
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకై ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల పేకేజీ ప్రకటించింది. దీనితో ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోయాయని, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సాధించిన గొప్ప విజయమిదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నాయకులందరూ ప్రకటిస్తున్నారు. అదే సందర్భంలో ఈ పేకేజీ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని, అసలు సమస్య ఇది కాదని, ఫ్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవడం, సొంత గనులు కేటాయించడం ద్వారా మాత్రమే ప్లాంటు అసలు పరిరక్షణ సాధ్యమని అక్కడి ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న పోరాట కమిటీ స్పష్టంగా ప్రకటించింది. వీటి సాధనకై తమ పోరాటం కొనసాగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపద్యంలో ఇందులోని వాస్తవాలను తెలుసుకోవాలంటే కొద్దిగా లోతుకు వెళ్ళి, కొన్ని పూర్వాపరాలను పరిశీలించాలి.
2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటును వ్యూహాత్మక అమ్మకం చేపట్టాలని నిర్ణయించింది. దీనర్ధం ఏదో ఒక ప్రైవేటు సంస్థకు దీనిని అమ్మేయడం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ ఒక్కటై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ అనే పేరున అప్పటి నుండి గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ప్లాంట్ వద్ద దీక్షా శిబిరాన్ని 2021 ఫిబ్రవరి 12 నుండి నేటికీ నడుపుతున్నారు. మరో దీక్షాశిబిరం విశాఖ నగరం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నాటి నుండి నేటి వరకు కొనసాగుతోంది.
నేడు స్టీల్ ప్లాంటు కష్టాలకు ప్రధాన కారణం దీనికి సొంత గనులు లేకపోవడమే. మేక్ ఇన్ ఇండియా వంటి గొప్ప నినాదాలు ఇస్తున్న నేటి ప్రభుత్వం మన ఇనుప ఖనిజాన్ని చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ, ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ కు మాత్రం కేటాయించ నిరాకరించడం ప్రభుత్వ నినాదంలోని డొల్లతనానికి నిదర్శనం.
విచిత్రమేమిటంటే, ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు మినహా నేడు దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల లోని అన్ని స్టీల్ ప్లాంటులకూ సొంత గనులు ఉన్నాయి. సొంతగనులు లేకపోవడంతో ఈ ప్లాంటు ఇనుప ఖనిజాన్ని మార్కెట్లో కొనుక్కోవడం వలన, మిగిలిన ప్లాంటులకంటే టన్నుకు నాలుగు వేల నుండి ఎనిమిది వేల రూపాయల వరకూ అదనంగా చెల్లించవలసి వస్తోంది. అయినా కూడా ఈ ప్లాంటు ఇటీవల వరకు లాభాలలోనే నడిచింది. గత నాలుగేళ్లుగా దీనికి బొగ్గుతో సహా ముడి సరుకు సరఫరాలో అంతరాయాలు కల్పించడం, చివరకు దీని ఎగుమతులకు రైల్వే వేగన్ లను కూడా సకాలంలో ప్రభుత్వం అందించక పోవడం, కావాలనే ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించి నడపడం, మూడింటిలో రెండు బ్లాస్ట్ ఫర్నెసులను మూసివేయడం వంటి యాజమాన్య, ప్రభుత్వ ఉద్దేశ పూరక చర్యల వల్ల నష్టాలను సరిచూడవలసి వచ్చింది. అందువల నేటి ప్లాంట్ కష్టాలు మానవ దురుద్దేశపూరితమే తప్ప నిర్వహణా లోపం వల్ల వచ్చినవి మాత్రం కాదు.
వాస్తవంగా దేశంలోని మిగిలిన స్టీల్ ప్లాంటులకు లేని ప్రత్యేకతలు ఈ ప్లాంటుకు ఉన్నాయి. దేశంలోని సముద్ర తీర భారీ స్టీల్ ప్లాంట్ ఇది ఒక్కటే. దీనివల్ల ఉత్పత్తి ఎగుమతులు, ముడి సరుకుల దిగుమతులు సులభతరమవుతాయి. అదే సందర్భంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ణానం కలిగి, తక్కువమంది కార్మికులతో, మిగిలిన ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంటుల కంటే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్న ప్లాంటు ఇది.
రాష్ట్రంలో అతి పెద్ద భారీ పరిశ్రమ అయిన దీనిని కేంద్ర కుట్రల నుండి కాపాడవలసిన నేటి రాష్ట్ర ముఖ్య మంత్రి, ఆ పని చేయకపోగా పక్కలో బల్లెంలా దీనికి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెనల్ మిట్టల్ ప్రైవేటు స్టీల్ ప్లాంటు నిర్మించాలని, దానికి అనుసంధానంగా పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడమే గాక, దానికి ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని ప్రధానిని ఇటీవల కోరడం విశాఖ స్టీల్ ను బలహీన పరచడంలో భాగంగానే భావించాలి.
