
మే 10వ తేదీ ఉదయానికి భారత్- పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు కావాల్సిన రంగం సిద్ధం అయ్యింది. అంతకు ముందే భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు హద్దులు మీరే ప్రమాదం ఉన్నదన్న సూచనలు తమకు అందాయని దీంతో ఇరు దేశాధినేతలతో సంప్రదింపులు ప్రారంభించామని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ బహిరంగంగ ప్రకటించారు. కాల్పుల విరమణ జరిగిన రెండు రోజుల తర్వాత జాతినుద్దేశింశి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలో కూడా అణ్వస్త్ర ప్రయోగం బెదిరింపులతో భారత దేశాన్ని లొంగదీసుకో లేరని స్పష్టం చేశారు.
మరో వైపున భారత వైమానిక దళాలు పాకిస్తాన్ అణ్వస్త్రాలు భద్రం చేసిన ప్రాంతంపై దాడులు చేశాయని భారత దేశంలోని టివి మాధ్యమాలు హోరెత్తించాయి. సాయుధంగాను వ్యూహాత్మకంగాను పై చేయి సాధించిన భారత దేశం ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టేంత వరకు ఓపిక పట్టకుండా కాల్పుల విరమణకు అంగీకరించటానికి కారణం అణ్వస్త్ర ప్రయోగ ప్రమాదమేనా అని ఇంట బయట చర్చలు మొదలయ్యాయి.
కానీ పాకిస్తాన్ భారత దేశంపై అణ్వస్త్ర ప్రయోగానికి సిద్దపడిన దాఖలాలు లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి సోమవారం నాడు విదేశాంగ శాఖా పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఇచ్చిన వివరణలో భాగంగా స్పష్టం చేశారు. భారత దేశం అఖిలపక్ష బృందాలను పలు దేశాలకు పంపి ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి వివరణ ఇప్పించేందుకు నిర్ణయించుకుంది. ఆ మేరకు వివిధ దేశాలకు వెళ్లాల్సిన పార్లమెంటరీ సభ్యుల బృందాలకు ఎవరెవరు నాయకత్వం వహిస్తారో కూడా నిర్ణయించింది. అందులో భాగంగా సోమవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శితో విదేశాంగ శాఖా పార్లమెంటరీ స్థాయి సంఘానికి మొత్తం ఆపరేషన్ సింధూర్ పరిణామాలను వివరించేందుకు ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరయిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి అనేక వివరాలను వెల్లడించారు.
అందులో భాగంగా పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పాకిస్తాన్ నుంచి అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన హెచ్చరికలు, సూచనలు ఏమీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటపుడు ప్రధాని తన ఉపన్యాసంలో అణ్వస్త్ర ప్రయోగం బెదిరింపులతో భారత దేశాన్ని లొంగదీసుకోలేరని చెప్పటంలో అర్ధం ఏమిటన్నది ప్రభుత్వానికే తెలియాలి. రెండు దేశాలు ప్రధానంగా సాంప్రదాయ శైలిలోనే యుద్ధం చేశాయని మిస్రి వివరించినట్లు పత్రికలు వెల్లడించాయి.
భారత్- పాకిస్తాన్ల మధ్య జరిగిన కాల్పుల ఒప్పందం తమ వల్లనే సాధ్యం అయిందని, రాత్రంతా రెండు దేశాల ప్రధాన మంత్రులతో దఫాదఫాలుగా సంప్రదింపులు జరిపామని అమెరికా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బాహాటంగ చేసిన ప్రకటనల పట్ల కనీసం దౌత్య స్థాయిలో అయినా అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భం కనిపించలేదు. కానీ పార్లమెంట్ సభ్యులకు విక్రమ్ మిస్రి ఇచ్చిన బ్రీఫింగ్లో మాత్రం ఈ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏమీ లేదని మిస్రి చెప్పటం గమనార్హం. రెండు దేశాల మధ్య అణ్వాయుధ ఘర్షణను కూడా నివారించామని ట్రంప్ చెప్పుకున్నారు.
కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి మాత్రమే వచ్చిందని అందుకే భారత్ అంగీకరించిందని మిస్రి తెలిపారు. భారత్- పాకిస్తాన్ల మధ్య జరగబోయే చర్చల్లో అమెరికా జోక్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనేమీ తన అనుమతి కోరటం లేదని చెప్పారు. అంతే తప్ప అమెరికా జోక్యం ఉండదని స్పష్టం చేయక పోవటాన్ని గమనించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.