ హింద్ ఫౌజ్ లేవనెత్తిన జాతీయ గౌరవం, ఐక్యత, మత సోదరభావం, లౌకికత్వం అనేవి కూడా అంతే అత్యున్నతమైనవని నేను భావిస్తున్నాను.’’
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒక ముఖ్యమైన స్థానాన్ని చోటుచేసుకుంది. భారత జాతీయత అనేక విభాగాలుగా విడివడిన సమయంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకోవడం, ఆయన స్థాపించిన ఐఎన్ఏ జాతీయ ఐక్యతను ప్రదర్శించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ ఐక్యత కోసం భారత సైనికులు ఐక్యంగా పోరాడారు. భారత సైన్యంపైన ఇక ఎల్లకాలం ఆధారపడలేమనే భావనను బ్రిటిష్ వారిలో ఐఎన్ఏ సాయుధపోరాటం బలంగా నాటింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో 2015 మార్చి 7న తొలి కెప్టెన్ అబ్బాస్ అలీ స్మారకోపన్యాసంలో ప్రముఖ చరిత్ర కారులు ఇర్ఫాన్ హబీబ్ చేసిన ప్రసంగం. ఐఎన్ఏ, లేదా ‘ఆజాద్ హింద్ ఫౌజ్ వారసత్వం’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
సుభాస్ చంద్రబోస్ జయంతి వేళ ఆ ప్రసంగం..
“ఐఎన్ఏ గురించిన సమాచారం దేశమంతా విస్ఫోటనంలా అలుముకున్నప్పుడు నేను స్కూలు విద్యార్థిని.
జపాన్ లొంగి పోయినప్పుడు ఐఎన్ఏ గురించి భారత ప్రజలకు మాత్రమే తెలుసు. కరాచీలో 1931 మార్చిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన తీర్మానంతో జాతీయోద్యమ స్వభావం ఏమిటో అర్థమైపోయింది. కాంగ్రెస్ కు ఇదొక కొత్త కార్యక్రమం. వయోజన ఓటింగ్ విధానం, కార్మికుల హక్కులను కాపాడడం, మౌలిక పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకు రావడం, దున్నేవాడికి భూమిని అప్పగించడం, వ్యవసాయ సంస్కరణలు తీసుకురావడం వంటి హామీలన్నీ తొలిసారిగా కాంగ్రెస్ ఇచ్చింది.
అప్పటి నుంచి కార్మిక కర్షక సంఘాలు బలపడడం మొదలుపెట్టాయి. త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఇది ప్రతిబింబించింది.
చంద్రబోస్ వామపక్ష భావజాలం..
వామపక్ష భావాలున్న నాయకుల్లో నెహ్రూతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారనడంలో నిర్వివాదాంశం. జాతీయోద్యమానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారని ఎవరైనా అడిగితే వరుసగా, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అని చెపుతారు. ఇది వ్యక్తుల పరిస్థితిని చెప్పడం కాదు, ఇది జాతీయోద్యమ స్వభావాన్ని చెప్పడం. వామపక్షీయుల్లోనూ విభేదాలున్నాయి. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో, తన ఆత్మకథలోనూ తాను నాస్తికుణ్ణని, మరణం తరువాత జీవితం గురించి తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే నమ్ముతారని నెహ్రూ ప్రకటించాడు. సుభాష్ చంద్రబోస్ మాత్రం జీవిత చరమాంకం వరకు దేవుడిపైన విశ్వాసంతోనే ఉన్నాడు.
ఈ మౌలికమైన తేడాలు బాధించేవి కావు. అయినప్పటికీ, ప్రజలందరినీ ఐక్యం చేయడానికి ఒక రకమైన సోషలిస్ట్ భారత దేశమే ఏకైక ధ్యేయమని భావించారు. సోషలిజం గురించిన వారి భావనల్లో తేడాలుండవచ్చు కానీ, పెట్టుబడిదారీ భూస్వామ్య విధానం ప్రజలకు మంచిది కాదనడంలో వారిరువురి మధ్య ఏకాభిప్రాయం ఉంది.
ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు..
