
యూఎన్ఎఫ్పీఏకు సంబంధించిన స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్- 2025 ప్రకారం, ప్రతీ ముగ్గరు వయోజన భారతీయులలో ఒకరు(36%) అవాంఛిత గర్భధారణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, పిల్లలు పుట్టకపోవడంతో అసంపూర్ణకోరికతో మూడింట ఒక వంతు(30%) మంది బాధపడుతున్నారు. సర్వే చేయబడిన భారతీయులలో 23% మంది ఈ రెండింటిని ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: లెక్కలకు అందకుండా పెరుగుతోన్న భారతదేశ జనాభా ఒక సంక్షోభాన్ని ముందుకు తెస్తోందని, ప్రజలు తమకు కావలసిన కుటుంబాన్ని, పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొన్నది.
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్ఎఫ్పీఏ) ప్రపంచ జనాభా నివేదిక 2025 ప్రకారం, ప్రతి ముగ్గురు వయోజన భారతీయులలో ఒకరు(36%) అవాంఛిత గర్భధారణ సమస్యను ఎదుర్కొన్నారు. అదే సమయంలో, మూడింట ఒక వంతు(30%) మంది పిల్లలు పుట్టాలనే తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారు. సర్వే చేయబడిన భారతీయులలో 23% మంది ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలియజేసింది.
నివేదిక ప్రకారం, ‘అసలైన సంతానోత్పత్తి సమస్య జనాభా గణాంకాలపై దృష్టి పెట్టడం నుంచి మారాలని కోరుతుంది. నిజమైన సంక్షోభం, తక్కువ జనాభా లేదా అధిక జనాభా కాదు. కానీ ‘సెక్స్, గర్భనిరోధకం ఇంకా కుటుంబాన్ని ప్రారంభించడం గురించి స్వేచ్ఛగా, సమాచారం ఆధారంగా నిర్ణయించుకునే సామర్థ్యాన్ని’ పెంపొందించడంలో వ్యవస్థ విఫలమైంది.
ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా 146.39 కోట్లకు చేరుకుందని నివేదిక ఒక అంచనా వేసింది.
భారతదేశ జాతీయ సంతాన పునరుత్పత్తి రేటు 2.0, ఇది అధిక సంతానోత్పత్తి, తక్కువ సంతానోత్పత్తికి సంబంధించిన వైరుధ్యాన్ని హైలైట్ చేస్తుందని యూఎన్ఎఫ్పీఏ చెబుతోంది. ఇది అసమానతలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. ఉదాహరణకు బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల కంటే అధిక సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. దీనిని ఆర్థిక అవకాశం, ఆరోగ్య సంరక్షణ, విద్య- ప్రాంతీయ లైంగిక అసమానతలకు సంబంధించిన సమస్యలతో ఈ నివేదిక అనుసంధానిస్తుంది.
భారతీయులకు ఆర్థిక సమస్యలు ప్రధాన అవరోధంగా ఉన్నాయని 14 దేశాలలో నిర్వహించిన YouGov సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. దాదాపు పది మందిలో నలుగురు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగ భద్రత లేకపోవడం, గృహ వసతి లేమితోపాటు అనుభవజ్ఞులైన పిల్లల సంరక్షకులు అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణమవుతున్నారు. ఏ దేశంలోనైనా తమ జీవిత భాగస్వామి తక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలనే కోరిక ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న వారిలో 19% మంది భారతీయులు తెలియజేశారు.
దీనికి సంబంధించి యూఎన్ఎఫ్పీఏ ఇండియా ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ “మెరుగైన విద్య, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవ వరకు చేరుకొని సాగుతోన్న భారతదేశం పునరుత్పత్తి రేటును తగ్గించడంలో ఉన్నతమైన అభివృద్ధిని సాధించింది. దీని వల్ల మాతాశిశు మరణాల రేటులో పెద్ద సంఖ్యలో తరుగుదల నమోదయ్యింది. అయినా కూడా రాష్ట్రాలలో, కులాలలో, ఆదాయాలలో తీవ్ర అసమానతలు కొనసాగుతున్నాయి” అన్నారు.
ఇంకా మాట్లాడుతూ “ప్రతి ఒక్కరికీ సమాచారంతో పాటు పునరుత్పత్తి ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ, మార్గాలు ఉన్నప్పుడు అసలైన ప్రజాప్రయోజనం సాధించబడుతుంది. పునరుత్పత్తి హక్కులు, ఆర్థిక శ్రేయస్సు ఎలా కలిసి ఉండవచ్చో చూపించడానికి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది” వోజ్నార్ చెప్పారు.
బీహార్లోని ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల కథనాల ఆధారంగా ఈ నివేదికలో పొందుపరిచారు. దాని ప్రకారం, 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నానమ్మకు సమాజ ఒత్తిడి ఇంకా గర్భనిరోధక విషయ పరిజ్ఞాన లేకపోవడం వల్ల ఐదుగురు పిల్లలు పుట్టారు. తన కోడలుకు తక్కువ మంది పిల్లలు కావాలని కోరుకున్నప్పటికీ ఆరుగురు పిల్లలను కనాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన మనవరాలు, తన సురక్షిత భవిష్యత్తు దృష్ట్యా కేవలం ఇద్దరు పిల్లలను కనాలని నిర్ణయించుకుంది.
“జనాభా సౌలభ్యత”ను యూఎన్ఎఫ్పీఏ సమర్థిస్తోంది. అది మానవ హక్కులను రక్షిస్తూనే జనాభా పరివర్తనకు అనుకూలంగా ఉండాలి. భారతదేశం కోసం ఇది ఒక సమగ్ర, అధికారిక దృష్టికోణాన్ని సూచిస్తోంది.
నివేదికలో పిల్లలు పుట్టనితనంతో పెంపకంతోపాటు ప్రత్యుత్పత్తి సంరక్షణ ఆరోగ్య సేవల వరకు చేరుకోవడాన్ని, పిల్లల పెంపకం, ఇళ్ల మీద పెట్టుబడి, పెళ్లికాని వ్యక్తులు ఇంకా అట్టడుగు వర్గాల కోసం ఉమ్మడి నియమనిబంధలను, శారీరక స్వయంప్రతిపత్తి గురించి మెరుగైన సమాచారం, ఇంకా తిరోగమన ఆలోచనలను ఎదుర్కోవడానికి సామాజిక పరివర్తన అవసరమని ప్రతిపాదించింది.
జనగణన మీద అధికంగా దృష్టిపెడితే అసలైన సమస్యలపై దృష్టిసారించలేమని యూఎన్ఎఫ్పీఏ హెచ్చరించింది. అంతేకాకుండా ఏ దేశ పురోభివృద్ధైనా కొలవడానికి ఆ దేశ ప్రజలు ఆరోగ్యంగా తమ ఇష్టానుసారం జీవించడం, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా అన్నవి కూడా ప్రమాణాలేనని సంస్థ అభిప్రాయపడింది.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.