
బారత్, పాకిస్తాన్‌లోని పాలకవర్గాల మౌలిక డిమాండ్లు నెరవేరిన తర్వాత మే 10, శనివారం నాటికి నాలుగురోజుల నుంచీ హోరెత్తిస్తున్న శతఘ్నుల గొంతులు మూగబోయాయి. ఏతావాతా చూసినప్పుడు ఇది రాజకీయ నాయకులు తమతమ సైన్యాధికారులను ముందు పెట్టి చేసిన యుద్ధం. యుద్ధ విరమణకు సిద్ధపడింది కూడా రాజకీయ నాయకులే.
భారతదేశం ప్రకటించినట్లు ఉగ్రశిక్షణ కేంద్రాలపై సాగించిన నియమిత, నియంత్రిత, ఆచితూచి చేసిన దాడుల్లో రక్షణ వ్యవహారాల కోణం నుంచి చూసినప్పుడు నిర్దిష్ట ప్రకటిత లక్ష్యంకానీ, అప్రకటిత లక్ష్యంగానీ ఏమీ లేవు. మహా అయితే పహల్గాం బాధితుల శోకం తీర్చటానికి బాలకోట్ సమయంలో పిలుపునిచ్చినదానికంటే భిన్నంగా వ్యవహరించాలన్న తపన ఉంటే ఉండొచ్చు దేశీయ పాలకులకు.
ఆమేరకు భారత ప్రభుత్వం తన హెచ్చరికలను ఆచరణలో పెట్టింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం నుంచి పాకిస్తాన్ సైన్యంతో పూర్తి స్థాయి ఘర్షణకు దిగాలన్నది భారత ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నది స్పష్టమవుతూనే ఉంది.
దేశీయ రాజకీయ అనుయాయుల దృష్టిలో తన ప్రతిష్టను ఇనుమడింప చేసుకున్నానన్న అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ప్రధాని మోడీకి నిర్నిరోదమైన మద్దతు ప్రకటిస్తూ సాయుధ దళాలను ప్రశంసించక తప్పని స్థితి ప్రతిపక్షాలది. ఈ రెండు చర్యలూ మసకబారుతున్న మోడీ ప్రతిష్టను ఇనుమడింపచేయటానికి తోడ్పడ్డాయి. రానున్న కాలంలో చక్రవర్తి శివాజీ తర్వాత దేశానికి దక్కిన అత్యున్నత సమర్థత కలిగిన జనరల్ మోడీ అని గోది మీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టనున్నది.
మరోవైపు సరిహద్దుకు ఆవలనున్న ప్రభుత్వం కూడా భారతీయుల చికాకును సహించటానికి సిద్ధంగా లేదని నిరూపించుకున్నట్లు తేటతెల్లమవుతోంది. పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ కుటిలత్వాన్ని, పహల్గాం దాడుల వెనుక పాకిస్తాన్ పాత్రనూ భారతదేశానికి చెందిన అర్థవంతమైన అవగాహన కలిగిన వ్యూహాత్మక రక్షణ నిపుణులు పదేపదే గుర్తు చేస్తున్నారు.
పాకిస్తాన్ వ్యూహాత్మక ఆధిపత్యంపై మునీర్ పట్టును ధృవీకరించిన దాడులు
మన దేశానికి చెందిన వ్యూహాత్మక రక్షణ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు వాస్తవమేనని నమ్మినా గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఆ మాటకొస్తే గత నెల రోజులుగా పహల్గాం తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే భారతదేశం పట్ల అసీం మునీర్ వ్యూహం, వ్యూహాత్మక ప్రతిపాదన ఆధిపత్యానికి ఎటువంటి ఢోకా లేదని రుజువు అవుతోంది. అంతేకాదు. పాకిస్తాన్ రక్షకుడిగా ఆయన కీర్తి ప్రతిష్టలు పెరిగాయని చెప్పటానికి సందేహించనవసరం లేదు.
