
ట్రంప్ చెప్పినట్లు సరైన పత్రాలు లేవన్న కారణంగా అమెరికాలో పని చేస్తున్న 1.30 కోట్లమందిని బహిష్కరిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ 2008 సబ్ ప్రైమ్ సంక్షోభం కంటే దారుణమైన సంక్షోభానికి లోనవుతుంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన ఎన్నికల వాగ్దానాల్లో చెప్పినట్లు దేశంలో సరైన పత్రాలు లేకుండా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని అమెరికా వచ్చి స్థిరపడిన కోటి ముప్పై లక్షల మందిని మూకుమ్మడిగా బహిష్కరిస్తారా? తద్వారా ఆధునిక ప్రపంచ చరిత్ర కనీవినీ చూడని తరలింపుకు తెరతీస్తారా?
నిజానికి ట్రంప్ అటువంటి పైత్యం ఉన్నవాడే. కాకపోతే అంతమందిని అమెరికా నుండి సరిహద్దుల ఆవలికి తరలింంచటానికి కావల్సిన వనరులు, అవకాశాలు అమెరికా అధ్యక్షుడికి ఉన్నాయా అన్నదే సమస్య. తగిన చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశింటానికి ప్రయత్నం చేస్తున్న వారిని సరిహద్దులవద్దనే గుర్తించి వెనక్కు పంపుతోంది. ఇది ఇప్పటికిప్పుడు మొదలైన కసరత్తు కాదు. దశాబ్దాలుగా సాగుతున్న క్రమం. అయితే ట్రంప్ చెప్తోన్న సామూహిక తరలింపుకు దశాబ్దాలుగా జరుగుతున్న పాలనాపరమైన చర్యకూ సంబంధం లేదు. తాను నెగ్గితే మురికివాడలతో సహా అమెరికా మొత్తం జల్లెడ పట్టించి అక్రమంగా నివసిస్తున్నవారిని, కాందిశీకులను, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ప్రవేశించి స్థిరపడిన వారి గురించి సర్వే చేసి, గుర్తించి, వెలికి తీసి అమెరికా నుండి తరిమేస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్ధానం చేశారు. (భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించినప్పుడు బిజెపి నేతలు కూడా ఇలానే మాట్లాడారు. అస్సాం ముఖ్యమంత్రి నేటికీ ఇదే భాష ప్రయోగిస్తున్నారు).
ఈ నిర్ణయం అమానుషమైనదటంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ట్రంప్‌కు అటువంటి మానవత్వం వీసమెత్తయినా లేదన్నది స్పష్టం. ఆ విషయం అలా ఉంచితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలు జరిగితే అమెరికాకే హానికరం. ట్రంప్ తన రెండో అధ్యక్షకాలంలో కీలకమైన, పరిమితంగా అందుబాటులో ఉన్న వనరులన్నీ ఇటువంటి పనికి కేటాయిస్తే దేశాన్ని ఉద్ధరించేందుకు చేయాల్సిన పనులు చేయలేరు.
మరోమాటగా చెప్పాలంటే ఎంతగా కావాలనుకున్నా దేశం నుండి కోటి ముప్పై లక్షలమందిని తరలించటం అన్నది సాధ్యమయ్యే పనే కాదు.
ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ట్రంప్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద అత్యవసర పరిస్థితి విధించారు. ఈ నిర్ణయం ద్వారా పహారా వ్యవస్థలను మరింత పటిష్టపర్చటానికి పెంటగాన్‌కు మరిన్ని నిధులు సమకూర్చుకోవచ్చు. అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వారంతా మెక్సికోలోనే బస చేయాలన్న ట్రంప్ నినాదం మళ్లీ తెరమీదకు రావచ్చు. ఏది ఏమైనా ఇవన్నీ కొత్తగా అమెరికా చేరుకుందామనుకుంటున్న వారిని అడ్డుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ దశాబ్దాల నుండి గాలిలో గాలినై, మట్టిలో మట్టినై అన్నట్లు అమెరికా శ్రామికజనావళిలో కలిసిపోయిన కోటి ముప్పై లక్షలమందిని మాత్రం వెనక్కు పంపేందుకు అక్కరకు రావు.
ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండానే అమెరికాలో నివసిస్తున్నారనుకుంటున్న ఈ కోటి 30 లక్షల మంది సంగతి ఏంటి? వారిని గుర్తించటం ఎలా? వారి సరిహద్దుల ఆవలికి తరలించాలన్న నిర్ణయాన్ని అమలు చేయటం ఎలా?
ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ శాఖతో కార్మికవాడల్లో నిరంతరం దాడులు నిర్వహించనున్నారు. ‘‘బైడెన్ ప్రభుత్వం ఈ సంస్థపై విధించిన బేడీలను తొలగిస్తున్నాము. ఇకనుండీ ఈ సంస్థ తనపనిలో తానుంటుంది.’’ అన్నారు ట్రంప్ ప్రభుత్వంలో హోంలాండ్ సెక్యూరిటీ ఛీఫ్‌గా నియమితులైన టామ్ హోమన్. (డిపార్ట్మెంట్ ఆఫ్ హోం లాండ్ సెక్యూరిటీ అంటే మన దేశంలో కేంద్ర గృహమంత్రిత్వ శాఖ లాంటిది). దేశీయ నిఘా కార్యకలాపాలన్నీ గుర్తించటం, నివాసప్రాంతాల నుండి అరెస్ట్ చేసి నిర్దేశిత ప్రాంతాలకు తరలించటం, అనధికారికంగా దేశంలో నివశిస్తున్నారని గుర్తించిన వారిని దేశం నుండి పంపించటం వంటివన్నీ ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ గతంలో ఆఫీసుల్లోకి కూడా దూసుకెళ్లి ఉన్నపళంగా తనిఖీలు చేసేది. కానీ బైడెన్ ప్రభుత్వం అటువంటి తనిఖీలను నిషేధించింది.
ట్రంప్ మొదటి అధ్యక్షపాలన హయాంలో ఇటువంటి తనిఖీలు, ఆకస్మికదాడులు నిర్వహించినా పెద్దగా ఫలితాలేమీ సాధించలేకపోయింది. ట్రంప్ మొదటి టర్మ్‌లో అమెరికా నుండి తరలించిన సంఖ్య కంటే ట్రంప్‌కు ముందూ, తర్వాత అధ్యక్షులుగా వ్యవహరించిన డెమొక్రాట్ల పాలనలో దేశాంతరం తరలించిన వారి సంఖ్యే ఎక్కువ. ట్రంప్ మొదటి దఫా అధ్యక్షపాలనలో దేశీయంగా వలసదారులను గుర్తించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో సరిహద్దుల్లో అనధికారికంగా చొచ్చుకు వస్తున్నవారిని నియంత్రించటంలో విఫలమయ్యామని స్వయంగా ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగం అభిప్రాయపడింది.
పత్రాలు లేనివారిని గుర్తించటం ఓ సవాలు
అనధికారికంగా నివశిస్తున్నవారిలో మూడింట రెండువంతుల మంది పదేళ్లకుపైగా అమెరికాలోనే నివసిస్తున్నారు.వాళ్లందరికీ సామాజికభద్రత ఖాతా నంబర్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలున్నాయి. వాళ్లని పనికి పెట్టుకున్న సంస్థలు తమవాటా సామాజిక భధ్రత ఖాతాలకు తమవంతు సొమ్ము జత చేస్తూ ఉంటారు. వైద్య సుంకాలు కూడా చెల్లిస్తున్నారు. మురికివాడల్లో ఉన్న వారిలో అనధికారికంగా నివసిస్తున్నవారిని గుర్తించటం తేలికే కానీ స్వంత ఇళ్లల్లోనో అద్దె ఇళ్లల్లోనో నివసించేవారిలో ప్రభుత్వ ఆమోదంతో వచ్చినవారు ఎవరు, ప్రభుత్వ ఆమోదం లేకుండా వచ్చిన వారెవరు అన్నది గుర్తించటం అంత తేలికైనదేమీ కాదు. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తాజా విధానం పర్యవసానంగా అన్ని అనుమతులూ పొంది దేశంలోకి వచ్చిన వారిని, సాధికారికంగా నివసిస్తున్నవారిని దేశం నుండి తరలించటానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వ అనుమతులతో దేశంలోకి వచ్చిన వారిని వేధించేందుకు ఈ విధానాలు దారితీసే ప్రమాదం ఉంది.
