
వేదకాలంలో సమాజంలో బ్రాహ్మణ,వైశ్య, క్షత్రియ, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఉండేవి.వర్ణాల నుండే కులాల ఏర్పడ్డాయనే వాదన కూడా ఉంది.
క్రీ.పూ 1500 లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది.
సమాజంలో కులం అంతర్భాగం.
కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ.కులవ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం.వ్యక్తిగత జీవనశైలి ద్వారా సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది.భారత ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 3000 కులాలు 25000 ఉప కులాలు ఉన్నాయి.నిజానికి భారతదేశంలో పని చేస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు.
భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు లేదా అధిక సంఖ్యాకులు లేదా బహుజనులు ఇప్పటికీ ఏ స్థాయిలో సామాజిక,ఆర్థిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారురో ఈ గణాంకాలు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం
నేషనల్ శాంపిల్ సర్వే 2011 -12 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016-17 ప్రకారం దేశంలో 28 శాతం ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50% ఎస్సీలు 33% ఓబీసీలు 27% పేదరికంలో ఉన్నారు.
నేషనల్ శాంపిల్ సర్వే 2017 -18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3%, ఎస్సీలు 4%, ఓ బి సి లు 6%, జనరల్ క్యాటగిరి 12% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లో జనరల్ కేటగిరీలో 3% ఓబీసీ లో 1% మాత్రమే ఉన్నారు.ఉపాధిరంగం జనరల్ కేటగిరిలో 30% ఓబిసి లో 20% ఎస్టీలు 12 శాతం మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు.రోజువారి కూలీలు ఎస్టీలు 29%, ఎస్సీలు 38%, ఓ బీసీలు 20%, జనరల్ కేటగిరీలో 11%. మాత్రమే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7% మంది జనరల్ కేటగిరి చెందిన వారే ఉన్నారు.అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64% పైగా జనరల్ కేటగిరీ వారు ఉన్నారు.
ఈ గణాంకాలన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్ కేటగిరి వారితో పోల్చితే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడ్డారని మనకు అర్థమవుతుంది.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ….
భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటి, ఐఐఎం లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఓబీసీల ప్రాతినిధ్యం చూస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచిన వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి అని చెప్పడానికి ఈ అధికారిక గణాంకాలే నిదర్శనం.ఐఐటీ ముంబై, ఐఐటి ఖరగ్పూర్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 700 మంది (90 శాతం) జనరల్ కేటగిరి వారే కావడం గమనార్హం.ఐఐటి మండి, ఐఐటి గాంధీనగర్,ఐఐటి కాన్పూర్, ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీలలో 80-90% సిబ్బంది జనరల్ కేటగిరి వారే పనిచేస్తున్నారు. ఈ సమాచారం ఆల్ ఇండియా ఓబీసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్ సమాచార హక్కు చట్టం( ఆర్టిఐ) ద్వారా వెనుకబడిన వర్గాల పరిస్థితి వివిధ విద్యా సంస్థల నుండి అధికారికంగా సేకరించినది.
ఐఏఎం ఇండోర్ లో 109 మంది వివిధ పోస్టుల్లో పనిచేస్తే వారిలో 106 (97.2%) జనరల్ కేటగిరి వారే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎస్సీ ,ఎస్టీ రిజర్వుడ్ కేటగిరి లో ఎవరు కూడా లేకపోవడం గమనార్హం.
ఐఐఎం ఉదయపూర్ లో 90% ఫ్యాకల్టీ, ఐఏఎం లక్నోలో 95% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందినవారే. కొన్ని విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు అసలు ప్రాతినిధ్యమే లేదు.
ఆర్ టి ఐ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 13 ఐఏఎంలలో పనిచేస్తున్న వారిలో 82.8% జనరల్ కేటగిరి వారు ఉండగా 5% ఎస్సీలు, 1% ఎస్టీలు, 9.6% ఓబీసీలు మిగతా వారిలో ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారు.
21 ఐఐటి లలో 80% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరి, 6% ఎస్సీ కేటగిరి,1.6% ఎస్ టి కేటగిరి, 11.2% ఓబిసి కేటగిరి మిగిలిన వాటిలో ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ ఛాలెంజ్ కోట వారు ఉన్నారు.
ఐఐటి పాట్నా లో 38 శాతం ఓ బి సి, 22% ఎస్సీలు, 13% ఎస్టీలు, 12% జనరల్ కేటగిరి వారు ఉన్నారు. ఐఐటి బిలాయి , ఇండోర్లలో 50% పైగా జనరల్ కేటగిరీ వారే పనిచేస్తున్నారు. అలాగే ఐఐఎమ్ జమ్ము లో జనరల్ కేటగిరి 19%, ఎస్టీలు 5%,23% ఓ బి సి లు ఉన్నారు .
రాజ్యాధికారంలో వెనుకబాటుతనం
ప్రస్తుత లోక్ సభ సభ్యుల్లో అగ్రవర్ణాల వాటా 214 (39.4%), ఓబీసీలు 137 (25.4%), షెడ్యూల్ కులాలు 85 (15.8%) షెడ్యూల్ తెగలు 55 ( 10.1%) ముస్లింలు 24 (4.4%) క్రిస్టియన్లు 7 ( 1.3%) సిక్కులు 13( 2.4%) ఇతరులు 6( 1.1%) లు ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 నుండి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు (2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి) తెలంగాణా నుండి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సింహభాగం అగ్రవర్ణాలకు చెందిన రెడ్డిలు, వెలమలు మరియు కమ్మలే.
గత 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా రెడ్డి ఎమ్మెల్యేలు 30 నుంచి 43, వెలమలు 8 నుంచి 13 మధ్య, కమ్మలు 3-8 మధ్య, బ్రాహ్మణులు 1 నుంచి 7 మధ్య ఉన్నారు.వెనుకబడిన తరగతుల (బీసీలు) ఎమ్మెల్యేల సంఖ్య 14 మరియు 23 మధ్య కొంచెం అటు ఇటుగా మారుతోంది.
ప్రస్తుత అసెంబ్లీ(119)లో 43 మంది రెడ్డిలు,13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ మరియు వైశ్య వర్గాలకు ఒక్కొక్కరు ఉన్నారు. అగ్రవర్ణాలకు చెందినవారు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన సభ్యులలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు,రిజర్వ్డ్ స్థానాల్లో 19 మంది షెడ్యూల్డ్ కులం, 12 షెడ్యూల్డ్ తెగ ప్రతినిధులు ఉండగా, ఏడుగురు ముస్లింలు లు ఉన్నారు.బీసీలందరూ జనరల్ కేటగిరీలో ఎన్నికయ్యారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు.వెనుకబడిన కులాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి లేకపోతే ఇంకా ఎన్ని ఎండ్లైనా ఈ వెనుకబాటు తనం ఇలాగే కొనసాగుతుంది.
దేశంలోని బడుగు బలహీన వర్గాల వారు ఇప్పటికైనా మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండే అప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇప్పుడు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ లు వచ్చాక ఆయా నియామకాల్లో అగ్రవర్ణాల వాటా మరింత పెరగనుంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారం ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధించబడుతుంది. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ నియామకాల్లో,చట్టసభల్లో వాటా కోసం బహుజనులందరూ సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది.రాజ్యాధికారమే పరమావధిగా ఉద్యమించి, బహుజనులను గెలిపించుకొని సత్తాచాటాల్సిన బాధ్యత బహుజనులందరి పై ఉంది.
✍️పాకాల శంకర్ గౌడ్
9848377734.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.