
1971లో కరాచీ విమానాశ్రయాన్ని తునాతునకలు చేసిన దాడికి ఆపరేషన్ ట్రిడెంట్ అని పేరు పెట్టిన విషయం ఎంతమందికి తెలుసు? ట్రిడెంట్ అంటే భారతీయ సాంప్రదాయంలో త్రిశూలం. శివుడు నిరంతరం చేబూని తిరిగే ఆయుధం.
1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. దక్షిణాసియా రాజకీయ భూగోళంలో సమూలంగా మార్పులు వచ్చాయి. ఆ పరిణామాలు తెలుసుకోలేకోపోతే వాస్తవాలు మన కళ్ల ముందే మాయమవుతూ ఉంటాయి. అప్పటి ప్రభుత్వం ఆ యుద్ధాన్ని జాతీయ భద్రతా సమస్యగా మాత్రమే చూసింది. దేశీయంగా భావోద్వేగాలు, ఆవేశకావేశాలు రెచ్చగొట్టడానికి త్రిశూలాన్ని ఆయుధంగా వాడాలని చూడలేదు. కేవలం ఇందిరా గాంధీ ఒక్కరే శక్తికలిగిన నేత, పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పగలిగిన దుర్గ అన్న ఇమేజిని సృష్టించటానికి మాత్రమే ఈ త్రిశూలం పదాన్ని వినియోగించుకున్నారు.
సరిగ్గా యాభై ఐదు సంవత్సరాల తర్వాత దేశం మేల్కొనే సరికి ప్రజలందరి నోళ్లలో నానుతున్న పదం ఆపరేషన్ సింధూరం. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారతీయ సైన్యాలు పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది కేంద్రాలపై దాడులు చేశాయి. అయితే దీని లక్ష్యాల విషయంలో కానీ ఫలితాల విషయంలో కానీ 1971 నాటి అపరేషన్ త్రిశూల్‌తో పోల్చదగినది కానేకాదు. ఎందుకంటే ఆపరేషన్ త్రిశూల్ కంటే భిన్నంగా ఆపరేషన్ సింధూర్ దేశీయంగా పాలకపార్టీకి ప్రధానికి ప్రయోజనం సిద్దింపచేసే ఉద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమం మాత్రమే.
బిజెపి అధికారిక సోషల్ మీడియా ప్రచార మాధ్యమాల్లో ఆపరేషన్ సింధూర్ ధీరత్వమంతా ప్రధాని మోడీది మాత్రమే అని చూపిస్తున్నారు. ఆరేషన్ సింధూర్ దాడుల్లో భారతీయ సైన్యం ధైర్యసాహసాల గురించిన ప్రస్తావన లేకపోవటం గమనించాల్సిన విషయం.
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన అనేక సైనిక చర్యలకు ఇప్పటి వరకూ పెట్టిన పేర్లు ప్రధానంగా ధైర్యసాహసాలకు ప్రతినిధిత్వం వహించే పేర్లు పెడుతూ వచ్చారు. కార్గిల్ శిఖాలను తిరిగి భారత సైన్యం స్వాధీనం చేసుకునేందుకు సాగించిన యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ విజయ్. 1984లో సియాచిన్‌ను పాక్ సేనల నుంచి స్వాధీనం చేసుకోవడానికి సాగించిన యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ మేఘదూత్. 2001లో పార్లమెంట్‌ను ముట్టడించిన ఉగ్రవాదులను తుదముట్టించటానికి పెట్టిన పేరు ఆపరేషన్ పరాక్రమ్. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడిని నియంత్రించేందుకు పెట్టిన పేరు ఆపరేషన్ బ్లాక్ టోర్నడో. పహల్గాంలో అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కంటే ముందు సాధారణ ప్రజలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన భారీ దాడి 2008 ముంబైపై జరిగిన దాడే.
ఇప్పటి వరకూ పాకిస్తాన్ లేదా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యలకు పెట్టినపేర్లకంటే పూర్తి భిన్నమైనది ఆపరేషన్ సింధూర్ పేరు. ఈ పేరు ఎంపిక కేవలం దేశీయంగా తమ రాజకీయ శ్రేణులను సంతృప్తి పర్చి రాజకీయ ప్రయోజనం పొందటమనే ఏకైక లక్ష్యం మాత్రమే ఉంది.