కమ్యునిస్టులు, సోషలిస్టులు కలిసే వామపక్షాలుగా ఉన్నాయి. ఆ సమయంలో ప్రపంచ పరిస్థితుల్లో వెంటనే మార్పులు సంభవించాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 అక్టోబర్ లో మొదలైనప్పుడు హిట్లర్ కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఇండియా కూడా పాల్గొంటుందని బ్రిటన్ ప్రకటించేసరికి కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. హిట్లర్ తరఫున మాట్లాడలేని పరిస్థితి. నాజీ జాత్యాహంకార సిద్ధాంతం ఆర్యేతరులకు కానీ, తెల్లగా లేని భారతీయులకు కానీ నచ్చలేదు. భారతీయులు బ్రిటిష్ వారికి బానిసలయ్యారు కనుక, సహజంగానే జాతీయోద్యమ శ్రేణుల్లో బ్రిటిష్ వారి పట్ల సానుకూలత లేదు.
కాబట్టి, దీని సారాశమేమంటే, ఈ యుద్ధం భారతీయులకు సంబంధించింది కాదు. వాస్తవానికి గాంధీజీ ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు బ్రిటిష్ వారికి అనుకూలంగా అక్కడ మాట్లాడిన మాటలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేదు. ఇక్కడే, తొలిసారిగా వామపక్షాల్లో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
జర్మనీకి వ్యతిరేకంగా నెహ్రూ వైఖరి..
ఫాసిజం స్వభావం ఏమిటో నెహ్రూకు తెలుసు కనుక జర్మనీ పట్ల శత్రుపూరితమైన వైఖరిని అనుసరించాడు. జర్మనీకి వ్యతిరేకంగా రష్యా, అమెరికా యుద్ధంలో ప్రవేశించడానికి కొంత సమయం ఉందని తన ఆత్మకథలో నెహ్రూ రాశాడు. ఇది బోస్, ఆయన అనుచరుల అభిప్రాయం కాదు. ఎందుకంటే ఇంగ్లాండ్ కు శత్రువు అయిన వారు భారత్ కు మిత్రులు అని బోస్ భావించబట్టే ముస్సోలినీని అభిమానించాడు. తొలినాటి జాతీయ వామపక్షీయుల్లో ఇవి రెండు రకాలైన ఎత్తుగడలు. సుభాష్ చంద్రబోస్ కు సోవియట్ యూనియన్ అంటే స్నేహభావం ఉన్నప్పటికీ, జపాన్ దురాక్రమణను వ్యతిరేకించి పోరాడుతున్న చైనా అంటే ఏ మాత్రం సానుభూతి లేదు. యుద్ధం మొదలైన ఏడాదిన్నర తరువాత మాత్రం సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల్లో ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి భారత దేశం నుంచి తప్పించుకుని రష్యా మీదుగా జర్మనీ వెళ్ళాలని బోస్ నిర్ణయించుకున్నాడు.
మానసిక సంక్షోభంలోకి బోస్..
జర్మనీ, ఇటలీ ఏకమై నిలబడినప్పుడు, ఇంగ్లాండ్ ఒంటరి కావడంతో 194లో బోస్ భారతదేశాన్ని వదిలి వెళ్ళాడు. రష్యా, జర్మనీ 1939లో చేసుకున్న నిర్యుద్ధ సంధికి కట్టుబడి ఉన్నాయి. జర్మనీ సోవియట్ యూనియన్ ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉందని బైట వాళ్ళెవరికీ తెలియదు. జర్మనీకి, సోవియట్ యూనియన్ కు మౌలికమైన విభేదాలున్నాయి. బోస్ 1941 ఏప్రిల్‌లో బెర్లిన్ వచ్చేవరకు ఈ విభేదాల విషయం ఆయనకు తెలియదు. హిట్లర్ 1941 జూన్ 22 న సోవియట్ యూనియన్ పైన దాడి చేసే సరికి పరిస్థితులు చాలా సంక్లిష్టంగా తయారయ్యాయి. ఈ సంఘటన బోస్ ను మానసిక సంక్షోభంలోకి నెట్టేసింది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి అర్థం చేసుకున్న రెండు దారుల విధానం చెల్లాచెదరైపోయింది. సోవియట్ యూనియన్ ను వ్యతిరేకించడంలో జర్మనీతో బోస్ ఎప్పుడూ చేతులు కలపలేదు.
