
“చివరికి యుద్ధం వల్ల మనం ఏ సాధించినట్టు” అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మేదళ్లను తొలుస్తుంది. దీనికి ఆత్మసంతృప్తికరమైన జవాబు కూడా కష్టమే అని చెప్పుకోవాలి. అయితే, ఈ ప్రపంచంలో యుద్ధం కంటే ముఖ్యమైంది కాల్పుల విరమణ- శాంతి. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. దేశంలో ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వం సాధించేదేమీ లేదు. కానీ యుద్ధం జరిగితే మరణాలు తప్పవు. కాబట్టి శాంతి ఎంత ఖరీదైందంటే ఏం చెప్పలేము. మనం శాంతిని కొనుక్కుంటున్నాం. ఎంత ఖరీదుతో కొంటున్నామన్నదే తీవ్రమైన అసలు ప్రశ్న. ఎంత ఖరీదు అయ్యిందైనా కాల్పుల విరమణ చాలా విలువైంది, ప్రజలకు అవసరమైంది.
అమెరికా వంటి అనేకానేక దేశాల చేత కాల్పుల విరమణ కమిట్ చేయించి, ఉల్లంఘించాలు చేయగానే మళ్లీ పాకిస్తాన్ పై దాడిచేయడానికి ఇదేమైనా వ్యూహమా లేదా బిజెపి చాణుక్యం అని ఆశించవచ్చా?
యుద్ధంలో ‘‘మనం గెలిచాం, శత్రువు ఓడిపోయారు’’ అనుకుంటూ సంబరం చేసుకునే స్థితి ప్రస్తుతం ఇంకా రాలేదు. ఒకవేళ యుద్ధంలో గెలిచామని అనుకుంటే అదొక భ్రమ మాత్రమే. భారత్- పాక్ మధ్య యుద్ధ విరమణతో చాలామంది ఆశ్చర్యపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి కూడా ఆశ్చర్యపోయింది. వ్యూహాల గురించి, యుద్ధ పాటవాల గురించి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న దశలో అధికార పార్టీవారి శ్రేణులు, వాట్సాప్ యూనివర్సిటీ నేతలు సందిగ్ధతలో పడ్డారు. గందరగోళం, అయోమయం వాళ్లను ఆవహించింది. మరో వైపు పాకిస్తాన్ ప్రధాని వచ్చి మోదీ కాళ్లపై పడి ప్లీజ్ ప్లీజ్ అని, పాక్ లొంగిపోయిందని సోషల్ మీడియాలో మీమ్స్ విజృంభించిన దశను కూడా చూశాము.
నిమిష్లాలోనే అంతా తారుమారు..
అయితే, అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? యుద్ధం వల్ల భారత దేశం లాభపడినట్టేనా? తొమ్మిదో తేదీ రాత్రి పాక్ వైమానిక స్థావరాలను భారీ ఎత్తున ధ్వంసం చేశామని అధికారికంగా ఫొటోలను సైనిక అధికారులు విడుదల చేశారు. మొదటిసారి జరిపిన దాడిలో ఏయే తీవ్రవాదులను తుదముట్టించారనే వివరాలను పేర్లతో సహా నాలుగురోజుల తర్వాత పదోతేదీన చెప్పారు. భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్నదని, పాకిస్తాన్‌కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా భారత్‌లోకి రాకుండా సైన్యం ఒక దుర్గమై అడ్డుకుంటుందని చెప్పారు. దీంతో సైన్యానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ జేజేలు పలికారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టింది, వారికి శిక్షణ ఇచ్చే స్థావరాలపై దాడి చేసింది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడి కూల్చివేసి, తన దుర్భేద్యమైన సైనికశక్తిని భారత్ చాటుకుంది. యుద్ధంలో పాకిస్థాన్‌పై భారతదేశం తిరుగులేని విజయం సాధిస్తున్నదని అంతా అనుకున్నారు. కానీ యుద్ధవిరమణతో అంతా తారుమారైంది. శాంతి ఉండాల్సిందే అనే మాటలో ఎటువంటి సందేహం లేదు. కానీ శాంతిని సాధించామా లేదా అనేదే సందేహం.