గతంలో కూడా 2019లో బాలాకోట్‌లోని జైషే మొమహ్మద్ శిక్షణా శిబిరంపై మెరుపు దాడులు చేయటం ద్వారా 2019 ఎన్నికల్లో బిజెపి భారీగా లబ్ది పొందిన అనుభవం మనముందున్నది. అయితే బాలాకోట్ అనేది భారతసైన్యం దాడి చేసిన పాకిస్తాన్ భూభాగంలోని పట్టణం పేరు. భారతీయ వారసత్వం ఉన్న పేరు కాదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయినా ఆ పేరు వలన పొందాల్సిన ప్రయోజనాన్ని బిజెపి పొందిందనుకోండి. ఈ దాడి తర్వాతనే ఉగ్రవాదులను ఇంట్లో దూరి మరీ చంపుతామన్న నినాదాన్ని బిజెపి ప్రజల ముందుకు తెచ్చింది. మే 6- 7 తేదీల్లో జరిగిన దాడులు కూడా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యలకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం హిందూత్వ రాజకీయాలకు బాలాకోట్ కన్నా ముఖ్యమైనది. అవసరమైనది. రక్షకుడు అంతిమంగా భారతీయ హిందూ మహిళలను కాపాడేందుకు బయల్దేరాడన్న సందేశం ఇవ్వటానికేనా?
ఈ పేరుతో మోడీ తన రాజకీయ శ్రేణులకు ఏ సందేశం పంపాలనుకున్నారో మే 7వ తేదీ ఉదయం పది గంటలకల్లా తేటతెల్లమైంది. అర్థరాత్రి జరిగిన సైనిక చర్యలను వివరించటానికి వ్యూహాత్మకంగా మైనారిటీ మతాలకు చెందిన ఇద్దరు మహిళలను ఎంపిక చేయటం కూడా మితవాద హిందూత్వ రాజకీయ శ్రేణులకు పంపదల్చుకున్న సందేశంలో భాగమే. ఈ ఇద్దరు మహిళా సైనికాధికారులు విలేకరుల సమావేశంలో మాట్లాడటం పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడికి మహిళలు తీర్చుకున్న ప్రతీకారం అన్న భావనను కలిగించేందుకు జరిగిన ప్రయత్నం అన్నది అర్థమవుతూనే ఉంది. నుదుట సింధూరం భారతీయ సాంప్రదాయంలో మహిళకు పెళ్లయ్యిందని చెప్పటానికి గుర్తు.
ఈ వార్త వెల్లడి కాగానే భారతీయ జనతా పార్టీ మీడియా సైన్యం మోడీ శక్తి సామర్ధ్యాలను ముడి సింధూరంతో పోల్చి కుప్పలు తెప్పలుగా పోస్టులు పెట్టారు. పాలక పార్టీకి భక్తగణంగా మారిన మీడియా మాధ్యమాలు ఇదే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లే కర్తవ్య సాధనలో నిమగ్నులయ్యారు. టైమ్స్ నౌ టివి ఛానెల్ మా అక్క చెల్లెళ్ల సింధూరం లాగేసుకున్న వారికి ఇప్పుడు తగినశాస్తి జరిగింది అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ప్రసారం చేసింది.
ఢిల్లీలో అధికారిక ప్రెస్ మీట్, దేశశ్యాప్తంగా కోట్లాదిమంది చేతుల్లో ఉన్న ఫోన్లకు వీడియోలు చేరటం ఏకకాలంలో జరిగింది. ఈ వీడియోల్లో మోడీ ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ఉత్సవాలు చేసుకుంటున్న బిజెపినేతల ఫోటోలు, వీడియోలు అవి. అటువంటి మేసేజుల్లో ఒకటి బిజెపి నేత సునీల్ దేవధర్ ‘మీ ఇంట్లోకి వచ్చి చంపాము. మీ సమాధులు తవ్వుతున్నాము. ఇక్కడ భారత్ గద్దె మీద కూర్చున్నది మీ ముత్తాత మోడీ’ మేసేజ్ పెట్టారు.
