
తాత్కాలికంగా కలిగే రాజకీయ ప్రయోజనమైన కులగణన నిర్ణయం భారతీయ సమాజాన్ని, రాజకీయాలను వ్యవస్థాగతంగా ప్రభావితం చేయనున్నది.
రానున్న జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలని ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. ఈ వైఖరి సంప్రదాయకంగా సంఘపరివారం నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి కంటే భిన్నమైనది. కులగణన హిందువులను చీలుస్తుందని సంఘపరివార నాయకత్వం గతంలో పదేపదే వాదించింది.
2023లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షం లేవనెత్తిన కులగణన డిమాండ్‌ను ఉద్దేశించి “కొంతమంది ఎన్నికల సమయంలో దేశాన్ని కులాలవారీగా విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు. నా దృష్టిలో నాలుగే కులాలు ఉన్నాయి. మహిళలు, యువత, రైతులు,పేదలు” అన్నారు. రెండేళ్ళ ముందు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం కులగణనను చేపట్టకూడదని నిర్ణయించిందని, షెడ్యూల్డ్ కులాల వరకు మాత్రమే కులగణన జరుగుతుందని తెలియజేశారు.
ప్రస్తుతం మోడీ తీసుకున్న యూటర్న్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
తక్షణమే సమీపించనున్న బీహార్ ఎన్నికలు కులగణన చేపట్టడానికి ఒక ముఖ్యమైన కారణం. వలస పాలన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలలో కులం గణనీయమైన పాత్రను పోషించింది. రాష్ట్ర రాజకీయాలలో కులం పాత్ర ఏ స్థాయిలో ఉందంటే చివరకు 2022లో నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్‌లో కులగణనను పూర్తి చేయాల్సి వచ్చింది. సరైన పద్ధతుల్లో కులగణన జరగాలనే అవగాహన నుంచి నితీష్ కుమార్ వైదొలిగితే దాని రాజకీయ పర్యవసానాలు ప్రభావాలు తీవ్రంగా ఉండేవి. ప్రస్తుత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి నితీష్ కుమార్ అందించిన బలం కీలకమైందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయ ఎజెండాగా మార్చి ఉండేవి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అశ్విని వైష్ణవ్‌తో సహా పలువురు బీజేపీ నేతలు మోడీ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. మరోవైపు స్వాతంత్రానంతరం దీర్ఘకాలం ఢిల్లీలో ఏలుబడి సాగించిన కాంగ్రెస్ పార్టీ కులగణనను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు ప్రారంభించారు. 2011 జనగణనలో భాగంగా కులాల వారి వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించిందన్న వాస్తవాన్ని వైష్ణవ్ ఉద్దేశపూర్వకంగా ప్రస్థావించటం లేదు. 2011 జనగణన ఆధారంగా వెల్లడైన కులాధారిత వివరాలను మోడీ ప్రభుత్వం బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టిందన్న వాస్తవాన్ని కూడా బీజేపీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తుంది.
బీహార్ ఎలక్షన్లతోపాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం కులగణన నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి మోడీ ప్రభుత్వం తాజా నిర్ణయానికి మరో ముఖ్యమైన కారణం. కులగణనకు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ చేతిలో విమర్శనాస్త్రాలు మరింత కుదించుకుపోతాయి. దీంతోపాటు ఈ నిర్ణయం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
మోడీ, బీజేపీకి భారతదేశంలోని మధ్యతరగతికి మధ్య ఏర్పడిన బంధం అటువంటి కారణాల్లో ఒకటి. 1990 నుంచి కేంద్ర ప్రభుత్వాలు మండల కమిషన్ నివేదిక అమలు జరపాలని నిర్ణయించడంతో దేశంలోని మధ్య తరగతి, ఉన్నత తరగతులకు చెందిన ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ ప్రభుత్వం కులాధారిత రిజర్వేషన్లను నీరుగార్చాలని మధ్యతరగతి, ఉన్నత తరగతి ఓటర్లు ఆశించారు. బీజేపీ వారి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు.