ఇష్టమున్నా లేకపోయినా యుద్ధం భారతదేశం నెత్తి మీద పడింది. అయితే వీలైనంత వరకు ఈ యుద్ధంతోనైనా పాకిస్తాన్‌కు బుద్ది వస్తే బాగుంటుంది. భారత సైనికులు, అధికార- ప్రతిపక్షాలు కలిసికట్టుగా సంక్షోభ సమయంలో దేశ రక్షణ కోసం పనిచేయడమే లక్ష్యంగా భావించారు, అందరూ ఒకతాటిపైకి వచ్చారు. దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. 8 వ తేదీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరిగాయని, డ్రోన్లు- చిన్నపాటి మిసైళ్లతో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడిందని వీటిని భారత సైన్యం తిప్పికొట్టిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదుల ఆటను సైనికులు కట్టించినట్టుగా వార్తలు అందాయి. అయినా కానీ చొరబాటులు కొనసాగుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా చొరబాటుదారులంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానించి, సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) వారిని మట్టుబెట్టిందని బీఎస్ఎఫ్ ప్రకటించింది.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను విధించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్తాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించింది. అసత్య, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్తాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో భారత్ చర్యలు తీసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఇప్పటికే పాకిస్తాన్ నటులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం ఓటీటీలపై కూడా నిషేధాన్ని కొనసాగించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం(ఐటీ రూల్స్)- 2021 నిబంధనల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత వెబ్‌సైట్‌ను నిషేధించడం అన్యాయం..
పాకిస్తాన్ నుంచి ప్రచురించే మొత్తం ప్రచురిత అంశాలను వెంటనే తొలగించాలని 2025 మే 8న ఆదేశించిందని డిగిపబ్ అధికారులు ది వైర్ వెబ్ సైట్ యాక్సెస్‌ను నిరోధించారు. ఇది ఆశ్చర్యానికి గురి చేసింది. మత ద్వేషంతో పాటు అసత్య ప్రచారాలు చేసే వెబ్సైట్లు జాతీయ సమైక్యతకు వ్యతిరేకమని ఉత్తర్వులు ఇవ్వడం అయితే ఫరవాలేదు. కానీ నిష్పాక్షికంగా విశ్లేషణాత్మకంగా వార్తా కథనాలను అందించే ది వైర్లాంటి వెబ్ సైట్లను నిరోధించడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ డి రాజా ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడకాస్టింగ్ చర్యను ఖండించారు. ఫేక్ న్యూస్ ఆపాలంటే కావలసింది ది వైర్లాంటి వెబ్సైట్ యాక్సెస్‌ను నిరోధించడం కాదు. ఆ పేరుతో పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహల్గాం సంఘటనలో ఉగ్రవాదులను ఖండించడం మంచిది. కానీ ది వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ఇంటర్ నెట్ ఫ్రీడం ఫౌండేషన్ న్యాయవాది. ఫౌండర్ డైరెక్టర్ అపర్ గుప్తా కూడా ప్రకటించారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యంతో సహా భారతదేశాన్ని పాకిస్తాన్ పాలకులు కవ్విస్తూ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు భారతదేశానికి ఉన్న ఒక పెద్ద సమస్య ఫేక్‌న్యూస్, ప్రస్తుతం భారతదేశానికి భయంకరమైన శత్రువంటే ఇదే. ప్రతిపౌరుడు ఈ ఫేక్ న్యూస్‌ను వ్యతిరేకించడం, నిజం ఏంటో పరీక్షించుకోవడం యుద్ధప్రాతిపాదికతో కూడిన తక్షణ అవసరం.
