
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గరిష్ఠంగా మూడు నెలల వ్యవధి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వ హోంశాఖ స్వయంగా సూచించింది. ఇది కొత్త విషయం కాదు. గవర్నర్లు కూడా మూడు నెలలలోగా బిల్లులను ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనే నిర్ణయం తీసుకోవాలని అడిగిందెవరు? కేంద్ర హొంశాఖే. ఈ మూడు నెలల కాలపరిమితిని రాష్ట్రపతికి వర్తింపజేయాలని సుప్రీంకోర్టును కోరింది కూడా కేంద్ర హోంశాఖే.
ప్రస్తుతం మళ్లీ వీటి మీద ప్రశ్నలు ఎందుకు? సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి సలహా ఇవ్వాల్సిన అవసరం దేనికి? గవర్నర్లు తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాలలో బిల్లులను కొన్నేళ్ల వరకు పెండింగ్‌లో పెట్టడానికేనా? ఇది రాజ్యాంగానికి సవాల్‌గా మారిన అంశం. కావాలని పాలనాపరంగా రాష్ట్రప్రభుత్వాలు ఏ పనీ చేయలేని స్థితిని తయారు చేస్తున్నారా? తమకు కావాలసిన బిల్లుల ద్వారా పరిపాలన చేయడానికి తమిళనాడుతో సహా దేశమంతా రాష్టాలన్నీ ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఇదా సుపరిపాలననా? ఇంతకూ రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా రేకెత్తిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన ‘తీర్పు’ నిలబడుతుందా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వద్దనుకుంటే ఇదంతా వృధా ప్రయాసే అవుతుందా?
జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా రాష్ట్రపతికి కాలపరిమితిని విధించగలమా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వమని, 2025 మే 16న సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన రాష్ట్రపతి సూచన ముఖ్యంగా ఈ అంశంపైనే ఉంది.
అయితే, చట్టసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రాలలో గవర్నర్లు కేంద్రంలో రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత చట్టాలుగా మారుతాయి. గజెట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ క్రమానికి సంబంధించిన విధివిధానాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 201లలో పొందుపరిచారు. ఈ అధికరణలోని వివరణ ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నలు, రాష్ట్రపతి తమ సమ్మతి లేదా అసమ్మతి తెలియజేయటానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఏమీ పేర్కొనలేదు. కానీ “ఇది హోంశాఖ 2016లో జారీ చేసిన రెండు కార్యాలయ ఆదేశాలను ఆధారంగా చేసుకొని మూడు నెలల గడువు నిర్ణయించడమే తప్ప, కొత్తగా ఏదీ నిర్ణయించలేదు” అని 2024 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో చాలా స్పష్టంగా తెలిపింది.
రాష్ట్రపతి ఏమడిగారంటే..
దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో దేశంలోని ప్రజలందరూ పాల్గొంటారు. మరే సందర్భంలో ఇటువంటి, ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలు జరగవు. అయితే భారత దేశ పరిపాలనకు సుప్రీం అధికారి రాష్ట్రపతి. అందుకే చాలా పెద్ద అధికారం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి దౌపది ముర్ము అత్యంత ముఖ్యమైన రాజ్యాంగంలో మౌలిక లక్షణమైన సమాఖ్య స్వభావానికి సంబంధించిన ప్రశ్నల సముదాయాన్ని ప్రజల ముందు పెట్టారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ పాలనలోని వివిధ అంశాలపై రాజ్యాంగ పండితులు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
భారతదేశం ఫెడరల్ స్వరూపమే..
ఇది భారతదేశ ఫెడరల్ స్వరూపానికి సంబంధించిన విషయం. భారత రాజ్యాంగం మొదటి ఆర్టికల్ “ఇండియా అంటే రాష్ట్రాల సమాఖ్య” అని పేర్కొంటుంది. “రాష్ట్రాలు, ప్రాంతాలు ఫస్ట్ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఉంటాయి” అని స్పష్టం చేస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నట్టే భారత దేశం కూడా విభిన్న రాష్ట్రాల సమాఖ్య(యూనియన్ ఆఫ్ స్టేట్స్) అనుకోవచ్చు. దీని అర్థం రాష్ట్ర పరిపాలనలో గవర్నర్‌కు ఎంతో అధికారం ఉన్నట్లు భావించవచ్చు,
గవర్నర్ అధికారం- బాధ్యతలు..