మోడీ 11 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ఎంత దారుణంగా అమ్మేశారో ఆమేరకు మొత్తం ఉద్యోగాలు తగ్గిపోయాయి. అందులో రిజర్వేషన్ క్యాటగిరి కింద జరిగిన నియామకాలు అదే మోతాదులో తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం అగ్రకులాలకు మరో శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆర్థిక బలహీన తరగతుల కోసం ఈ సానుకూల చర్య తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలలో నామమాత్రంగానే మిగిలిపోయారు.
దీని అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే కొద్ది, మధ్యతరగతి పొందే ప్రయోజనాలు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో మోడీ పాలనను చూసి ఆయనను ఆకాశానికి ఎత్తిన మధ్య తరగతి ఆర్థికంగా పాతాళానికి పడిపోయింది.
2014లో మోడీ అధికారానికి వచ్చే నాటికి దేశంలో ఉన్న మధ్యతరగతిని మరింత విస్తరించి నయమధ్యతరగతిని సృష్టించాలన్న ప్రయత్నానికి భిన్నంగా దేశంలో మధ్యతరగతి తగ్గిపోతూ వచ్చింది. దేశంలోని జనాభా పిరమిడ్‌లో శిఖరాగ్రాన ఉన్న 10% మంది మాత్రమే ఈ 11 ఏళ్ల మోడీ పరిపాలనలో మరింత కుబేరులు అయ్యారు. జనాభాలోని మధ్యతరగతి వర్గం ఆర్థికంగా ఈ కాలంలో పుంజుకోలేకపోయింది.
ప్రపంచ దేశాలలోని అసమానతల గురించి అధ్యయనం చేసే వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ 2024 సంవత్సరానికి తన అధ్యయన వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 1947లో సంపన్నులైన 10% జనాభా చేతిలో 37% సంపద కేంద్రీకృతమై ఉంటే 1980 నాటికి వీరి చేతిలో ఉన్న సంపద 30 శాతానికి తగ్గిపోయింది. తిరిగి 1990 నాటికి ఈ జనాభా చేతిలో ఉన్న సంపద విలువ 33.5 శాతానికి పెరిగింది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి భారత జనాభాలో 10% జనాభా చేతిలో ఉన్న సంపద విలువ 57.7 శాతానికి పెరిగింది. మిగిలిన గణాంకాలు కూడా ఇదే నిర్ధారణకు దారితీస్తున్నాయి.
వినిమయ వ్యయం గురించి చర్చను ముందుకు తీసుకురావడానికి ఈ గణాంకాలు దోహదం చేస్తున్నాయి. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లోని 50 శాతం జనాభా సగటున నెలకు 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే అత్యధికంగా సంపన్నులైన 5% జనాభా సుమారు నెలకు 21 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టగలిగే స్తోమత కలిగి ఉన్నది. వారికి దిగువనున్న మరో 5% జనాభా నెలకు 12,399 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతుంటే వారికి దిగువనున్న 10% జనాభా నెలకు దాదాపు 9,500 వరకు ఖర్చుపెట్టగలుగుతుంది. అట్టడుగు స్థాయిలో ఉన్న 50% జనాభాకు అత్యున్నత స్థాయిలో ఉన్న 20 శాతం జనాభాకు మధ్య బ్రతుకులు ఈడుస్తున్న వారిని మధ్యతరగతిగా పిలుస్తూ ఉంటాము. వీరి సగటు నెలసరి వ్యయం 562 రూపాయల నుంచి 7,673 రూపాయల మధ్య ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే భారతదేశంలో కేవలం 12 శాతం జనాభా మాత్రమే కార్లు కొనుగోలు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నారని మారుతి సుజుకి ఇండియా అధ్యక్షుడు ఆర్సీ భార్గవ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. రేపోమాపో తాము కూడా నయమధ్య తరగతిగా ఎదగగలమని ఆశించినటువంటి విశాలమైన జనాభాకు ఈ పరిణామాలు నిరాశ కలిగిస్తున్నాయి. ఈ జనాభాలో ఎక్కువమంది అట్టడుగు కులాల నుంచి వచ్చినవారే. అందువల్ల ఈ తరగతి కులాధారిత రాజకీయ సమీకరణ ద్వారానే తమకు ఎంతో మేలు జరుగుతుందని భావించే స్థితికి చేరుకుంటున్నారు.