అయితే, భారత్- పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఓడించి పీవోకేను తీసుకునే అనువైన సమయంగా, దీంతో ఒకరకంగా శత్రుత్వ పీడను వదిలించుకోవాలని భారతీయ ప్రజలు ఆశపడ్డారు. కష్టాలను ఎదుర్కొవడానికి జనం సిద్ధమయ్యారు. ప్రతి రాజకీయ పక్షం, ప్రభుత్వం పక్షం ఏకమై మొత్తం భారత జాతి ఒక తాటి మీద నడిచింది. “మేము ఉన్నాం, త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇస్తున్నాం, మా అభిప్రాయభేదాలను వదిలేసి వస్తున్నాం. సైనికులారా మీరు యుద్ధం చేయండి, మీ వెంట నిలబడతాం.” అని పార్టీ ముఖ్య నేతలు అన్నారు. ఇటువంటి దశలో భారతీయ ప్రజల ప్రోద్బలంతో త్రివిధ దళాలు పాక్ దాడులను తిప్పికొడుతూనే, ప్రతిదాడులతో ముందుకు వెళుతున్నదశను భారత ప్రజా చూసింది. మరోవైపు పాక్ ఆత్మరక్షణలో పడిపోయిన దశను చూడాల్సి వచ్చింది.
ఏ క్షణంలోనైనా ఉల్లంఘించే కాల్పుల విరమణకు భారతదేశం ఎందుకు అంగీకరించింది? భారతదేశం నిజాయితీగా తాను పూర్తిగా విరమణ చేస్తామని స్పష్టంగా చెప్పడం మంచిది. ఇది చాలా గొప్పవిషయం. పాకిస్తాన్‌ను ఒప్పించిన శాంతి దూతగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధన్యవాదాలు చెప్పి పాక్- భారత నేతలకు షేక్ హాండ్ ఇచ్చారు. ఈ శాంతి ఒప్పందంతో యుద్ధ విరమణతో ఉగ్రవాదులను అంతం చేసినట్టేనా. ఉగ్రవాదుల నేతలు లొంగిపోయారా? పోనీ పీఓకో విషయంలో ఏదైనా ప్రగతిని సాధించామా? భారత దేశ షరతులతో పాక్ లొంగిపోయిందనే నమ్మకం ఏదైనా వచ్చిందా? పోనీ ఉగ్రవాదం తగ్గిందా లేదా ఆగిందా? కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటించిన తర్వాత కూడా సరిహద్దు వెంబడి పాకిస్తాన్ యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడిందే. గత మూడు రోజుల్లో ఎన్నడూ లేనంత సంఖ్యలో డ్రోన్ల దండు అతలాకుతలం చేయడం కనపడడం లేదా? ఓ డ్రోన్ ఏకంగా శ్రీనగర్‌లోని రాజ్‌బాగ్ వరకు, మరో డ్రోన్ గుజరాత్‌లోని కచ్ వరకు దూసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి, వినలేదా? జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా శ్రీనగర్‌లో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు కూడా విన్నాడట కదా. ఎక్కడ ఈ కాల్పుల విరమణ, ఎక్కడి ఒప్పందం?
కాగల కార్యం గంధర్వులు సాధించారన్నట్టు బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టేస్తున్నమనేవి ఉత్తర కుమారుడిలాంటి ప్రగల్భాలేనా? పాక్ ఆక్రమిత భారత కశ్మీర్ భారత్‌కు చెందుతుందా? పాకిస్తాన్ అనేదే మ్యాప్‌లో ఉండదని అత్యాశ ప్రచారాలు వింటూనే ఉన్నాం కదా. పోనీ పాకిస్తాన్ శరణు శరణు అంటున్నదా. కాళ్లు పట్టుకుందా? లొంగబాటులు కనపడ్డాయా? ‘పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది? అసలు దీనిని ఎందుకు మొదలు పెట్టినట్టు? ఎందుకు ఆపినట్టు?’ అని అడిగే హక్కు ఎవరికి లేదా?
విరమణా లేక మరణమా..!