దేశం నుండి కోటి 30 లక్షల మందిని గుర్తించి అరెస్టు చేసి తరలింంచాలంటే కనీసం రెండున్నర లక్షల నుండి నాలుగు లక్షలమంది సిబ్బంది కావాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఉన్న మొత్తం సిబ్బంది కేవలం 20వేలు మాత్రమే. అంటే ట్రంప్ లక్ష్యాలు సాధించాలంటే ఇప్పుడున్న సిబ్బదికంటే కనీసం 10 నుండి 20 రెట్లు అదనపు సిబ్బంది కావాలి. కనీసం ఏడాదికి పది లక్షలమందిని అరెస్టు చేయాలన్నా 30 వేలమంది అదనపు సిబ్బంది కావాలి. ఈ కసరత్తు పూర్తి చేయటానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు కావాలి.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అంచనాలు కూడా కనిష్ట అంచనాలు. దేశంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల మెరుపుదాడులను తట్టుకోలేక కనీసం 20 శాతం మంది తమంతట తామే దేశం విడిచి వెళ్తారనీ, కాబట్టి మిగిలిన 80 శాతం మంది కోసం కసరత్తు చేస్తే సరిపోతుందని ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అంచనా వేసింది.
ఈ స్థాయిలో తరలింపు అంటే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. దాదాపు కోటిన్నర మందిని లేదా కనీసం కోటి మందిని నిర్బంధించి ఉంచేందుకు కావాల్సిన నిర్మాణాలు చేయాలి. వారిని ప్రస్తుత నివాస ప్రాంతాల నుండి నిర్భంధ కేంద్రాలకు తరలించాలి. అలా నిర్భంధ కేంద్రంలో నివశించేవారికి తమతమ దేశాలకు వెళ్లేంత వరకూ నిత్యావసరాలు సమకూర్చాలి. ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే. వీరందరినీ తరలించాలంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న విమానయాన సదుపాయాలు కనీసం 500 రెట్లు పెరగాలన్న వాస్తవం తెలిస్తే మీ ఊపిరాగిపోవచ్చు. అమెరికా కేంద్రంగా ఉన్న ప్రపంచ కుబేరులకు స్వంత విమానాలు చాలానే ఉన్నాయనీ, దేశ అవసరాల కోసం కేటాయించవచ్చని ట్రంప్ మద్దతుదారులు వాదింవచ్చు. కానీ ఇక్కడ ఓ చిక్కు ముడి ఉంది. ఇలా గుర్తించబడిన అక్రమ వసలదారులు తమ దేశం ఏమిటో చెప్పటానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటి? ఒకవేళ వాళ్లు తమ మాతృ దేశం ఏమిటో చెప్పినా సదరు మాతృదేశం వీరిని వెనక్కు తీసుకోవడానికి తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రతిష్టంభనను తొలగించే మార్గాలు ఏమిటి? అన్నదే ఆ చిక్కుముడి. ఈ చిక్కుముడి పరిష్కారం కానంతవరకూ ఎంత ఖర్చుపెట్టినా ఆశించిన ఫలితం రాదు.
అభయ నగరాలు
అమెరికాలో పరిస్థితులు కొంత చిత్రంగా ఉంటాయి. మనకు తెలిసిన నగరాలతోపాటు తెలీని నగరాలు కూడా కొన్ని ఉంటాయి. వాటినే అభయ నగరాలు అంటారు. ఆ నగరాల్లో ప్రధానంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారికి ఆశ్రయం ఇస్తారు. అటువంటివారిపై చేయి చేసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికీ ఆయా మున్సిపాలిటీలు కూడా అనుమతించవు. అది ఫెడరల్ ఏజెన్సీలు అయినా సరే లేక ఇమ్మిగ్రేషన్ అధికారులనైనా జోక్యం చేసుకోనీయరు. 2017లో ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు అభయనగరాల నిర్మాణం, నిర్వహణకు అనుమతిస్తూ చేసే చట్టాలు రద్దు చేయటమో, సవరించటమో జరుగుతుందనీ అందరూ ఆందోళన చెందారు. అలా జరక్కపోగా ట్రంప్ హయాంలో అటువంటి అభయ నగరాలు మరిన్ని పుట్టుకొచ్చాయి. ఈ అభయనగరాల్లో జరిగే తనిఖీలు, తదనంతరం తలెత్తే గొడవలకారణంగా సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కేంద్రీకరించి పని చేయలేకపోతున్నామని ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశీయ భద్రతా విభాగానికి ఫిర్యాదు కూడా చేశారు.
