
పెద్దగరువు ఆదివాసీలు తమ జీవితాలలో మార్పు “ కాట” కొనుక్కుంటే వస్తుందని అనుకున్నారు. పెద్దగరువు ఒక కొందు ఆదివాసీల ఆవస గ్రామo. అది అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కళ్యాణలోవ ప్రాంతంలో, కొండల మధ్య, అడవిని ఆనుకొని వుంటుంది. కొందు ఆదివాసీలకు లిపి లేని భాష వుంది. దానిని ‘కుయి’ అంటారు.
కొందులకు పెద్ద చరిత్రే వుంది. వారి పూర్వీకులది ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతం. పర్లాకిమిడి రాజ్యంలో వారు భాగం. బ్రిటిష్ అoత్రోపాలజీ విద్యార్ది ఫిలిక్స్ పడేల్ ( Felix Padel), తన Ph.D పరిశోధన గ్రంధం “ది సెక్రీపైస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్” ( The Sacrifice of Human Being : British Rule and the Konds of Orissa, published 1995 Oxford press)లో ఆ చరిత్రను వివరిస్తాడు. అదంతా మరో సారి చెప్పుకోవలసిన పెద్ద కధ.
పెద్దగరువులో 16 కుటుంబాలు వారికి, కుటుంబానికి 4 ఎకరాల వరకూ జీడి మామిడి తోటలు వున్నాయి. పెద్దగరువు దగ్గిరలో రాయిపాడు, తాటిపర్తి, రొచ్చుపణుకు ఆవాస గ్రామలు వుంటాయి. పెద్దగరువు, రాయిపాడులో వున్నది కొందు ఆదివాసీలు కాగా, తాటిపర్తి, రొచ్చుపణుకు గ్రామాలలో వున్నది కొండదొరలు. ఈ గ్రామాలన్ని దట్టమైన అడవులతో నిండిన తూర్పు కనుమల మహపర్వతాల దాపున వుంటాయి.
ఈ గ్రామలలోని జీడి మామిడి పంటను మార్చి – జూన్ నెలలలో షావుకార్లు కొనుగోలు చేస్తారు. అంతకు ముందు వారికి అప్పులు ఇచ్చి వుంటారు. అప్పులు, వడ్డీలు, వాటికి చక్ర వడ్డీలు. జీడి పిక్కల వ్యాపారి – వడ్డీ వ్యాపారి ఒకే నాణానికి బొమ్మ బొరుసులు. ఒక సారి అవసరం కోసం ఆ సాలెగూడులో చిక్కుకుంటే, వడ్డీ కింద జీడి పిక్కలు ఇవ్వాలి ( నగదు తీసుకొడు), జీడి పిక్కలు తనకే ఇవ్వాలి ( మరొకరికి అమ్మనివ్వడు, కోన నివ్వడు), బస్తా ( 80 kgలు) రేటు ఎంత వుందో తానే చెపుతాడు. రేటును సరి చూసుకునె అవకాసం లేదు. మార్కెట్ రేటు తెలియజేసే వ్యవస్తలేవి లేవు. ఒకవేల తెలిసినా చేసేది ఏమి లేదు. తానే కాట ( తూకం / త్రాసు) తెస్తాడు. దానితోనే తూకం వేయాలి.
ఏడుకొండల స్వామి అప్పు, షావుకార్ల అప్పులు రెండు ఎన్నటికీ తీరవు. 40 కుటుంబాలు వున్న రొచ్చుపణుకు గ్రామ కొండదొర యువకులు వేసిన లెక్క ప్రకారం చక్ర వడ్డీలతో కలిపి రెండు కోట్లు అప్పు తేలింది. చివరికి వారి జీడి మామిడి తొటలు తనఖలలోకి పోయాయి. ఈ నాలుగు గ్రామాల ఆదివాసీలు తమ తోటలలో పని చేసే కూలీలుగా మారారు. తనఖాలు, లీజులు పేరుతో ఆదివాసీల నుండి గిరిజనేతర షావుకార్లకు “ అన్యక్రాంతం” అయిన జీడి మామిడి తోటలు, యువకుల అధ్యయనం ప్రకారం 110 ఎకరాలు. నిజానికి ఈ భూములన్ని అయితే భు సంస్కరణల చట్టం కింది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇచ్చిన సీలింగు మిగులు భూములు లేదా ప్రభుత్వ బంజరు భూములు. కొందరు షావుకార్లు బంజరు ( D-ఫారం) పట్టా భూములను 99 సంవత్సరాలకు రాయించేసుకున్నారు.
ఆ చట్టం వర్తించదు – ఈ చట్టం అమలు కాదు:
ఆదివాసీలకు అప్పులు ఇచ్చి, అసలు, వడ్డీ కింద దినుసు ( పంట) రూపంలో, జీడి మామిడి తోటల రూపంలో, భూముల రూపoలో వ్యాపారి తీసుకోవచ్చునా? చట్టం ఏం చెపుతుంది ?!
