
మన సైన్యం సాంకేతిక వీరత్వం, వ్యూహాత్మక విజయాలు ఎలా ఉన్నప్పటికీ, భారతదేశ అంతర్జాతీయ ఖ్యాతి కుప్పకూలింది. నిర్లక్ష్యపూరితమైన మీడియా సంచలనాత్మకత, దౌత్యపరమైన అతిక్రమణ, మిత్రదేశాలను దూరం చేసే మతపరమైన ద్వేషపూరిత ప్రసంగపు అపరిమిత విస్తరణే దీనికి కారణం.
భారతదేశం, పాకిస్తాన్ కోల్పోయిన ‘వనరుల’ సంఖ్యపై ఎక్కువ శ్రద్ధ చూపడానికి మించి, పాకిస్తాన్‌కు మనం గణనీయమైన నష్టాలను కలిగించామని ఇప్పుడు స్పష్టమైంది.
అలా చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద దాడులకైనా సరే, పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉందంటూ ప్రధానమంత్రి ప్రకటించిన సంకల్పాన్ని అమలు చేయడానికి మన రక్షణ దళాలు సాంకేతిక, వైమానిక శక్తిని కూడా ప్రదర్శించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్త మద్దతు ఎందుకు లేదు? పహల్గాం తర్వాత భారత్‌పై విస్తృతంగా పెరిగిన సానుభూతి ఇంత త్వరగా ఎందుకు తగ్గిపోయింది? చైనా, టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్ కోసం చేసినట్లుగా, ఆ నాలుగు కీలకమైన రోజుల్లో ఏ దేశం కూడా మన పక్షాన ఎందుకు నిలబడలేదు? అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్‌కు మరో ఒక బిలియన్ డాలర్లను ఎందుకు మంజూరు చేయగలిగింది? ఇరుదేశాల ఘర్షణపై మధ్యవర్తిత్వానికి మనం తెలుపుతున్న చారిత్రక వ్యతిరేకతను పూర్తిగా తెలుసుకొని కూడా, ట్రంప్ మళ్ళీ భారతదేశం, పాకిస్తాన్లను కూర్చోబెట్టి, మధ్యవర్తిత్వం చేయగలనంటూ ఎందుకు ప్రతిపాదించారు? ఆ నాలుగు రోజుల అంతర్జాతీయ నివేదికలు మన కంటే పాకిస్తాన్ వెర్షన్‌కు ఎందుకు అనుకూలంగా ఉన్నాయి?
బహుశా మే 13న కరణ్ థాపర్‌తో ఒక ఇంటర్వ్యూలో ‘భారత మీడియా మన విశ్వసనీయతను నాశనం చేసింది’ అని అరుణ్ శౌరి చెప్పిన దానిలో దీనికి సమాధానం ఉంది. దీనికి ప్రభుత్వం, దాని మితవాద మూకల నుంచి ఏ కొంచెం సహాయం కూడా లేదని నేను జోడించవచ్చా? ఇది ప్రపంచ అవగాహన యుద్ధంలో మనం ఓడిపోయామని నిర్ధారించింది.
పహల్గాం సంఘటన తర్వాత మీడియా, ముఖ్యంగా టెలివిజన్ రిపోర్టింగ్(మళ్ళీ శౌరి మాటల్లో చెప్పాలంటే) ‘దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరం’ కంటే తక్కువ కాదు.
మొదట, ఈ నాలుగు లేదా ఐదు దుష్ట ఛానెల్‌లు తమ వికృత, ద్వేషపూరిత, విషపూరితమైన వ్యాఖ్యాతలతో ఉగ్రవాదులను, పాకిస్తాన్‌ను సాధారణంగా ముస్లింలతో సమానంగా చూపుతూ, కథనాన్ని వక్రీకరిస్తూ, మన రెండు ప్రధాన కమ్యూనిటీల మధ్య పెద్ద చీలికను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. గత పదేళ్లుగా వారు ఎటువంటి తనిఖీలు లేకుండా ఇలా చేస్తున్నారు, కానీ యుద్ధ సమయంలో ఇది దేశ ఐక్యతకు, సాయుధ దళాల నైతికతకు చాలా ప్రమాదకరం కావచ్చు.
