
పశ్చిమ బెంగాల్లో ప్రజలను చేరుకోవడానికి సిపిఎం నూతన వ్యూహాన్ని అమలుచేయబూనుకొంటోంది. పార్టీ శ్రేణులకు రాసిన లేఖలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యామ్నాయ పాఠశాలలు, ట్యూషన్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజల దైనందిన జీవితంలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని సిపిఎం నాయకత్వం పార్టీ శ్రేణులను కోరింది.
మిషన్ 360 పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రధానంగా 2015లో పార్టీ రూపొందించిన మాస్ లైన్ కార్యాచరణను, గత మూడు మహాసభల్లో ఆమోదించి రాజకీయ తీర్మానం అందించిన దిశా నిర్దేశాన్ని ప్రతిబింబిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జీవన రంగాల్లోనూ నయా ఉదారవాద విధానాల ప్రేరిత ప్రతిపాదనల స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, ప్రయత్నాలు ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కనీసం జిల్లాకు రెండు కేంద్రాల్లో బోధనాకేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ బోధనా కేంద్రాల్లో పార్టీ అనుబంధ సంఘాల్లో పని చేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యనభ్యసించిన యువకులను గుర్తించి ఎంపిక చేసి రిసోర్స్ పర్సన్స్‌గా ఉపయోగించుకోవాలని ఆ లేఖలో ప్రస్తావించారు.
అదేవిధంగా మొహల్లా స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రోగులకు తక్షణ నివారణ కల్పించే విధంగా ఆరోగ్య సలహాలు, తక్కువ ఖరీదుతో మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ లేఖ పార్టీ శ్రేణులను కోరింది. ఈ కేంద్రాల్లో సుక్షితులైన వైద్య రంగ నిపుణులు, వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తూన్న వారి సేవలు కూడా ఉపయోగించుకుని ఈ కేంద్రాలు నడపాలని ఆ లేఖలో ప్రతిపాదించారు. ఈ లేఖలోని ప్రతిపాదనలను అమలు చేసి ఈ సంవత్సరం ఆగస్టు నాటికి సమాచారం ఇవ్వాలని పార్టీ లేఖలో శ్రేణులను కోరారు.
సంఘ సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే రాజకీయ పోరాటాల పట్ల ఏమరుపాటు పనికిరాదని కూడా ఆ లేఖ హెచ్చరించింది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బూత్ స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రధానంగా పార్టీ అవగాహనను ప్రజలకు చేర్చేందుకు ఈ సోషల్ మీడియా వేదికగా ఉండాలని లేఖ ప్రతిపాదించింది.
సిపిఎం పొలిట్‌బ్యురో సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి మొహ్మద్ సలీం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా వైద్యరంగాలకు పూర్తి స్థాయి ప్రత్యామ్నాయంగా తాము జోక్యం చేసుకోవాలనుకోవటం లేదనీ, అయితే ఈ రంగాల్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు ప్రజలకు తక్షణ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మాత్రమే ఈ ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో రెడ్ వలంటీర్ల సేవలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని ఆయన అన్నారు. ఆ తరహాలోనే వివిధ సామాజిక రంగాల్లో పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించిందే మిషన్ 360 కార్యక్రమమని ఆయన వివరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.