ఆదివాసీల రక్షణకు, షెడ్యూల్డ్ ప్రాంతాల వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టం వుంది. దాని ప్రకారం గిరిజనేతరులు ఆదివాసీలతో వడ్డీ వ్యాపారo చేయాలంటే “ కలెక్టర్” అనుమతి వుండాలి. ఆదివాసీలకు ఇచ్చిన అప్పుల వివరాలను నమోదు చేయాలి. వడ్డీ న్యాయ బద్దంగా వుండాలి. నగదు రూపాంలో తప్ప, పంట, స్తిరాస్తీ రూపంలో తీసుకోకూడదు. కానీ ఈ చట్టం పెద్దగరువు ఇతర ఆదివాసీలకు అక్కరకు రాని చుట్టం అయ్యింది. ఎందుకంటే ఈ గ్రామల ప్రజలు నూటికి నూరు శాతం ఆదివాసీలే అయినా అవి షెడ్యూల్డ్ (ఆదివాసీ) గ్రామాలుగా గుర్తించబడ లేదు. రాజ్యాంగం 5వ షెడ్యూల్ కింద నోటిపై కాని ఆదివాసీలకు ఈ చట్టం వర్తoచదని తేల్చేసారు. నిజాని రాష్ట్రం ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఒక చిన్న సవరణతో ఆదివాసీలoదరిని చట్టం రక్షణ కిందకు తీసుకురావచ్చును. కాని ఎవరికి కావాలి ఈ ఆదివాసీలు?
పేదలకు ప్రభుత్వాలు ఇచ్చే భూములు దున్నుకొని బతకాలి తప్ప అమ్ముకోవడానికి లేదు. కేవలం అమ్ముకోవడమే కాదు, ఎలాంటి “అన్యక్రాంతం” చేయరాదు. అలా చేయడం చట్ట ప్రకారం చెల్లదు, సరికదా నేరం కూడ. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేద చట్టం 9/77 లో “అన్యక్రాంతం” అనె మాటకు విస్తృతమైన అర్దం చెప్పారు. 1. తనఖ 2. కౌలు 3. కానుక 4. అమ్మకం 5. మార్పిడి 6. మరే రూపంలో బదిలి జరిగిన అది చెల్లదు. “అన్యక్రాంతం” పొందిన వ్యక్తికి ఆరు నెలలు జైలు, రెండు వేల రూపాయల జరిమాన విడివిడిగ లేదా కలిపి వడ్డించ వచ్చును.
కాని ఈ చట్టం అమలు కాదు. ఎందుకంటే, అన్ని పార్టీలకు ఈ వడ్డీ / షావుకారు మహారాజ పోషకుడు. మండల స్తాయి అధికారులకు ATM కార్డులాంటి వాడు.
ముందడగు వేసిన యువకులు :
జీడి పిక్కల సీజన్ మార్చితో మొదలై జూన్ తో ముగుస్తుందని చెప్పుకున్నాం. అప్పుల రొచ్చు నుండి బయటపడక పోతే తమవి ఇక బానిస బతుకులేనని రొచ్చుపణుకు గ్రామo కొండదొర యువకులు గుర్తించారు. తమ గ్రామంతో బాటు, తాటిపర్తి, పెద్దగరువు, రాయిపాడు గ్రామల జీడి తోటల రైతులను సమీకరించారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఇచ్చిన ప్రోత్సాహంతో 8 ఆదివాసీ గ్రామాలలో ఋణ విమోచన పాద యాత్రను జూన్ 2023న చేపట్టారు.
చెట్టు ఎంత ఇస్తే అంతే :
ఈ పాదయాత్రలో ఐదు ప్రతిజ్ఞలను రైతుల ముందు వుంచారు. 1. షావుకార్ల అప్పులన్ని ఇక రద్దు. కావాలంటే వారు సివిల్ కేసులు వేసుకోవచ్చు 2. జీడి తోటలు ఇక నుండి మనవే 3. ఆగస్టులో చేపట్టే తోటల శుభ్రం పనులకు “ సహయాలు” అనె పాత పద్ధతిని అందరూ పాటించాలి( ఒకరికి మిగిలిన వారు సహయం. అలా అందరూ) 4. రసాయనిక విష ఎరువులు, పురుగు మందు విషాలు వాడకూడదు. 5. నేరుగా కంపెనీకె జీడి మామిడి పిక్కలు అమ్ముకోవాలి ( మధ్య దళారీలు వద్దు). ఇక వారు ప్రచారంలో పెట్టిన సూత్రం “ చెట్టు ఎంత ఇస్తే అంతే”.
