
ముందు మన అంతరంగంలో ఉదయించి, రగులుకొని
జరజరా దేశమంతటా పాకి సరిహద్దులలో అస్తమిస్తుంది
దానికి తన పర భేదం లేదు
కేవలం విధ్వంస రచనయే దాని ఆప్త ప్రక్రియ
ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రస్థానాలు?
యుద్ధం వలన పూర్తిగా ధ్వంసమయ్యేది
చితికిపోయేది కింది స్థాయి కుటుంబాలే
మధ్య తరగతి జీవితాలే
ప్రభుత్వాలదేముంది?
ప్రజల మీద పన్ను పోటుతో బాదెయ్యొచ్చు
ఇక బడా బాబులదా?
యుద్ధ నెపంతో ఎడాపెడా ధరలు పెంచవచ్చు
కృత్రిమ డిమాండ్ సృష్టించవచ్చు
వారికదీ ఒక సంపాదనా మార్గమే..!
ఎలా చూసినా
ఏ దేశంలోనైనా ఈ దీనులకే వేదన
నాదీ అదే ఆవేదన
బాగా అలసి పెను తుపానుకు కుప్పకూలిన దేశ వృక్ష దేహమిది
పైకి పాకుతూ పెరిగిన వ్యాపిత హరితం అమాయకమైంది
లోపలి ధ్వంస రచనను ఎలా అర్థం చేసుకోగలదు?
ఆ అంతరంగ కుహురంలో ఎన్ని వెతలు
ఎన్నెన్ని భావోద్వేగాలు?
యుద్ధం కన్నా యుద్ధ భయం ప్రమాదకరం
అలాగే..
యుద్ధం కన్నా యుద్ధ వాతావరణం
యుద్ధ ఉన్మాదం మరింత ప్రమాదకరం
యుద్ధం రాల్చే పసి ప్రాణాలెన్నో
ఒరిగే నర కంఠాలెన్నో
చితికి పోయే పచ్చని కుటుంబాలెన్నో
ఇంకేం మిగులుతాయి
కొన్ని ఒంటరి దేహాలు
మరికొన్ని ఒంటరి మనసులు
ఇంకొన్ని పునాదులతో సహా కుప్పకూలిన భవనాలు
లెక్కలేనన్ని విలాపాగ్నుల మధ్య మరికొన్ని వికటాట్ట హాసాలు
కావలసినంత ఉన్నాయి మన వద్ద
దేశం నుదుటి గీతలను ఆదేశించే, విశ్లేషించే గీతలు
విపరీత ద్వేషాన్ని రగిల్చే ఉన్మాదపు రాతలు
ఫలితంగా కోట్ల మనసుల గుండె కోతలు
సరిహద్దుకి ఈవలా! ఆవలా!
అణుమాత్రం శాంతి విలువ తెలియడం కోసం
ఇరు దేశాల మధ్య అణు యుద్ధమే జరగాలా?
అదేదో ఉద్యమాల మూలంగా
ఇరు వైపులా అంతర్గతంగా
భావ సంఘర్షణ జరిగితే పోలా!?
కనీసం 90 శాతం ప్రజలకైనా
కడుపు నిండా తిండి
కంటి నిండా నిద్రా ప్రాప్తిస్తాయి!!
అస్తు!!
గిరిధర్
9849801947
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.