మరొక విషయం ఏమిటంటే జపాన్ ఎప్పుడూ సోవియట్ యూనియన్ పై యుద్ధానికి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ, జర్మనీ రాగానే అక్కడ సైన్యాన్ని తయారు చేయడానికి సిద్దమయ్యాడు. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా కాకుండా, అమెరికాకు వ్యతిరేకంగా పెర్ల్ హార్బర్ పైన దాడిచేయడం ద్వారా జపాన్ కూడా 1941 డిసెంబర్లో యుద్ధంలో చేరడంతో ఉన్నట్టుండి పరిస్థితి కాస్తా మారిపోయింది.
కెప్టెన్ మోహన్ సింగ్..
థాయ్ లాండ్లో జాని ప్రీతమ్ సింగ్ ఇండియన్ ఇండిపెండెట్స్ లీగ్ ను స్థాపించి, జపాన్‌తో పాటు మలయాలోకి ప్రవేశించేసరికి బ్రిటిష్ అధికారుల ద్వారా భారత సైన్యాలు లొంగిపోయియి. వాళ్ళు ప్రీతమ్ సింగ్ పిలుపు మేరకు భారత స్వాతంత్ర్యం కోసం తామొక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేయదలిచామని జపాన్ తో మట్లాడారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పడినప్పుడు అందులో కెప్టెన్ మోహన్ సింగ్ ప్రముఖమైన వ్యక్తి. మలయాలో బ్రిటిష్ అధికారుల ద్వారా జపాన్ కు లొంగిపోయినప్పుడు అతను భారత సైన్యం నుంచి వేరుపడ్డాడు.
కొంత కాలం మోహన్ సింగ్ ను మర్చిపోయారు. కానీ అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో చెప్పుకోదగ్గ మనిషి. ‘‘అతనికి ఎలాంటి బలహీన తలు లేవు’’ అని సింగ్ కు మేం చెప్పాం అంటూ మోహన్ సింగ్ కు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వారు నివాళులు అర్పించారు.
మోహన్ సింగ్ అనర్గళంగా ఉపన్యసించగల వక్త. అతను ప్రసంగించిన రెండు రోజుల తరువాత 1942 ఫిబ్రవరి 15న , అతని ఉపన్యాసం భారత సైన్యాలపైన బలంగా పడింది. అది వేలాది మంది సైనికులకు చేరింది. రాస్ బిహారీ బోస్ అనే ఒక విప్లవ కారుడు, భారత దేశంలో తన పై ఉరి వేయదగ్గ శిక్ష విచారణనుంచి తప్పించుకోవడానికి జపాన్ పారిపోయాడు. రాస్ బిహారి బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు.
భారతీయ సైనికులను సమీకరించారనేదే మోహన్ సింగ్ పైన పెట్టిన కేసులో ముఖ్యమైన అభియోగం ; అదికూడా భిన్న మతాలు, భిన్న ప్రాంతాలకు చెందిన సైనికులు వారు. ఆయన ప్రధాన సహచరుడ అక్రమ్. ఎట్టి పరిస్థితిలో కూడా మత విభేదాలు రాకూడదని ఐఎన్ఏలో బలమైన నమ్మకం ఉండేది. అనుకోకుండా జరిగిన ఒక విమాన ప్రమాదంలో మోహన్ సింగ్ తో పాటు అక్రమ్ కూడా మరణించాడు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ప్రకారం మోహన్ సింగ్ 12,000 మందితో బలమైన ఐఎన్ఏని నిర్మించగలడు.
ఆర్థిక సమస్యలు..
మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాళ్ళకు తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నాయి. జపాన్ వారికేమీ పెద్ద ఆయుధాలులివ్వలేదు సరికదా, చిన్న చిన్న ఆయుధాలు మాత్రమే ఇచ్చారు. వారు బ్రిటిష్ వారి నుంచి సంపాదించినవే వారి ఆయుధాలన్నీ. ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ముప్ఫై లక్షల జనాభా ఐఎన్ఏకు ఏ మేరకు సాయం చేస్తుందో కూడా తెలియదు. ఐఎన్ఏలో కూడా భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆగ్నేయాసియా కు చెందిన ముస్లింలు ముస్లింలీగ్ కు మద్దతు తెలుపుతుండగా, ప్రీతమ్ సింగ్, మోహన్ సింగ్ మహాత్మా గాంధీకి, కాంగ్రెస్ కు విధేయులమని ప్రకటించారు.
