
ఈ గీతలు గీసినదెవరు?
అక్షాంశములనీ, రేఖాంశములనీ వీటికి నామకరణము చేసినదెవరు?
నీకింత, వాళ్లకింత
మాకింత, మీకింత
అని ఏ పంచుల సమక్షమున
పంచి ఇచ్చిన భూ స్థల సంపద ఇది?
ఇందు స్థిరనివాసులు
రాళ్లురప్పలు, నీళ్లు, నదీ నదాలేనా?
ఇక్కడ మనుషులు ఒక్కరే అస్థిరులా?
దేహమునకు పుట్టుకతో ఒక దేశమంటూ ఉండదా?
అది ఏమైనా గోత్రమా? ఇంటి పేరా?
ఎవరు ఎవరిని ఎందుకు దత్తతగా తీసుకుంటున్నారో?
ఇంకెవరు మరెవరిని ఎందుకు జారవిడుచుకుంటున్నారో?
భేరీ శబ్ద బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో జరుగుతున్న రాకాసి క్రీడ ఇది!
ఈ ఆట ప్రత్యక్ష, పరోక్ష ప్రసారం, ప్రచారం!
మధ్య మధ్య విరామ సంగీతాలేవీ?
అన్నీ విషాద గీతాలే కదా?
మరిన్ని వికటాట్టహాసాలే కదా?
ఇక్కడ ప్రాయోజిత ప్రకటనల కోసం విరామం లేదంటున్నారు
అసలు మొదటి నుంచి చివరి వరకు ఇవే ప్రకటనలట
దీని సమర్పకులు ఎవరో?
భారీ ప్రయోజనం పొందే వాణిజ్యవేత్తలు కాదు
గుండెలు చిక్కబట్టుకొని వింటావా ఎవరో?
అది నీవు, నేను, వీళ్లు, వాళ్లు, మనందరం!
మనకు తెలియకుండానే తీసుకుంటున్నారు
మన జేబుల్లోంచి,
మన గల్లా పెట్టెల్లోంచి,
అక్కడ దొరకకపోతే
మన ఒంటిలోని ఆకలి కేంద్రక
నాడీ వ్యవస్థల నుంచి,
మన కంటిపాపల్లోని ఆశాబింబాల నుంచి,
మన చంటి పాపలలోని
ఆకాంక్షల భవితల నుంచి
ఇంకా వాళ్లకు సరిపోకుంటే..
ఇంకా ఏమైనా మిగిలి ఉంటే
మనందరి మెడుల్లా అబ్లాంగేటాలలోని
అనార్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుంచి
ఏలాంటి ప్రతిస్పందన, ప్రతిఘటన,
నిరోధ, నిరసన ప్రకటన లేకుండా దొరికే ముడిచమురు కదా
ఏ వైపు నుంచి ఏ శబ్దంతో
ఏ నిశ్శబ్దంతో ఎంత బలంగా
ఎంత కసిగా వస్తుందో తెలియని
ఒక అందమైన బీభత్స దృశ్య గీత మెలోడీని
ఆస్వాదించేందుకు
మనతోపాటు సిద్ధంగా ఉన్నారు
పొరుగున ఉన్న హోమోసేపియన్ దీన దుష్టులు
మన రోజువారీ కష్టాలకు, బాధలకు, కన్నీళ్ళకు,
హర్ ఏక్ మాల్‌లకు ఒకే ఒక జిందాతిలిస్మాత్
ఈ శాంతి యుద్ధం!
రండి..
మూకుమ్మడిగా చచ్చిపోదాం
ఏడ్చేందుకు ఎవరూ మిగిలియుండని
ఆనంద ప్రపంచాన్ని
ఏలాంటి ఆక్షేపణలేని కాలానికి అందించి వెళ్దాం..
అనామక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.