
బ్రిటిష్ నిరంకుశ పాలనను వెక్కిరిస్తూ, 19, 20వ శతాబ్దాల్లో ‘ద ప్యారిస్ పంచ్’, ‘అవధ్ పంచ్’, ‘హిందీ పంచ్’ అనే మూడు పత్రికలు వచ్చాయి.
బ్రిటిష్ వలసపాలనాధికారాన్ని సవాలు చేస్తూ, నిర్మొహమాటంగా రాస్తూ, వ్యంగ్యోక్తులు విసురుతూ ఈ మూడు పత్రికలు 19,20వ శతాబ్దాల్లో పాఠకాదరణ పొందాయి. భారతదేశంలో 2014 నుంచి పత్రికా స్వేచ్ఛ అణచితకు గురవుతోంది. ఈ అణచివేతకు బాధ్యులైన నేటి వార్తా పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటి విధేయ పాత్రికేయులకు ఈ మూడు ‘పంచ్’ పత్రికలు ఒక చెంపపెట్టులా అనిపిస్తాయి.
ఇంగ్లాండ్ లో చమత్కారంతో ‘పంచ్’ అనే పత్రిక 1841 లో ప్రారంభ ప్రారంభమైంది. తరువాత 1854 నుంచి 1930ల మధ్య ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఈ మూడుపత్రికలు లక్నో, బొంబాయి, ఇండోర్ లలో నడిచాయి.
ఆడంబరమైన నిరంకుశ బ్రిటిష్ పాలకులను వెక్కిరిస్తూ, ఈ మూడు పత్రికలు ఎంతో పట్టదలతో పనిచేశాయి. బొంబాయి నుంచి ఇంగ్లీషులో పెస్టోంజి మార్కర్ 1854 ప్రారంభించిన ‘పార్సీ పంచ్’ పత్రిక 1931 వరకు నడిచింది. అలాగే లక్నో నుంచి ఉర్దూలో మున్సి సజ్జద్ హుస్సేన్ 1877లో ప్రారంభించిన ‘అవధ్ పంచ్’ 1936 వరకు నడిచింది. ఇండోర్ నుంచి నౌరోస్ జీ బర్జోర్జీ హిందీలో 1906లో ప్రారంభించిన ‘హిందీ పంచ్ ’ 1936 వరకు మూడు దశాబ్దాల పాటు నిరాటంకంగా సాగింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి పత్రికల నోరు నొక్కే వాతావరణం ఏర్పడింది. ఇంతకంటే వలసపాలనలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, ఈ మూడు పత్రికల (వాటి మధ్య భిన్నమైన ప్రాంతీయభాషాభేదాలు ఉన్నప్పటికీ) సంపాదకీయ వైఖరి మాత్రం వలసపాలనకు వ్యతిరేకంగానే సాగేది.
నేడు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ, పిరికితనం నిండిన నేటి ప్రతికలకంటే, పరిమితమైన ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం, అంతులేని నిరక్షరాస్యత, ఆంక్షల వాతావరణం వంటి పరిమితుల్లోనే ఈ మూడు ప్రతికలు, ఎంతో పట్టుదలతో సత్యాన్ని చాలా బలంగా వ్యక్తీకరించాయి. వలస కాలం నాటి ఆ పత్రికల వారసులైన నేటి పత్రికలను గమనిస్తే, ప్రభుత్వాన్ని నిశితంగా పరిశీలించడంలో, పరిపాలనలో ఉన్న అవినీతిని, పాలనలో ఉన్న లోపాలను బహిర్గతం చేయడంలో, ప్రభుత్వానికి సంపన్నులు విసురుతున్న సవాళ్ళను బహిర్గతం చేయడంలో నేటి పత్రికల పాత్ర చాలా అవమానకరంగా ఉంది.
స్థానిక రాజకీయలపైన, సామాజిక రుగ్మతులు, ముఖ్యంగా కుల, మత అసమానతలపైన ఈ మూడు పంచ్ పత్రికలూ విమర్శలు గుప్పించేవి. వలసపాలకులతో కుమ్మక్కయిన వారిని, ముఖస్తుతికి నక్కవినయాలు ప్రదరిస్తూ వ్యవహరించే భారతీయ విద్యావంతులపైన నిర్మొహమాటంగా పెద్ద పెద్ద వ్యంగ్య చిత్రాలు వేసి వారిని ఎగతాళి చేసేవి.