రాష్ట్ర గవర్నర్లను కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి, హోంమంత్రి సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అంటే గవర్నర్ల నియామకం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నియంత్రణలో జరుగుతుంది. కాబట్టి రాష్ట్రపతి గవర్నర్‌ను నియమిస్తారు. ఒక రాష్ట్ర సర్వోన్నత అధికారిగా గవర్నర్ పనిచేయాలి. ఆ రాష్ట్రంలో జరిగే పరిపాలనా పరమైన వ్యవహారాలన్నింటిలో గవర్నర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యతవహిస్తారు. భాగస్వాములు అవుతారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201 ప్రకారం రాష్ట్రాల్లో చట్టాలకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం ఇవ్వటం గురించి తాజాగా రాష్ట్రపతి తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను తెలిజేయాల్సిందిగా కోరారు. దీన్నె రాజ్యాంగ పరిభాషలో రిఫరెన్సింగ్ అంటారు. సహజంగా ఇంత తీవ్రమైన రాజ్యాంగ ప్రశ్నలను లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలను కూడా రాజ్యాంగ నిపుణులు తయారు చేస్తారు. అందుకే జవాబులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు.
200, 201 ఆర్టికల్స్ ఎటువంటి కాలపరిమితిని నిర్దేశించవు. అది లోపం కాదు. కానీ సహజంగా పరిపాలనలో రెడ్‌టేప్ లేకుండా వెంటవెంట పనిచేయవలసిన పరిపాలన ఉంటుంది. గవర్నర్‌కు ఇంతకు మించిన పెద్ద పనులేవీ ఉండవు. లాంఛనమైన అధికారాలే అయినప్పటికీ, సత్వరంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఏదైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించి బిల్లులు రూపొందిస్తుంది. ప్రతీ బిల్లు ఏ లక్ష్యాల కోసం రూపొందించిందో కూడా ముసాయిదా బిల్లులో చివరి పేజీలో ఉంటుంది. అటువంటి బిల్లులు చట్టసభలలో చర్చించి, ఆమోదించిన తర్వాత అవి చట్టాలుగా అమలు కావాలంటే గవర్నర్ల సంతకం(సమ్మతి) రాజ్యాంగ పరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను ఏవో కుంటి సాకులతో వాయిదా వేయడం అంటే ప్రభుత్వాలు ఆయా చట్టాల ద్వారా సాధించదల్చుకున్న పరిపాలనా పరమైన లక్ష్యాలను ఆచరణరూపం దాల్చనీయకుండా వాయిదా వేయడమే.
ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్దిష్ట సామాజిక, ఆర్థిక, శాంతిభద్రతపరమైన లక్ష్యాలను సాధించడానికి పూనుకున్నప్పుడు వాటిని వాయిదా వేయించడం వల్ల గవర్నర్లకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈ ప్రశ్నల నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్ విషయంలో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు గవర్నర్లందరికీ వర్తిస్తుంది. తీర్పులో భాగంగా రాష్ట్రపతి బాధ్యతలను కూడా సుప్రీంకోర్టు ప్రస్థావించింది. ఈ తీర్పు నేపథ్యంలోనే రాష్ట్రపతికి ఉన్న స్వేచ్ఛా అధికారాలను కూడా పరిమితం చేస్తుందనే అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఈ రెఫరెన్స్‌లో వ్యక్తం చేశారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులను చట్టాలుగా మార్చడంలో ఎందుకీ ఆలస్యం?
గవర్నర్లకు ముఖ్యమంత్రులకు లేదా మంత్రివర్గానికి మధ్య సాధారణంగా అయితే ఘర్షణలేమీ ఉండవు. కానీ కేంద్ర ప్రభుత్వ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో కేంద్ర పాలక పార్టీల ద్వారా నియమితులైన గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా ఈ ఘర్షణలను ముందుకు తెస్తున్నారనే విమర్శ ఉంది. దేశవ్యాప్తంగా రాజ్భవన్లు, రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య పెరుగుతున్న విబేధాల నేపథ్యంలో రాష్ట్రాల చట్టాలపై నిర్ణయాలు లేకపోవడం వల్ల పాలన స్తంభించిపోతుంది. అటువంటి పరిస్తితులలో ఆయా రాష్ట్రాలు ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ (2025) కేసులో సుప్రీంకోర్టు “పాకెట్ వీటో” అనే పదాన్ని ఉపయోగించి, బిల్లులను ఆమోదించకుండా ‘నిష్క్రియంగా’ నిలిపివేయడాన్ని తప్పుపట్టింది.
సుప్రీంకోర్టుకు రిఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలు ఏంటి?
ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ వినియోగించే స్వేచ్ఛా అధికారాలు న్యాయపరంగా సమీక్షించదగినవేనా?
ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్/రాష్ట్రపతికి ఇచ్చిన రక్షణ, న్యాయపర పరిశీలనకు పూర్తిగా అడ్డుగా ఉందా?
