
గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను పశ్చిమ బెంగాల్‌కు వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్రప్రభుత్వానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అంతేకాకుండా వేతనాలు చెల్లించేందుకు ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలన్నది తప్పనిసరి షరతు గా చేయకూడదని సిఫార్స్ చేసింది.
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005(ఎంజిఎన్ఆర్ఇజిఎ)కింద కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల విషయ లో నిరంతర జాప్యం పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా గ్రామీణ వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి వేతన రేట్లను సవరించాలని సిఫార్సు చేసింది.
దేశవ్యాప్తంగా ఒకేరకమైన వేతన రేటును అమలును ప్రభుత్వం పరిగణించాలని సూచించింది.
ఈ చట్టం కింద కనీస పని దినాలను 100 నుంచి 150కు పెంచాల్సిందిగా కమిటీ సూచించింది. ఆధార్ ఆధారిత నగదు పంపిణీ పద్ధతిని ఐచ్ఛికంగా మార్చాలని, పశ్చిమబెంగాల్‌కు విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సిఫార్స్ చేసింది.
కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతఅత్వంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరానికి గాను స్టాండింగ్కమిటీ మార్చి 12న సమర్పించిన నివేదిక లో ఈ సిఫార్సులు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ (గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ), భూ వనరుల శాఖ(గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ), పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్ల కమిటీ(2025-26)ఐదవ, ఆరవ, ఏడవ నివేదికలను ఈ కమిటీ లోక్‌సభలో సమర్పించింది.
వేతన రేట్ల సవరణ
వివిధ రాష్ట్రాలుా కేంద్రపాలిత ప్రాంతాలలో వేతన రేట్ల సవరణ, వేతనాలలో అసమానత తమ ‘దీర్ఘకాలిక ఆందోళనలలో’ ఒకటి అని కమిటీ పేర్కొంది. ‘వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక(సిపిఐఎఎల్)కు ఎంజిఎన్ఆర్ఇజిఎ వేతనాల ప్రస్తుత అనుసంధానం చేసినందువల్ల వ్యవసాయ కార్మికుల జీవితాలలో ధరల ప్రభావాన్ని సరిగ్గా ఖచ్చితంగా ప్రతిబింబించకపోవచ్చు’ అని తెలియజేసింది.
‘ఈ సూచిక ద్రవ్యోల్బణం వాస్తవ ప్రభావాన్ని పూర్తిగా సంగ్రహించలేదని కమిటీ విశ్వసించింది. దీంతో వేతన ఖరారు పద్ధతిని సమీక్షించి, క్షేత్ర స్థాయిలో వాస్తవ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ప్రాధాన్యతా ప్రాతిపదికన నవీనీకరించాలి’ అని పేర్కొంది.
పథకానికి ప్రారంభం నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది కాబట్టి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకే విధంగా వేతన రేటు అమలుకై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని కమిటీ కోరింది.
‘పథకం కింద వేతన చెల్లింపులలో న్యాయమైన, నిలకడుత్వాన్ని నిర్ధారించడానికి ఇది సహాయపడొచ్చు’ అని తెలియజేసింది.
ఉపాధి హామీ చట్టం 2006లో నుండి అమలులో ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల హామీ వేతన ఉపాధిని ఈ చట్టం గారంటీ చేస్తోంది.
నిధుల విడుదలలో నిరంతర వాయిదాలు
పథకంలోని కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల విషయంలో నిరంతరం వాయిదాలు వేస్తోందని కమిటీ గుర్తించింది. ఫిబ్రవరి 15న గ్రామీణాభివృద్ధి శాఖ(డిఆర్డి) అందించిన సమాచారం ప్రకారం, వేతన- పథకం కింద సామాగ్రి భాగాలకు రూ.23,446.27 కోట్లు మొత్తం బకాయిలున్నాయని, ప్రస్తుత బడ్జెట్లో ఇది 27.26% అని తెలిపింది.
‘ఇది ప్రస్తుత బడ్జెట్లో 27.26%, అంటే కేటాయించిన నిధులలో నాలుగో వంతు కంటే ఎక్కువ. గత సంవత్సరాల బకాయిలను క్లియర్ చేయడానికి ఈ మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ బడ్జెట్ రూ. 62,553.73 కోట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పథకం సమర్థవంతంగా పనిచేయడానికి, గ్రామీణ దుస్థితిని నివారించడం, జీవనోపాధి భద్రతను నిర్ధారించడం అనే ప్రాథమిక లక్ష్యాన్ని తీర్చే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది’అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
నిధుల కేటాయింపు, విడుదల, వినిమయం విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. వేతనాలకు, సామాగ్రికి సంబంధించిన కేంద్ర వాటాను సమయానికి విడుదల చేయాలని పేర్కొంది. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వంతో మెరుగైన సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించింది.
పశ్చిమ బెంగాల్‌కు నిధుల విడుదల సమస్య
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన టిఎంసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను తమ రాష్ట్రానికి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. రాష్ట్రాలకు సరైన నిధులను విడుదల చేయాలని స్టాండింగ్ కమిటీ తన నివేదకలో సిఫార్సు చేసింది.
‘అర్హత ఉన్నటువంటి అన్ని సంవత్సరాలకు సంబంధించిన సరైన బకాయిలను, ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తున్న సంవత్సరాన్ని మినహాయించి పశ్చిమ బెంగాల్ పొందాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అదనంగా, ఎటువంటి వాయిదా లేకుండా బకాయి చెల్లింపులను కచ్చితంగా విడుదల చేయాలి. ఎందుకంటే కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. లబ్ధిదారులు ఆర్థిక పరిమితుల వల్ల ఇబ్బందిపడకూడదు’ అని అది పేర్కొన్నది.
2021 నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌కు చెందిన నిధులను నిలిపివేసింది. దీనికి పథకం అమలు సరిగ్గా లేదని కారణంగా చూపింది.
ఆధార్ ఆధారిత చెల్లింపుల నిలుపుదల, పని దినాల పెంపు..
పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తప్పనిసరి చేయకూడదని కమిటీ గుర్తించింది. ‘దీని వల్ల ఎదురవుతున్న సమస్యలతో అసలైన అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోతున్నారని కమిటీ అధ్యయనంలో తేలింది. ఆధార్, జాబ్ కార్డ్‌లోని వివరాల వ్యత్యాసం వల్ల ఉపాధిహామీ కార్మికులను తప్పుగా తొలిగించారని అన్నారు.
డిసెంబర్ నెలలో జాబ్ కార్డ్ తొలగింపు విషయంలో తమ పాత్ర లేదని పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం సమాచారమిచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపింది.
ఉపాధి హామీ పథకానికి ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఎప్పుడైతే జాబ్‌కార్డ్స్ తొలగింపు గురించి ప్రస్థావించారో, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖామంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని స్పందించారు. ‘జాబ్‌కార్డ్ తొలగింపులో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదు’ అని అన్నారు.
శ్రావస్తి దాస్‌గుప్తా
అనువాదం: క్రిష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.