
మే 10, సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడి వాన్స్‌లు భారత్ పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించటంతో దేశం ఓ మేరకు ఊపిరి తీసుకున్నట్లు అయ్యింది. కానీ పాకిస్తాన్- పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో మే 7వ తేదీ వేకువఝామున తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై మెరుపుదాడులు చేసిన తర్వాత నాలుగు రోజుల పాటు వాస్తవాధీన రేఖ వెంట జరిగిన పరస్పర ఎదురు కాల్పుల్లో అధికారిక అంచనాల ప్రకారమే సుమారు 20 మంది భారతీయులు చనిపోయారు. అంతకు ముందు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల్లో మరో 26 మంది భారతీయులు చనిపోయారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల పాటు ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు పాల్పడ్డాయి. పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను తటస్తీకరించామని, వాటివలన భారత రక్షణ వ్యవస్థకు నష్టం జరక్కుండా చూశామని రక్షణ శాఖ, విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనల్లోనూ, నిర్వహించిన విలేకరుల సమావేశాల్లోనూ వివరించారు.
ప్రపంచమంతా ఎదురు చూసిన కాల్పుల విరమణ భారతీయ కాలమానం ప్రకారం మే 10 సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జరిగింది. దీనికంటే ముందు జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఇవి:
ఉదయం 10.30 గంటలకు రక్షణ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశం..
ఉదయం 10.30 గంటలకు రక్షణ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రి మాట్లాడారు. పాకిస్తాన్ గత నాలుగు రోజులుగా భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిందనీ, శనివారం వేకువజామున కూడా ఈ రెచ్చగొట్టే చర్యలు కొనసాగాయని తెలిపారు. భారతదేశపు పశ్చిమ సరిహద్దు వెంబడి పౌర- సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని బహుముఖ దాడులకు పాకిస్తాన్ సిద్ధమవుతోందని విలేకరుల సమావేశంలో పాల్గొన్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు తెలిపారు. పాకిస్తాన్ భారత గగనతలంలలోకి ప్రవేశించేందుకు 26 చోట్ల ప్రయత్నం చేసిందనీ, ఈ ప్రయత్నాలను నిలువరించటంలో భారత సేనలు విజవంతం అయ్యాయని తెలిపారు. అయితే ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్ ప్రాంతాల్లో పాక్ సేనలు ద్రోణులతో చేసిన దాడుల వలన పరిమితంగానైనా నష్టం జరింగని వ్యోమికా సింగ్, ఖురేషీ చెప్పారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే తాము కూడా పాల్పడబోమని పునరుద్ఘాటించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విక్రం మిస్రి భారతదేశంలో కొందరు ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను విమర్శిస్తున్నారనీ, పరిణితి పొందిన ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.
శ్రీనగర్, భదేర్వాల్లో పేలుళ్లు ..
శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లో పౌర నివాసాల మధ్య భారీ పేలుళ్లకు చెందిన శబ్దాలు వినపడ్డాయని, తర్వాత చెదురు మదురుగా చిన్నచిన్న పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు వచ్చాయని పౌరులు తెలిపారు. ఉదయం పూట కిష్ట్వార్ జిల్లాలోని భదేర్వాలో కూడా భారీ పేలుళ్లు వినిపించాయని పౌరులు తెలిపారు. సైన్యం ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన కొన్ని శకలాలు శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో కూలాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇళ్లు దాటి బయటికి రావొద్దు: జైసల్మీర్ జిల్లా పాలనా యంత్రాంగం హెచ్చరిక
శనివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లో ప్రజలు ఎవ్వరూ ఇళ్లు వదిలి బయటికి రావద్దని జిల్లా పాలనా యంత్రాంగం హెచ్చరించింది.
భారీ కాల్పుల నడుమ గ్రామాలు ఖాళీ చేసిన ఫూంచ్ వాసులు
జమ్ము కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంట ఉన్న పూంఛ్ సెక్టార్లో పాక్ దళాలు కాల్పులు, భారత సేనల ఎదురు కాల్పుల మధ్య పౌరులు పెద్ద ఎత్తున గాయపడ్డారు. నిన్న జరిగిన కాల్పుల్లో కూడా ఒకరు మణించారు. గణనీయమైన స్థాయిలో ఆస్తి నష్టం కూడా జరగటంతో వివిధ గ్రామాల్లోని ప్రజలు రక్షిత స్థావరాలకు తరలి వెళ్తున్నారు. స్థానిక పోలీసులు, పరిపాలన యంత్రాంగం పౌరులను రక్షిత స్థావరాలకు తరలించే పనిలో నిమగ్నమైంది.
రక్షణ శాఖ విలేకరుల సమావేశం మే 10 సాయంత్రం
మే 10 మధ్యాహ్నం మూడున్నరగంటల ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన డెరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్ భారత దేశానికి చెందిన డెరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్‌కు నేరుగా పోన్ చేశారు. ఇరువురూ సంప్రదింపుల తర్వాత రెండు పక్షాల నుంచీ భూతలంలోనూ, గగనతలంలోనూ సాగుతున్న సైనిక చర్యలను సాయంత్రం ఐదు గంటలకల్లా నిలిపివేయాలన్న నిర్ణయంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని సాయంత్రం 5:56 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి విలేకరులకు వెల్లడించారు. ఈ అవగాహనను అమలు చేయాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు దేశాలకు చెందిన డెరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ సర్వీసెస్ స్థాయి అధికారులు సోమవారం 12 గంటలకు తిరిగి సంప్రదించుకుంటారని కూడా ఆయన వెల్లడిరచారు.
తప్పుడు ప్రచారాలపై ప్రత్యేకంగా విలేకరుల సమావేశం
కమాండర్ రవినాయర్ మాట్లాడుతూ పాకిస్తాన్ పెద్దఎత్తున తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందనీ మీడియా దృష్టికి తెచ్చారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషిలు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి అంశాలూ, సందర్భాల వారీగా వివరించారు. భారత సైన్యాలు పాకిస్తాన్లో మసీదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదనీ, ఓ లౌకిక దేశంగా భారతదేశం ఎన్నడూ ప్రార్థనా స్థలాలపై దాడి చేయదనీ వివరించారు. భారత్ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన సైనిక కేంద్రాలు, వసతులు గణనీయంగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. పాక్ హద్దు మీరితే దేశ రక్షణ కోసం తగినవిధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
శనివారం కుదుర్చుకున్న అవగాహనకు కట్టుబడి ఉండేందుకు సిద్ధమవుతూనే అవసరమైతే అన్నిరకాలుగా తలపడేందుకు కూడా సేనలు సన్నద్ధంగా ఉన్నాయని రవి నాయర్, వ్యోమికా సింగ్, ఖురేషి, విక్రం మిస్రిలు తెలిపారు. మాతృభూమి సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎంతకైనా వెనకాడేది లేదని రవినాయర్ అన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పిడితే మాత్రం తగినవిధంగా స్పందించేందుకు సదా సన్నద్ధమైన ఉన్నామని హెచ్చరించారు.
ది వైర్ స్టాఫ్
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.