దూర దృష్టితో పిలుపు..
ఏదేమైనప్పటికీ, మోహన్ సింగ్ దూర దృష్టితో ముస్లింలకు ఒక పిలుపునిచ్చాడు. ఇక్బాల్ రాసిన ‘సారే జహాసె అచ్చా’ అన్న పాటను ఐఎన్ఏ గీతంగా ప్రకటించాడు. భారత దేశాన్ని స్థానికులంతా ప్రపంచంలో అత్యున్నత దేశంగా భావించేలా చేయడానికి ఈ పాట దోహదం చేసింది. ఐఎన్ఏని సొంతం చేసుకుంటూ మన దేశం సైన్యం పాటగా ఇది తయారైంది.
మోహన్ సింగ్ చిన్నచిన్న గ్రూపులను మాత్రమే ముందుకు పంపడం మొదలుపెట్టాడు. సిక్కులు, ఇతర సైనికులు తిరుగుబాటు చేయడంతో పంజాబ్ లో సంక్షోభం ఏర్పడిదందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ విభాగం 1942లో తమ నివేదికలో పేర్కొంది. కొందరు ఐఎన్ఏను విడిచిపెట్టడం కూడా ఉంది. తన ఆధిపత్య భావనతో మేజర్ థిల్లాన్ ఐఎన్ఏని విడిచి వెళ్ళిపోతే, ఆ సమయంలో కెప్టెన్ గిల్ ను జపాన్ అధికారులు ఖైదు చేశారు. ఈ సంఘటనతో జపాన్ తో మోహన్ సింగ్ విభేదాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా మోహన్ సింగ్ ను రాస్ బిమారి బోస్ 1942 డిసెంబర్ 27న ఐఎన్ఏ నుంచి తొలగించాడు.
కీలకమైనపరిణామాలు..
ఐఎన్ ఏ 1942 తరువాతే సైనికంగా అత్యుత్తమంగా తయారైంది. బ్రిటిష్ కానీ, అమెరికా కానీ అస్సాంలోకి పెద్ద ఎత్తున సైనికులను తరలించలేకపోయాయి. ఆ సమయంలో అస్సాంలోకి ఎవరైనా సరే తేలికగా చొరబడవచ్చు. జర్మనీ స్టాలిన్ గ్రాడ్ వైపు దూసుకుపోతోంది. పసిఫిక్ ప్రాంతంలో, ఆగ్నేయాసియాలో జపాన్ దాదాపుగా పూర్తి ఆధికత్యలను సాధిస్తోంది. భారత దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం 1942లో మొదలైంది. ఇది ఐఎన్ఏకి నైతికంగా గొప్ప ఊపునిచ్చింది. గాంధీ, నెహ్రూలిద్దరూ అరెస్టవడంతో వారిరువురూ ఐఎన్ఏ వైపే ఉన్నారని చెప్పడానికి అవకాశం దొరికింది. క్విట్ ఇండియా తీర్మానం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్ మిత్రపక్షాల వైపే ఉందని స్పష్టమైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం తీసుకురావడం ఐఎన్ఏకి నైతిక ప్రోత్సాహమైనా, అనుకోకుండా అది కాస్తా వృథా అయిపోయింది.
ఓడిపోయిన హిట్లర్ సైన్యం..
సుభాష్ చంద్రబోస్ కనుక ఇప్పడున్నట్టయితే పరిస్థితులు మరొక రకంగా మలుపు తిరిగేవి. సుభాష్ చంద్రబోస్ ఆగ్నేయాసియాకి వచ్చేసరికి , నమ్మకం సన్నగిల్లడం మొదలైంది. బోస్ 1943లో ఒక బోట్ లో జర్మనీకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే యుద్ధ అలలు వేరే దిశకు తిరిగాయి. స్టాలిన్ గ్రాడ్ లో హిట్లర్ సైన్యం ఓడిపోయింది. హిట్లర్ తూర్పు దళాలన్నీ 1943 నాటికి కుంగిపోయాయి. జిటాడెల్లీ దారుణంగా విఫలమైంది. యుక్రెయిన్, బెలారస్ లను జపాన్ నుంచి సోవియట్ యూనియన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అమెరికా వైమానిక దాడులతో జపాన్ బాగా దెబ్బతింది. తాను ఆక్రమించుకున్న ప్రాంతాలనే కాకుండా, తన సొంత ప్రాంతాల పై కూడా పట్టు పోగొగొట్టుకుంటోంది.