ఈ యాంకర్లు తమ ప్రసారాలలో ఉపయోగించే భాష వారు జన్మించిన ప్రాంతాలకు మాత్రమే చెందినది. భారతీయ మీడియా వాచ్డాగ్ అయిన న్యూస్‌లాండ్రీ వాటిలో కొన్నింటిని సంకలనం చేసింది. ఈ యాంకర్ల భాషలోని అసభ్యత, దాని పూర్తి లోతులను గ్రహించవలసిందిగా పాఠకుడిని నేను కోరుతున్నాను. ఒక క్లిప్‌లో తనను తాను రిటైర్డ్ మేజర్ అని పిలుచుకునే యాంకర్(మన సైన్యానికి చాలా అవమానం) మనకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఒక ఇస్లామిక్ దేశ విదేశాంగ మంత్రిని “సువర్ కా ఔలాద్”(పంది నా కొడుకు) అని వర్ణించాడు. మీకు వినడానికి కష్టంగా ఉంటే అతడు దానిని తెరపై కూడా రాస్తాడు! ఇది అప్పటి నుండి దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. కానీ ఊహించినట్లుగానే, విదేశీ ప్రభుత్వంతో శత్రుత్వాన్ని సృష్టించినందుకు ఈ యాంకర్‌పై ఎటువంటి చర్యా తీసుకోలేదు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై తీసుకునే ప్రామాణిక క్రిమినల్ చర్య ఇదే మరి.
ఇది మన దేశాన్ని ఇస్లామిక్ దేశాలకు ఇష్టమైన దేశంగా మార్చడానికి ఉద్దేశించిన వ్యవహార శైలి కాదు. రెండు రోజుల తర్వాత సౌదీ అరేబియా, ఖతార్, యుఎఇలు పాకిస్తాన్‌కు ఐఎమ్ఎఫ్ ఇచ్చిన రుణానికి మద్దతు తెలిపాయి. ఇది యాదృచ్చికమే కావచ్చు, కానీ నాకు అనుమానం ఉంది.
ఈ సంఘర్షణను తప్పుగా నివేదించడం అనేది నకిలీ, నిజాయితీ లేని, యుద్ధోన్మాద పరిమితులన్నింటినీ దాటేసింది, స్టూడియోలను నకిలీ యుద్ధ గదులుగా మార్చారు, అక్కడ అన్ని రకాల కథలనూ అల్లారు. కరాచీ ఓడరేవు నాశనం, ఇస్లామాబాద్ ఆక్రమణ, రావల్పిండి పతనం, కిరానా హిల్స్‌పై, పాకిస్తాన్ అణు సంస్థాపనలపై బాంబు దాడి, ఆపై రేడియేషన్ విడుదల(భారత వైమానిక దళం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వరుసగా వీటిని తిరస్కరించాయి). ఈ ఛానెల్‌లు ప్రతి గంటకు ప్రసారం చేసే వార్తలు ఢిల్లీలో అధికారిక బ్రీఫింగ్‌లకు విరుద్ధంగా ఉన్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా గందరగోళం, భయాందోళనలతోపాటు మన విశ్వసనీయత మంటగలిసిపోయింది. ఇప్పుడు, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వారం రోజుల తర్వాత కూడా వేడి వాతావరణాన్ని తగ్గించడానికి, ప్రశాంతతను కలిగించడానికి, వాస్తవాలపై మాత్రమే నివేదించడానికి ప్రయత్నించకుండా ఈ చానెల్స్ తమ యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వం కూడా స్వతంత్ర, నిర్భయ, విమర్శనాత్మక, నిష్పాక్షిక నివేదికలకు పేరుమోసిన కొద్దిమంది విలేకరులను, వ్యాఖ్యాతలను లక్ష్యంగా చేసుకుని, మన పాత్రికేయ ఖ్యాతిని దెబ్బతీసేందుకు తన వంతు కృషి చేసింది. ది వైర్, 4 PM, ప్రవీణ్ సాహ్నీ, పుణ్య ప్రసూన్ బాజ్‌పాయ్ వంటి ఛానెళ్లను తొలగించడమే కాకుండా, నేహా సింగ్ రాథోడ్‌పై, ‘డాక్టర్ మెడుసా’పై కేసులు దాఖలు చేయడం ద్వారా అది ఒక అవగాహనాపరమైన అత్మహననానికి (హరా-కిరి) పాల్పడింది. నిష్పాక్షికతతో ఉన్నాయని నమ్మగల కొన్ని గొంతులను నోరు మూయించారు. ప్రపంచం దీని నుండి స్పష్టమైన పాఠాలు నేర్చుకుంది. భారత ప్రభుత్వం ఏదో దాచిపెడుతోందని, అది ప్రతిదాన్నీ ప్రచార స్థాయికి తగ్గించి వేసిందని ప్రపంచం భావిస్తోంది.