మరోవైపు కులాధారిత రాజకీయ సమీకరణాలపై చూపుతున్న మొగ్గు దేశంలోని అగ్రకులాలు, అగ్రవర్గాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తరగతి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. మరి ఇంకా ఈ ఉన్నత ఆర్థిక తరగతులు ఎవరికి తమ మద్దతును తెలియజేయాలి? మొత్తం జనాభాలో వారికున్న ఓటింగ్ శాతం ఎంత?
ఈ వివరాల నేపథ్యంలో మోడీ యూటర్న్ తీసుకోవడానికి దారితీసిన మరో పరిణామాన్ని పరిశీలించాల్సి ఉంది. సీఎస్డీఎస్ లోకనీతి సంస్థ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం 2009 నాటికి పేదలలో కేవలం 16% మాత్రమే బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉంటే 2014 నాటికి 24%, 2019 నాటికి 36%, 2024 నాటికి 37% పేదలు బీజేపీ జెండా నీడన చేరారు. సంపన్న తరగతి వర్గాలలో 41% శాతం మంది బీజేపీ పంచన చేరితే, పేదలు- మధ్యతరగతిలో 35% బీజేపీకి ఓటు వేస్తున్నారు. అంటే బీజేపీ ఓట్ బ్యాంకులో సంపన్నులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 6% మాత్రమే. అటువంటి పరిస్థితుల్లో పేదలంతా బీజేపీ వైపు నిలబడాలని ఆశిస్తున్న తరుణంలో కేవలం అగ్రకులాలు, ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే విధానాలకు పరిమితం కావలసిన అవసరం ఏముంటుంది?
మోడీ పదేపదే ఆత్మగౌరవ రాజకీయాలనే భావనను చర్చకు పెట్టడం, రాజకీయ ఎజెండాగా మార్చడం ద్వారా దేశంలోని పేదలలో ఎక్కువ మందిని ఆకర్షించగలిగారు. ప్రత్యేకించి మన్ కీ బాత్ ద్వారా ఆయన చేస్తున్న ఉపన్యాసాలలో ఈ కోణాన్ని నిశితంగా పరిశీలించవచ్చు. రోజువారి జీవితంలో పొట్టపోసుకోవటానికి రెక్కలాడించే జనాభా గురించి ఆయన పదేపదే మాట్లాడుతారు. తనను కూడా వారిలో ఒకరిగా చెప్పుకుంటూ ఉంటారు. పేదలల్లో మోడీ పట్ల సానుకూలత కలగటానికి ప్రభుత్వ అనుసరించిన సంక్షేమ విధానాలు కూడా మరో కారణం. దేశంలో వివిధ సాంఘిక సంక్షేమ పథకాలన్నీ ప్రధానమంత్రి పేరుతోనే మొదలవుతున్నాయి. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి జనధన యోజన వంటి పథకాలు ఎన్నో ఉన్నాయి.
ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పేదలు ఎక్కువమంది బీజేపీకి ఓటు వేయటానికి సానుకూలత చూపిస్తున్నారని సీఎస్డీఎస్ సర్వేలో తేలింది. ఈ కారణంగానే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నానాటికి దిగుదారుతున్నప్పటికీ ఈ కారణంగా బీజేపీ ఓటు బ్యాంకుగా మారిన పేదలు భారీ స్థాయిలో బీజేపీని వీడి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. పైగా ఈ కష్టకాలంలో కేంద్రంలో మోడీ ఆయన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ విధానాలు తమకు మరింత అవసరమని పేదలు భావించే పరిస్థితులు ఉన్నాయి. నిజానికి అధికారదాహం ఉన్న ఏ రాజకీయ నాయకుడైన పేదలు నానాటికి దుర్బల పరిస్థితులకు దిగజారి పోవాలని, అటువంటి దుస్థితి నుంచి బయటకు రావడానికి తనలాంటి నాయకులపై ఆధారపడాలని ఆశించడం సహజమే.
కులానికి సంబంధించిన విషయంలో కూడా ఇదే తరహా వర్తిస్తుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిన హిందూ అగ్రకులాల జనాభాకు బీసీ జనాభాకు మధ్య పెద్దగా అంతరం లేదు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అగ్రకులాలలో 53% మంది బీజేపీకి ఓటు వేస్తే వెనుకబడిన కులాలకు సంబంధించిన ఓటర్లలో 49 శాతం బీజేపీకి ఓటు వేశారు. బీజేపీ ఓటు బ్యాంకులో కలిసిపోతున్న ఈ రెండు పాయలను అర్థం చేసుకోవడానికి హిందుత్వ మెజారిటీ రాజకీయాలను అర్థం చేసుకోవాలి.
1990 నుంచి రామ జన్మభూమి ఉద్యమం పేరిట దేశంలోని కుల అస్తిత్వాలను మరుగున పెట్టి, హిందూ అస్తిత్వాన్ని రాజకీయ అస్తిత్వంగా ముందుకు తేవటంలో బీజేపీ- సంఘపరివారం సఫలమయ్యాయి. నిరంతరం ముస్లింలను, మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ సైద్ధాంతిక భౌతిక దాడులకు దిగటం ఈ ప్రయత్నంలో ముఖ్యమైన వ్యూహం. తద్వారా కులాధారత రాజకీయ సమీకరణాల స్థానంలో మతాధారిత రాజకీయ సమీకరణాలను బీజేపీ ముందుకు తెచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీఎస్పీఎస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యూహాలు బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చాయని రుజువయింది. బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిన పేదలలోను అగ్ర కులాలలోనూ ముస్లిం వ్యతిరేకత ఉమ్మడి లక్షణంగా కనిపిస్తుంది. ముస్లింలు విశ్వసించదగిన వారు కాదని సీఎస్డీఎస్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారిలో 27 శాతం మంది హిందువులు అభిప్రాయపడ్డారు. బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిన దళితుల్లో ఈ అభిప్రాయం 28.7% మందికి ఉన్నది.
నిన్న కులాలకు సంబంధించిన ఓటర్లను బీజేపీ తన వైపు లాగేసుకున్న తర్వాత వారిపై తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవటానికి కావలసిన విధివిధానాలు రాజకీయ వ్యవహారాలను రూపొందించే పనిలో ఉండటం సహజమే కదా. ఈ అవగాహనతో ముందుకొచ్చిందే కులగణన నిర్ణయం.
అయితే ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. బీజేపీలో అగ్రకులాలదే ఆధిపత్యం. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ శ్రేణులుగా ఉన్న పార్టీ కార్యకర్తల సామాజిక నేపథ్యాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. బీజేపీ టికెట్లపై గెలిచిన ఎంపీల సామాజిక నేపథ్యాన్ని పరిశీలించిన ఇది అర్థమవుతుంది.
