
మావోయిస్టు అగ్రనేత బడే చొక్కా రావు చనిపోయారన్న మరణవార్తను ఆయన కుటుంబీకులు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించలేదు అలాని కొట్టిపారేయలేదు.
తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు మరణించారా లేదా అన్నది రహస్యంగా మారింది. ఆయన చనిపోయరన్న వార్త వెలుగులోకి వచ్చిన మరుసటిరోజు ములుగులోని తన సొంత ఊరిలో బ్రతికే ఉన్నారని సమాచారం తెలిసింది. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించలేదు అలాగని తిరస్కరించలేదు.
ఛత్తీస్‌ఘడ్ అడవులకు దగ్గరలో ఉండే తెలంగాణలోని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ది వైర్‌తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ(మావోయిస్టు) కార్యదర్శిగా ఉన్న బడే చొక్కారావు చనిపోయినట్టుగా ఇంకా ధృవీకరించలేదని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కంకెర్లోని అడవుల్లో జనవరి 16న భారీ ఎన్కౌంటర్ మాత్రం జరిగిందని అంగీకరించారు. మొదట ఎన్కౌంటర్లో 12మంది చనిపోయారని నమ్మామని తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఎవరైనా చనిపోయారెమోనని పోలీసులు ఇంకా విచారిస్తున్నారని అన్నారు.
మావోయిస్టు పత్రికా ప్రకటన…
ఏదిఏమైనప్పటికీ, సీపీఐ(మావోయిస్టు) జనవరి 18న పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ మీద మావోయిస్టు పార్టీ నేత, సౌత్ బస్తర్ డివిజనల్ కార్యదర్శి గంగా సంతకం ఉంది. తమ 18మంది సభ్యులు కాల్పుల్లో చనిపోయినట్టుగా వెల్లడించారు. చొక్కా రావు, పార్టీ సభ్యులు నరసింహారావుతో పాటు ఎవరైతే కాల్పుల్లో మరణించారో 18మంది కామ్రెడ్స్‌కు ప్రెస్ రిలీజ్లో ఘన నివాళి అర్పించారు. కానీ ఈ పత్రికా ప్రకటనలో కూడా చొక్కారావు మరణించారాలేదాన్నది స్పష్టంగా ప్రస్తావించలేదు.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై మావోయిస్టు నేత గంగా నిప్పులు చెరిగారు. ఫాసిస్ట్ ప్రభుత్వం తమ సభ్యులను చంపిందని విమర్శించారు. కేంద్ర రక్షణ బలగాల ఆధ్వర్యంలో ఛత్తీస్‌ఘడ్ అడవులలో భయంకర, అమానుష ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ అడవులలో ఉన్న సహజవనరులను కొల్లగొట్టాలనే లక్ష్యంతో ఈ ఆపరేషన్ జరుగుతుందని ఆరోపించారు. దీనికోసం స్థానిక ఆదివాసులను వేరే చోటికి తరలిస్తున్నారని చెప్పారు.
దంతెవాడ రేంజ్ ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్ఆఫ్ పోలీస్) కామ్లోచన్ కాశ్యప్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారని ఆమె తెలిపారు. మొత్తం 5,000 పోలీసు బలగాలతో ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు.
కాల్వపల్లిలో భిన్న దృశ్యం…
స్థానిక మీడియా ప్రతినిధులు చొక్కారావు స్వస్థలమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు నేత గంగా ప్రకటన ఆధారంగా చొక్కారావు మరణాన్ని ధృవీకరించడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా చొక్కా రావు తల్లి బతుకమ్మను పలకరించారు. తన కొడుకు చనిపోలేదని బతుకమ్మ చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురైయ్యారు. అంతేకాకుండా చొక్కారావు తల్లితో పాటుగా కుటుంబీకులు కూడా మరణ వార్తను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా చొక్కారావు మరణాన్ని ధృవీకరించలేదు.. అలాని కొట్టిపారేయలేదు. దీంతో సందిగ్ధత నెలకొంది.
తెలంగాణ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రెసిడెంట్ జీ లక్ష్మణ్ ఈ విషయంపై స్పందించారు. చొక్కారావు మరణవార్త అసత్యమని కొట్టిపారేశారు. సీపీఐ(మావోయిస్టు) కేడర్‌ను మానసికంగా వేధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి సమాచారాన్ని ప్రచారం చేస్తుందని విమర్శించారు. ‘ఇది అసత్యమని మేము ఆమె ముందే (గంగా స్టేట్మెంట్) చెప్తాము’ అని అన్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ మాజీ సభ్యులు, నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మాజీ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ జంపన్న చొక్కారావు మరణానికి సంబంధించిన సందిగ్ధతను దూరం చేయడానికి ప్రయత్నించారు.
పూర్తి విరుద్ధంగా జంపన్న మాటలు…
చొక్కారావు కుటుంబీకులు, లక్ష్మణ్ మాటలకు భిన్నంగా జంపన్న మాట్లాడారు. బహుశా కాల్పుల సమయంలో చొక్కారావుతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు గాయాలతో ఘటనా స్థలిలో చనిపోయి ఉంటారని అన్నారు. కాల్పుల తీవ్రత ను తట్టుకునే ప్రయత్నంలో వెనుదిరిగిన ఆరుగురు దళ సభ్యులు గాయాలతో అక్కడే చనిపోయి ఉండవచ్చనారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మృతదేహాలను తమ కామ్రెడ్స్ తీసుకువెళ్లడం కూడా సాధ్యమేనని తెలిపారు. దీంతో ఎవరు చనిపోయారో పోలీసులకు తెలిసి ఉండకపోవచ్చని చెప్పారు. నరేష్ పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. 5గురు రక్షణఅధికారులు చనిపోయినట్టుగా, పలువురికి గాయాలయినట్టుగా పోలీసులు కూడా అంగీకరించరని అన్నారు. ఇటువంటి వార్తలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్త్తాయని ప్రభుత్వం భావిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వంపైన నరేష్ అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టులు చాలా బలహీనంగా ఉన్నారని రుజువు చేయడానికి ఈ వార్త కుట్రలో భాగం కావచ్చని అన్నారు.
మావోయిస్టు నేతల నేపథ్యం…
నరేష్ ఒకప్పుడు మావోయిస్టు నేతగా పనిచేశారు. తరువాత ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి చొక్కారావు, మావోయిస్టు ఉద్యమంతో తనకు గాఢమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన బంధువు బడే నాగేశ్వరరావు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో నాగేశ్వరరావు పోలీసు కాల్పుల్లో మరణించారు. నాగేశ్వరరావు సోదరులు మురళి, రాంబాబు కార్యనిర్వాహకులుగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. మురళి ఓ ఎన్కౌంటర్లో చనిపోయారు. అనారోగ్య కారణాల వల్ల పోలీసులకు లొంగిపోయిన తర్వాత రాంబాబు కూడా చనిపోయారు.
ఏటూరు నాగారం అసిస్టెంట్ పోలీసు సూపెరిండెంట్ ఉపాధ్యాయ వారం క్రితం చొక్కారావు తల్లి బతుకమ్మను కలిశారు. తనకు తానుగా చొక్కారావు పోలీసులకు లొంగిపోవాల్సిందిగా చెప్పాలని బతుకమ్మకు సూచించారు.
చొక్కారావును పట్టించిన వారికి 50 లక్షల పారితోషకం ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఏఎస్పీ చొక్కారావు తల్లికి వివరించారు.
ఎన్. రాహుల్
అనువాదం : ముజాహిద్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.