భారతదేశానికి స్వతంత్ర మీడియా లేదని, మన టీవీ న్యూస్ ఛానెల్‌లు, ప్రింట్ మీడియా ప్రభుత్వ సమాచార ఉపకరణానికి వాస్తవ పొడిగింపులని ప్రపంచమంతా తెలుసు. కాబట్టి యుద్ధం పురోగతిపై మీడియా విశ్వసనీయత కోల్పోవడం వల్ల అధికారిక ప్రతినిధులపై కూడా నమ్మకం, విశ్వసనీయత తగ్గిపోయింది. అవి విదేశాంగ శాఖ అయినా లేదా రక్షణ బ్రీఫింగ్‌లు అయినా. స్పష్టంగా చెప్పాలంటే, ఎవరూ సంఘటనలపై మన వెర్షన్‌ను నమ్మలేదు. దానికి బదులుగా రాయిటర్స్, బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇతర దేశాల ప్రతినిధులపై ఆధారపడ్డారు!
మన అసౌకర్యానికి, ఒంటరితనానికి కారణం, ఎస్ జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టినప్పటి నుండి భారత దౌత్యం పూర్తిగా విఫలం కావడమే. ప్రసంగ వేదికపై అహంకారంతో కూడిన ఆయన ప్రసంగాలు, మైక్ పట్టుకున్నప్పుడల్లా ఆయన దూకుడు ప్రదర్శన, ఇతర దేశాల పట్ల కఠినంగా వ్యవహరించడం, ప్రపంచ దేశాలలో మనకంటే చాలా ఉన్నతమైన దేశాలను ఆయన తక్కువ చేసి మాట్లాడటం, మన విశ్వగురు ఆకాంక్షలు అంతర్జాతీయ విషయాలలో మన హోదాకు, స్థాయికి సరిపోలడం లేదని గుర్తించడాన్ని ఆయన తిరస్కరించడం, చాలా ప్రముఖ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని లోపభూయిష్ట ప్రజాస్వామ్యంగా భావిస్తున్నాయని, ఇది సూత్రాలకు కట్టుబడటానికి బదులుగా అవకాశవాదంతో వ్యవహరిస్తోందని భావిస్తున్నాయని ఆయన గ్రహించలేకపోవడం. ఇవన్నీ అంతర్జాతీయ సమాజం మన రాజకీయాలను, విధానాలను అనుమానించడానికి, మన నుండి సహేతుక దూరం జరగడానికీ దారితీశాయి. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం భారతదేశానికి మన పొరుగు ప్రాంతంలో కూడా మిత్రదేశాలు లేవని చూపించింది. మన సైనికులు ఒంటరిగా పోరాడారు.