మన టెలివిజన్ వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు మనకు అందించిన విజయం, విజయ దరహాసాలను పక్కన పెడితే, ఆచరణలో పాకిస్తాన్- భారతీయులంతా కలిసి ఉమ్మేస్తే కొట్టుకుపోయేంత అల్పమైనది కాదు అన్నది మాత్రం ఖరారవుతోంది. గగనతలంలో జరిగిన దాడి ప్రతిదాడి గురించిన అధికారిక సమాచారం, అంచనాలు, వాస్తవాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కంటే ఉన్నతమైన సైనిక సామర్ధ్యం కలిగిన భారతీయ వాయుసేనను సమర్థవంతంగా నిలువరించగలిగామని కూడా పాకిస్తాన్ చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు.
మన విలువలకు హాని కలిగించటానికి ప్రయత్నిస్తే నష్టం, ప్రతీకారం ఉంటాయన్న హెచ్చరిక పంపాము అన్న తృప్తి మనకు ఉన్నా అనేక కారణాలు, పరిస్థితుల రీత్యా మన దేశం కలిగించే నష్టాన్ని ఓర్చుకునే ఓర్పు నేర్పు పాకిస్తాన్‌కు ఉన్నాయి.
ఇరు దేశాల సైనిక చర్యలు రెండు దేశాల రాజకీయ నాయకులు పొరుగు దేశంపై విజయం సాధించామని ఢంకా బజాయించుకునే స్థాయికి చేరాయి. రెండు దేశాలకు చెందిన సమాచార ప్రసార రంగాలు రెండు దేశాల ప్రజల్లో మితిమీరిన జాతీయోన్మాదాన్ని, పొరుగుదేశంపై అంతులేని శతృవైఖరిని పెంచి పోషించటానికి శాయశక్తులా ప్రయత్నం చేశాయి. రెండు దేశాల్లోనూ సైనికులకు గతంలో ఎన్నడూ దక్కని గుర్తింపు గౌరవాలు దక్కుతాయి. సంస్థాగత ప్రయోజనాలతో పాటు వ్యక్తిగత ప్రయోజనాలు కూడా సురక్షితంగావించబడ్డాయి.
రెండు దేశాల్లోనూ మోగుతున్న యుద్ధ భేరీల మాట ఎలా ఉన్నా ఆధునిక, ఇప్పటి వరకూ ఉపయోగించని ఆయుధ సంపత్తి సామర్ధ్యాలు రోజువారీ జన జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో అన్న సందేహం, ఆందోళనలైతే సర్వత్రా అలుముకుని ఉన్నాయి. ఈ యుద్ధోన్మాదాన్ని మన చేతుల్లో ఉన్న మొబైళ్లు మనకి మరింత దగ్గరగా చూపిస్తున్నాయి.
ప్రస్తుతానికి శాంతించిన ఉత్తరభారత ఉద్వేగం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఓ అంచనా లేకపోలేదు. అటువంటి ఉద్వేగాలు, ఉద్రిక్తలతే పాకిస్తాన్‌లోనూ ఆజ్యం పోసుకున్నాయి.
దేశీయంగా చూస్తే పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో దేశంలో మతోన్మాద ఉద్రేకాలు పెచ్చరిల్లుతాయేమోనన్న ఆందోళనలను నిఘా వర్గాలు వెల్లబుచ్చుతూనే ఉన్నాయి. ఇటువంటి ఉద్రేకాలను అదుపులో ఉంచేందుకా అన్నట్లు కల్నల్ ఖురేషిని భారతీయ సైన్యపు ప్రతినిధిగా మీడియా ముందు నిలబెట్టడం ఆశాజనకపరిణామమే.