సుభాస్ చంద్రబోస్ 1943 మేలో ఒక సబ్ మెరైన్ లో ఆగ్నేయాసియా చేరుకోగలిగాడు. అదే ఏడాది జూన్ 5న సింగపూర్ లో ఐఎన్ఏ నుంచి వందన స్వీకారం చేశాడు.
జర్మనీలో బోస్ ను నేతాజీ అని పిలిచేవారు. జర్మనీలోనే ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు ఖరారుచేశారు. కాంగ్రెస్ త్రివర్ణ పతాకం నుంచి ఒక పులి అన్వేషణలో భాగంగా దూకుతున్నట్టుంటుంది. ‘వందేమాతరం’ను ముస్లింలు వ్యతిరేకించడాన్ని బోస్ గమనించాడు. ‘అల్లాహ్ అక్బర్ వందేమాతరం’ అని పఠాన్లు నినదించడం మొదలు పెట్టారు. జనగణమన గీతాన్ని బోస్ స్వీకరించాడు.
ఐఎన్ఏకి నూతన జవసత్వాలు..
‘ఢిల్లీ చలో’ నినాదంతో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏకి నూతన జవసత్వాలు నింపాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాన్ని 1943 అక్టోబర్ 13న ఏర్పాటు చేశాడు. థాయిలాండ్ వంటి ఇతర ప్రభుత్వాలతో పాటు జపాన్ నుంచి కూడా ఆజాద్ హింద్ ప్రభుత్వానికి మోహన్ సింగ్ సాధించలేని గుర్తింపును సుభాష్ చంద్రబోస్ సాధించాడు. గుర్తుంచుకోవలసిని విషయం ఏమిటంటే, ఆజాద్ హింద్ ప్రభుత్వానికి భూభాగం లేకపోయినప్పటికీ, మిగతా అన్ని ప్రభుత్వాలకంటే కూడా దీనికి ఎక్కువ స్వేచ్ఛ, స్వతంత్ర ఉంది.
బోస్ నాయకత్వంలో మిలటరీ చర్యలు చాలా సమర్ధవంతంగా జరిగాయి. తొలుత అర్కాన్ లో, తరువాత భారత సరిహద్దు అస్సాంలో జరిగాయి. అప్పుడు అస్సాం భౌగోళిక భద్రత ఏమిటి? ఇప్పుడున్న మణిపూర్ లో పాక్షికంగా, నాగాలాండ్ లో పాక్షికంగా ఉన్న భాభూగాన్ని ఇంఫాల్ గా ప్రచారంలో ఉండేది. మణిపూర్, నాగాలాండ్‌లోకి జపాన్ చొరబడడంతో అవి దాని ఆధీనంలోకి వెళ్లాయి. మిలటరీ ఉద్యమానికి అప్పటికే ఆలస్యమైంది. 1944 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో అమెరికా దాడులతో జపాన్ అతలాకుతలమైంది. వైమానిక దళం లేకుండా, కేవలం నాలుగు డివిజన్ల పదాతి దళంతో బర్మాలోని తన సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అయాబి ఎందుకీ ఆక్రమణకు పాల్పడ్డాడో చెప్పడం చాలా కష్టం.