పహల్గాం దాడి తర్వాత దేశంలో ప్రత్యేకించి బిజెపి, దాని రాజకీయ గురువు ఆరెస్సెస్ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ సందేశాలు వారికి చేర్చటం వారి భావోద్వేగాలను చల్లబర్చడానికి రూపొందించిన వ్యూహమనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. పహల్గాం ఘటన వెనక భద్రతా దళాల వైఫల్యం ఏమైనా ఉందా అన్నది దేశ ప్రజల మనస్సును పట్టి పీడిస్తున్న ప్రశ్న.
2024 ఎన్నికల్లో హిందూ వివాహ సాంప్రదాయానికి సంబంధించిన మరో చిహ్నాన్ని రాజకీయ సాధనంగా మల్చుకున్నారు మోడీ. కాంగ్రెస్ పార్టీ మీ మెడల్లోని మంగళసూత్రాన్ని తెంచుకుపోవడానికి సిద్ధమవుతోందన్నది మోడీ తొలుత రాజస్థాన్‌లోనూ తర్వాత దేశవ్యాప్తంగానూ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. పహల్గాం నేపథ్యంలో మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యం దేశంలో 26 మహిళల మంగళసూత్రాలను బలి దీసుకుందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మితవాద రాజకీయ శిబిరంలో ఎక్కువ మంది మోడీ పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే చర్య ఏదైనా తీసుకోవాలని అభిలషించారు. మరికొందరు ఉబలాటపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కావడానికి ముందు ఈ డిమాండ్లు దేశమంతా మారుమోగాయి. జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ మోడీ చేతగానివాడని, ఏమీ చేయలేడనీ, పిరికివాడని ద వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మోడీ భక్తగణమే మోడీని కదనరంగంలోకి దించుతాయని కూడా ఆయన హెచ్చరించారు.
ముందు ముందు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం గురించి కూడా పెద్దఎత్తున విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా పత్రాలు పుట్టుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. భారతదేశం చేపట్టిన సైనిక చర్యలకు తొలిసారి ఒక లైంగిక కోణాన్ని ఆపాదించే పేరు పెట్టడం, అది కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందు మహిళల దైనందిన జీవితంలో భాగమైన అంశాన్ని ఎంచుకోవటం గురించి పరిశోధనలు జరగినా ఆశ్చర్యపడనవసరం లేదు. అదేసమయంలో ఈ ధీరులైన మహిళలను పహల్గాంలో భర్తలను కోల్పోయిన మహిళలను మాత్రం ఆపత్కాలంలో ఆపరేషన్ సింధూర్ గురించి ఉత్సవం జరుపుకుంటున్న సైన్యం, ప్రభుత్వం విస్మరించిందనీ, ఆ విస్మరణ వల్లనే ఇంతటి ఘోరం జరిగిందన్న వాస్తవాన్ని మాత్రం ఎవ్వరూ విస్మరించలేరు. విస్మరించకూడదు.
ఇదేసమయంలో పహల్గాంలో తమ భర్తలను కోల్పోయిన తర్వాత కూడా పాలక పార్టీ రూపొందించిన వ్యాఖ్యానాన్ని, భావోద్వేగాలను తలకెక్కించుకోకుండా నిబ్బరత్వాన్ని పాటించిన మహిళలు ఇదే బిజెపి శ్రేణులు పెద్దఎత్తున విమర్శించిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. తమకు జరిగిన వ్యక్తిగత నష్టాన్ని మతోన్మాద రాజకీయాలకు ఉపయోగించుకోరాదన్న అవగాహనతో వ్యవహరించిన భర్తను కోల్పోయిన వారికి సంఫీుభావం చెప్పటానికి ఏ ఒక్క సీనియర్ ఆరెస్సెస్, బిజెపి నేతలు ముందుకు రాలేదు. మోడీ మంత్రాంగం అందించిన సందేశాలతో కళ్లు మూసుకుపోతున్న బిజెపి మతోన్మాద శ్రేణుల ప్రవర్తన అర్థం చేసుకోవడానికా సోషల్ మీడియాలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ. 26మంది మహిళలు విధవలుగా మారటానికి దారి తీసిన భద్రతా వైఫల్యాలపై జరగాల్సిన చర్చను దారి మళ్లించటమే అసలైన ఆపరేషన్ సింధూర్.
సంగీతా బారువా పిషారోటి
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.