ఆమె మాట్లాడుతున్నప్పుడు కనిపించే ఆత్మ విశ్వాసం, భాషలో తేటైన హిందీ భాష చూపరులను ఆకర్షించాయనటంలో సందేహం లేదు. ఈ సైనిక ఘర్షణ, మంద్రస్థాయిలోనైనా సుదీర్ఘకాలం కొనసాగితే హిందూత్వ వెర్రి ఉన్న వ్యూహకర్తల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలీదు. పాలక పార్టీకి అనుకూలంగా సాగుతున్న రాజకీయ చర్చలో ఈ ప్రమాదం పొడచూపుతూనే ఉంది.
శతఘ్నులు మౌనం దాల్చాయి. యుద్ధోత్పత్తుల తయారీదారులు, విశ్లేషకులు ఈ సాయుధ ఘర్షణ గురించిన లోతైన విశ్లేషణలు చేయటానికి కావల్సినంత సమయం దొరికింది. ఈ ఘర్షణ ఇంకా కొనసాగినా విశ్లేషణ కోణంలో ఇంతకన్నా ఎక్కువ వివరాలు అందించే పరిస్థితి ఏమీ లేదు. ఈ యుద్ధంలో చైనా, రష్యా, ఫ్రాన్స్‌కు చెందిన ఆయుధోత్పత్తుల సామర్ధ్యం గమనించిన ప్రపంచ దేశాలు భవిష్యత్తు యుద్ధ వ్యూహాల్లో తదనుగుణంగా ఏ ఉత్పత్తులు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ఉంటాయి. ఎస్- 400 క్షిపణులు మన వైమానిక దళాలకు రక్షణ కవచంగా పని చేసిందన్న తృప్తిని మాత్రం ఈ యుద్ధం మిగిల్చింది.
ప్రపంచ భాగస్వామ్యం
ఈ ప్రతి దాడులు ఆరంభం నుంచీ, ఆ మాటకొస్తే పహల్గాం దాడుల ఆరంభం నుంచీ ప్రపంచ దేశాలు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటాయన్న విషయం తేటతెల్లమవుతూనే ఉంది. రెండు దేశాలకు చెందిన దౌత్య అధికారులు మీడియాకు వివరిస్తూంటే వీళ్లు మిగిలిన ప్రపంచానికి వివరిస్తూ వచ్చారు.
హెచ్చరిక, సంయమనం వంటి పదాలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. పడికట్టు పదాలుగా మారాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు హద్దులు మీరకుండా ఉండాలని, ఇద్దరు పిచ్చోళ్ల చేతుల్లో అణ్వాయుధాలు పావులుగా మారకుండా చూడాలని అమెరికా, రష్యా, చైనాలు తెరవెనుక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ముందు ముందు ఈ యుద్ధం అసలు అవసరమైనదేనా కాదా అన్న అంశంపై లోతైన విశ్లేషణలు వ్యాఖ్యానాలు వస్తాయనటంలో సందేహం లేదు. ఆ విషయం ఎలా ఉన్నా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న అపనమ్మకం, శతృభావంలో మాత్రం ఎటువంటి మార్పులూ రాలేదు. రెండు దేశాల్లో పాలక పార్టీలు ప్రయోగిస్తున్న రాజకీయ పదజాలం, భావోద్వేగాలు రెండు దేశాల మధ్య చర్చలు, సయోధ్యకు అవకాశం ఇచ్చేవిగా ఏ మాత్రం లేవు.
బలవంతంగానో, భయపెట్టడం ద్వారానో పాకిస్తాన్‌ను దారికి తెచ్చుకోవటం సాధ్యం కాదన్న విషయం ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత తేటతెల్లమైంది. గతంలో లాగా ఉడత ఊపులతో భయపెట్టించటం సాధ్యం కాదని కాలం రుజువు చేస్తోంది. మనం ఏమి చేయాలి, ఏమి చేసి ఉండాలి అన్నది మన సమస్య. పాకిస్తాన్ సమస్య మాత్రం యథాతథంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే మన సమస్య తీవ్రరూపం దాల్చింది.
హరిష్ ఖరే
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.