బహుశా, సుభాష్ చంద్రబోస్ ఒత్తిడి వల్లనే జపాన్ ఈ ఆక్రమణకు పాల్పడినట్టుగా కనిపిస్తోంది. బహుశా జపాన్ పైన బోస్ ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడనిపిస్తోంది. ఆక్రమణకు సిద్ధమవడంతో బర్మాలో వారు చాలా బలహీనడిపోయారు. మణిపూర్ భూభాగంలో చాలా లోపల ఉన్నమొరాంగ్, ఇంఫాల్ లోని దక్షిణ ప్రాంతాలను రెండు నెలల్లో ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతం రెండు నెలల పాటు ఐఎన్ ఏ ఆధీనంలో ఉండి దాని జాతీయ జెండా రెపరెపలాడింది. తరువాత జపాన్ దారుణంగా ఓటమి పాలైంది. జపాన్ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆలస్యంగా వెనక్కి వెళ్ళడం బహుశా ఇది మరొక పొరపాటై ఉండవచ్చు. ఎందుకంటే ఐఎన్ఏకి భారీ ఆయుధాలంటూ ఏమీ లేవు కనుక, వెనక్కి వెళ్ళిపొమ్మని ఐఎన్ఏకి వారు చెప్పారు. జపాన్ తన సైన్యానికి తర్ఫీదు ఇచ్చినట్టుగా ఐఎన్ఏకి తర్ఫీదు ఇవ్వలేదు. దాంతో బర్మాలోకి చొచ్చుకుపోవడానికి బ్రిటిష్ వారికి దారి సుగమమైంది.
హిరోషిమా పైన అమెరికా అణుబాంబు
ఈ మధ్య కాలంలో బోస్ రంగూన్ను వదిలేసి, బ్యాంక్ కాక్ కు వెనుదిరిగి వచ్చేశాడు. ఆ సమయంలో జపాన్ లోని నాగసాకి, హిరోషిమా పైన అమెరికా అణుబాంబులను వేసింది. సోవియట్ యూనియన్ మంచూరియాని ఆక్రమించగా, 1945 ఆగస్టులో జపాన్ లొంగిపోయింది. వాస్తవం ఏమిటంటే లొంగిపోవడానికి మూడు రోజులు ముందే బోస్ కు ఈ విషయం తెలుసు. బోస్ రష్యాకు వెళ్ళాలనుకున్నాడు. కానీ, బ్రిటిష్, అమెరికా సామ్రాజ్యవాద దేశాలకు బలమైన రష్యా మాత్రమే బాసటగా ఉంది. కానీ ఆ సాహసం ఎప్పుడూ చేయలేదు. జపాన్ కు యు బోట్ లో బోస్ వెళ్ళాడు. ఆయన వెంట జర్మనీకి చెందిన ముస్లిం ఆఫీసర్ అబిద్ హసన్ ఉండగా, ఐఎన్ఏకి చెందిన మరొక ముస్లిం ఆఫీసర్ హబీబ్ ఉర్ రహమాన్ మాత్రం వాస్తవాలు చెప్పడానికి మిగిలి ఉన్నారు.
ఐఎన్ఏ గురించి, ఆజాద్ హింద్ ప్రభుత్వం గురించి భారత దేశంలో ప్రచారం చేయడం కోసమే ఐఎన్ఏ ఖైదీలు భారత దేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. ఆ ప్రభుత్వ లౌకికత్వ స్వభావాన్ని, భారత ప్రజలను కూడగట్టడానికి దానికున్న శక్తి సామర్థ్యాల గురించి, బ్రిటిష్ వారిపై పోరాడే వారి శక్తి గురించిన వివరాలతో ప్రతి వార్తా పత్రికా వార్తలను కథనాలను ప్రచురించాయి. ఐఎన్ఏ పోరాట పటిమను బ్రిటిష్ ఇంటెలిజెంట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఆగ్నేయాసియాలోని చాలా మంది ధనికులు, పేదలు కూడా ఐఎన్ఏకు విరాళాలిచ్చారని జపాన్ గుర్తించింది. ఐఎన్ఏకి అతి పెద్ద విరాళాలిచ్చిన దాత రంగూన్ కు చెందిన హబీబ్ తన ఆస్తి సర్వస్వాన్ని ఐఎన్ఏకి అర్పించాడు.