రాజ్యాంగం కాల పరిమితి నిర్దేశించనప్పుడు, గవర్నర్ తగిన నిర్ణయం తీసుకోవటానికి వ్యవహరించవలసిన విధానం ఏంటి?
ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి పంపబడిన బిల్లుపై తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?
ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి నిర్ణయానికి కాల పరిమితి విధించాలా? కోర్టు కాల పరిమితులను నిర్ణయించగలదా?
మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు..
ఆర్టికల్ 200 ప్రకారం బిల్లుపై గవర్నర్‌కు ఎన్ని ప్రత్యామ్నాయలు, అవకాశాలు ఉంటాయి?
రాష్ట్ర మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే గవర్నర్ వ్యవహరించాలా?
ఇటువంటి సమస్యలలో రాష్ట్రపతి సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలా?
ఆర్టికల్స్ 200, 201 కింద కోర్టులు న్యాయ విచారణ జుడిషియల్ రివ్యూ జరిపే హక్కు ఉందా?
ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు గవర్నర్/రాష్ట్రపతిని మార్చే నిర్ణయాలు తీసుకోగలవా?
గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం రాజ్యాంగబద్ధమేనా?
రాజ్యాంగ విశ్లేషణకు సంబంధించి ప్రధాన ప్రశ్న ఏంటంటే కోర్టు కచ్చితంగా ఆర్టికల్ 145(3) ప్రకారం కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉందా?
ఆర్టికల్ 142 అనేది కేవలం ప్రొసీజరల్ లా (ప్రక్రియాత్మక చట్టం) విషయంలో వర్తిస్తుందా లేక రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఆదేశాలివ్వగలదా?
ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ సూట్ దాఖలు చేయకుండా, కేంద్రం- రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు తీర్చగలదా?
తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం..
తమిళనాడు గవర్నర్ పది బిల్లులను ఆమోదించకుండా పక్కకు పెట్టిన తీరు“చట్టవిరుద్ధమైనది, పొరపాటు” అని గత నెలలో సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 142 ఆధారంగా బిల్లులను రాష్ట్రపతికి రిఫర్ చేయబడింది. అలా రిఫర్ చేసిన తర్వాత కూడా కాలయాపన జరగడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నిర్దిష్ట కాలపరిమితికి లోబడి రాష్ట్రపతి కార్యాలయం నుండి సమాధానం రాకపోతే అటువంటి బిల్లులను ఆమోదించబడ్డవిగా భావించాలని తీర్పు ఇచ్చింది. ఒకసారి చట్టసభ ఆమోదించి గవర్నర్ వద్దకు బిల్లు వచ్చిన తరువాత గవర్నర్‌కు మూడే ప్రత్యామ్నాయాలు ఉంటాయని ఈ తీర్పులో జస్టిస్ పర్దివాలా స్పష్టం చెప్పారు. బిల్లును తిరిగి పంపిన తర్వాత, గవర్నర్ రాష్ట్రపతికి పంపలేరు. బిల్లును గవర్నర్ సిఫారసుల ప్రకారం మాత్రమే సవరించినప్పుడు రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు ఉండదని కోర్టు అభిప్రాయపడింది.
ఇంతకూ ఈ తీర్పును ప్రభుత్వం ఒప్పుకొంటుందా?
ఈ తీర్పు స్ఫూర్తిగా తీసుకుని గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే, కోర్టును ఆశ్రయించి మాండమస్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో పాలన ‘చర్య’ ద్వారానే సాగాలి. ‘నిష్క్రియ’తో పాలన కొనసాగదు. అయితే ఈ తీర్పుపై రాజ్యాంగ ధర్మాసన అభిప్రాయం అవసరమని రాష్ట్రపతి భావించారు. రాష్ట్రపతి ఇచ్చిన రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే రాజ్యాంగ ధర్మాసనం తన నిర్ధారణలు, అభిప్రాయాలు తెలియజేయడానికి చాలా కాలం పట్టవచ్చు.
సుప్రీంకోర్టుకు వచ్చిన రిఫరెన్స్లపై ఇచ్చే సలహాలను(తీర్పు) ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు కానీ రాజ్యాంగపరమైన బాధ్యతలు కానీ లేవు. ఎందుకంటే ఆర్టికల్ 143 కింద ఇచ్చే సుప్రీంకోర్టు సలహా బైండింగ్ కాదు. ఈ సమయంలో బిల్లులు ఆమోదించకపోవడం వల్ల మంత్రిత్వ శాఖల పనితీరు నిలిచిపోతుంది. ఇటువంటి వివాదాలు అర్థవంతమైన పరిపాలనను పొందాలన్న ప్రజల హక్కులను నిర్వీర్యం చేస్తాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.