
న్యూఢిల్లీ: గవర్నర్లు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితిని పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. తీర్పుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఈ దేశంలో రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని స్పష్టం చేశారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ధనకర్ ఓ బహిరంగ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తుందని విమర్శించారు.
గత కొంతకాలంగా ప్రత్యేకించి గత 12 ఏళ్లుగా రాష్ట్ర గవర్నర్ల పాత్ర తిరిగి చర్చనీయాంశమైంది. కేరళ, తమిళనాడు గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను బాహాటంగా వ్యతిరేకించడం, కేంద్రంలో ఉన్న బిజెపి రాజకీయ విధానానికి అనుగుణంగా విమర్శలు గుప్పించటం. ఆగస్టు 15, జనవరి 26 సందర్భంగా జరిగే కార్యక్రమాల నుంచి వాకౌట్ చేయటం, రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయకుండా, వాటిని చట్టాలుగా మార్చకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం వంటి చర్యలకు కారణం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాము ఆమోదించిన బిల్లులను చట్టాలుగా మార్చడంలో రాష్ట్ర గవర్నర్ కాలయాపన చేస్తున్నారని, ఈ కాలయాపన వలన చట్టాలతో ఆశించిన ప్రయోజనం సాధించడంలో రాష్ట్రం ఇబ్బందులను ఎదుర్కొంటుందని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై దీర్ఘకాలం పాటు వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను చట్టాలుగా మార్చే విషయంలో రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్న గవర్నర్లు, రాష్ట్రపతి కార్యాలయాలు నిర్దిష్ట కాల పరిమితిని పాటించాలని స్పష్టం చేశాయి. ఆ కాల పరిమితి లోపల బిల్లులు తిరిగి ప్రభుత్వానికి అందకపోతే వాటిని రాష్ట్ర గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదించినట్లుగా భావించాల్సిందిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయ వ్యవస్థ తానే పార్లమెంట్లా వ్యవహరిస్తోందని ఉపరాష్ట్రపతి ధనకడ్ విమర్శించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తీవ్రమైన విమర్శలు చేస్తూ లోక్సభ ఆమోదించిన చట్టంపై వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పార్లమెంట్ పైన మరో అధికారిక కేంద్రం ఉన్నట్లుగా రాజ్యాంగం చెప్పలేదని వ్యాఖ్యానించారు.
న్యాయ వ్యవస్థ అత్యున్నత అధికార కేంద్రం, కార్య నిర్వాహక వర్గం లేదా చట్టసభలు అత్యున్నతమైనవా ఆని ప్రశ్నిస్తే నేను భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని న్యాయ వ్యవస్థ, చట్టసభలు, కార్య నిర్వాహక వర్గం భారత ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలని ఈ మూడు అంగాల మధ్య సహకారం సమన్వయం ఉండాలని ముంబైలో బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి స్పష్టం చేశారు.
కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ఈ దేశాన్ని ఇంకా రక్షిస్తూనే ఉందని గవాయి గుర్తు చేశారు. భారతీయ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ చట్టసభలు కార్యనిర్వాహణ కొరకు తమతో కొంత వ్యవహరించేలా కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తోడ్పడిందన్నారు.
తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి బిఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, తన తల్లిదండ్రులు నేర్పిన విలువలే కారణమని గుర్తు చేసుకున్నారు.
అదే సమయంలో తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిజిపి కాని ముంబై పోలీస్ కమిషనర్ కాని ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని, సరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పర్యటనకు వస్తే మర్యాదపూర్వకంగా కలవటానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముంబై పోలీస్ కమిషనర్ లేదా డిజిపి ఎవరూ సిద్ధం కాకపోవటం పట్ల వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.