రెండు శిబిరాలుగా విభజన
రాజకీయాల్లో మత ప్రాతిపదికపైన రెండు శిబిరాలుగా విభజన జరిగింది. దాని లౌకిక అభిప్రాయాలతో పాటు కాంగ్రెస్ హిందూ కుల పార్టీగా అవతరించిందని గాంధీజీనే అంగీకరించాడు. ముస్లింలు 1946లో ఉన్నట్టు ఉంటానికి తిరస్కరించారు. ముస్లింలలో 80 శాతం మంది ముస్లిం లీగ్ కు ఓటు వేశారు. హిందూ మహాసభ వైరస్ లా వ్యాపించింది. ఇదంతా ఐఎన్ఏకి చాలా భిన్నంగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో ‘జైహింద్’నినాదం సర్వసాధారణమైపోయింది. బ్రిటిష్ వారిలో ఐఎన్ఏతో ఎలా వ్యవహరించాలనే చర్చ సాగింది. ఐఎన్ఏ రాజద్రోహానికి పాల్పడిందని, దాన్ని తుడిచి పెట్టాలని భావించారు కానీ, ప్రజాభిప్రాయానికి వెనుకాడారు. ఐఎన్ఏకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ షా నవాజ్, కల్నల్ పి.కె సెహగల్, కల్నల్ గురుబక్ష్ సింగ్ థిల్లాన్ వంటి తొలి ఖైదీలను విచారించాలని ప్రయత్నించారు. ఎర్రకోటలో వారిని విచారించాలనుకున్నారు కానీ, ప్రజా వెల్లువ గగ్గోలు పెట్టింది. ప్రజా వెల్లువ నుంచి మేల్కొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఐఎన్ఏ తరఫున డిఫెన్స్ లాయర్ గా మితవాది సర్ తేజ్ బహదూర్ సప్రును నియమించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సప్రు బ్రిటిష్ ప్రభుత్వంతో స్థిరంగా కుమ్మక్కయి ఉన్నాడు. ఆయన గొప్ప ఉర్దూ పండితుడు. మంచి లౌకిక భావనలున్న వ్యక్తి. అయినా కానీ, బ్రిటిష్ రాజ్యాంగవిధానానికి ఆరాధకుడు. ఆ డిఫెన్స్ కమిటీలో ఆయనతో పాటు జవహర్ లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, కె.ఎన్. కడ్జు, పి.శరన్, బద్రిదాస్, అసిఫ్ ఆలి ఉన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మనం అభినందించక తప్పదు. ఎందుకంటే, ఐఎన్ఏ అభిప్రాయాలకు, తమ అభిప్రాయాలకు చాలా తేడా ఉందని చెపుతూనే, ఐఎన్ఏలోని వారంతా దేశభక్తులని స్పష్టం చేసింది. ఈ అభిప్రాయాన్ని క్షేత్ర స్థాయిలో కూడా పంచుకున్నారు. ఐఎన్ఏ చేసిన అత్యంత గొప్ప మేలు ఏమిటంటే, తన ప్రతిఘటనతో పాటు, పోరాటంలో చాలా మంది అమరులవడం , భారత జాతీయాభిప్రాయం పైన బలమైన ప్రభావం కలగచేసింది.
బ్రిటిష్ వారు ఇక ఏ మాత్రం పాత పద్ధతిలో పరిపాలించడానికి వీలులేదని, ఐఎన్ఏ వారిపైన విచారణ జరపడాన్ని వ్యతిరేకిస్తూ, వారిని విడుదల చేయాలని కోరుతూ, 1945 నవంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఫార్వర్డ్ బ్లాక్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. భారత జనవాహినికి వ్యతిరేకంగా తొలి సారిగా బ్రిటిష్ దళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 33 మంది మరణించినప్పటికీ, ప్రజా వెల్లువ ఏ మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఫలితంగా కలకత్తాలో అబ్దుల్ రషీద్ కు ఏడేళ్ళ కఠిన కారాగారా శిక్షవిధించారు. ఆయన పైన ప్రత్యేకంగా విచారణ చేపట్టడంతో ముస్లిం లీగ్ ఆయన తరఫున వాదించే బాధ్యతను చేపట్టింది. మళ్ళీ 1946 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కలకత్తాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రదర్శన సందర్భంగా 84 మంది మరణించారు.
షానవాజ్ ఖాన్ కు యావజ్జీవ కారాగార శిక్ష..