ట్రంప్ తొలి టర్మ్‌లో ఈ నగరాలను దివాళా తీయిస్తే ప్రభుత్వం మాట వింటాయన్న ధోరణితో వ్యవహరించారు. ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు నిలిపివేస్తామని ఆ నగరాల మేయర్లను బెదిరించారు. అటువంటి బెదిరింపులు తర్వాత కూడా ఆ నగర పాలకమండళ్లు లొంగటానికి సిద్ధం కాకపోవటం చూస్తే ఇటువంటి అభయ నగరాల్లో నివసించే వారి భద్రత విషయం స్థానిక రాజకీయాల్లో ఎంత ప్రాధాన్యాత కలిగి ఉందో అర్థమవుతుంది. కొంతమంది మేయర్లు ట్రంప్‌ను బహిరంగంగానే సవాలు చేశారు. న్యాయస్థానాలు కూడా అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చటంలో ఇటువంటి ధోరణి సరికాదని ట్రంప్‌నే మందలించాయి. ఈ పరిస్థితుల్లో ఈ సారైనా ఆ అభయ నగరాలపై ట్రంప్ పట్టుబిగించగలడా అన్నది చర్చనీయాంశం అవుతోంది.
ఆర్థిక భారం సంగతేమిటి?
అమెరికా జనాభాలో ఇటువంటి సరైన పత్రాలు, అనుమతులు లేకుండా నివసించే జనాభా 3.3 శాతం ఉంటుంది. శ్రమశక్తిలో ఐదుశాతం పైమాటే. ఈ సంఖ్యలు కాస్తంత ఎక్కువే అయినా వివిధ రంగాల్లో వారి పాత్ర గురించి ట్రంప్ కానీ, ఆయన మద్దతుదారులు కానీ సరిగ్గా అంచనా వేయటం లేదనిపిస్తోంది. వ్యవసాయ క్షేత్రాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, శిశుసంరక్షణ కేంద్రాల్లోనూ పనిచేసేవారిలో అత్యధికులు ఇలా సరైన పత్రాలు, కాగితాలు లేనివాళ్లే. భవన నిర్మాణ రంగంలో పని చేసేవాళ్లల్లో 12 శాతం ఇటువంటివాళ్లే. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్లందరినీ తరలించటం అంటే ఆయా రంగాల్లో పెద్దఎత్తున కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో ఉత్పత్తి, సేవలు కూడా స్థంభించిపోయే పరిస్థితులున్నాయి.
ఇన్ని భారాలు భరించటానికి కూడా ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైనా చివరకు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారన్న విషయంలో స్పష్టత లేదు.
ట్రంప్ తొలి టర్మ్‌లో కాందిశీకుల ప్రవేశాన్ని నియంత్రించటానికి 472 ప్రత్యక్ష ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ సమస్యపై ఈ సారికూడా పెద్దఎత్తున గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయి. అటువంటి జనాభా కూడా భయాందోళనలకు లోనుకావల్సి వస్తుంది.
ఇక్కడ ట్రంప్ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేయటం, సామాజిక అశాంతి పెచ్చరిల్లేందుకు అవకాశాలు కల్పించటం, ఇమ్మిగ్రెంట్స్ శ్రమశక్తిపై ఆధారపడి పని చేసే ఆర్థికరంగాలను అతలాకుతలం చేయటం. ఇటువంటి చర్యలు అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయటంతో పాటు యావత్ ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నాయి. ట్రంప్ నిర్ణయాలు అమలు జరిగితే ఆర్థిక వృద్ధి రేటు సగటున 6.8 శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ హెచ్చరించింది. 2008లో తలెత్తిన సబ్ ప్రైమ్ సంక్షోభ కాలంలో దెబ్బతిన్నదానికంటే ఇది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎన్నికల వాగ్ధానాలు ఆచరణలో ఏ రూపం తీసుకుంటాయో వేచి చూడాలి.
– నీరజ్ కౌశల్
అనువాదం : కొండూరి వీరయ్య
రచయిత కొలంబియా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్ విభాగంలో సోషల్ పాలసీ బోధిస్తారు. వలసవాదులపై ఆరోపణలు : ప్రపంచ స్థాయి వలసల జాతీయవాదం, ఆర్థిక పరిణామాలు గ్రంథ రచయిత. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ లో కూడా పరిశోధనలు చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.