గిల్లేస్ వెర్నియర్స్ రాసిన ఓ పరిశోధనాత్మక వ్యాసం జర్నల్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ పాలసీ త్వరలో ప్రచురించబడనున్నది. ఎన్డీఏ అభ్యర్థులలో 31 శాతానికి పైగా అభ్యర్థులు అగ్రకులాల నుంచి వచ్చిన వారేనని, ఇండియా కూటమిలో గెలిచిన అభ్యర్థులలో కేవలం 19 శాతం మాత్రమే అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గిల్లేస్ తన వ్యాసంలో వివరించారు. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వ స్థాయిలో దిగువ కులాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వటానికి సిద్ధమైతే ఇప్పటి వరకు ఆయా స్థానాలకు అంటిపెట్టుకొని కూర్చున్న అగ్రకులాలు ఏ విధంగా స్పందిస్తాయి?
ఇక రెండో అంశం. ప్రతిపక్షాలు బీసీలలో ఉన్న దిగువ కులాలను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన ఫలితమే 2024 ఎన్నికలలో ఈ తరగతులకు చెందిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారు. దీర్ఘకాలం ప్రతిపక్షం బీసీలలో ఉన్నత శ్రేణిలో ఉన్న కులాలకు మాత్రమే రాజకీయ ఆశ్రయం కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం సమాజ్‌వాది పార్టీ బీసీలలో ఉన్న ఉన్నతశ్రేణి కులాలకు చెందిన వారికి నామమాత్రంగా సీట్లు కేటాయించింది. ఈ తరగతిలోని నిమ్నకులాలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది. యాదవులు సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయడంతో పాటు ఈ రకమైనటువంటి వ్యూహం ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికలలో మెరుగైన ఫలితాలను సాధించింది.
బీహార్‌లో కూడా ప్రతిపక్షం ఇదే వ్యూహాన్ని పునరావృతం చేయగలుగుతుందా? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రతిపక్షమే. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అనుసరించిన ఎన్నికల వ్యూహాన్ని అనుసరిస్తే కులగణన నిర్ణయం ద్వారా రాజకీయ లబ్ధి పొందకుండా బీజేపీ, జేడీయూ కూటమిని నిలువరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది సమీప భవిష్యత్తులో జరిగే పరిణామం మాత్రమే.
ఇదిలా ఉంటే కులగణన భారతీయ సమాజాన్ని రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కులగణన చేసినంత మాత్రాన అంతా అయిపోదు. వివిధ కులాలు మొత్తం జనాభాలో ఉన్న మోతాదుకనుగుణంగా బ్యూరోక్రసీలోనూ, రాజకీయాలలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఉన్నాయా లేవాని పరిశీలించేందుకు విశ్లేషించేందుకు కులగణన ఒక సాధనం మాత్రమే. సామాజిక న్యాయసాధనకు ఉద్యమిస్తున్న పలుసామాజిక తరగతులు కులగణన వివరాలు వెలుగు చూసిన తర్వాత అనేక కొత్త రకమైన డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశం ఉంది. 1990 దశకంలో మండల కమిషన్ నివేదికను బయటకు తీసి సిఫార్సులు అమలు చేయడానికి అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు బీజేపీలో ఉన్న అగ్రకులాలు ఏ విధంగా ప్రతిఘటించాయో అదేవిధంగా ప్రస్తుతం కూడా ఈ అగ్రకులాలు ప్రతిఘటించే అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. మండల్ నివేదిక అమలు అనంతర రాజకీయ పరిస్థితులలో వచ్చిన మార్పులను ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక పత్రిక ఆర్గనైజర్ శూద్ర విప్లవమని పిలిచింది. కులగణన ద్వారా ఇప్పటివరకు మతాధిపత్యం కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు కులం సామాజిక ఆర్థిక అంశాలు కేంద్రంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఈ దీర్ఘకాలిక పర్యవసానాలను నరేంద్ర మోడీ ఊహించి ఉండకపోవచ్చు. కానీ వ్యూహాత్మకంగా ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు అనూహ్యమైన పర్యవసానాలకు దారితీస్తాయి.
(ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సీఈఆర్‌ఐ సైన్సెస్ సంస్థలో వ్యాస రచయిత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఉన్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో భారత రాజకీయాలు సామాజిక శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.)
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.