1991 లో 1.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ ప్లాంటు సొంత నిధులతో తన సామర్ధ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇటీవల 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి చేరింది. ఇంకా 20 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి పెంచకోగలిగే, భూమితో సహా మౌలిక వసతులు అన్నీ దీనికి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న ఆత్మ నిర్భర భారత్ నినాదం సాకారం కావాలంటే దేశ స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచాలి. చైనా వెయ్యి మిలియన్ టన్నులతో స్టీల్ రంగంలో ప్రపంచంలో నెంబరు వన్ గా నేడుంది. మన దేశీయ ఉత్పత్తి గత సంవత్సరం 138.5 మిలియన్ టన్నులు మాత్రమే. దీనిని కనీసం 200 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సెయిల్ లో భారీగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేయాలి. కానీ అంత ఖర్చు లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సామర్ధ్యాన్ని 20 మిలియన్ టన్నులకు చాలా సులువుగా పెంచే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తాను పెట్టుకున్న లక్ష్యానికి భిన్నంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటును మాత్రం అమ్మేయలని నిర్ణయించడం వెనుక దేశ ప్రయోజనాల కంటే ఇతర అంశాలే కీలకంగా మారాయి.
ముందే చెప్పినట్లు, ఇతర స్టీల్ ప్లాంటులకు లేని సముద్ర తీరం, ఆధునిక సాంకేతి పరిజ్ఞానం ఉండడంతో పాటు, 22 వేల ఎకరాల సువిశాల భూభాగంతో మొత్తం నికర ఆస్తులు కనీసంగా మూడు లక్షల కోట్ల రూపాయల పైగా ఉంది. దీనిని ఎలాగైనా కారు చౌకగా పుస్తక విలువకు కాజేయాలని స్టీల్ కార్పొరేట్ దిగ్గజాలు దీనిపై కన్నేసాయి.
వీరి సేవలో భాగమే నేటి కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయం. నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను స్పీడుగా అమలు చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం ఒక విధానంగా పెట్టుకుంది. Government has no business in doing business అని ప్రధాని మోదీ స్పష్టంగానే తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు.
ఈ ప్లాంటు కనుక లేకపోతే విశాఖ నగరాభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎండమావిగానే ఉంటుంది. వాస్తవంగా ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారానే విశాఖ నగరం అభివృద్ధి చెంది, నేడు 25 లక్షల జనాభాతో ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా నిలిచింది. 682 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే మూడవ అతి పెద్ద నగరంగా కూడా నేడుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచింది. 30 వేల మంది ప్రత్యక్షంగా, మొత్తం లక్ష మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. రిజర్వేషన్ల ద్వారా నాలుగువేల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఉంది. 8,500 క్వార్టర్లు కలిగిన టౌన్ షిప్ దేశంలోని వివిధ బాషలు, ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజలతో ఒక మినీ ఇండియాగా నిలిచింది . ప్రతి నెలా సుమారు వంద కోట్ల రూపాయలు విశాఖ మార్కెట్ లోనికి ఉద్యోగుల జీతాలు, భత్యాల ద్వారా సమకూరుతోంది. కరోనా సమయంలో ఆక్సిజన్ లేక దేశం విలవిల లాడుతుంటే గొప్ప సామాజిక బాధ్యతతో దేశంలోని అనేక ప్రాంతాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసింది. దీనిపై ఆధారపడి అనేక చిన్న పరిశ్రమలు విశాఖ నగరంలో నడుస్తున్నాయి. ఇలా ఆర్ధిక, సామాజిక రంగాలలో విశేషపాత్ర స్టీల్ ప్లాంట్ పోషిస్తోంది.
రాజకీయంగా కూడా ఇది వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటమిలలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసంబ్లీ ఎన్నికలలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రధానంగా ఉన్న గాజువాక అసంబ్లీ, విశాఖ పార్లమెంటు నియోజక వర్గాల నుండి స్టీల్ ప్లాంటును కాపాడతామని వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఇదే ప్రధాన కారణం.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్లాంటుకు దేశంలో మరే ఇతర స్టీల్ ప్లాంటుకు లేని మరో గొప్ప ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అని 1966లో ఉవ్వెత్తున పోరాడి సాధించుకున్న పరిశ్రమ ఇది. ఇక్కడ నిర్మించవలసిన ఈ ప్లాంటును కర్ణాటక రాష్ట్రానికి తరలించాలని నాటి కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం యత్నిస్తే, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. 32 మంది ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. వేల మంది క్షతగాత్రులయ్యారు. నాడు 52 మంది కమ్యూనిస్టు శాసన సభ్యులతో సహా మొత్తం 67 మంది ఎమ్మేల్యేలు తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామా చేసి, ఉద్యమంలో భాగస్వాములై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వీరితో బాటు ఏడుగురు కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు కూడా తమ పదవులను త్యజించారు. నాటి ఉమ్మడి తెలుగు ప్రజలు రెండేళ్లకు పైగా సాగించిన మహోన్నత పోరాటం ప్రభుత్వాన్ని వణికించి వేసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి, 1971 లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ, నిధులు ఇవ్వకపోవడంతో భూ సేకరణ, నిర్మాణం ప్రారంభం కాలేదు. మరలా ప్రభుత్వం మీద అనేక రూపాలలో వత్తిడి తేవడంతో నాటి జనతా పార్టీ ప్రభుత్వం నిధులు కేటాయించి భూ సేకరణ చేపట్టింది. నిర్మాణం కూడా త్వరితగతిన సాగింది. 64 గ్రామాల ప్రజలు తమ ఊళ్లు ఖాళీ చేసారు. 16,500 మంది చిన్న, సన్నకారు రైతులు తమ జీవనాధారమైన 22 వేల ఎకరాల భూములను ఏ మాత్రం సంకోచించకుండా త్యాగం చేశారు. వారిలో నేటికీ 6500మందికి నిర్వాసితులకు ఉపాధి కూడా లభించలేదు. ప్లాంట్ నిర్మాణంలో రెండు వందల మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు 1991 లో నాటి ప్రధాని పివి నరసింహారావు దీనిని జాతికి అంకితం చేశారు. అంటే దాదాపు రెండు దశాబ్దాల పోరాట ఫలంగా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమయింది. కానీ ఆది నుండీ అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటూనే వస్తోంది.