మన ఖ్యాతి, మన అంతర్జాతీయ ప్రతిష్టకు చెందిన చివరి మేకును మితవాద సైబర్ యోధులు, అపఖ్యాతి పాలైన ‘ఐటీ సెల్’ దిగగొట్టి వేశాయి. తప్పుడు సమాచారం పక్కన పెడితే, కశ్మీరీలు, వారి సమాజంపై ద్వేషాన్ని రేకెత్తించే పోస్టులతో సోషల్ మీడియా నిండిపోయింది. దీని ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లోని హాస్టళ్లు, కళాశాలల నుండి కశ్మీరీ విద్యార్థులను వెళ్లగొట్టేశారు. ముస్లింల జాతి ప్రక్షాళన, పాకిస్తాన్ నిర్మూలన కోసం డిమాండ్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఒక బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరిగా ముద్ర వేశారు. హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించే వరకు రాష్ట్రం అతనిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. అంతేకాకుండా, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ ఇంకా అతనిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.
కాల్పుల విరమణ ప్రకటించినందుకు విదేశాంగ కార్యదర్శిని, అతని కుమార్తెను మితవాద సానుభూతిపరులు నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేశారు. దీంతో ఆ అధికారి తన ఎక్స్ ఖాతాను లాక్ చేసుకోవాల్సి వచ్చింది. పహల్గాంలో ఉగ్రవాదులచే చంపబడిన నావికాదళ అధికారి భార్య హిమాన్షి నర్వాల్‌ను కూడా విడిచిపెట్టనంతగా వీరి వక్రీకరణ పరాకాష్టకు చేరుకుంది. మితవాద మతతత్వవాదులు ఆమెను కనికరం లేకుండా ట్రోల్ చేశారు, ఆమెపై విషం చిమ్మారు. ఆమెను కాల్చి చంపాలని కోరుకున్నారు. ఆమె వ్యక్తిత్వం, నైతికతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎందుకు? ఎందుకంటే ఆమె మత సామరస్యం కోసం, ముస్లింలు-కశ్మీరీలపై జరుగుతున్న హింసను ఆపమని విజ్ఞప్తి చేశారు. మన సైనికులు అలాంటి వక్రబుద్ధిపరుల కోసం పోరాడారా?
ప్రపంచం, అంతర్జాతీయ మీడియా దీనిని గమనించి భారతదేశం నుంచి దూరం కావాలని నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన బలమైన ఆరోపణలను కలిగివున్న మనం, సంఘర్షణకు మూల కారణమైన ఉగ్రవాదంపై పోరు వెనుక పట్టు పట్టడానికి అనుమతించాము. హిందూ భారతదేశం వర్సెస్ ఇస్లామిక్ పాకిస్తాన్ కథనం కేంద్ర వేదికను ఆక్రమించింది. మనం ఆశించే మద్దతుతో పాటు వేదికను కూడా కోల్పోయాం.
దౌత్యపరంగా, అవగాహన పరంగా యుద్ధభూమిలోనూ ఆకాశంలోనూ మన ప్రయోజనాలను మనమే పోగొట్టుకున్నాము, మన వీరోచితమైన, అహంకారపూరిత వాక్చాతుర్యంతో మనం ఒంటరితనపు పెట్టెలో చిక్కుకున్నాము. మనకు ఎవరి తోడూ లేకుండా పోయింది. ఎందుకంటే మీ పాదాలు కిరాయి అవకాశవాదం, ప్రాథమిక మానవ హక్కుల పట్ల ధిక్కారం, ద్వేషం, మత జాతీయవాదపు చిత్తడినేలలో గట్టిగా పాతుకుని ఉన్నప్పుడు మీరు నైతికపరమైన ఉన్నత స్థానాన్ని ఆక్రమించలేరు. దీని కోసం మన సైనికులు పోరాడలేదు. సైనికులు గెలిచారు కానీ ఒకదేశంగా మనం వారికి తలవంపులు తీసుకొచ్చాం.
అనువాదం: ప్రత్యూష
(వ్యాస రచయిత మాజీ ఐఏఎస్ అధికారి అవయ్ శుక్లా రాసిన ఈ వ్యాసం మొదట తన బ్లాగ్ ‘వ్యూ ఫ్రమ్ (గ్రేటర్) కైలాష్’లో ప్రచురితమైంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.