‘ఇంగ్లాండ్ లో చదివిన బ్రౌన్ సాహెబ్ లు’ ( లేదా ‘మన కొబ్బరి కాయలు’ పైన గోధుమ వర్ణం ఉన్నా లోపల తెల్లగా ఉంటారు) ‘జీ హుజూర్’ అంటూ విధేయత ప్రదర్శించే గుంపును ఎగతాళి చేసేవారు. ఈ గుంపులో మహారాజులు, రాజకుటుంబీకులు, ఇంగ్లీషు ఫ్యాషన్లను, వారి మాటతీరును, వారి పద్ధతులను, వారి హావభావాలను అనుకరిస్తూ సామాజికంగా ఎదగాలనుకుంటూ, బిరుదులకు, గౌరవ వందనాలకు బ్రిటిష్ వారి ముందు నక్కవినయాలు ప్రదర్శించేవారు ఉండేవారు.
మత సంప్రదాయాల వంటి వివాదాస్పద విషయాలను, స్థానిక మత నాయకులను వ్యంగ్యంగా చిత్రించడం, అత్యుత్సాహంతో స్వయం సేవ చేస్తున్నట్టు కనిపిస్తూ దోచుకుంటూ, గుడ్డిగా చేసే మత తంతుల వంటి విషయాలను వారు ప్రచురించేవారు. కులతత్వం పైన, వరకట్న దురాచారంపైన, సంపద అసమానతలు పెరగడం పైన వారు దాడి చేస్తూ, సమాజంలో పురుషులకు విధేయులుగా ఉన్న మహిళలను ఉద్దేశించి, ముఖ్యంగా మహిళల విద్య గురించి, సామాజికంగా విముక్తి గురించి, వారి హక్కుల గురించి రాసేవారు.
ఈ పత్రికల సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉండేది. పెద్దగా నైపుణ్యం లేని, అధ్వాన్నమైన పరికరాలతో ఈపత్రికలు ప్రింట్ అయ్యేవి. అయినా వీటి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో అక్షరాస్యత స్థాయి కూడా చాలా తక్కువగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ, వీటి శీర్షికల పైన కాస్త దృష్టి సారిస్తే, వాటి సర్క్యులేషన్ చాలా పరిమితం. అయినప్పటికీ, స్థానికంగా ప్రజాభిప్రాయానికి ఒక రూపాన్నివ్వడంలో, ప్రజలపైన ప్రభావం కలగ చేయడంలో విజయవంతమయ్యాయి.
‘అవద్ పంచ్’ రెండుగా మడిచే ఎడిషన్ 250 కాపీలతో ప్రింట్ మొదలైనా, త్వరలో అది ఎనిమిది పేజీలతో 500 కాపీలకు పెరిగింది. ఒక ప్రతి నాలుగు అణాలు కాగా, ఏడాది చందా పన్నెండు రూపాయలు(ఈ రోజుతో పోల్చుకుంటే అది రెండు వేల, ఒక వంద రూపాయలు). ‘పార్సీ పంచ్’ సర్క్యులేషన్ 400 కాపీలతో మొదలై 700కు పెరిగింది. దీని సంవత్సర చందా ఆరు రూపాయలు. ఉర్దూ ప్రచురణతో పోల్చుకుంటే, బొంబాయి మహానగర పాఠకుల సంఖ్య వల్ల ఈ ఇంగ్లీషు ప్రచురణ ఖర్చు తక్కువగానే ఉంటుంది.
‘‘పారిస్ పంచ్ నుంచి పండిన పంట’’ పేరుతో ఈ ‘పారిస్ పంచ్’ మాస సంచిక 24 నుంచి 36 పేజీల వరకు ఉండేది. ఇది బాగా విజయవంతమైంది. బ్రిటిష్ అధికారుల గురించే కాకుండా, పార్సీ మతస్తులు జోరాస్ట్రియన్లుగా మత సంప్రదాయాలను ఆచరిస్తూనే, మరో పక్క ఇంగ్లీషు వారి జీవన విధానాన్ని అనుకరించడం వంటి వాటి గురించి కూడా వ్యంగ్య చిత్రాలను ప్రచురించేది. తొలి నుంచి ‘పారిస్ పంచ్’ తో సంబంధం పెట్టుకున్న ‘హిందీ పంచ్’ వార సంచిక సర్క్యులేషన్ 800 కాపీల వరకు ఉండేది. దీని వార్షిక చందా ఆరు రూపాయలు. ఇప్పటి విలువతో పోల్చుకుంటే అది పదకొండు వందల రూపాయలవుతుంది.
ఈ మూడు ప్రచురణల్లో సృజనాత్మకతకల నిర్భయమైన ఎడిటర్లు, వారికి మద్దతుగా నిష్కపట రచయితలు, కార్టూనిస్టులు, చిత్రకారులు వలస పాలకులకు వ్యతిరేకంగా వ్యంగ్యోక్తులు, చతురోక్తులు వంటి ఆయుధాలు ప్రయోగించేవారు. స్థానికుల పద్ధతులు, విధానాలు, భాషను తెలుసుకోవడానికి బ్రిటిష్ అధికారులు పడే అవస్థల ఎంత తమాషాగా ఉండేవో, పాలకులకు, పాలితులకు మధ్య సాంస్కృతిక సంబందాన్ని తెంచేసేవిధంగా అవి ఎలా ఉంటాయో ఎత్తి చూపించేవారు.