ప్రపంచంలో పుష్కలంగా ఇనుప ఖనిజం లభించే దేశాలలో భారతదేశం ఒకటి. కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజం వంద సంవత్సరాలకు సరిపడా కేటాయించింది. టాటా, భిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా వంటి స్టీల్ ప్లాంట్లు అన్నింటికీ ముడి ఖనిజం సమృద్ధిగా వుంది. వారితో విశాఖ స్టీల్ పోటీ పడాలి. మార్కెట్లో అన్ని స్టీల్ప్లాంట్ల అమ్మకాల రేట్లు ఒక్కటే. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం 1957 సెక్షన్ 17(1)(బి) ప్రకారం ప్రభుత్వ రంగ పరిశమ్రలన్నింటికి ముడి ఖనిజం గనులు కేటాయించాలని స్పష్టంగా వుంది. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వంత గనుల కేటాయింపు ఒక హక్కు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో 1985లో విడుదల చేసిన డి.పి.ఆర్ ప్రకారం ఎన్.ఎమ్.డి.సి (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్), బైలదిలాలోని నాలుగు, ఐదు బ్లాకుల్లో స్వంత గనులు విశాఖ స్టీల్‌కు కేటాయించాలి. అయినా నాటి నుండి నేటి వరకు గనులు కేటాయించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నది. దీన్ని కావాలనే
నష్టాలలోనికి నెట్టి ప్రైవేటికరించాలనే కుట్ర దీని వెనుక దాగి ఉంది.
1998-99 సంవత్సరంలో ప్లాంటుకు వరుసగా నష్టాలొస్తున్నాయనే పేరున నాటి వాజ్ బాయ్ ప్రభుత్వం దీన్ని బిఐఎఫ్ఆర్ కు రిఫర్ చేసి, మూసేయాలని చూసింది. దీనిపై కూడా మరో పెద్ద కార్మిక పోరాటం జరిగింది. లాఠీ ఛార్జీలు, పోలీసు కేసులు వంటివి ఎదుర్కొని మరలా నిలబడడమే కాక, తన స్వంత నిధులతో తన సామర్ధ్యాన్ని కూడా పెంచుకుంది.
సముద్ర తీరాన్ని ఆనుకుని ఈ ప్లాంట్ ఉండడంతో దీనికి అనుసంధానంగా దీని భూములలోనే గంగవరం పోర్టు కూడా నిర్మించాలన్నది అసలు ప్రతిపాదన. కానీ నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కుని ప్రైవేట్ పోర్టుకు దారదత్తం చేసి, పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది.
వాస్తవంగా ఆరంభం ఉండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సమకూర్చిన నిధులు కేవలం 4890 కోట్ల రూపాయాలు మంత్రమే. దీనికి ప్రతిగా ఈ ప్లాంట్ వివిధ పన్నులు, డివిడెండ్ల రూపంలో నేటికి 50 వేల కోట్ల రూపాయాలకు పైగా ప్రభుత్వానికి చెల్లించింది. ఏ ప్రైవేటు సంస్థ ఇన్ని నిధులు ప్రభుత్వానికి సమకూర్చిన దాఖలాలు దేశంలోనే లేవు. ఇటువంటి బంగారు బాతు లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం, బలహీన పరచడం అంటే ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రయోజనాలను, సామాజిక న్యాయాన్ని ఫణంగా పెట్టడమే. అందుకే నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు గత నాలుగేళ్లుగా సుదీర్ఘ పోరాటాన్ని సాగిస్తున్నారు. దీన్ని పరిరక్షించుకునేందుకు, అంటే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, సొంత గనులు కేటాయించి బలోపేతం చేసే వరకూ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తద్వారా తామే అసలైన అభివృద్ధి కాముకులమని చాటుతూ రాష్ట్ర ప్రజలు, కార్మికులు ఆగ్ర భాగాన నిలబడుతున్నారు. ఈ ఉద్యమానికి అండగా నిలవడం, ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడమే అసలైన దేశభక్తి.
— ఎ. అజ శర్మ,
ప్రథాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.