గుంటూరు వచ్చింది రొచ్చుపణుకు:
గుంటూరు అన్నమయ్య పార్కులో 85 ఏళ్ల ఒక పెద్దాయన వాకింగ్ చేస్తున్నారు. ఆయనకు మరో పెద్దాయన మిత్రుడు. ఆమాట ఈ మాట అయ్యాక, మొదటి పెద్దాయన మూడు రోజులు నీకు కనబడను ‘కేంప్’ అన్నారు . ఎక్కడికి అంటె “ రొచ్చుపణుకు” అన్నారు. అక్కడి ఆదివాసీలు వడ్డీ వ్యాపారుల చెర నుండి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు చెప్పారు. మీకు ఎలా తెలుసు అంటె “ సోషల్ మీడియా” అని జవాబు. మొదటి పెద్దాయన పేరు జొన్నలగడ్డ రామరావు. రెండవ ఆసామి కాకుపర్తి నారాయణ రావు. నారాయణ రావు ఒక 5 వేలు రామరావు గారి చేతిలో పెట్టారు. అక్కడి ఆదివాసీలకు ఇవ్వమని చెప్పారు.
1936లో రైతు కుటుంబంలో జన్మించిన రామరావు గారు అలహాబాద్ యూనివర్సీటిలో అర్దం శాస్త్రంలో MA చేశారు. భారత వ్యాసాయ రంగం, భు సంబంధాలను అధ్యాయనo చేసిన అమెరికన్ సామజిక శాస్త్రవేత్త డేనియల్ తోర్నర్ ( Daniel Thorner) మాటలలో చెప్పాలంటే జొన్నలగడ్డ రామరావు గారు “వ్యవస్తాపన వ్యవసాయదారు/రైతు” ( Entrepreneurial farmer) వ్యవసాయంలో వడ్డీ వ్యాపారం రైతు ఆత్మహత్యలకు ఎలా కారణం అవుతున్నది ఆయన “వుషరి అండ్ సుసైడ్స్” (Usury and Suicides) అనె తన పుస్తకంలో మనకు వివరిస్తారు. ఇప్పటికీ ఆయన మూడుసార్లు రొచ్చుపణుకు గ్రామాన్ని సందర్శిoచారు. తమకు లభించిన ప్రోత్సాహంతో ఆ గ్రామ యువకులు ఒక కాట ఏర్పాటు చేసుకున్నారు.
2024 మార్చి – జూన్ సీజన్ లో నాలుగు గ్రామల ఆదివాసీ జీడి మామిడి రైతులు రొచ్చుపణుకు ‘కాట’ ద్వారా తుని (కాకినాడ జిల్లా)లోని జీడి పిక్కల కంపెనికి తమ పంట ఫలసాయాన్ని నేరుగా అమ్ముకున్నారు. నాలుగు గ్రామాలు కలసి 902 బస్తాలు కంపెనీకి స్వంత కాటపై తూకం వేసి ఇచ్చారు. వారికి 76,46,960 రూపాయలు ఆదాయం వచ్చింది. 902 బస్తాలు x ఒక బస్తా 80 కెజిలు = 72,160 కెజీల జీడి పిక్కలకు గాను, Rs 76,46,960 / 72,160 కేజిలు = ఒక కేజి జీడి పిక్కలను Rs 106కి అమ్ముకున్నారు. ఈ ఏడాది శ్రమ తప్ప మరో పెట్టుబడి ఖర్చు లేదు.
పెద్దగరువుకొచ్చింది ‘కాట’ తల్లి:
పెద్దగరువు గ్రామ సభ తమకు స్వంత కాట వుండాలని తీర్మానించుకుంది. ఇందుకోసం జోగుoపేట ఆదివాసీ మహిళ రైతు గదబరి జ్యోతమ్మ 5 ఎకరాల జీడి తోట శుభ్రం చేయడానికి 35,000 రూపాయలకు గుత్తకు వప్పుకున్నారు. అందరూ వెల్లి పని చేశారు. 20,000 రూపాయలు పంచుకొని, 15 వేలు కాట కోసం అట్టేపెట్టారు. 6,500 రూపాయలకు మంచి కాట వచ్చేలా సహాయం చేశారు అనకాపల్లి పట్టణంలోని సామాజిక కార్యకర్తలు.
కాట గ్రామoలోకి మోదకొండమ్మలా అడుగు పెట్టింది. తడి గుడ్డతో తుడిచారు. బొట్టు పెట్టి, దండ వేసి స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలోని మిగిలిన ఆదివాసీ గ్రామాలు పెద్దగారువును తప్పక అనుసరిస్తాయి.
షెడ్యూల్డ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా వున్న “వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాన్ని” రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో వున్న ఆదివాసీలoదరికి వర్తిoపజేయాలి. ఒక చిన్న సవరణ ద్వారా ఆ పనిని కూటమి ప్రభుత్వం చేయవచ్చును. గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యరాణి గారు చొరవ తీసుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.
P. S. అజయ్ కుమార్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.