ఇదే సమయంల ఐఎన్ఏ నాయకుడు షానవాజ్ ఖాన్ కు యావజ్జీవ కారాగార శిక్షవిధించినప్పటికీ, దాన్ని తగ్గించారు. ఎందుకంటే యావజ్జీవ కారాగార వాసానికి లెక్కలేనన్ని పరిణామాలుంటాయి. ఐఎన్ఏ మాత్రమే చేపట్టిన మరొక గొప్ప సంఘటన ఇది. రాయల్ ఇండియన్ నౌకాదళానికి చెందిన 78నౌకలు బొంబాయిలో ఫిబ్రవరి 18 నుంచి 23 వ తేదీ మధ్య తిరుగుబాటు చేశాయి. వెంటనే బ్రిటిష్ దళాల్లో లైసెస్టర్ రెజిమెంట్, ద ఎసెక్స్ రెజిమెంట్, బ్రిటిష్ ఫిరంగి దళం, రాయల్ మెరైన్లు ఆ తిరుగుబాటును అణిచివేశాయి. ఈ నౌకాదళ తిరుగబాటు కేవలం ఐఎన్ఏ వారిని విడుదల చేయమని కోరటం మాత్రమే కాదు, తాము బ్రిటిష్ వారికి లొంగి పోవడం లేదని, భారత దేశానికి మాత్రమే లొంగిపోతున్నామని చెపుతూ, పెద్ద పెట్టున ‘జైహింద్’ అన్న నినాదాలు చేశారు. ఇది ఐఎన్ఏ పోరాటానికి కొనసాగింపు.
ఈ ఐఎన్ఏ తిరుగుబాటును మనం మర్చిపోవడమే భారతదేశంలో అత్యంత విషాదం. నౌకాదళ తిరుగుబాటు దారులు కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలను పట్టుకుని తిప్పారు. ఈ తిరుగు బాటు నాయకుడు ఎం.ఎస్ ఖాన్ అనే ఒక నౌకాదళ సిపాయి. బొంబాయిలో జనసమ్మర్దం లాగా హిందువులు, ముస్లింలు కలిసి ఈ తిరుగుబాటులో పోరాడారు. అన్ని రకాల బంధాలను తెంచేసుకోవాలని ఆ సమయంలో ఆ జనవాహిని నినదించిందని అక్కడే ఉన్న నా మారు సోదరుడు చెప్పాడు. ఆ రోజుల్లో టై కట్టుకోకుండా బొంబాయి వీధుల్లో తిరగలేరని, మా మారు సోదరుడు టై తీసి జేబులో పెట్టుకుని తిరిగానని చెప్పాడు. కాబట్టి బొంబాయిలో ఉన్న భారతీయులందరిలో బ్రిటిష్ వ్యతిరేక భావన గూడుకట్టుకుంది. కానీ, హిందువులు, ముస్లింలు అనతి కాలంలోనే ఒకరి పీకలు ఒకరు పట్టుకునే స్థితికి చేరారు. ఏడాదిన్నరలో దేశం రెండుగా విడిపోయింది.
భారత దేశం ఎప్పటికీ విభజించకుండా, ఐక్యంగా ఉండాలని మోహన్ సింగ్ నాయకత్వంలో కానీ, సుభాష్ చంద్ర బోస్ నాయకత్వంలో కానీ ఐఎన్ఏ బలంగా విశ్వసించింది. ముస్లింలకు అన్ని రకాల మినహాయింపులు ఇవ్వాలే కానీ, దేశాన్ని విభజించకూడదని బోస్ భావించాడు. ఐఎన్ఏ దేని కోసమైతే నిలబడిందో, ఒకరొనొకరు నరుక్కోవడం అనేది దానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ రోజు ఐఎన్ఏకు నివాళులు అర్పించడం ఎంత ముఖ్యమో, అది లేవనెత్తిన జాతీయ గౌరవం, ఐక్యత, మతాల మధ్య సోదరభావం, లౌకికత్వంను సమున్నతంగా నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం. సుప్రీం కోర్టు చెప్పే లౌకికత్వం కాదిది, నిజమైన లౌకికత్వం అంటే ప్రతి మతానికి, ప్రతి వర్గానికి అందులో స్థానం ఉండడం.
(ఐఎన్ఏ సిపాయి కెప్టెన్ అబ్బాస్ అలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కారణమేమంటే, ఐఎన్ఏ సాధించిన విజయాలను ఘనమైన విజయాలను మనం గుర్తు చేసుకుని ఉత్సవం జరుపుకోవడమే.)
-ఇర్ఫాన్ హబీబ్, ప్రముఖ చరిత్రకారులు
అనువాదం: రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.