బాధ్యతగా ఇరుదేశాలు ఇకనైనా నిజంగా కాల్పుల విరమణ సాధించడం సాధ్యమవుతుందనుకోవాలి(!). భారత విదేశాంగ కార్యదర్శి కాల్పున ఉల్లంఘనకు పాల్పడితే గట్టిగా జవాబిస్తామన్నారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తమ కమిట్మెంట్ కొనసాగుతుందని మాత్రం పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ సభ్యులు. బంగ్లాదేశ్, ఖతర్, టర్కీ, యూకేలాంటి 30 దేశాలు కాల్పుల విమరణ గొప్ప నిర్ణయమని అభివర్ణించాయి. ఇంతకు ఈ విరమణ ఒప్పందం ‘మరణ’ సమానమేనా?
ఈ పహల్గాం దారుణం తరువాత మరణించిన 60 ప్రాణాలకు విలువ ఉందా లేదా? లైన్ ఆఫ్ కంట్రోల్ బయట పాకిస్తాన్ చాలా స్పష్టంగా 13 మందిని చంపేశామని చెబుతుంది. మరీ ఏం సాధించినట్టు? ఇంకేదైనా భారతదేశానికి సాధ్యమా నేతలారా?
సంక్షోభ సమయంలోనూ ఫేక్ న్యూస్, పుకార్లు ఉగ్రవాదుల కంటే భయంకరంగా విజృంభించాయి. ఈ ఫేక్ న్యూస్ వరదలో భాగంగా చాలా విషయాల వల్ల ప్రజలు గందరగోళానికి గురైయ్యారు. అయితే, జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్టుగా వార్తలు రావడంతో ఇది వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇందులో భాగంగా ఏడు వీడియోలను పరిశీలించింది. అన్నీ అబద్దాలే అని తేలాయి. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు కూడా వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్ అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం కొన్నాళ్ల వరకు ఈ అసత్య ప్రచారాల మీద యుద్ధం చేయాల్సిందే.
అంతేకాకుండా, ఓ పాత వీడియోపై కూడా పీఐబీ వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ మిస్సైల్ దాడి 2020లో లెబనాన్‌లోని బీరుట్లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇటువంటి వాటిపై వివరణలను ఎప్పటికప్పుడు చెప్పవలసి వచ్చింది. ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయిన్ సూసైడ్ దాడి జరగలేదని పీఐబీ చాలా స్పష్టంగా వెల్లడించింది. జలంధర్‌లో డ్రోన్ దాడి వల్ల వ్యవసాయ క్షేత్రంలో కేవలం మంటలు మాత్రమే చెలరేగాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. జలంధర్ జిల్లాలో ఎటువంటి డ్రోన్ దాడి జరగలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇండియన్ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారమవుతున్న మరో వీడియో కూడా ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్ బెటాలియన్ అనే యూనిట్ లేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్నది.
అయితే, పౌరులకు దేశ భక్తి ముఖ్యమే కానీ అతి ఉత్సాహంతో తప్పుడు పుకార్లు నమ్మకూడదు. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొందరు సోషల్ మీడియా, పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియా ద్వారా కూడా భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ప్రకటనలు చదవండి. ఇటువంటి పనికిరాని పుకార్లు లేదా ఫేక్ న్యూస్‌ను ఫేస్బుక్లో తదితర సోషల్ మీడియాలో చెప్పడం దారుణం. ఇది ఉగ్రవాద దాడివంటి భయంకరమైందని అర్థం చేసుకోవాలి.
ఏది ఏమైనా ఇది తప్పని పోరాట పరిస్థితి. కాబట్టి ప్రతి పౌరుడికి బాధ్యత అనేది చాలా అవసరం. సోషల్ మీడియాలో నోటీకొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. పాకిస్తాన్ వ్యాపించే భయంకరమైన అసత్యాలపైన సత్యాల ఆధారంగా భారత దేశం గెలవడం భారత ప్రజల- పాలకుల కర్తవ్యం.
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.