‘కంటెస్టెడ్ రాయాలిటీస్’ అనే రాజకీయ చారిత్రక బ్లాగ్ ప్రకారం ‘అవధ్ పంచ్’లో వ్యంగ్యోక్తులు, కార్టూన్లు ‘‘అవకాశం దొరికినప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వం కంట్లో వేలుపెట్టి పొడిచినట్టు’’ ఉండేవి. ‘విట్ అండ్ హ్యూమర్ ఇన్ కలోనియల్ నార్త్ ఇండియా’(వలస ఉత్తర భారతదేశంలో చతురోక్తులు, హాస్యం) పుస్తక రచయిత, చరిత్రకారులు ముషిరుల్ హసన్ బ్లాగ్ ఇది. భారత రాజకీయ సాంస్కృతిక చరిత్రను చూపించేలా ఉన్న శిక్షార్హమైన కార్టూన్ల ఈ వారపత్రిక ఆ బ్లాగులో పొందుపరిచారు.
స్థానికులకు నాగరికతను నేర్పే పేరుతో భారత సంపదను కొల్లగొడుతున్న బ్రిటిష్ అధికారుల దురాశను చూపించడానికి తార్కాణంగా, ఎముకల గూడులా ఉన్న భారతీయులను పక్కనపెట్టి, అతి పెద్ద కిరీటాన్ని ధరించిన వలసపాలనాధికారుల చిత్రాన్ని వేశారు. మరొక చిత్రంలో రాచరిక కాలంలోని మిలటరీ అధికారి ఒకరు పక్కన పడేసిన ‘న్యాయం’ అని రాసిన పలకంపై కూర్చుని ఉంటాడు. దాని అడుగున భారతీయ రైతు గొలుసుతో బంధీ అయి ఉంటాడు. దానికి ‘ఇన్ సాఫ్ కా తాజ్’ (న్యాయ కిరీటం) శీర్షికగా ఉంటుంది. ఇది వలస ప్రభుత్వం అవినీతికి పాల్పడే ధోరణి, నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. స్పష్టంగా వారి దోపిడిని బహిర్గతం చేసేలా ఉంది.
పంతొమ్మిదవ శతాబ్దం చివరన ప్రజల్ని భయకంపితులను చేసిన భారత దేశంలోని బ్రిటిష్ రాజ్యం, లండన్ లోని దాని ప్రభుత్వం తీరుకు దారి తీసిన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన అసాధారణ రాజకీయ క్రీడలోరష్యా పాత్ర అసంబద్దతను తెలిపే వ్యంగ్య చిత్రం ’పారిస్ పంచ్’లో ఉంది. ఈ చిత్రంలో బురఖా ధరించిన పస్తూన్ మహిళ అసంబద్ధంగా గడ్డంతో ఇబ్బందికరంగా కనిపిస్తుంది.
నిలదొక్కుకుంటున్న స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమం, అందులోని మితవాదులు, తీవ్రవాదుల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల పై కూడా పంచ్ ప్రచురణలు వ్యాఖ్యానించేవి.
చిన్న చిన్న విషయాల గురించి వాదించుకుంటున్న భారత నాయకులను దూరం నుంచి చూస్తున్న బ్రిటిష్ సమ్రాజ్యవాద సింహం చిత్రం. స్వాతంత్ర్యోద్యమంలో అనైక్యతను తెలిపేలా ‘పారిస్ పంచ్ ’ దీన్ని చిత్రించింది.
రాజకీయ అసమ్మతిని అణచివేస్తున్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో, వ్యంగ్యోక్తులను విసరడంలో ‘పారిస్ పంచ్’ అంత గుర్తింపును ‘హిందీ పంచ్’ పొందలేకపోయి ఉండవచ్చు.
‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ 2024 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 180 దేశాల్లోని పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత దేశం 159వ స్థానంలో ఉంది. ఈ విషయాలన్నీ మన ప్రతికా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందో మనల్ని ఆలోచింప చేస్తాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించే జర్నలిస్టులను ధ్యేయంగా భారత ప్రభుత్వాధికారులు వ్యవహరిస్తున్నారని, ఇది వలసపాలనా కాలంలో ఉన్న నిరంకుశ దేశ ద్రోహ శాసనాలను పోలినట్టుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ‘ద హ్యూమన్ రైట్స్ వాచ్ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ’ వంటి అనేక ప్రభుత్వేతర సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ పట్ల విమర్శనాత్మకంగా ఉన్న అనేక పత్రికా సంస్థలు, వాటి ఎడిటర్లను 2014 నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారాకానీ, ఆదాయపన్ను శాఖాధికారుల ద్వారా కాని , కొన్ని కేసుల్లో ఈ మూడు సంస్థలతో కాని దాడులు చేయిస్తోంది. ఆర్థికంగా అవినీతికి పాల్పడ్డారంటూ వర్గీకరించి కేసులు పెడుతోంది. నత్తనడకన సాగుతున్న న్యాయవ్యవస్థలో జరిగే విచారణలో ఈ కేసుల్లో న్యాయం జరగాలంటే ఏళ్ళు గడిచిపోతాయి.
భారతదేశంలో జర్నలిస్టు ప్రయాణం ‘ఏకాంత ప్రయత్నం’లా ఉంటుందని 9.4 మిలియన్ల వీక్షకులున్న ప్రముఖ యూట్యూబ్ చానల్ టిలివిజన్ న్యూస్ యాంకర్ రవిష్ కుమార్ అంటారు. రాజీపడకుండా పనిచేస్తున్న రిపోర్టర్లకు మద్దతుగా ఆయన మాట్టాడుతూ, నిష్పాక్షికంగా పనిచేసే వారిని పత్రికా, న్యూస్ ఛానల్ సంస్థలు, వాటి కార్పొరేట్ యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని అంటారు. వారిని ప్రశ్నించడానికి వీలు లేదు. పైగా వారు ఎవరికీ బాధ్యత వహించరు.
ఈ మీడియా వ్యాపార-రాజకీయ నాయకులకు అనుబంధంగా బీజేపీకి ప్రచారం చేయడం కోసం పుట్టినవే పెంపుడు కుక్కలవంటి భాజాబంజంత్రీ పత్రికలు, ఛానెళ్ళు. భారత పత్రికారంగం ‘పూర్తిగా వృషణాలు తొలగించిన’ అని ఆరు సార్లు పార్లమెంటుకు ఎంపికైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సీనియర్ అధికారులు బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేసే మీడియా సంస్థలను సందర్శిస్తుంటారని, అలా సందర్శించడాన్ని వ్యతిరేకించిన వారిపై సీబిఐ చేత కానీ, ఈడీచేత కానీ, ఉభయ సంస్థల చేత కానీ దాడులు చేయిస్తుంటాయని హార్వర్ఢ్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసి, 2022 వరకు ఎంపిగా ఉన్న సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. రష్యా, చైనా లో మీడియాలో చర్యలు ఎలా ఉంటాయో వాటితో పోల్చి మన మీడియా పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పారు.
రాజకీయ ప్రకృతి దృశ్యాలను మార్చడానికి సామాజిక, సాంస్కృతిక రంగాలకు ‘ఆత్మ నిర్భరత’ (స్వయంపోషకం) అనే ముష్టి ఘాతం(పంచ్) తీవ్రమైన సవాళ్ళను విసురుతోంది. హస్యానికోసం గుర్తించిన కొన్ని విషయాలను ఇప్పుడు వడపోయక పోతే అవి అట్టడుగువర్గాలను, అసమానతలను పెంచుతాయి.
ఒక ప్రేక్షకులకు ఒకటి వినోదం అయితే, అది మరొకరిని ఇబ్బందిపెట్టేలా ఉంటాయి. ప్రపంచ మీడియా స్వభావ రీత్యా ఒక సాంస్కృతిక నేపథ్యం నుంచి వారు వేసే వ్యంగ్యోక్తులు అనేక తప్పుడు వ్యాఖ్యానాలకు దారి తీసి ఇతరులను ఇబ్బందిపెడతాయి. కానీ, అట్టడువర్గాలను ఇబ్బంది పెట్టేలా కాకుండా, విశాల దృక్పథంతో, అధికారంలో ఉన్న వారి పట్ల, ప్రభుత్వ నిర్మాణ వ్యవస్థ పట్ల, సామాజిక అసంబద్ధతలను ప్రతిధ్వనించేలా వ్యంగ్యోక్తులతో వెక్కిరించడం మంచిది.
సంక్లిష్టమైన వాస్తవాలను అర్థం చేసుకోవడానికి, నిబంధనలను సవాలు చేయడానికి, సంభాషణలను కొనసాగించడానికి హాస్యం అనేది ఒక పనిముట్టులా చేస్తుందని ప్రపంచ వ్యాపితంగా ఆమోదించిన సత్యం.
-రాహుల్ బేడీ
అనువాదం : రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.